వీక్లీ అమెరికా-18(24-7-17 నుండి 30-7-17 వరకు )

వీక్లీ అమెరికా-18(24-7-17 నుండి 30-7-17 వరకు )

సుందరకాండ లలితాసహస్ర పారాయణ ,గృహప్రవేశ ,కూచిపూడి రంగప్రవేశ వారం

24-7-17 సోమవారం -శ్రావణ మాసం ప్రారంభం .. న్యాయవాది నాటక సినీ నటుడు ,ప్రజాన్యాయ ఉద్యమ నిర్మాత సి వి ఎల్ నరసింహారావు తో యు ట్యూబ్ లో ఇంటర్వ్వ్యూ చూశాను ..ఆయన ఉద్దేశ్యం లో కొత్త చట్టాలు తేవక్కరలేదు . ఇంకో వంద యేళ్ళ వరకుకావలసిన చట్టాలు ఉన్నాయి వాటిని అమలు పరచటం లోనే సమస్య . ఆ చొరవ ప్రభుత్వం తీసుకొంటే చాలు .. అమలు అతి వేగవంతంగా జరగాలి . చట్టం పై భయం తో పాటు భక్తీ ఉండాలి . ప్రజలకు అవగాహన కల్పించాలి .లేబర్ కు ప్రభుత్వం ఎన్నో సదుపాయాలూ కలిపించింది లాయర్లను వారికి ఏర్పాటు చేస్తోంది .. ఇది తెలియని చాలామంది సామాన్యులున్నారు .మా దగ్గర కొచ్చేవారికి ఈ విషయం చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేసే న్యాయ వాదుల దగ్గరకు మేమె పంపుతున్నాము .మా దంపతులం కౌన్సిలింగ్ చేసి ఎన్నో కుటుంబాలను ఎందరో దంపతులను కాపాడాం .అన్నాడాయన .అందరూ చూడాల్సిన ఇంటర్వ్యూ . 20 వ శతాబ్ది అరుదైన మహా సంస్కృత విద్వా0సుడు  కపాలి శాస్త్రి గురించి గీర్వాణం -3 లో 381 వ కవిగా రాశాను .

 మంగళవారం ‘’అలంకారిక ఆనంద నందనం ‘’సీరియల్ రాయటం మొదలు పెట్టాను .అవధాన సరస్వతి శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్   మెచ్చి చదువుతూ సలహాలతో మార్గ దర్శనం చేస్తుండటం నాకు ఆనందంగా ఉంది .

బుధవారం -కాకినాడలో ఉన్న మా శిష్యుడు చిలుకూరి కొడుకుకు ఏం బి బి ఎస్ కౌన్సెలింగ్  లో శ్రీకాకుళం ప్రయివేట్ మెడికల్ కాలేజ్ లో కన్వీనర్ కోటాలో సీటు వచ్చిందని ఫోన్ చేసి చెప్పాడు .మా కుటుంబం అంతా చాలా సంతోషించాం .. ఆలంకారికులు 2 ,3 భాగాలు రాశాను .

 బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అకస్మాత్తుగా రాజీ నామా చేసి లాలూ ముఠాను వదిలించుకొని ‘’కమలాన్ని’’ చేత ధరించి మళ్ళీ 6 వ సారి ముఖ్యమంత్రి అయ్యాడు .చాణక్యానికి మించిన ఉదాహరణ .

27-7-17 గురువారం -శ్రీ సుందరకాండ 56 వ 9 రోజుల పారాయణ మొదటి రోజు ఉదయం 7-30 కు మొదలు పెట్టి 9-30 కి పూర్తి చేశాను రోజుకు ఒక శ్రీ సువర్చలాన్జనేయ శతకం కూడా చదవటం  మొదలు పెట్టాను . ఆలంకారికులు 4,5 భాగాలు రాశాను ..

