అలంకారిక ఆనంద నందనం -10

అలంకారిక ఆనంద నందనం -10

భోజ రాజు -సర్వ జన సంక్షేమం నా ధ్యేయం .సమైక్య భారతావని న దృష్టి .కేదారేశ్వర ,రామేశ్వర ,సోమనాధ ,సుందర ,కాల అనలా ,రుద్రాదులకు దేవాలయాలు నిర్మించాను కాశ్మీర్ లో ఇప్పటి కోధర్ వద్ద పాప సూడాన్  తీర్ధానికి మట్టికట్టలు పోయించటానికి ధనసహాయం చేశాను . ఈ విషయం కల్హణుడు రాజతరంగిణిలో రాశాడు ..భోజపురం అంటే ఈ నాటి భోపాల్ లో బెట్వానది ఉపనదితోకలిసే సన్నని కనుమద్వారా ప్రవహించే చోట మైలున్నర పొడవున్న ఆనకట్ట వేసి విశాల సరోవరాన్ని నిర్మించాను .ఇది అద్భుత సాంకేతిక పరిజ్ఞానానికి  నా సాహస కృత్యానికి ప్రతీక అని అంటున్నారు ..కవి ,పండిత ,కళాకారులకు భూరి విరాళాలిచ్చి పోషించాను ..వారి కవితా శక్తికి అక్షర లక్షలిచ్చాను ..దేశం లోని వివిధ ప్రాంతాలనుండి వచ్చిన కవి పండితులూ నా ఆస్థానం లో ఉండటం నా అదృష్టం .నా సంస్థానం సరస్వతీ నిలయమై వర్ధిల్లింది .తిలక మంజరికర్త జైనమతాచార్యుడు ధనపాలుడు ,శుక్ల యజుర్వేద భాష్యకర్త కాశ్మీర పండితుడు ఊవటుడు,చిత్తకవి ,ఇంకా ఎందరెందరో నా కొలువు కూటానికి ప్రకాశం తెచ్చారు . నేను వారిని పోషించానని గర్వంగా చెప్పను .వారి వలన నా భోజ సభ భాజమానమైంది అంటాను ..నేను శివ భక్తుడనే కానీ అన్నిమతాలు నాకు ఆదరణీయమైనవే . జైన గ్రంధాలను కాపాడాను .కర్ణాటకలోనిశ్రావణ బెళగొళ లో  ఉన్నజైన గురువు ప్రభ చంద్రునికి భూరి దక్షిణ సమర్పించాను . దీనికి సంబంధించిన శాసనం అక్కడ వేయించాను .నా రాజ్య పాలన 40 ఏళ్ళు సాగింది ..

 నేను 84 రచనలు చేశాను. 84 దేవాలయాలు నిర్మించాను ..సరస్వతీ కంఠా భరణం ,శృంగార ప్రకాశం అనే అలంకార శాస్త్ర గ్రంధాలు నాకు మంచి పేరు తెచ్చాయి … మిగతా వివరాలు తర్వాత తెలియ జేస్తాను ఇప్పుడు మిగిలిన వారు మాట్లాడుతారు .

