నిన్న 15-8-17 మంగళవారం శ్రీ కృష్ణాష్టమి 71 వ భారత స్వాతంత్య్ర దినోత్సవం .ఉదయం మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో బాలకృష్ణ ముద్దుపాదాలను ముగ్గుతో మా శ్రీమతి చిత్రించి బాలకృష్ణుడిని ఆహ్వానించింది .నేను శ్రీకృష్ణఅష్టోత్తరం విష్ణుసామ్ తో సహస్రనామ0 తో కన్నయ్యకు పూజచేసి మా ఆవిడ చేసిన అటుకులు ,కట్టెకారం తో పాలు పెరుగు వెన్న మామూలు నైవేద్యానికి అదనంగా నైవేద్యం పెట్టాను . సాయంత్రం మా అమ్మాయి భజన ఏర్పాటు చేసింది . సాయి సెంటర్ వాళ్ళందరూ దాదాపు 75 మంది వచ్చి భజనలు చేశారు .అందులో కృష్ణభజనలూ ఉన్నాయి . మా అమ్మాయి నన్ను మాట్లాడమంటే 9 నిమిషాలు కృష్ణతత్వాన్ని గురించి చెప్పాను .చాలా బాగుంది ఇంకా చెబితే బాగుండేది అని చాలామంది ముఖ్యంగా శ్రీమతి లక్ష్మి ,ఉష ,రాధా అడిగారు .సరే నని భోజనాలయ్యాక రాత్రి 9-30 నుండి 9 50దాకా మళ్ళీ హోలిక విశేషాలు చెప్పాను .అందరూ సంతోషంగా ఆనందం తో రాత్రి 10 గంటలకు ఇళ్లకు బయల్దేరి వెళ్లారు . నేను మాట్లాడిన దాని సారాంశం తోపాటు మరికొంత సమాచారం తో దీన్ని ”కృష్ణం వ0దే జగద్గురుమ్ ”గా అందజేస్తున్నాను .
అసలు కృష్ణ అని అనగానే మనముందు నీలమేఘచ్చాయ తో ముగ్ధ మోహన రూపం తో” వ్యస్తష్టపాదం ” తో పెదాలవద్ద వేణువు తలలో నెమలి పించం మెడలో తులసిమాల ,ప్రక్కన గోమాత ఉన్న నందనందన యదునందనుఁడు గోపాల కృష్ణుని దివ్య మంగళ రూపం కళ్ళ ముందు దర్శనమవుతుంది .ఆ రూపానికి జగత్తు అంతా పరవశించింది . ఆయన దేహచ్చాయ నీలవర్ణం .అనంతమైన ఆకాశం సముద్రం రంగు కూడా నీలమే .కనుక అది అనంతత్వానికి ప్రతీక -సింబల్ .అంతేకాదు అన్ని రంగులూ నీలం లో లయమవుతాయి .నిరాకార పరబ్రహ్మ తత్వానికి అదేప్రత్యేకత ..భాగవత రచన ప్రారంభిస్తూ వ్యాసమహర్షి కృష్ణుడు దుష్ట శిక్షణ ,శిష్ట రక్షణ కోసం మాత్రమే అవతరించలేదు -అజ్ఞానం ,విషయం వాంఛలతో ,సుఖ భోగ లాలసత్వం సంసారం లో మునిగితేలేవారికి తనలీలలద్వారా తరించే మార్గం చెప్పటానికి అవతరించాడు అంటే స్మరణ మాత్రం తో మొక్షాన్నిస్తాడని అర్ధం .అంతేకాదు ఇన్ని అవతారాలున్నాయి ఏ అవతర0 లో లేని లీలలు కృష్ణావతారం లో కనిపించి ఆ కృష్ణ లీలలకు సమ్మోహితులమవుతాం మన మనసు శరీరం అంతా ఆయన వశమైపోయే తాదాత్మ్య స్థితి అనుభవిస్తుంటాం .