28-7-17 శుక్రవారం -పారాయణ రెండవ రోజు పూర్తి చేశాను . మా అల్లుడి వద్ద వేదం నేర్చుకున్న శ్రీ నూకల రాంబాబు గారింట్లో నూతన గృహప్రవేశానికి వెళ్లాం . పురోహితుడు మా మంటాడ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో సుమారు 30 ఏళ్ళక్రిందట  ఉన్న పూజారి శ్రీ బలరామా  చార్యులే . ఇక్కడికి వచ్చి 27 ఏళ్ళు అయిందట . శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ,వాస్తుహోమం కూడా చేశారు .మా ఇద్దరికీ నూతన వస్త్రాలు పెట్టి ఆశీస్సులు పొందారు రాంబాబు ఉషా దంపతులు . తర్వాత భోజనాలు -పూర్ణాలు ,గారెలు పులిహోర వంకాయ కూర పప్పు సాంబారు పెరుగు తో భోజనం . నేనుస్వీ టు పెరుగన్నం తో సరిపుచ్చుకున్నాను .

  సరసభారతి 105 వ సమావేశంగా లలితా సహస్రనామ పారాయణ

 రాంకీ దంపతులు ఈ మొదటి శుక్రవారం  రాత్రి 7 గంటలకు వాళ్ళ ఇంట్లో లలితా సహస్ర నామ పారాయణ చేస్తూ మా శ్రీమతిని మా అమ్మాయినీ పిలుస్తూ ‘’పోతు పేరంటాలు ‘’గా  నన్నూ రమ్మన్నారు .ముగ్గురం వెళ్లాం .భక్తిగా చేశారు .దీన్ని సరసభారతి 105 వ కార్యక్రమంగా అందరి అనుమతితో నిర్వహించాం . అనుకోకుండా ఇక్కడ కొందరు పరిచయమయ్యారు నామిత్రుడు శ్రీ పసుమర్తి ఆంజనేయ శాస్త్రిగారి బంధువు లు శ్రీ దూర్వాసుల కామేశ్వరరావు దంపతులు శాస్త్రిగారి స్వ గ్రామం కృష్ణాజిల్లా కూడేరు లో వారి శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణం లో నవగ్రహ ప్రతిష్ట చేశారట .కామేశ్వరరావుగారి భార్య రాంకీ భార్య శ్రీమతి ఉష కు అమ్మక్కయ్యే . ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న శాస్త్రి గారి రెండవ అబ్బాయి సుబ్రహ్మణ్యం కు ఆఫీస్ బాస్ . వీరుకాక  గండి గుంటవారైనా మహిళ ఉయ్యూరు శాసన సభ్యులు స్వర్గీయ శ్రీ అన్నే బాబూ రావు గారి మేనకోడలు .మరొకామె కెసిపి లో ఉద్యోగి కుమార్తె .ఇంకోరు చల్లపల్లి వారు .మరొకామె నాదెళ్ల అంజయ్యగారి మనవరాలు .తమాషాగా ఎలా కలిశారో ఆశ్చర్యమేసింది అందరం ఆనందించాం . పారాయణ తర్వాత అందరికి ఉపాహారం.  మహా రుచిగా ఉన్న పనస తొనలు  ప్రత్యేకం

 నేను సరస భారతి గురించి రెండుమాటలు చెప్పి షార్లెట్ లో రెండవ సమావేశమూ రాంకీ వాళ్ళఇంట్లో జరగటం దానికి ఆ దంపతుల తోడ్పాటుకు ధన్యవాదాలు చెప్పి ,,ఇందులో పాల్గొన్నవారంతా సరసభారతి సభ్యులే అని తెలియ జేశాను . తర్వాత లలితా సహస్రనామ విశేషాలు ,శ్రావణమాస ప్రాముఖ్యత క్లుప్తంగా 8 నిమిషాలలో చెప్పాను -దాని సారాంశం తెలియ జేస్తున్నాను -’

