అలంకారిక ఆనంద నందనం -11(చివరిభాగం )

అలంకారిక ఆనంద నందనం -11(చివరిభాగం )

భోజ రాజు -నా గ్రంథ ప్రారంభం లోని పది పద్యాలలో నా సిద్ధాంత సారాంశాన్ని వివరించాను . తర్వాత అధ్యాయం లో అర్ధనారీశ్వర వర్ణన చేసి నా శృంగారవాదానికి ఎంత సందర్భోచితమో చెప్పాను . పార్వతీ పరమేశ్వరులకలయిక స్త్రీ పురుషత్వాల సమైక్య స్వరూపం .దాని ఫలితంగా కలిగే హాస్య పూరిత అనుభవాలు సాంకేతికంగా వర్ణించా .అందులోని ప్రతిపదం సంభోగ ,విప్రలంభ శృంగారాల వివిధ రూపాలను ధ్వనింప జేస్తుందన్నాను ..ప్రాచీనులు 10 రసాలు చెప్పినా నేను శృంగారమే రసం అన్నాను .అదే ఆనంద స్వరూపం .భరతముని చెప్పిన 49 భావాలు సమానమైనవే .అందులో ఏదైనా ఉచ్ఛ  స్థితికి చేరి ఆనందంగా మారచ్చు . ఆనందాన్ని  కేవలం రసం అనకుండా శృంగారరసం అన్నాను .దీన్ని ‘’యేన శృంగారం రియతే స శృంగారహః ‘’అని నిర్వచించా .అంటే శిఖరాన్ని చేరటం అన్నమాట ..అంటే ఆన0దా ధిరోహణం చేయటమే .శృంగారం నుంచే 49 రసాలు జన్మించాయి ..దానికి అవి సహాయకాలు .ప్రేమ అంటే అనురాగానికి పర్యాయ పదం కాదు .సౌందర్య తత్వ సాధనమైన ఆనందమే ప్రేమ .అందుకే ఆనంద రసం అన్నాను ..అభిమానం వీటిని కలిపి ఉంచే లక్షణం .అభిమానమే రసాను భూతికి మూలం . రసాను భూతి అనే సోపానానికి ఉన్న మూడు మెట్లలో అది అట్టడుగు మెట్టు ..దీనినే అహంకారం అన్నాను .నా పేర్లలో సాంఖ్య సిద్ధాంత చాయలున్నాయి ..ఈ అభిమాన శబ్దానికే అహంకార ,శృంగార ,రస శబ్దాలు పర్యాయ పదాలు .అహంకారం అంటే స్పందించాగలిగే సహృదయుని భావోద్వేగ స్థితి నుంచి బహిర్గతమయ్యే అహంకారమే అభిమానం .అహంకారం అంటే లౌకికార్ధం లో ఉన్న గర్వం కాదు.  నేను అనే భావం అన్నమాట ..రసాను భూతిగా మారే ప్రతి దశలో అహంకార ఛాయకనిపిస్తుంది ..అలంకార శాస్త్ర ప్రయోజనాలకోసం సాంఖ్యుల భావాల్ని పునర్నిర్మించి ,తత్వ వేత్తల  అహంకారాన్ని ,అలంకార శాస్త్రజ్ఞుల భావయిత్రీ ప్రతిభను సమ్మిళితం చేసి కొత్త రూపాన్నిచ్చాను . మిత్రులారా తర్వాత మీ వంతు .

