అలంకారిక ఆనంద నందనం -8

అలంకారిక ఆనంద నందనం -8

అభినవ గుప్తుడు -నాటక కళా సృష్టిని సజీవంగా భావించాను ..భరత ముని మార్గాన్నే అనుసరించి దాన్ని కార్యావస్థలు ,అర్ధ ప్రకృతులు గా విశ్లేషించా .ఈ రెండిటినీ 64 సంధ్యారాగాలుగా విభజించి ,నాటక కర్త అవసరాన్ని బట్టి వీటిలో ఎన్నైనా వాడుకొనే వీలు కల్పించా .నాటకం లో రసమే ఆత్మ అని నేనూ అంగీకరించా ..రంగస్థలం పై ప్రదర్శించే ఒక వస్తువుగా రసాన్ని విశ్లేషించా .విభావ అనుభావ వ్యభిచార స్థాయీ భావాలు దాని అంగాలు అన్నాను ‘’స్థాయీ విలక్షణో రసాహ్ ‘’.సన్నివేశం మొదలైన వాటితోకలిసి పానకం లా స్థాయీ భావానికి భిన్నంగా ఉండేదే రసం ..రసానుభవం వేర్వేరు స్థాయిలలో ఉంటుందని చెప్పా .ఇంద్రియాలు బుద్ధి ,భావోద్వేగం ,ఉద్వేగ అభి వృద్ధి ,అలోకికం అనేవి ప్రతి ఒక్కటీ తర్వాత వచ్చే స్థాయికి తీసుకొని వెడతాయి . రసానుభవం యొక్క వివిధ భావాలను ఒక్కొక్కదాన్ని ఒక ప్రత్యేక స్థాయికి కేటాయిస్తుంది . మొదట ఇంద్రియ స్థాయిలో విశ్లేషణ ప్రారంభమౌతుంది .కళకు సంతోషమే ప్రయోజనం అన్నాను ..నిజమైన రసాత్మక వస్తువు కేవలం ఇంద్రియాలను ఉత్తేజపరచేదికాదు.  భావనశక్తిని ఇంద్రియాలద్వారా పురిగొల్పుతుంది .అంటే ఒక చిత్రానికి స్థూల రేఖలు మాత్రమే గీసినట్లు అన్నమాట .ప్రేక్షకుడు తన భావనా  శక్తితో  అవసరమైన వాటితోనింపి చిత్రాన్ని పూర్తి చేస్తాడు .కనుక నేను రసానుభూతికి రెండవ స్థాయి భావన అన్నాను ..ప్రేక్షకుడు నటుని అభినయం తో తాదాత్మ్యం చెంది ఉద్వేగానికి గురౌతాడు .కళ  ఉద్వేగాన్ని ప్రదర్శిస్తుంది ,ప్రేరేపిస్తుంది .ఉద్వేగానికి గురైతే తనను తాను  మర్చిపోతాడు అప్పుడు వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు .నా దృష్టిలో గాఢమైన అంతర్లీనత  వలన ,స్థాయీ భావాన్ని నిరాదరరించటం వలన కర్త ,వస్తువు అనే ద్వైవీ భావం  తొలగిపోవటమే చివరిది అత్యున్నత మైనది అయిన రసానుభవం .ఈ దశలో స్థాయీ భావం అంతశ్చేతన  లో మునిగిపోగా సాధారణీకరణం చెందిన వ్యక్తిలోని ఆనంద పార్శ్వ్0 ప్రకాశిస్తుంది . యోగి అనుభావించే తురీయానందం వంటిది పొందుతాడు .ఆత్మ ఒక్కటే ప్రకాశించగా వస్తువుకు సంబంధించిందంతా అంతశ్చేతనలో లయమై పోతుంది . సోదరులూ ఇక కానీండి . మమ్మటుడు -అన్నగారు సమాధి సిద్ధి మనందరికీ కల్గించారు . .నేను నా గ్రంధం 5 వ అధ్యాయం లో మధ్యమ తరగతి కవిత్వాన్ని చర్చించాను .ఇలాంటికవిత్వం లో వాచ్యార్థమే ప్రధానం . వ్యంగ్యార్థం అప్రధానం . దీనినే ‘’గుణీ భూత వ్యంగ్యం ‘’ అన్నాను  . శాస్త్ర తార్కిక వాదంతో పరిపుష్టి చేశాను . 6 వ అధ్యాయం అధమకవితను గూర్చి చెప్పాను .ముఖ్యమైన 7 వ ధ్యాయం లో కావ్య దోషాలు చర్చించి నా విమర్శనా శక్తికి పదును పెట్టాను ..కాళిదాసు కుమార సంభవం లో వర్ణించిన పార్వతీ పరమేశ్వరుల శృంగార క్రీడను తప్పు పట్టాను .తప్పు ఎవరు చేసినా తప్పే . ఆనాడే వర్ధనులు అంగీకరించినా నేను మాత్రం ఒప్పుకోలేదు . నాకు ఉన్నది ఉన్నట్లు చెప్పే ధైర్యం ఉంది . నేను ఎవరికీ జంకను .స్వంత  తలిదండ్రుల రతి క్రీడ వర్ణించటం ఎలా తప్పో, ఆది దంపతుల రతికేళి వర్ణించటం కూడా అంతే తప్పు మొహమాటం లేదు ..పద్యం లో రస విరోధం ‘’విషయం లో ఆనంద వర్ధనుని నిలదీశాను అలాగే వామన రుయ్యక ఉద్భటులతో కూడా విభేదించా ,చివరికి నా వాదమే సరైనది అని అందరూ అన్నారు .వేదాంతులలో నిష్ణాతులైన ముకుళభట్టు ,మండన మిశ్రులతోకూడా ఢీ అంటే ఢీ  అన్నా ..