మహిమా భట్టు -భట్ట గోపాలుడు నా అనుమాన సిద్ధాంతాన్ని ఆరాధించాడు -’’రసామృత నదీ మగ్నే ,ధ్వనికారే మహా గురౌ అనుమానాయాహి కావ్యం గోష్టిమ్ న ముంచతి ‘’-మా గురువైన ధ్వనికార్టరసామృతం లో మునిగిపోయినా ,అనుమానం మాత్రం సాహిత్య విమర్శకుల గోష్ఠి ని వదిలి వెళ్ళలేదు ..నాతర్వాత వారైనా రుయ్యక మమ్మట విద్యాధర ,విశ్వనాథ  జగన్నాథా దులు నా సిద్ధాంతాన్ని పరిశీలించారు .నేను కళ వాస్తవాన్ని అనుకరిస్తుంది అని నమ్మాను .విభావానికి స్థాయికి మధ్య సంబంధం ,కారణానికి కార్యానికి మధ్య ఉన్న సంబంధం లాంటిదే .రస సాక్షాత్కారం అనుమానాయిక గ్రాహకత్వాన్ని దాటి పోదు .అన్న నాసిద్ధాంతానికి తగిన నిర్మాణం దృఢంగానే చేశాను .భావ ప్రకటనకు భాష సహేతుక సాధనం . భావాలు అర్ధవంతమైతేనే ఇతరుల మనస్సులను ఆకర్షించుకో గలవు ..మీమాంసకులలాగానే నేనుకూడా కర్మను చేయించే ప్రవ్రుత్తి ,కర్మకు విముఖం చేసే నివృత్తి సిద్ధాంతమే భాషా లక్షణాన్ని శాసిస్తుంది అని నమ్మాను . వాక్యం లో సాధ్యం అంటే అనుమానం చేత సిద్ధించేది ,సాధన అంటే తర్కం అనే అంశాలుంటాయి .కనుక దీని స్వభావం అనుమానం చేతనే గ్రాహ్యం .కనుక వాక్యం ద్వారా అందజేసేభావాలు సాధ్య ,సాధనాల సంబంధం తో ముడిపడి ఉండటం వలన అనుమేయ స్వభావం కలిగి ఉంటాయి .. కావ్యార్ధం మూడురకాలు  -వస్తువు ,అలంకారం, రసం .మొదటి రెండిటినీ ప్రత్యక్షంగా చూపించవచ్చు .కానీ మూడవదైన రసం అనుమానం వలననే సిద్ధిస్తుంది .అక్షరాలచేత ప్రభావితమయ్యే పదాల అర్ధం ద్వారానే రతి మొదలైన స్థాయీ భావాలను అనుమానించటం జరుగుతుంది .అక్షరాలూ సూచించే గమకం అంటే గుణం పరోక్షంగా నే గ్రాహ్యమవుతుంది అభిదా శక్తినే గుర్తించాను .లక్షణ ,తాత్పర్య ,అర్దాపత్తి ఉపమానం వక్రోక్తి అన్నీ అనుమానం కిందికే వస్తాయి .

విశ్వనాథుడు -నా సాహిత్య దర్పణం భారత దేశమంతా ప్రచారమైంది .కావ్య ప్రకాశం పధ్ధతి ననుసరించి రాశాను .ఇందులో కారకాలు ,వృత్తులు నేనే రాశాను .ఉదాహరణలు నా గ్రంథా లనుండి ఇతర గ్రంథాలనుంచి ఇచ్చాను .నా ప్రసిద్ధ సిద్ధాంతం ‘’వాక్యం రసాత్మకం కావ్యం ‘’..వ్యంజన ను ప్రత్యేక వృత్తిగా చెప్పాను .పురాణకావ్యాలను కథ ,చంపు ,బిరుదు ,కరండ గా విభజించి నిర్వచించాను ..నాకు మార్గ దర్శి ధనుంజయుడు ..నేను అలంకార దోషాన్ని అంగీకరించలేదు ..సాహిత్యాన్ని శ్రవ్యం (కావ్యాలు )అని దృశ్యం (నాటకాలు )అని వర్గీకరించాను . ఆనంద వర్ధన ,మమ్మట ,జగన్నాధా దులు శ్రవ్య కావ్యాలనే చర్చిస్తే భారత ,ధనుంజయులు దృశ్య సాహిత్యాన్ని మాత్రమే చర్చిస్తే నేను మాత్రమే మొట్ట మొదటి సారిగా శ్రవ్య దృశ్య సాహిత్యాన్ని చర్చించాను . నాటకకళ కూయక ప్రత్యేక అధ్యాయాన్ని కేటాయించాను .  నా వంటి వారి వలననే ధ్వని సిద్ధాంతం సుస్థిరమైంది .నేనే ధ్వనిసిద్ధాంత ప్రతిస్థాపకుడనని -’’ప్రస్థాపనా పరమాచార్య ‘’అని నిర్భయంగా నిస్సంకోచంగా చెప్పుకొన్నాను .. జగన్నాథుడు -షాజహాన్ చక్రవర్తి మామ నూర్జహాన్ సోదరుడు అసఫ్ ఖాన్ ప్రశంసిస్తూ ‘’ఆసఫ  విలాసం ‘’కావ్యం రాశాను జగదాభరణ ,ప్రాణాభరణ కూడా నావే .నా విడి విడి పద్య సంకలనమే ‘’భామినీ విలాసం ‘’..రస గంగాధర విషయాలను సంక్షిప్తం చేసి ‘’చిత్ర మీమాంస ఖండన ‘’రాశాను ..నా గురుదేవులు శేష కృష్ణులను భట్టోజీ దీక్షితుడు విమర్శిస్తే ,దీక్షితుల ‘’ప్రౌఢ మనోరమ ‘’పైనా  అక్కసు అంతా కక్కుతూ ‘’మనోరమా కుచమర్దనం ‘’రాశాను ..నా అలంకార గ్రంధం రస గంగాధరం నన్ను మహా పండితునిగా ,విమర్శకునిగా పేరు ప్రతిష్టలు తెచ్చింది .ధ్వన్యాలోకం కావ్య ప్రకాశిక ల తో సమాన స్థాయి పొందింది .నా తర్క శాస్త్ర పాండిత్యానికి ,ఆలోచనాపటిమకు ,సుబోధక శైలికి  అలంకార శాస్త్ర ప్రతిభకు ఇది నిలువెత్తు దర్పణం . ఇందులో రెండు అధ్యాయాలున్నాయి అధ్యాయాలను ‘’ఆనానాలు ‘’అని వినూత్నంగా పేరు పెట్టాను .మధుర కవిత్వం లో నాకు సాటి ఎవరూ లేరని సవాలు విసిరాను ..శృంగార0 రాసేటప్పుడూ ఔచిత్యాన్ని దాటకుండా రాశా .ముక్తకాలలో కూడా రస పోషణ చేసి సెబాస్ అనిపించుకొన్నాను .నా రచనలన్నీ ప్రసాద గుణానికి ఉదాహరణలే .’’.రమణీయార్ధక ప్రతిపాదక  శబ్దహః కావ్యం ‘’అన్న కావ్య జగజ్జెట్టీని నేను .