మహిమా భట్టు -రసము అంటే స్థాయి యొక్క ప్రతిబింబమే .కళాత్మకంగా ఉన్న కారణం నుంచి అనుమాన ప్రమాణం చేత సాధింపబడుతుంది .రసికుడిలో విభావాదుల జ్ఞానం వలన స్థాయీ భావం ఉద్దీన మవుతుంది . దాని నుంచి వచ్చిన అనుమాన స్ఫురణ యే రసాను భూతి . రసికుడు రసాన్ని భావ రూపంగా మాత్రమే అనుభవిస్తాడుకాని యదార్ధంగా కాదు .వ్యంజకా వ్యంజనాలను గ్రహించినప్పుడే కాక ,విభావాదుల నుంచి వచ్చే స్థాయీ భావాన్ని అనుభవించటం లో కూడా కాలక్రమం ఉంటుంది .దీనికి కారణం -వీటిమధ్య కారణం ,కార్య సంబంధం ఉంటుందికనుక . నా గ్రంథం రెండవ అధ్యాయం అంతా అనౌచిత్యాన్నే చర్చించాను .అనౌచిత్యం -అంతరంగ ,బహిరంగ అని రెండురకాలు .మొదటిది రసాన్ని అభివ్యక్తి చేయటంలో రెండవది శబ్దార్ధాల ప్రయోగాలతో కనిపిస్తుంది . ఈ రెండిటినీ మళ్ళీ 5 రకాలుగా విభజించా .ఇవన్నీ రసావిష్కారానికి అవరోధాలు .ధ్వనికారుని ‘’కావ్యమస్యాత్మా ధ్వని రీతి ‘’అని మొదలు పెట్టిన మొదటి కారిక లోనే ఈ దోషాలను చాలా ఉదాహరించి చూపించా ..ఆనంద వర్ధన శ్లోకాలే వాడి దోషాలకు ఉదాహరణలుగా చెప్పాను .ఈ దోషాలు పరిహరించి ఎలా రాస్తే బాగుంటుందో సూచించాను .భారతీయ సాహిత్య విమర్శనా చరిత్రలో నేను చేసి చూపింది అపూర్వం అసదృశం ..దీనికొక ఉదాహరణ ఇచ్చా ‘’వైద్యుడు ఇతరులను అయోగ్యమైన ఆహారం తినకుండా నివారిస్తాడు-తానూ దానికి అలవాటు పడిఉన్నా  సరే ‘’అని చెప్పాను .ఇక చెప్పాల్సింది లేదు .సెలవ్ .

విశ్వనాథుడు -నేను చెప్పాల్సింది అంతా  చెప్పేశాను ..పండితరాయలు ప్రసంగిస్తారు .సెలవ్

జగన్నాథుడు -రస ప్రాధాన్యాన్ని నేను అంగీకరిస్తా.కానీ రసం ప్రముఖంగా లేదనో ,రసధ్వని కనపడలేదనో కావ్యాన్ని కావ్యం కాదు అనకూడదు .అలంకార చమత్కారమున్నా ,చమత్కారాన్ని సూటిగా లేక వాచ్యార్థం గా చెప్పినా కావ్యం ఆనందాన్నిస్తుంది . చమత్కార గుణానికి జేజే లుపలికాను .రస ,అలంకార వస్తువులనుంచి ఇది నిష్పన్నమవుతుంది.  ధ్వని ,లేక వాచ్యం ద్వారా అభి వ్యక్తమవుతోంది .ఈ రకంగా కావ్య భావానికి కొత్త సమగ్ర స్వరూప నిర్ణయం చేశాను ..నా వాదనాపటిమ ఘనిస్టం .సహజ ఉన్నత కవిత్వం అని నా కవిత్వాన్ని కీర్తించారు ..తేడా వస్తే చమడా ఒలుస్తా ..నాది ఆత్మ విశ్వాసం .అద్వైతినైనా నాకు శివ కేశవ భేదం లేదు .లోకాన్ని నిశితంగా పరిశీలించి రాశాను .భోగ లాలసత కు ,శృంగార క్రీడలకు నిలయమైన మొఘల్ సామ్రాజ్య రాజధానిలో ఉండటం వలన శృంగారం నా అంగాంగానా అలముకొన్నట్లు కనిపిస్తుందికదూ ..ఇంతకంటే నాకూ చెప్పటానికేమీ మిగలలేదు సెలవ్ .