కుంతకుడు -సృజనాత్మక భావన కవిత సామ్రాజ్యపు అయిదు వేర్వేరు క్షేత్రాలలో ప్రవర్తిస్తుంది .ఇవే  అక్షరాలా కూర్పు ,పద పూర్వార్ధ ,పద పరార్ధ ,వాక్య ,ప్రకరణ ప్రబంధం . వక్రత ఈ ఐదింటిలోనే ప్రదర్శనమిస్తుంది..కవిత్వం లో రస ప్రాధాన్యం గుర్తించి అది ప్రకరణ వక్రత ,ప్రబంధ వక్రత పరిధిలోకి వస్తుందని చెప్పా .మొత్తం కావ్యం లో కనిపించే వక్రత లేక ప్రబంధ వక్రతను ఆహ్లాదకరమైన రసాల సాయం తో సాధించాలి .పదాల కు జీవకళ వచ్చేది ఆసాంతం రసాన్ని కొనసాగించి ,ఆహ్లాదం కలిగించినప్పుడే .ఆనంద వర్ధనుల మతమూ ఇదే .ఈ భావమే నన్ను ఉత్కృష్ట అలంకారిక జాబితాలో చేర్చింది ..కావ్యం లో అంగీభూతంగా రసం ఉంటె దాన్ని ధ్వనిగా గుర్తించాలని ఆనంద వర్ధనులన్నారు .కానీ నేను ‘’రసానుతుల్యం వర్తమానం ‘’అని చెప్పి ,నేను చెప్పిన రసవాదాలంకారానికి ,రసానికి సమాన హోదా ఇవ్వాలని వాదించాను  . వర్ధనులు రెండవ తరగతి కావ్యం లో దీన్ని చేర్చగా నేను వక్రతతతో సమాన హోదా నిచ్చాను . రసవదాలంకారం అంటే రసమే ప్రధాన ఆకర్షణగా గల ఒక రకమైన వక్రోక్తి .

అభినవ గుప్తుడు -ఉద్వేగ అభి వ్యక్తి స్థాయిలో అనుభవించే రసానికీ ,అలౌకిక స్థాయిలో అనుభవించే పరమానంద సమానమైన రసానికి భేదం ఉంటుంది .సూక్ష్మఅంశాలను సైతం అధిగమించగలవారు మాత్రమే ఇలాంటి రసానందాన్ని పొందగలరు .విశేషణం విశేష్య భావ ముఖేన యో వ్యవహారాః సా ఆత్మాణి నోప పద్యతే ‘’. రసానుభవం నిశ్చలం కాదు .గతి శీలమైనది . ఇది ఆత్మ తన విశ్వ జనీనత ను భావించి అనుభవించటమే .ఆనందం అంటే స్వాత్మ పరామర్శమాత్రమే వేరే ఏమీ కాదు .దీన్ని అద్వైత వేదాంత దృ ష్టి తో వివరించలేము కారణం ఆత్మకు లేక బ్రహ్మ0 కు స్వప్రకాశమే కానీ స్వాత్మ పరామర్శ ఉండదు …