‘’లలితా సహస్ర నామాలలో శాస్త్రీయ దృక్పధం ఉంది .మహామేధావి శాస్త్రజ్ఞుడు అయిన్ స్టీన్ చెప్పిన సాపేక్ష సిద్ధా0తం ఇందులో ఉంది ..పదార్ధం దాని శక్తి యొక్క ప్రతిక్రియవలన ఈ ప్రపంచం నడుస్తుంది . పదార్దానికి ,శక్తికీ భేదం లేదు .పదార్ధం శక్తిగా శక్తి పదార్థంగా మారుతుంది .శక్తి యొక్క స్థూల రూపమే పదార్ధం .పదార్ధం పరమశివుడైతే శక్తి పరమేశ్వరి .శివుడు శక్తి ఒకే  శక్తికి రెండు రూపాలు .ప్రతి పదార్ధం లోను శక్తి నిగూఢంగా ఉంటుంది .ఆ శక్తియే శ్రీ లలితా పరమేశ్వరి -’’యస్య యస్య పదార్ధస్య యాయా శక్తి రుదాహృతా -సా సా  సర్వేశ్వరీ దేవీ ,శక్తిమంతో మహేశ్వరః ‘’అన్నారు .భండాసురుడు  మొదలైన రాక్షసులు జడత్వానికి అజ్ఞానానికి ,బద్ధకానికి ప్రతీకలు .జడత్వం వదిలే దాకా వాళ్లకి వాళ్లలో ఉన్న శక్తి తెలియదు ఆ శకినీ శ్రీ మాత అంటాం .జడత్వాన్ని సంహరించి చైతన్య జ్ఞాన ప్రకాశం కలిగిస్తుంది ..లోపలి శక్తి మేల్కొనాలి అంటే సాధన చేయాలి .. లలితా సహస్ర పారాయణ చేస్తే అమ్మవారు మనల్ని చెయ్యిపట్టుకొని ముందుకు నడిపిస్తుంది .చైతన్య యాత్ర చేయిస్తుంది .ఈ సహస్ర నామాలలో చివర పరమేశ్వరి శివుని అభిన్న  రూపంగా తాదాత్మ్యం చెందుతుంది .లలితా రూపం లోజగదాంబ దర్శన  మిస్తుంది ..ప్రతినామం ఒక మజిలీ . .లలితా స్తోత్రం అంటే శ్రీదేవి దివ్య విభూతి ,విజ్ఞాన సర్వస్వము .ఈ భావాలు అర్ధం చేసుకొని పారాయణ చేస్తే అలౌకిక ఆనందం కలిగి మోక్షం కలుగుతుంది .

   ‘’ఇప్పుడు శ్రావణ మాసం విశేషాలు తెలుసుకొందాం .శ్రవణా నక్షత్రం పౌర్ణమి నాడు ఉన్ననెల  శ్రావణ మాసం విష్ణు మాసం .ఈ నెలలోనే విష్ణువుఉద్భవించాడు .ఈ మాసం లోనే బ్రహ్మ మొదటిసారి విష్ణు సందర్శనం చేశాడు .తిరుమలలోని గోవిందుడూ ఈ నెలలోనే వెలుగు చూశాడు .శ్రావణ శుద్ధ పంచమి నాగ పంచమి లేక గరుడ పంచమి అంటారు . గరుత్మంతుడు తన తల్లి వినతాదేవి బానిసత్వాన్ని పోగొట్టిన రోజు .తానూ విష్ణువుకు వాహనమైన రోజు .గరుడ పురాణం ఆవిర్భవించిన రోజు కూడా పంచమి తిథినాడే .

 శ్రావణ శుద్ధ ఏకాదశి పుత్రాది ఏకాదశి .మొగ  సంతానం కోసం నోములు నో స్తారు . గొడుగులుదానం ఇస్తారు ..ద్వాదశి దామోదర ద్వాదశి .విష్ణువుకు ప్రీతికరం .త్రయోదశి చతుర్దశి శివ పార్వతుల పూజ చేస్తారు .శ్రావణ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి రాఖీ పున్నమికూడా .హయగ్రీవుడు వైఖానస ముని జన్మించిన రోజు . .సంతోషిమాత అవతరించిన రోజుకూడా .ఈ రోజుననే అగస్త్య మహర్షికి హయగ్రీవుడు లలితా సహస్రనామం బోధించాడు .

 శ్రావణ బహుళ చవితి సంకష్ట హరణ  చతుర్థి .అష్టమి శ్రీ కృష్ణ జన్మాష్టమి . .శ్రావణ అమావాస్య పో లాల అమావాస్య .

