ఆలంకారిక ఆనంద నందనం -6

ఆలంకారిక ఆనంద నందనం -6

ఆనంద వర్ధనుడు -రామాయణ ,భారతాలలో ,కాళిదాస శకుంతల వంటి నాటకాలలో సౌందర్యం ఉన్నా ,అందులోని లక్షణాలను విశ్లేషించి చెప్పే ప్రయత్నం చేసినవారు లేరు .సిద్ధాంతకర్తలు తమ పద్యాలనే సౌందర్యానికి ఉత్తమ ఉదాహరణలుగా తెలుపు కొన్నారు .నేను దీన్ని తిరస్కరించి నా  గ్రంథం అ0తా  కవితా సౌందర్య లక్షణాలను ,ఎన్నో సంస్కృత మహా కావ్యాల ను విశ్లేషించి నిరూపించే ప్రయత్నం చేశాను .సౌందర్య తత్వ మూల సూత్రాన్ని సహృదయులే గ్రహించ గలరనేది నా ప్రగాఢ విశ్వాసం ..

  నేను ఈ విధంగా గ్రహించిన మూల సూత్రమే ‘’ధ్వని ‘’దీన్ని మహా కావ్యానికైనా  చిన్నదైనా గీతానికైనా సమాన బలం తో వర్తింప చేయవచ్చు అపరిమితమైన వివరాలకు అందులో ఆస్కారం ఉంది . కవిత్వ విలువలకు అంచనా కట్టటానికి ధ్వని బాగా ఉపయోగ పడుతుంది .పోలికలు భేదాలుచూపించటం ద్వారా కవిత్వాన్ని ఇతర ప్రక్రియలనుంచి వేరు చేసి చూపిస్తుంది.  తర్కం ,శబ్దార్ధ సంబంధ శాస్త్రం  భాషా శాస్త్రాలలో నిష్ణాతులనుకూడా సంతృప్తిపరచచే సమగ్రమైన శాస్త్రం అయింది విజ్ఞాన శాస్త్ర తర్క శాస్త్ర మూలకు ఎంతటి ప్రాధాన్యం ఉందో దానికి సమానమైన స్థానం కళకూ ,కవిత్వానికీ ఉందని నిరూపించటం లో ధ్వని సిద్ధాంతం విజయం సాధించింది . ఇంతకు  పూర్వమే ఉన్నసౌందర్య లక్షణాలుగా వర్గీక రింప బడిన అలంకారాలు ,గుణాలు ,మొదలైన వాటిని తోసి రాజు అనకుండా వాటినీ ఈ సిద్ధాంతం ఆకళింపు చేసుకొన్నది .విమర్శకుడు మాత్రం తన విశ్లేషణలో వాటిని విడదీసి చూడటం అనివార్యం . వామన విష్ణు స్వరూపా వామనా ,,చందోలంకార రాజాశేఖరా  వరుసగా మీ మాటలు వినిపించండి .