 అర్ధ నిర్ణయం లో ఉన్న సమస్యలనూ మనో వైజ్ఞానిక దృ ష్టి నుంచి అధ్యయనం చేసి వాటిలో అభిదా ,లక్షణా ,తాత్పర్య ,వ్యంజనా అనే నాలుగు భేదాలున్నాయని చెప్పాను  .నా అల్మాకార సిద్ధాంతం శైవ తత్వ శాస్త్రాలు జ్ఞాన సిద్ధాంతాలపై ఆధార పడిఉంది . నా సిద్ధాంతాన్ని అందుకే రహస్య యోగం అన్నారు .పరమ సత్యం  అఖండమైనది .జ్ఞానం జ్ఞేయం జ్ఞాత అంతా ఆభాసమే .ఈ ఆభాస పూరిత ప్రపంచమంతా సమస్తాన్నీ తనలో ఇముడ్చుకొన్న విశ్వ చేతన.లేక ఆత్మ యొక్క వ్యక్తరూపం .దీన్ని స్వాతంత్య్ర  వాదం అనీ అనచ్చు నిర్ణయం స్వేచ్ఛ పరమ తాత్విక సిద్ధాంతంగా అది విశ్వ శిస్తుంది ..జీవాత్మ ,పరమాత్మ ఒకే పోలికకలవి .జీవాత్మకు మూడుకల్మషాలు -అణవ,కర్మ ,మాయ ఉండటం వలన పరమాత్మకంటే వేరుగా కనిపిస్తాడు .వీటిని తొలగించుకోవటానికి తంత్ర లోకం అనే గ్రంధం లో దేశధ్వ ,తత్వధ్వమొదలైన అధ్యాయాలలో చర్చించాను .అనుభవ స్థాయిలో గ్రహించేవాడి వ్యక్తిత్వం రుచి ,కోరిక ,గ్రహణ శక్తి ని బట్టి ఉంటుంది .సాధారణ భావ స్థాయిలో రసికుడు ,రసకారుడు విశ్వ జనీనతను సాధిస్తారు .దీనికి నాటక ప్రదర్శన విధానమమే  తోడ్పడుతుంది . .. ఇంతటితో నేను చెప్పాల్సింది ముగిస్తూ ,మిత్రులకు కొనసాగించమని కోరుతున్నాను .

మమ్మటుడు-పదం ,పదాంశం ,మూలం ,ధాతువు ,ప్రత్యయం ,విభక్తి ,పాదాంతం ,క్రియాకాలం ,చివరికి వచన  సంఖ్య లో కూడా  సూక్ష్మా0శాలలో  వ్యంగ్యార్థం తొంగి చూడచ్చు . ధ్వనికి అనంత రూపాలున్నాయి వీణాన్నిటిని నాల్గవ అధ్యాయం లో వివరంగా రాశాను . దోషాలను ఎట్టి చూపే రంధ్రాన్వేషకులు చాలామందే ఉంటారు .నేను దోష నివారణ పద్ధతులు చెప్పి దారి చూపించాను  ..ఇంతటితో నా ప్రసంగం ముగిస్తున్నాను .

