వీక్లీ అమెరికా -20-(7-8-17నుండి 13-8-17 )వరకు
-కస్తూరి వెంకయ్య అరంగేట్ర వారం
శీర్షిక కంఫ్యూజింగ్ గా ఉందా? కిందకి వస్తే అదే తేటతెల్లమవుతుంది .
-7-8-17 సోమవారం -అమెరికా వచ్చి నాలుగు నెలలయింది – మార్చి 30 న సీజన్ లో మామిడిపళ్ళు తినటం మొదలుపెట్టి ఈ రోజువరకు అంటే నాలుగునెలలపై 15 రోజులవరకు మామిడిపళ్ళు తింటూనే ఉన్నాం . మా జీవితం లో ఇంత లాంగెస్ట్ మామిడి సీజన్ ఇదే . మా అమ్మాయి పటేల్ బ్రదర్స్ లో పండ్లు కనబడటం ఆలస్యం కొని తెచ్చి తినిపిస్తోంది ..గీర్వాణం -3 లో 394 వరకు రాశా ..ఇవాళ శ్రావణ పౌర్ణమి జంధ్యాలపౌర్ణమి .నూతన యజ్నోపవీతం ధరించాను
మంగళవారం -..మచిలీపట్నం హిందూకాలెజ్ హిస్టరీ హెడ్ శ్రీ ఎస్ వెంకటేశ్వరరావు గారికి ఫోన్ చేసి ఆధునిక ప్రపంచానిర్మాతలు కు ముందుమాట రాయమని కోరగా వెంటనే అంగీకరించటం వారికి ఫైల్ ను ఫార్వార్డ్ చేయటం జరిగిపోయింది అవధాన సరస్వతి .శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారికి గీర్వాణం -3 కు ముందుమాటరాయమని మెయిల్ పెట్టిన వెంటనే జవాబు ఇస్తూ తప్పక రాస్తానని తెలియజేశారు . వారు ఆగస్టు 27 అమెరికావచ్చి సెప్టెంబర్ 27 మళ్ళీ ఇండియా చేరుతారు . కనుక ఆతర్వాత ఆపని చేస్తానంటే సరే అన్నాను .
91 ఏళ్ళ శ్రీ పోతుకూచి సాంబశివరావు గారు మరణించిన వార్త చూశాను .ఆయన ఆంద్ర పత్రిక లేక ప్రభ వీక్లీ లో సీరియల్ గా రాసిన ”ఏడు రోజుల మజిలీ ”నవల బాగా నచ్చింది .10 ఏళ్ళక్రితం ఒకసారి ఆయనకు ఫోన్ చేసి హైదరాబాద్ లో వారింటికి వెళ్లి ఒక అరగంట సేపు మాట్లాడాను .మంచి సంభాషణా చతురులు ఆయన .ఒక మాసపత్రిక కూడా నడిపేవారు .
బుధవారం -గీర్వాణం -3 ను 410 వరకు లాగించా .
గురువారం -”కస్తూరిసేవా పరిమళ వ్యాప్తి ”రెండుభాగాలు రాశా .ఇంద్రజ ,నారా రోహిత్ ,లవకుశ నాగరాజు ల ఇంటర్వ్యూలు చూశా .నాగరాజు తన స్నేహితుడు హైదరాబాద్ ఝాన్సినగర్ లో కట్టించిన శ్రీ షిరిడీ సాయిబాబామందిరం లో భార్యతో సేవలో ఉంటున్నాడట .ఇంద్రజ కూ ఇద్దరుబాబాలు పూజనీయులేట .”గొట్టం” లో నారా నటించిన రౌడీ ఫెలో చూశా కొల్లేరు సరస్సు ,ఆక్రమణపై కథ బాగా చేశాడనిపించింది .
11-8-17 శుక్రవారం -వెంకయ్య 15 వ ఉపరాష్ట్ర పతిగా ప్రమాణ స్వికారం చేశాడు .అఖిల భారతీయవిద్యార్థి పరిషత్ లో క్రియా శీలకం గా పని చేసినవాడు అత్యున్నత పదవిని అలంకరించటం మనకు గర్వకారణం . అత్యున్నత పదవులలో ఈనాడున్న అత్యంత సామాన్యులు ప్రధాని మోడీ ,రాష్ట్రపతి కోవింద్ ,ఉపరాష్ట్రపతి ఉషాపతి వెంకయ్య . స్పీకర్ సుమిత్రా మహాజన్ తో కూడా కలిపితే బిజె పి నాయకులు నలుగురు అత్యున్నత పీఠాలపై ఉండటం ఆపార్టీకి గర్వకారణం మోడీ ,షా ల చాకచక్యం .చాణక్యం
సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం నాడు శ్రీ కోట గురుదేవుల గురు పూజోత్సవ కార్యక్రమం తయారు చేసిపంపాను. కస్తూరి 3,4 రాశా .
అరంగేట్రం
12-8-17 శనివారం – కస్తూరి 5 రాసి ముగించా .