వామనుడు -నేను ప్రస్తావించిన రీతి గురించి ‘’తగురీతి’’గా తెలియ జేస్తాను .రీతిరాత్మా కావ్యస్య ‘’అని ఘంటాపధంగా చెప్పాను .కావ్య శరీరానికి ఆత్మరీతి మాత్రమే  .రీతులు మూడు రకాలు వైదర్భి కోమలమైంది .గౌడీ సమాసాలతో పరుషాక్షరాలతో ఉంటుంది .పాంచాలీ రీతి ఈ రెండిటి మిశ్రమ రూపం .ఆ కాలం లో ఆ ప్రదేశాలలో శైలిని బట్టే రీతులకు ఆ పేర్లు  వచ్చాయి . వైదర్భీ రీతిలో కావ్య దోషం కొంచెం కూడా ఉండదు .మాధుర్య ,ప్రసాద మొదలైన 10 గుణాలు ఉంటాయి వైదర్భీ రీతి కాళిదాసుని శైలి ఉత్తమ ఉదాహరణ ..గౌడీ రీతిలో దీర్ఘ సమాసాలు  శబ్దా డంబరం ఎక్కువ .దీనికి కాంతి ,ఓజస్సు అనే రెండు గుణాలుంటాయి  భవభూతిశైలి దీనికి ఉదాహరణ .భవభూతి ఒకే పద్యం లో శ్రీరాముడు శివుని విల్లు విరవడం ,దాని ఫలితంగా చెవులు బ్రద్దలయ్యే ధ్వని రావటం వర్ణించాడు పదాలు విల్లు విరిగే ట ప్పుడు వచ్చే శబ్దాన్ని ప్రతిధ్వనిస్తాయి దీర్ఘ సమాసాలు వాడటం ఆయనకిష్టం .మూడు సమాసాలతో మూడున్నర వాక్యాలు రాశాడు . 19 మాత్రలతో ‘’శార్దూలం ‘’పై ‘’క్రీడిం’’చాడు .పాంచాలీ రీతిలో మాధుర్య ,మృదుత్వ గుణాలతో పై రెండిటికి మధ్యస్తంగా ఉంటుంది .పటం  పై రేఖలు ముందుగీసి తర్వాత చిత్రం తయారు చేసినట్లు ఉంటుంది .కవిత్వం ఈ మూడింటిలో దేనికో ఒక దానికి చెంది ఉంటుంది .. కవికి వ్యాకరణ నిఘంటు ఛందస్సు కళలు ,శృంగార రాజనీతులలో పాండిత్యం తో  కూడిన లోకజ్ఞానం ఉండాలి . వీటినే కవితా సామాగ్రి అన్నాను . ఇతర మహాకవుల రచనలతో పరిచయం ఉండాలి .పద్యరచన నిష్ట తో చేయాలి . జ్ణాసంపన్నులను సేవించాలి పదాలను చేర్చేటప్పుడు తీసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచనతో చేయాలి . ఏకాగ్రత అన్నిటికన్నా ముఖ్యం భావనా  శక్తి  పుష్కలంగా ఉండాలి . స్వయం సిద్ధమైన శక్తివంతమైన లోపల దాగి ఉన్న ప్రతిభయే భావనా శక్తి .

రాజశేఖరుడు-వాత్సాయన కామ శాస్త్రం కౌటిల్యుని అర్థశాస్త్రం ఆదర్శంగా కావ్య మీమాంస రాశాను ఇతర రచయితల అభిప్రాయాలను క్రోడీ కరించి చేర్చాను .కవులకు సమాచార దర్శిని గా కావ్య మీమాంస ఉండాలన్నదే నా అభిప్రాయం ..తమాషాగా నేను కావ్య పురుషుడిని వర్ణించి ఆయనకు సాహిత్య విద్య అనే కన్యనిచ్చి విదర్భలో వత్స గుల్మ లో పాణిగ్రహణం చేశానని చెప్పాను .కవికి కావాల్సిన అర్హతలు ,ప్రతిభా పాండిత్యాలు ,వృత్తుల ,రీతుల స్వభావం,కవిత్వానికి ఆధార సామగ్రి ,ప్రాచీన గ్రంథాలనుండి ఎలా విషయం సేకరణ చేయాలో ,అది అనుకరణగా ఎప్పుడు దిగజారుతుందో ,కవి సంప్రదాయాలు ఎలా ఉంటాయో ,దేశం లోని పర్వత నదీనదాలు వాటి ప్రత్యేకతలు ,ఋతువులను ఎలా వర్ణించాలి ,చెట్లను లతలను పక్షులను ఏయే రుతువులలో ఎలా వర్ణించాలో అన్నీ రాసి కరతలామలంగా చేతిలో పెట్టాను .ఇప్పుడు మీరు గైడ్ అంటారే అలా రాశాను . ఒక రకంగా మార్గదర్శి యైన గైడ్ ను కూడా అయ్యానేమో .