కు0త కుడు -నేను రీతి కి మార్గం అని పేరుపెట్టాను .కాళిదాసు సుకుమారమార్గానికి ,బాణ భవభూతులు విచిత్రమార్గానికి ,మయూరుడు మార్గ మార్గానికి ,మిగిలినవారు  మాధ్యమమార్గానికి చెందినవారు .ప్రతికవికి భిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది .కవి వ్యక్తిత్వం శైలిలో ప్రతి బింబిస్తుంది . వక్రోక్తి కి అసాధారణ ఆకర్షణ ఉండాలి రసికులు రంజింపజేయాలి ..ధ్వని రస విషయాలలో నాకు అభిప్రాయం భేదం లేదు . కావ్య నిర్వచనం లో నేను రసికులు ప్రాధాన్యమిచ్చాను ‘’శబ్దార్ధౌ  సహితం కావ్యం ‘’-శబ్దం అర్ధం కలిసే కావ్యమౌతుంది .శబ్దార్ధాలుకలిసి ‘’సాహిత్యాన్ని ‘’కలిగి,వక్రోక్తిలో అమరి అభిరుచి ఉన్న రసికులు ఆనందింప జేసినపుడే అది కవిత్వం అవుతుంది .ఈ సాహిత్య భావన కల్పించినవాడిని నేనే ..నేనే స్వయంగా కవితా గుణాలను రెండు సముదాయాలుగా గుర్తించాను .మొదటిది సాధారణ ఇది అన్నిరకాల కవిత్వం లోనూ ఉంటుంది .రెండవది అసాధారణ .ఇందులోని గుణాలు ప్రత్యేక మార్గాలు లేక శైలి కి సంబంధించినవి . మొదటి సముదాయం లో సౌభాగ్య ,లావణ్య ,ఔచిత్యా లు ఉంటాయి రెండవదానిలో మాధుర్య ,ప్రసాద ,లావణ్య ,ఆభిజాత్యాలుంటాయి ఈ నాలుగు గుణాలు సుకుమార మార్గ ,విచిత్ర మార్గాలకు చెందినవి .సౌభాగ్యగుణం శబ్దానికి అర్ధానికీ కూడా చెందుతుంది . గుణం చేరటం వలన సందర్భాన్ని బట్టి రసం నిష్పన్నమై రసికులు ఆనందం కలిగిస్తుంది . శబ్దార్దాల సౌందర్యమే లావణ్యం .కవితా మర్యాద ఔచిత్యం .భావాలలో ,పద ప్రయోగం లో కూడా ఔచిత్యం ఉండాలి . ఔచిత్యం ద్వారానే కవిత భావనలు జీవం పోసుకొంటాయి .. ఔచిత్యానికి నేనే మార్గదర్శినని చెబుతూ సెలవ్ .

   చాలా సంతోషంగా ఈ మూడవ కార్యక్రమం పూర్తి అయింది .ఒక్కసారి వారి భావనలను పునశ్చరణ చేసుకొందాం  . ‘

 ‘’రసానుభవం లో సాధారణ భావ స్థాయిలో రసికుడు ,రసకారుడు కూడా విశ్వ జనీనత ను సాధిస్తారని అభినవ గుప్తులవారి భావం .కావ్యభాషకు భావకత్వ  భోజకత్వ శక్తులు ఉంటాయి అన్న భట్టనాయక మతాన్ని గుప్తులవారు తిరస్కరించారు . ఈ రెండు శక్తులవలననే రసానుభవం లో సాధారణీకరణ జరుగుతుందని భట్టనాయకుడు భావిస్తే ,అభినవ గుప్తులు రసానుభవాన్ని అలౌకిక స్థాయిలో కూడా వివరించి అది ఆనందానుభవం తప్ప మరొకటి కాదన్నారు ..భట్ట తౌతుడు రాసిన ‘’కావ్య కౌతుకం ‘’కు గుప్తులవారు ‘’వివరణ ‘’రాశారు ..అభినవ గుప్తుల అన్నగారు ధ్వన్యాలోకానికి ‘’చంద్రిక ‘’వ్యాఖ్యానం రాశారు . దాన్ని ఆ వంశం వారందరూ అధ్యయనం చేశారు .చంద్రిక చాలక తాను  ‘’లోచన ‘’వ్యాఖ్య రాశానని గుప్తులవారే చెప్పుకొన్నారు . వేదికపై ఉన్న మమ్మటు లవారు అభినవ గుప్తులను ‘’ఆచార్య పాదులు ‘’అని సంబోధించటం వలన అయన శిష్యుడే అయి ఉంటారు .క్షేమేంద్రుడూ గుప్తులను తనగురువుగా చెప్పుకొన్నాడు . అలంకార శాస్త్రం లో ‘’గుప్తం’’గా ఉన్న ఎన్నో విషయాలను వెలికి తీసి ‘’అభినవం’’గా చెప్పిన అభినవ గుప్తులవారికి అభినందన చందనం .