 కొత్తగా పెళ్లి అయిన అమ్మాయిలూ శ్రావణ గౌరీవ్రతం ప్రతి మంగళవారం చేసి వాయినాలు ఇస్తారు .తమకు దీర్ఘ సుమంగళీత్వం లభించాలని చేసే వ్రతం ఇది . పౌర్ణమికి ముందువచ్చే శుక్రవారం శ్రీ వరలక్ష్మీ వ్రతం . ఇన్ని విశిష్టతలున్న మాసం శ్రావణమాసం .అందరికి శుభాలు కలిగించాలని ఆ జగదేక మాత ను ప్రార్ధిద్దాం .

29-7-17 శనివారం -కుమారి రచిత కూచిపూడి రంగ ప్రవేశం

సాయంత్రం 5 గంటలనుండి 8-45 వరకు కమ్యూనిటీ హా ల్ లో కుమారి రచిత కూచిపూడి రంగ ప్రవేశానికి వెళ్లాం .. ఈమె గురువు శ్రీమతి మాడభూషి పల్లవి . 7వ ఏటనుంచే నాట్యం అభ్యసించింది . గణపతి  ప్రార్ధన ,వాణీ పరాకు లతో ప్రారంభించి కొలువైతివా రంగ సాయి అనే స్వర్గీయ దేవులపల్లి కృష్ణ శాస్త్రిగారి విప్రనారాయణ సంగీత నాటకం లో రాసిన దాన్ని అభినయించింది .తర్వాత గోవర్ధన గిరిధార చేసింది .6 గంటలకు విరామం -బిస్కట్లు శ్వీట్లు వగైరాలు టీ .మళ్ళీ 6-15 కు ప్రారంభం .అంబాష్టకం ,తర్వాత కొలువై ఉన్నాడే ,చేసింది అన్నీ రాగమాలికలే  కురవంజి రాగం లో ముద్దుగారే యశోదా అన్నమయ్య కీర్తన చేసింది .చివరికి కుంతలవరాలి రాగం లో మంగళం పల్లి బాలమురళీ కృష్ణ  తిల్లానాతో రాత్రి 8-45 కు పూర్తి చేసింది . తర్వాత రెండు స్వీ ట్లు పప్పు కూర చపాతీ  బిర్యానీ వగైరాలతో మంచి విందు హాజరైన దాదాపు 300 పై జనాలకు ఆత్మీయంగా ఏర్పాటు చేశారు నేను రెండు  స్వీట్లు  ‘’కరుడన్నం’’ తో సరిపెట్టుకున్నా .

 బాగానే చేసింది కానీ నృత్యం ఆత్మ కనిపించలేదు .అన్నమయ్య గీతం లో రతికేళీ రుక్మిణి దగ్గర మంచి హావ భావాలు చూపించింది .పెద్ద వెలితి ఏమిటి అంటే కాలికి గజ్జలు కట్టలేదు ఆ సవ్వడి లేకపోవటం తో మొత్తం ప్రోగ్రామ్ తేలిపోయింది అనిపించింది . అమెరికాలో మేము చూసిన రెండవ  రంగ ప్రవేశమిది .2002 లో మొదటి సారి అమెరికాకు హూస్టన్ కు వచ్చినప్పుడు మా బంధువు శ్రీమతి వావిలాల లక్ష్మిగారు మా ఇద్దరినీ  రైస్ యూనివర్సీటీలో  నాసాలో పని చేసే ఆంధ్రా దంపతుల అమ్మాయి  రంగ ప్రవేశానికి తీసుకు వెడితే చూసాం .చాలా బాగా చేసింది . .అక్కడే జానప ద గాయని శ్రీమతి అనసూయ (కృష్ణ శాస్త్రిగారి మేనకోడలు )గారమ్మాయి శ్రీమతి రత్నపాప గారిని అనసూయగారినీ మొదటి సారి చూసి మాట్లాడాం . ఒక రకం గా బంధుత్వం ఉంది . మా అమెరికా మేనల్లుడు శాస్త్రి అనే జె వేలూరి కూతురు వీణ రెండేళ్లక్రితం కాలిఫోర్నియాలో ఇలాగే కూచిపూడి రంగ ప్రవేశం చేసింది . మా అమ్మాయి షార్లెట్ నుంచి వెళ్లి చూసి వచ్చింది . ఈ వారం వీక్లీ కి సమాప్తం పలుకుతూ సెలవ్

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-7-17- కాంప్-షార్లెట్ -అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.