 ఆనంద వర్ధనుడు -సౌందర్యం అనేక కోశాల చేత కప్పబడి ఉంటుంది .బయటికి కనిపించేది తక్కువ ప్రాధాన్యం కలది పైకి స్పష్టంగా కనిపించే బాహ్య సౌందర్యం లోపలి సౌందర్య సారమైనసారం అయిన రసానికి సరైన మాధ్యమం అయితేనే దానికి విలువ ఉంటుంది లయాత్మక ప్రక్రియ వలన రూపానికి ,భావ చిత్రం వలన వస్తువుకు శోభకలగవు .సౌందర్యాన్ని పెంచేది అలంకారం ,గుణం ,రీతి ,వృత్తి . అంతరాంతరాలలోకి దూసుకు వెళ్లి రసాత్మను స్పృశించాలి .బాహ్య అందాలను ఏ పండితుడైనా గ్రహించగలరు .కానీ కవిత్వాన్ని .సాహిత్య రూపాల నుంచి వేరు చేసి ప్రత్యేక లక్షణమైన రసాన్ని అర్ధం చేసుకోవాలన్నా ,వివరించాలన్నా రసికుడికే సాధ్యం ..మిగిలిన విషయాలు తరువాత చెబుతాను .లేకపోతె మోతాదు మించిపోవచ్చు .సోదరులారా ఇక మీ వంతు –

వామనుడు -విజ్ఞులైన విమర్శకులకు ఆహ్లాదం కలిగించే ఉత్తమ కవిత్వానికి లక్షణాలు చెప్పాను ..కవులు దోషాలు,అవి  లేకపోవటం ,గుణాలు అలంకారాలు ఉండటం  .కవులు గుణాలు  స్వీ  కరించి దోషాలు పరిత్యజించాలి .దోషాలు చాలా ఉంటాయికనుక గుణాలతోపాటు దోషాలనూ ఎక్కువగానే చర్చించాను . సూక్ష్మ దోషాలనూ తెలియజేశాను .గుణాలు  అలంకారాలు కావ్యగుణాన్ని పెంచుతాయి .అనటాన్ని నేను ఒప్పుకోను .రెండూ వేర్వేరు .’కావ్య శోభయాహ్  కర్తారో గణాః తదతిశయ హేతవ స్త వాలంకారః పూర్వే నిత్యా ‘’అంటే గుణాలు కవిత్వానికి స్వాభావిక సౌందర్యానికి కారణాలు .అవి అందుకే అనివార్యంగా నిత్యముగా ఉండాలి అల0 కా రాలు కావ్య సౌందర్యాన్ని వృద్ధి చేస్తాయన్నమాట నిజమే .అంతమాత్రం చేత తప్పని సరికాదు .గుణాలతో సహజ సౌందర్యం ఉన్న కన్నెపిల్ల ఆభరణాలతో  మరింత  అందంగా ఉన్నట్లు అన్నమాట ..

రాజశేఖరుడు -నా కావ్య మీమాంస సాధారణ ఛందో శాస్త్ర గ్రంధాలవంటిదికాదు ఛందో శాస్త్రం లో చాలా అరుదుగా కనిపించే అనేక విషయాలు రాశాను .అలంకార శాస్త్రం పై నాకు ఎక్కువ గౌరవం ఉంది .అది వేదాలలో 7 వ అంగం .దాని సహాయం లేకపోతె వేదపాఠాల పూర్తి అర్ధం తెలియదు నా ఉద్దేశ్యం లో సాహిత్య విద్య 5 వ విద్య .మనకు సాంప్రదాయంగా వచ్చే విద్యలు నాలుగు -వేదాలు వ్యవసాయ వాణిజ్యాలు ,రాజనీతి ,తత్వ శాస్త్రం .ఇవి ఎంతముఖ్యమో అలంకార శాస్త్రమూ అంతముఖ్యమే .అందుకే 5 వ విద్య అన్నాను .నేను రాజా దర్బారులో జరిగే సాహిత్య గోష్ఠులు ,కవి దిన చర్య ,అతని పఠన మందిరం ,రాత సామాగ్రీ గురించి ఆసక్తికరంగా చెప్పాను .కవయిత్రుల ప్రతిభను కూడా నిర్ణయించి వారికీ గౌరవం కల్పించాలని చెప్పాను .సాహిత్య పరీక్షలు నిర్వహించి ఉత్తములను ఎంపిక చేసి బ్రహ్మ రధంగా ఊరేగించాలని రాజులకు హితవు చెప్పాను .మహాకవులైన కాళిదాసు ,మెంధ ,అమర ,భారవి మొదలైన వారిని పరీక్షించి సన్మానించారు .అలాగే శాస్త్ర కారులైన ఉపవర్ష ,వర్ష ,పాణిని ,పింగళ ,వ్యాడి ,పతంజలి వంటివారిని పాటలీ పుత్రం లో పరీక్షించి నిగ్గు తేల్చారు ..నా అభిప్రాయాలను ,ఇతర అభిప్రాయాలను బలపరచటానికి విస్తారంగా పద్యాలు ఉదాహరించాను .. ఇంతకంటే నేను చెప్పాల్సింది లేదు .సెలవు .