భోజరాజు -సాహిత్య రసానుభూతి మూడు మెట్ల సోపానం అని ఇందాకే చెప్పాను .అడుగుమెట్టును పూర్వ కోటి అని ,అభిమానం అనే మధ్యమెట్టు మాధ్యమావస్థ  భావన.ఇది మనో వృత్తులన్నీ అణగిపోయిన తర్వాత సాగే చింతన యొక్క ఉన్నత దశ .ఈ దశలో వివిధ మనోద్వేగాల  బహుళత్వం అను భూతమవుతుంది .ఇవే భరతముని చెప్పిన అష్ట రసాలు .నిజానికి ఇవి 49 .. భావనా పరిధిని అధిగమించి న శుద్ధానందం ఇది .ఈ  చరమ స్థితినే శృంగారం లేక ప్రేమ అన్నాను .ఇదే ఉత్తర కోటి . ఆనంద వర్ధనుని ధ్వనిని అంగీకరిస్తూ మీమాంసకుల ‘’తాత్పర్యం ‘’తో దానికి సామరస్యం కలిపించాను ..అంటే ధ్వనికి తాత్పర్యం అనే కొత్త పేరు పెట్టానన్నమాట .వర్ధనుడి అనువాద ధ్వనికి ప్రతివాదంగా ‘’శబ్ద ధ్వని ‘’అనే కొత్త రూపాన్ని ప్రవేశపెట్టాను ..అలంకార పరామర్శలో కొత్తదనాన్ని తెచ్చాను .గుణాలు ,రసాలు భావాలు అన్నీ అందులోకి వస్తాయని దాని విస్తృతి పెంచాను . సూక్ష్మ అర్ధ పరిమాణాలు గుర్తించా ..అలంకార సమ్మేళనంలో 6 ప్రమాణాల భావన సమర్ధించా ..అలంకారాలలోచమత్కారం పరాకాష్టకు చేరేది వాటిని నేర్పుగా కలిపినప్పుడే . ఇదే నాకున్న అలంకార శాస్త్రం పై శ్రద్ధ అన్నారు  . మీ కృష్ణా జిల్లా పెనమకూరు కవి అనంతామాత్యుడు ‘’భోజ రాజీయం ‘’రాసి నన్ను చరితార్థుడిని చేశాడు ..అందులో ఆవు -పులి కథ చిరస్మరణీయంగా రాశాడు .ఆ కథ  నాకు చాలా ఇష్టం . సత్య నిష్ఠకు అది గొప్ప ప్రతీక ఆయనకు అభినందన చందనాలు  .అభిమానంతో నన్ను ఆహ్వానించి నిర్వహణ బాధ్యతనూ అప్పగించినందుకు సరసభారతి కి కృతజ్ఞతలు .నేను నా రాజ్యం లోనే ఉన్నట్లు అనిపించింది .నా సాహిత్య సభనే నడిపిన అనుభూతికలిగింది .శ్రోతృ మహాశయులు ఓపికకు ధన్యవాదాలు .

 సాహితీ బంధువులారా !అలంకారిక ఆనంద నందనం చివరిభాగ0లో మన కోరికమన్నించి విచ్చేసి తమ సిద్ధాంత సారా మృతధారలతో తనియింపజేసిన అలంకారిక పరమేశ్వరులకు కృతజ్ఞతాభి వందనాలు . మీకూ శతకోటి అభినందనలు .ఒక్క సారి పునశ్చరణ చేసుకొందాం .