 భోజరాజు -సరస్వతీ కంఠాభరణం నా మొదటి రచన .చిన్నదికూడా . .శృంగార ప్రకాశం రెండవది .రెండిట కొన్ని సమాన విషయాలున్నాయి .నేను చెప్పాల్సిందంతా దీనిలోనే చెప్పాను .శృంగార విషయాల నిగ్గు తేల్చే గ్రంధం .లలితా కళారహస్యాలను ,కావ్యరచనా మర్మాలు ఉన్నాయి .కంఠాభరణం అయిదు పరిచ్చేదాలు .అలంకార శాస్త్ర విషయాలన్నీ ఉన్నాయి .అలంకారాలను శబ్దాలంకారాలు అర్ధాలంకారాలు  ఉభయాలంకారాలుగా విభజించాను . 6 గుణాలు 16 దోషాలు చెప్పాను .ఒక్కోదానిలో 24 అలంకారాలు చెప్పాను .చివరి అధ్యాయం ముఖ్యమైంది ఇందులో రసం పై చర్చ ఉంది .ఇందులోకారికల సమాఖ్య ఉదాహరణలో ఎక్కువే .

‘’శృంగార ఏవ ఏకో రసః ‘’శృంగారం ఒక్కటే రసం అన్నాను .అంటే శృంగారం సంపూర్ణమైన రసం అని సిద్ధాంతం చేశాను ఇది వినూత్న సిద్ధాంతమే .