 రాజానక మమ్మట  పండితుల సమైక్యబుద్ధి అభినందనీయం .తన వ్యక్తిత్వాన్ని బహుముఖ పాండిత్యాన్ని కావ్య ప్రకాశం లో ప్రకాశమానంచేశారు స్వతంత్ర భావాలు ,నిర్భీకత ,న్యాయ ద్దృ ష్టి ,విశాల దృక్పధం ,సమన్వయ దృష్టి ,సాహిత్య సృష్టిలో అంద  చందాలు  .దోషాలు గ్రహించే ప్రతిభ ,రసికత వారి వ్యక్తిత్వ ముఖ్య లక్షణాలు .ఇన్ని గుణాలు ఒక చోట కలిసిఉండటం అరుదైన విషయం .అందుకే కావ్యప్రకాశానికి వ్యాఖ్యానం రాసిన ఒకాయన ఆయనను సరస్వతీ దేవి అపర అవతారమని  స్తుతించాడు ‘’వాగ్దేవతావతార’’అని మళ్ళీ స్తుతించేదాకా ఉండలేక పోయాడు . ఆయన మాటకు తిరుగు లేదు .ధ్వని సిద్ధాంత లక్షణాలకు నిర్దిష్ట రూపాన్నీ ,ఆచరణాత్మక నిర్వచనాన్ని ఇచ్చిన ఘనత రాజానక మమ్మట పండితులకే చెందుతుంది .వీరికి ముందు ధ్వన్యాలోకం లో లోచన0 లో సిద్ధాంతాలుగా రూపు దాల్చని భావాలుగా ఉన్న  ధ్వని సిద్ధాంతానికి సంపూర్ణమైన తుది స్వరూపమిచ్చి ఆనంద వర్ధనులకే కాక అలంకార శాస్త్రానికి విలువైన కానుక నిచ్చిన మమ్మట పండితులకు కాశ్మీరమేకాదు యావద్భారతం  రుణ పడి  ఉంది .వారి కావ్యప్రయోజన ,కావ్య హేతు చర్చ అందర్నీ ఆకర్షించింది .శబ్ద శక్తి వివరణ అనితరసాధ్యమనిపిస్తుంది .కావ్యప్రకాశికకు జైన మతాచార్యులు మాణిక్య చంద్రుడు మొదటి వ్యాఖ్యానం రాస్తే ,ఆతర్వాత 50 కి పైగా టీకలు  వచ్చి  భగవద్గీత తర్వాత ఇన్ని టీకలు వచ్చిన గ్రంధంగా రికార్డ్ సాధించింది . టీకాలు వివరణలు వివరణలు మళ్ళీ టీకలూ శర  పరంపరగా సాగుతూనే ఉన్నాయి .ప్రతి ఇంట్లో కావ్య ప్రకాశం ఆవరించి ఉంది అనే శ్లోకం ఒకటి బాగా ప్రచారం లో ఉంది  -’’కావ్య ప్రకాశస్య కృతా గృహే గృహే టీకా తదాప్యేష తథైవ దుర్గమః ‘’.ధన్యులు మీరు మమ్మట పండితా!  మమ్మల్నీ ధన్యులను చేసినందుకు కృతజ్ఞతలు .  మమ్మట మతం సర్వ సమ్మతం అని పించారు .

  రాజానక కు0తకుల వారి   వక్రోక్తిలో ధ్వని సంప్రదాయం కలిసే ఉంది . కానీ కొత్తదారిపట్టి ముసుగేసుకొన్న ధ్వని వక్రోక్తియే అనిపించారు .అందరూ కావ్యాత్మ అంటే కావ్య జీవితం అన్నారు . సోమేశ్వర మాణిక్య చంద్రులు వీరిని సమర్ధించారు . వీరిభావాలు పాశ్చాత్య ఆలంకారికుల భావాలకు దగ్గరగా ఉంటాయి .కావ్య నిర్వచనం ,అలంకార నిర్ణయం రీతి వివరణలో ఆధునిక మార్గమే తొక్కారు .ఔచిత్యం ద్వారానే కవితా భావనలు జీవం పోసుకొంటాయి అన్న వారి భావనలను క్షేమేంద్రుడు ఔచిత్యాన్ని గురించి ఒక బృహద్గ్రంధమే రాశాడు .ఔచిత్యం రసం తోకలిసి స్థిరమై కావ్య శరీరాన్ని జీవం తో నింపుతుందన్నాడు .ఔచిత్య ,రసాల ఆధిక్యతను  అంగీకరించి తమ కొత్త సిద్ధాంతమైన ‘’వక్రోక్తి ‘’కూడా అలంకార శాస్త్రం లో ముఖ్యమైన విలువలను సమర్థిస్తుంది అని నిరూపించారు . వక్రోక్తి కుంతక ధరులైన కుంతకులకు అభినందనం .

 ఈ మూడవ సమావేశం అర్ద వంతంగా సమాప్తి చెందినందుకు ఇందులో పాల్గొన్న అలంకారిక మహాశయులకు శ్రోతృ మహాశయులకు కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను . నాల్గవ చివరి ప్రత్యేక సమావేశం లో మళ్ళీ కలుద్దాం .

 సశేషం

 మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -31-7-17-కాంప్-షార్లెట్-అమెరికా

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.