ఆనంద వర్ధనుడు -రాజా శేఖరులవారు తమ అమూల్యాభిప్రాయాలను స్పష్టంగా క్లుప్తంగా తెలియ జేసినందుకు ధన్యవాదాలు .. రస స్వభావం దాని అంతరాత్మ తప్ప వేరేదీ కాదు కానేరదు . రసం మనసుకు కలి గించే ఆనందాను భూతి . అది కవి సృజనను ప్రేరేపిస్తూ ,భావనా శక్తి కల విమర్శకుడి మనసును రంజింప .కవితా సౌందర్యానికి కారణం ఫలితం కూడా అదే .రసికుడు భావించి అనుభవించేవరకు రసం అనేది ఉండదు .

  నేను చెప్పిన ముఖ్య విషయం ధ్వని .అది మెరుపులా వచ్చే స్ఫూర్తి .’’అక్షరం ,పదం ,సర్వనామం ,సమాసం ,వాక్యం  కావ్యం లలో దేనిలోనైనా రసం యొక్క సౌందర్యం మెరుపులా తటిల్లున వ్యక్తమైనది ధ్వని అని నేను నిర్వచించాను .ధ్వని ఉవ్వెత్తున పైకి లేచినపుడు రసాన్ని ప్రత్యక్షం చేయటానికి ఉపయోగించే ఆధారభూమి సామాన్య భాష ,సామాన్య అర్ధం .రసధ్వని గుణాలను అలంకారాలను త్రోసిపుచ్చదు .శబ్దార్ధాల సొగసుల్ని తనలో విలీనం చేసుకొంటుంది . రస స్పందన లేకపోతె మిగితావేవీ రాణించవు . ప్రతి భాణా 0శమూ వ్యంజకమే అంటే రసాన్ని అభి వ్యక్తం చేసేదే . వ్యంజకం అంటే వెల్లడించేది అని అర్ధం కనుక ఇది శ్రేష్ఠమైన వ్యంజకం అవుతుంది ..భాషకు అతీతంగా వెల్లడి అయ్యే క్రియ ధ్వని .ఇప్పుడు వామనుల వారి అభిప్రాయం విందాం .

వామనుడు-శబ్ద ,అర్ధ అలమాకారాలను నేను చర్చించాను .యమక ,అనుప్రాస లనే నేను చర్చించాను .వీటిని అతిగా వాడద్దు అని చెప్పాను ఉపమా ప్రపంచం రాశాను రూపక వక్రోక్తిలను వివరించాను .రూప చిత్రణను నిదర్శనాలంకారం అన్నాను .అయిదవ అధికరణ లో కవి ప్రయోగాలు  చెప్పే ప్రాయోగిక రాశా .ఒకే పదాన్ని రెండు సార్లు వాడరాదని సంధినియమాల జాగ్రత్త ,పద్యపాదం మొదట్లో ‘’ఖలు ‘’వంటి పదాలు వాడొద్దని హితవు చెప్పాను ..కవిత్వం లో ముఖ్యాంశం సౌందర్యమేనని మొదట చెప్పింది నేనే . ఇంతకంటే చెప్పాల్సినది లేదని తెలియజేస్తూ సెలవు .