భోజమహారాజుగారి నిశిత పరిశీలనకు జోహార్లు .. వారిని ధారానగర ప్రభువు అంటారు ..భోపాల్ లో వారు నిర్మించిన ‘’భోజేశ్వర దేవాలయం ‘’సుప్రసిద్ధమైనది .భోజేశ్వర పట్టణం గొప్ప విద్యా కేంద్రం ..అతి పురాతన తాళపత్ర గ్రంధాలను సేకరించి భాప్రాపరచారు భోజరాజు .ఈ నాటి థార్ నగరం లో వారు నిర్మించిన సరస్వతీ దేవాలయం ఉంది .సరస్వతీ పుత్రలేకాక సమరాంగ ణ సార్వభౌములైన వారు .మన కృష్ణ దేవరాయలు గుర్తుకు వస్తారు . పతంజలి యోగ సూత్రాలకు భాష్యం రాశారు .సివిల్ ఇంజనీరింగ్ పై ‘’సమరాంగణ సూత్ర దారి ‘’రాసి దేవాలయ ,కోటల ,విగ్రహ, గృహ నిర్మాణ వివరాలు తెలిపారు .తంత్ర శాస్త్రంగా ‘’తత్వ ప్రకాశం ‘’,లోహ శాస్త్రంగా ‘’రస రాజమృగాంకమ్ ,నౌకా నిర్మాణ శాస్త్రంగా ‘’యుక్తి కల్పతరు ‘’న్యాయ శాస్త్రం పై ‘’ధర్మ శాస్త్ర వృత్తి ‘’రామాయణంపై రామాయణ చంపు రాశారు దీనికే ‘’భోజ చంపు’’ అనే సార్ధకనామమేర్పడింది .మొత్తం 84 గ్రంధాలు రాసిన బహుశాస్త్ర కోవిదులు .కాళిదాసాది కవులకు నిలయం భోజరాజాస్థానం .ఆంద్ర దేశం లో పూర్వం గురుకుల విద్య భోజ రాజ  చంపు తోనే ప్రారంభమయ్యేది ..అంతటి ప్రశస్తి పొందిన చంపు అది .. రాజుకనుక ప్రతి విషయాన్నీ చెప్పాలనే చాపల్యం ఉందనిపిస్తుంది . సర్వజ్ఞుడికి అందర్నీ తనలాగే చేయాలనే కోర్కె ఉంటుంది . అందుకే ఈతపన . కృతజ్ఞతలు భోజరాజేంద్రా .

  మహిమాబట్టు లవారు అనుమాన సిద్ధాంతం ధ్వని సిద్ధాంతం కంటే మరింత సమ గ్రమైనది .రసాధిక్యతను నొక్కి చెప్పింది .గుణీ భూత వ్యంగ్యాన్ని  వివరించింది .కవితా సృష్టికి రసమే  ఆనంద  కారణం కనుక మరే  ఇతర పదార్ధానికీ కూడా దాన్ని లోబరచకూడదని స్పష్టంగా చెప్పారు ..అనుమాన సిద్ధాంతం లో గుణీ భూత వ్యంగ్యానికి అగ్రాసనమిచ్చారు .దీనిలో వక్రోక్తి తాత్పర్యాలను కూడా భాగం చేశారు.  మౌలిక ఆలోచనకలిగిన ధైర్య శాలి .అలంకార చరిత్రలో పాండిత్య స్ఫోరకమైన వాగ్వాదాలకు ,విస్తృతమైన విద్వత్తుకు ,విస్పష్ట విశదీకరణకు ,లోతైన గ్రహణ శక్తికి మహిమా భట్టు లవారికి సాటి వేరెవరూలేరు అన్న శ్రీ ఆర్ .పి .ద్వివేదీ పలుకులు అక్షర సత్యాలు ..వారు అవతరించిన అసమాన ‘’అనుమాన మహిమాభట్టు ‘’.

 విశ్వనాథకవిరాజుల  వారి సాహిత్య దర్పణం గురించి వారికుమారుడు అనంతదాసు ‘’శ్రవ్యా భి  నే యాలంకార తత్త్వం సత్కవి సమ్మతం -యదిహాస్తి యదన్యత్ర యాన్నే హస్తి తత్క్వచిత్ ‘’అని గొప్పగా చెప్పాడు -అలంకారాల ముఖ్య ధర్మాలన్నీ ఇందులో ఉన్నాయి .ఇందులో ఉన్నది ఇతర గ్రంథాలలో ఉండవచ్చు .కానీ ఇందులో లేనిది మాత్రం ఇంకెక్కడా ఉండదు ‘’అదీ అలంకార విశ్వ నాధీయ0 .  ‘’విశ్వ నాదీయం ‘’కూడా ..విశ్వనాధులవారు సాహిత్య దర్పణాన్ని సంక్షిప్తంగా ,అర్ధ స్పష్టత తో ,సర్వ దోషరహితంగా రచించారు దీనికి  ఆయన కుమారుడుఅనంతదాసు చెప్పిన శ్లోకమే సాక్షి -’’స్వల్పాక్షరాహ్ సుబోధార్దాహ్ ప్రధ్వస్త శేష దూషణాః –సాహిత్య దర్పణో నామ గ్రంథ స్తేన వినిర్మితాహ్ ‘’. ధ్వని సిద్ధాంత ప్రవర్తకులలో పరిపక్వమైన చింతనగల వారిలో విశ్వనాథ కవిరాజ స్థానం అత్యున్నతమైనది –