ఇక్కడ మా కమ్యూనిటీ లోనే ఉన్న గుజరాతీ దంపతులు ప్రేరా ,అనుపమ పటేల్ లకుమార్తె కుమారి త్విషా పటేల్ భరతనాట్యం శ్రీమతి రాధికా ఉన్నితన్ వద్ద నేర్చి ఈ రోజు హాల్టన్ ధియేటర్ లో అరంగేట్రం చేసింది .అందరం వెళ్లాం 4-45 కు బయల్దేరి చూడటానికి .సరిగ్గా 5గంటలకు ప్రారంభమైనది . షణ్ముఖ ప్రియ రాగం లో గణేశఅంజలి ముందుగా చేసింది .తర్వాత నాటరాగం లో అలరిపు (అలరింపు ),రసాళిరాగం లో జతిస్వరం ,రాగమాలికలో శబ్దం, ధన్యాసిరాగం లో వర్ణం లను కృతులు కీ ర్తనలకు తగినట్లుఒక గంట సేపు అభినయించింది .
తర్వాత ఒక 20 నిమిషాలు విశ్రాంతి-అందరికి సమోసా మాంగో జ్యుస్ , టీ ఇచ్చారు .
విరామానంతరం హిందోళ రాగంలో మైసూర్ వాసుదేవాచార్య కృతి”మామవతు” సరస్వతీ దేవీ స్తుతి ,తర్వాత శివ తాండవానికి శివా అంటే పార్వతీదేవి చేసే ”లాస్యం ” చివరగా తిల్లాన కు నాట్యం చేసి , ఆతర్వాత తండ్రికోసం గుజరాతీ పాటకు, తల్లికోసం హిందీ పాటకు నృత్యాభినయం, చేసి చివరకు నా ట రాగం లో మంగళం లో దేవుడికి గురువుకు ప్రేక్షక దేవుళ్ళకు విన యాంజలి ఘటించి ఒక గంటలో ముగించింది .గురువు శ్రీమతి రాధికగారు నట్టువాంగం చేస్తూ ప్రోత్సహించింది . హావ భావాలు బాగానే ఉన్నాయి .కానీ ప్రతి అంశం 7లేక 8 నిమిషాలకంటే లేకపోవటం ,ఏదో చేసేసి వెళ్ళిపోదాం అన్నట్లు చేయటం గా నాకు అనిపించింది. భరతనాట్యం పధ్ధతి ఇంతేనేమో నాకు తెలియదు తర్వాత అందరికి డిన్నర్ . రోటీ ,రెండునాకుకూరల పులుసులు సువీత్ ,పులిహోర ,బిర్యానీలాంటిది ,అప్పడం .కావాల్సినవాళ్లకు కోకాకోలా . రోటీ ఒకటిన్నరముక్క స్వీట్ అప్పడం తో లాగించా అంతే . .
ఇంతకు ముందు మేము చూసిన కుమారి రచిత కూచిపూడి రంగ ప్రవేశమే నాకు బాగా నచ్చిందేమో అనిపించింది . మనకు నచ్చటం నచ్చకపోవడం అటుంచి ఇంగ్లిష్ లో చదువుతూ ,క్షణం ఖాళీ లేని విద్యా జీవితం గడుపుతూ ఇ0త ఉత్సాహంగా అంకితభావం తో తమదికాని భాషలో ,తమభాష కాని గురువువద్ద క్రమశిక్షణతో నృత్యం నేర్వటం ఆ చిన్నారుల పట్టుదల క్రమశిక్షణ ,అకుంఠిత దీక్ష కు జోహార్లు .మన సంస్కృతిని ఇక్కడ ఇంత గొప్పగా ప్రదర్శిస్తూ మన్ననలు అందుకోవటం సామాన్యమైన విషయంకాదు .ఆ పిల్లల తలిదండ్రులకున్న అభిరుచి గురువుపై నమ్మకం , ఎన్నో వేలడాలర్లు ఖర్చుపెట్టి నేర్పించటం ,రంగప్రవేశ అరంగేట్రాలకు కూడా సంకోచంలేకుండా డబ్బు ఖర్చు చేయటం చూస్తుంటే వీరందరికి ఉన్న ఉత్తమాభి రుచికి మనస్ఫూర్తిగా తప్పక అభినందనలు తెలియ జేయాల్సిందే . మేరా భారత్ మహాన్ .
13-8-17 ఆదివారం -ప్రొద్దున ,మధ్యాహ్నం ”శంకరాభరణం పాలెస్ ”కిట్టుగాడున్నా డు జాగ్రత్త” యు ట్యూబ్ లో చూశా . సరదాగా ఉన్నాయి . రమణ ఫోన్ చేసి ఉయ్యూరులో సేవింగ్స్ ఏజెంట్ మండా ప్రసాద్ భార్య శ్రీమతి పావని చనిపోయినట్లు తెలిపాడు.పాపం ఆమె రెండేళ్లనుంచి కేన్సర్ తో బాధ పడుతోంది . వైద్య లోపం ఏమీలేదు .ఖరీదైన వైద్యమే చేయించారు . నేను మార్చి చివర్లో ఆమెకు రీకరింగ్ డిపాజిట్ కట్టాను కూడా ..అలాగే ఈవారం లోనే మా పెద్దకోడలు అమ్మక్కయ్యగారు శ్రీమతి భవానిగారు కూడా చనిపోయినట్లు తెలిసింది .ఈ ఇద్దరి ఆత్మలకు శాంతికలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను . ఆకుటుంబాలకు మా సానుభూతి తెలియ జేస్తున్నాను
వాగ్గేయకారుడు మైసూర్ వాసుదేవాచార్య సంస్కృతం లో కృతులు రాశాడని తెలుసుకొని గీర్వాణం 3 లో 411 వ కవిగా ఇప్పుడే ఆయన గురించి రాశాను.. ఈ వీక్లీ సమాప్తం .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-8-17-కాంప్-షార్లెట్-అమెరికా