 ఆనంద వర్ధనుడు -సోదరులిద్దరూ కాడి నాపై పడేసి భారం దించుకొన్నారు ..రస ధ్వని ఉంటేనే కావ్యం అన్నాను .కానీ తర్వాత కొంత సడలించి .బహురూపి అయినా రసమే ధ్వనికి ఆత్మఅనే నేను నమ్మాను .ధ్వని ప్రధాన వ్యంగ్యంగా ,గుణీ భూత వ్యంగ్యంగా రెండురకాలుగా ఉంటుంది .అంటే కవితా చిత్రణలో ధ్వని అందానికి సహాయ భూతంగా ఉంటుంది . వాల్మీకి కాళిదాసులు మొదటి దానికి ప్రతినిధులు .బాణుడు మాఘుడు రెండవ దానికి ప్రతినిధులు ..సౌందర్యోన్మీ లన స్వభావం రసం యొక్క సృజనాత్మక స్పందన మాత్రమే అని మరొక్క సారి తెలియ జేస్తూ మా ముగ్గురకు మీతో ముచ్చటించి మా హృదయకవాటాలు విప్పి మా సిద్ధాంతాలు తెలియజేయటానికి అవకాశం కలిగించిన సరసభారతి శ్రద్ధగా విని జయ ప్రదం చేసిన శ్రోతృ మహాశయులకు ధన్యవాదాలు తెలియ జేస్తూ సెలవ్ .

 వేదిక ను సుసంపన్నం చేసిన పెద్దలారా సోదరులారా .గొప్ప అదృష్టవంతులం మనం .ఇంతటి ఉత్కృష్ట సిద్ధాంత కర్తలు మన మాట మన్నించి ఈ ప్రత్యేక కార్యక్రమ0 లో పాల్గిని అమూల్య విషయాలు చెప్పినందుకు విన్న మీకు కృతజ్ఞతలు .ఒక్కసారి ఈ ముగ్గురు చెప్పిన విషయసారాంశం మీ ముందు ఉంచుతాను –

 విమర్శనాత్మక పరిశీలన చేసి విలువ కట్టటానికి కావలసిన ప్రమాణాలు మొట్ట మొదటి సారిగా చెప్పిన వాడు ఆనంద వర్ధనుడు .కవిత్వ విమర్శలో రసానికి సంబంధిన విధానం ఔచిత్యం ఒక్కటే అన్నాడు స్పష్టంగా .సౌందర్య శాస్త్రానికి సంబంధం లేని ప్రమాణాలనుంచి ఆయన అలంకార శాస్త్రానికి విముక్తి కలిగించాడు .అలంకారిక ఔచిత్యం అనే ప్రమాణానికి కట్టుబడి ఉంటె ,నైతిక ప్రమాణాలను ఉల్లంఘించిన రసాభాసం కూడా సుందరంగా ఉంటుంది అంటూ నైతిక నిర్ణయాలను దాటి ఆమోదం తెలియ జేశాడు ..ఆనంద వర్ధనుడు మౌలిక ప్రతిభకల మేధావి సౌందర్య భావనలో అన్ని ముఖ్యాంశాలను లోకం దృష్టికి తెచ్చిన మొదటి ఆలంకారికుడాయన .ఆయన సృజనాత్మక ఆలోచనా విధానం నేటికీ ఆసక్తి కలిగిస్తోంది ..తార్కిక ,వ్యాకరణ ,వాక్య నిర్మాణ రీతులను అధిగమించి కవిత్వం సంతరించుకొని ధ్వనిని ,దాని ఉవ్వెత్తున లేచే శక్తిని ఆనాడే వర్ధనుడు గ్రహించాడు అభినవ గుప్తుడు మరింత స్పష్ట పరచాడు .భామహా దండి ల అలంకారవాదం వామనుని రీతి వాదం లను కూడా సమన్వయ పరచిన సహృదయ ఆలంకారికుడు ఆనంద వర్ధనుడు . ధ్వని ధ్వని అని చెవుల్లో మార్మోగేట్లు చెప్పి అందులోని అలోకిక ఆనందాన్ని  బ్రహ్మానంద  సహోదరత్వాన్ని  చెప్పిన మౌలిక సిద్ధాంతకర్త పేరుకు సార్ధకత తెచ్చినవాడు ఆనంద వర్ధనుడు .