‘’ధ్వన్యాధ్వని  ప్రౌఢాధియం పురోగాహ్ శ్రీ విశ్వనాధాహ్ కవి చక్రవర్తీ ‘’..ఈ సభ మీ రాకతో ధన్యమైందికవి చక్రవర్తీ ,

మనవాడైన జగన్నాథ పండితరాయల వారి కవిత్వం కోన సీమ కొబ్బరికున్న తీపిదనం లేతతనంతో కోనసీమ అందాలవంటి శబ్దార్ధాల సుందర మేళవింపుతో  ఆ సీమ ప్రత్యేకమైన పక్వమైనపనసపండు తొనలవంటి మాధుర్యవంతమైన  ప్రయాస లేని యమకాల ఇంపు సొంపులతో అలరిస్తుంది .. రామణీయార్ద ప్రతిపాదనమైన శబ్దమే కావ్యం అనగలిగిన చేవ ఉన్న అలంకారిక కవి .సౌందర్యం మూర్తీభవించిన వ్యక్తి .ఐహిక భోగాలకు పర లోక చింతనకు సమ విలువనిచ్చినవారు .అపార విద్వత్తుతో ప్రకాశించే ఆపర సాహత్య  జగన్నాధులే .మీరాక తో మేము పావనమయ్యాము పండితరాయా నమోవాకాలు . అలంకారిక చతుష్టయం అందరికీ మరోమారు వందనం .ఆల0కారకులైన  మీ రాకవలన ఈ ప్రత్యేక కార్యక్రమం నిజంగానే ఆనంద నందనమై కను విందు, వీనుల విందూ చేకూర్చింది .

దీనిని ప్రశ్నోత్తర రూపం లో నిర్వహించి అలంకార పరిణామాన్ని తెలియ జేస్తే బాగుంటుంది అనే సూచన వచ్చింది .అసలు అలంకార  శాస్త్రం  డ్రై  సబ్జెక్ట్ .మళ్ళీ దీనిలో ప్రశ్నలు , సమాధానాలు ,చర్చలూ ఉపచర్చలు పెడితే బుర్ర వేడెక్కి మైండ్ బ్లాకై పోతుందని భయపడి ఈ విధానాన్ని ఎంచుకున్నాను .సరదాగా వినేందుకు ,కావాలంటే ఆరుద్ర రాసిన ‘’సమగ్రాంధ్ర సాహిత్యం ‘’లాగా హాయిగా చదువుకొనేట్లు రీడబిలిటీ ఉండాలని అనుకొని ,ఆలంకారికుల గురించి  తెలియని విషయాలెన్నో తెలియ జేసే వీలు ఇది కలిగిస్తుందని భావించాను .  . ఇది ఒక భూమిక మాత్రమే . కావలసినవారు దీనిపై సౌధాలు నిర్మించుకో వచ్చు . నేను తీసుకున్నది 13 మంది ఆలంకారికులను మాత్రమే . ఇంకా ఎందరో లబ్ధ ప్రతిష్టులైన వారున్నారు . ఎందరో ఆలంకారికులు అందరికీ ఆనంద నందన వందనములు . ఈ కార్యక్రమాన్ని సమాదరించి జయప్రద0 చేసిన అందరికీ మరొక్క మారు కృతజ్ఞతాభి వందనాలు .

ఆధారం -ఈఆలం కారిక ఆనంద నందనం ధారా వాహికకు  ఆధారం 1–నేను రాసిన గీర్వాణ కవుల కవితా గీర్వాణం -1 మొదటిభాగం 2- పబ్లికేషన్స్ డివిజన్ వారి ‘’భారతీయ సంస్కృతీ వైతాళికులు -ఆలంకారికులు .

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -1-8-17-కాంప్-షార్లెట్-అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.