శృంగార ప్రకాశం లో 36 ప్రకాశాలున్నాయి .అధ్యాయాలను ప్రకాశానాలు అన్నాను శబ్దార్ధ సంబంధాల అభి వ్యక్తియే సాహిత్యం అని నిర్వచించాను ఈ సంబంధం 12 రకాలు .. 9వ అధ్యాయం లో సాహిత్య విమర్శ చేశాను . 13 వ అధ్యాయం ‘’రతి ‘’ కి కేటాయించాము ..ధర్మార్ధ కామ మోక్షాలకు సంబంధించిన నాలుగు శృంగార రూపాలతో కొత్త సిద్ధాంతాన్ని విస్తృత ప్రాతిపదికపై నిర్మించాను . 15 అధ్యాయాలలో సంప్రదాయ శృంగార రస లక్షణాలు చర్చించాను ..  22 వ అధ్యాయం ‘’అనురాగం ‘’కు కేటాయించాను .దీనిలో 64 రకాలున్నాయని చెప్పాను అందులో ఒక్కొక్కొటి 8 విధాలు .వీటిలో ఒక్కొక్కదానిలో మళ్ళీ 8 రకాలు .ఇవి మళ్ళీ ఒక్కోటి 3 రకాలు .కనుక మొత్తం 64x8x 24=12228రకాలు .ఇన్నిటికి పేర్లు పెట్టటం ఆషామాషీ కాదు కానీ అన్నిటికీ పేర్లు పెట్టాను ..అన్నిటికీ ఉదాహరణలివ్వగలిగాను .

మహిమా భట్టు -భోజమహా రాజుల వారిది ఎంతటి సూక్షం పరిశీలనా అర్ధమయిందికదా ..ఒక వస్తువు ను చూడటం వలన అది అనుభవం లోకి  వచ్చి సంస్కార రూపంగా మనసులో దాగి ఉంటుంది .దీనికి సంబంధించిన మరో వస్తువును విన్నప్పుడో చూసినప్పుడో పూర్వ సంస్కారం వలన క్రొత్తదాన్ని గ్రహించగలం ఈ మూడు రకాల అభి వ్యక్తీకరణలో ఒక్కటికూడా ధ్వనికి వర్తించదు .అందుకే రసధ్వనికి నిర్వచనంగా అభి వ్యక్తిని చూపటం జరిగింది ..వాచ్యార్థ రచనలన్నీ కవిత్వం అవుతాయి .ధ్వనికావ్యం దాని వెలుపలే మిగిలిపోతుంది ధ్వనిని రెండవ రకమైన వ్యంజకంగా భావిస్తే అప్పుడు వ్యంజకానికి అనుమాన సంజ్ఞ లేకుండా పోతుంది .ధ్వని సిద్ధాంతాన్ని వదిలి అనుమాన సిద్ధాంతాన్ని అంగీకరించాల్సి వస్తుంది .

విశ్వనాథుడు -నేను ధ్వనిని అంగీకరించి ,దాని ఉనికిని నిరూపిస్తూ -’’కావ్యస్యాత్మా సాయి వార్ధాహ్  కావ్యస్యాత్మా ధ్వని రీతిహ్ ‘’రస ప్రాధాన్యతపై నేను -’’ఏకో రసో అంగీకర్తన్యాహ్ ‘’అని ధ్వని వస్తు, అలంకార రసధ్వనులన్నాను ..మొదటి రెండు కావ్యాత్మ కానేరవు .రసధ్వనిమాత్రమే కావ్యాత్మ .ఈ ఒక్కమాటతో నా సాహిత్య దర్పణం అలంకార శాస్త్ర వికాసం లో అసదృశ స్థానం పొందింది .ధ్వని సిద్ధాంత ప్రవర్తకులలో నన్ను అగ్రగణ్యుని చేసింది .రస సిద్ధాంతాన్ని సుదృఢం చేసిన వానిగా కీర్తి గడించాను .

 జగన్నాథుడు -నా అన్యోక్తులలో కూడా ధ్వని ఉంది .సాహిత్య సేవలో ప0డిపోయాను .ఎన్నో స్వతంత్ర భావాలు చెప్పాను .ప్రతిభకు సర్వోన్నత స్థానమిచ్చాను .కావ్యాలను నాలుగు రకాలుగా విభజించాము .కొత్త రస సిద్ధాంతం చెప్పటం ,రెండురకాల గుణాలు అంగీకరించటం ,శబ్ద మూల శక్తి ధ్వనిని తర్క సమ్మతంగా రుజువు చేయటం ,అభిద లక్షణ శక్తులపై చర్చ ,అనేక అల0కారాలకు రూపాన్ని ,పరిధిని నిర్ణయించటం లో నా మౌలిక ప్రతిభ వ్యక్తమైనదని అంటారు.  నిజమేనేమో లేక పొతే ఎందుకంటారు ?

 సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-8-17-కాంప్-షార్లెట్-అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.