 వామనుడు అలంకార గ్రంథ కర్తలలో సూత్ర శైలిని ఆశ్రయించిన మొట్టమొదటివాడు . భావాలను సూటిగా సుత్తిలేకుండా చెబుతాడు . వృధా చర్చల జోలికి వెళ్ళలేదు సాంకేతిక విషయాలనూ సులభ సుందర శైలిలో చెప్పి హృదయానికి దగ్గరకు చేర్చాడు .కవులు రెండురకాలని మొదటివారు ‘’అరోచ కినాః ‘’అంటే ఎక్కువ శ్రద్ధ లేనివారు అంటే తృప్తి చెందని అభిరుచికలవారు అని రెండవవాడు ‘’సత్ర నాభ్యవహా రినా ‘’అంటే దేనినైనా తినగలిగేవారు అంటే ఏ రకమైన రచనయైనా చేయగలిగే వారు ..మొదటి రకం వారు వివేకులు విచక్షణా జ్ఞానమున్నవారు కానుక వారికి బోధించవచ్చు రెండవవారు అవివేకులు విచక్షణా జ్ఞానం లేనివారు .వీరికి చెప్పటం వ్యర్థం .కవికి ఏ కాగ్గతకావాలని మనసును అంతర్ముఖం చేసినప్పుడే వాస్తవమైన అంతరార్ధాన్ని గ్రహించగలడ ని వామన ఉవాచ .చిత్రకళాభిమానికనుక కవిత్వ లక్షణాలను చిత్ర కళతో పోల్చి అందంగా చెప్పాడు .. సాహిత్య వ్యక్తీకరణలో అనేక అంశాలు లక్షణాలు విశ్లేషించి విమర్శించి తనకున్న ఉత్తమ కళాభి రుచిని వ్యక్తం చేశాడు వామనుడు . కవిత్వ నిర్మాణం అనే సమైక్య సత్యం యొక్క లక్షణాలను అధ్యనానం చేసిన వాడు వామనుడు .కావ్యం యొక్క ఆత్మను గురించి మొదట చెప్పినవాడు వామనుడే . .కావ్యానికి గుణాలవల్ల సౌందర్యం కలుగుతుందన్న సౌందర్య వాది . ‘’కావ్యం గ్రాహ్య మాలంకారాత్ ‘’అంటూ గ్రంధం ప్రారంభించి సౌందర్య విశ్వరూపాన్ని చూపినవాడు వామనుడు

  రాజా శేఖరుడు ఉదహరించిన పద్యాలలో విలువైన సమాచారం ఉంది.  ఒక పద్యం ద్వారా పైశాచి అనే ప్రాకృత భాష అవంతీ అబూ పర్వత  ప్రాంతం ,మాండ్ శోర్ ప్రాంతాలలో మాట్లాడే వారని  తెలుస్తోంది .అలాగే గుప్త చరిత్రలో రామ గుప్తుని వృత్తా0త  విషయాలు తెలియ జెప్పే పద్యం ఒకటి ఉంది ఇంకెక్కడా రామ గుప్తుని ప్రస్తావన లేదు ..ఆయన రాసిన కావ్యమీమాంస లో కొద్దిభాగమే దొరికినా ప్రాచీన భారతీయ సంస్కృతికి చెందిన సాధారణ జ్ఞానం ,అలంకార శాస్త్రానికి చెందిన విశేష జ్ఞానం దీనివలన గొప్ప సంపదగా మనకు లభించింది . భార్య అవంతీ సుందరి చెప్పిన’’ రసోచిత శబ్దార్ధ సూక్తులను కావ్యంగా పరిగణించాలి ‘’అన్నమాటను సమర్ధించి ‘’రసకవియే ఉత్తమకవి ‘’అని నిర్ధారణ చేసి తానూ రాశావాదినే అని పించుకొన్నవాడు రస ట్రాజ శేఖరుడు .

 మరొక్కమారు ఈ ముగ్గురు మేధావులకు కృతజ్ఞత తెలుపుతూ రెండవ సమావేశాన్ని ముగిస్తున్నాము . మూడవ ప్రత్యేక సమా వేశం లో మరికొందరు ఆలంకారికులతో ముచ్చటింపజేద్దాం అంతవరకూ సెలవ్ .

 సశేషం

 మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ -29-7-17- కాంప్-షార్లెట్-అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.