అదీ కృష్ణావతార పరమార్ధం . మేనమామకు గండం ఉన్న రోహిణీ నక్షత్రం లో ఆదివారం నాడు అడ్డ కాళ్లతో పుట్టాడు .పుట్టగానే తనను చంపటానికి సిద్ధపడిన ఏడుగురు దాసీలను చంపేశాడు . పూతన చనుబాలుతాగి దాని ప్రాణాలు తోడేశాడు దాని చనుబాలలో ఉన్న విషయాన్ని కూడా తాగేసి ,అంటే పాపాలన్నీ తాగేసి దాని శరీరానికికి పుణ్యమే మిగిల్చాడు పూతన దేహాన్ని తగలబడుతుంటే ”అగరువత్తుల సుగంధం వచ్చిందట . ”పునాతి దేహం పూతన ”అంటే దేహాన్ని పవిత్రం చేసేది అని అర్ధం . ఆమె విషం ఈయనకు అమృతం అయింది అందుకే ఏ పదార్ధమైనా భగవంతుడికి ”అమృతమస్తు ”అంటూ నైవేద్యం చేసి తింటాం అది అమృత స్వరూపంగా మారుతుంది అదే ప్రసాదం అంటే ప్రకృష్టమైన సాదం అంటే భోజనం పవిత్ర భోజనం శకటాసుర తృణాసుర ,కాళీయుల ను సంహరించాడు .అహంకారం తో ప్రకృతిపూజను అవహేళన చేసిన ఇంద్రుడికి గోవర్ధనపర్వతం కొనగోటిపై నిలబెట్టి వరుణుడి గర్వాన్ని అణచి గోవులకు గోపాలురకు రక్ష కల్పించాడు . గోపాలకులతో కలిసి చద్దన్నాలు తిన్నాడు . దీన్ని చూసిన నారదుడు ”మహా మునీశ్వరులు కూడా దర్శించలేని కృష్ణపరమాత్మతో ఈ గోపీగోపాలురు హాయిగా ఆటలాడుకొంటున్నారు కలిసి ఎంగిలి కూడు తింటున్నారు వాళ్ళ అదృష్టం యెంత గొప్పదో ”అన్నాడు .పోతన్నగారైతే ఏకంగా కృష్ణుడితో ఆవకాయ మాగాయ పచ్చళ్ళుతినిపించాడు దీన్ని చూసిన వ్యాసభగవానుడు కృష్ణుడితో ”కన్నయ్యా నువ్వుమరీ తెలుగుకృష్ణుడివి అయిపోయావు ”అని అన్నాడని కరుణశ్రీ ”భాగవతః వయజన్తిక”లో సరదాగా రాశారు . ఏ ప్రాంతం వారికీ ఆ ప్రాంతపు కృష్ణుడుగా కనపడటం ఆయన ప్రత్యేకత . ఎంత ఆకర్షణ లేకపోతే భక్తమీరాలాయి సూరదాసు వంటి మహా భక్తులు తమహృదయాలలో ఆయనకు గుడికట్టి పూజించారు .అంతటి ఆకర్షణ ఉన్న అవతార పురుష్ఘుడు లేదు రామావతారం లో రాముడు నీలమేఘ శ్యాముడే .ఆయన మర్యాదా పురుషోత్తముడు .తానూ ఎలా ధర్మాన్ని పాలిస్తూప్రవర్తించాడో జనం అలా నడవాలని ఒక ఆదర్శ మూర్తిగా మార్గదర్శిగా నిలిచాడు కృష్ణుడు ఆచరింపజేశాడు . ధర్మ చ్యుతి కలిగితే నిర్దాక్షిణ్యంగా బంధువైనా సరే సంహరించాడు .అలా సంహరింపబడినవారిలో మేనమామ కంసుడు మేన బావ శిశుపాలుడు లను చంపాడు . బావలవరుస అయినసమస్త కౌరవులు అర్జునుంచేత భీమునిచేతసంహరింపజేశాడు .చివరికి ధర్మ భ్రష్ఠులైన యాదవుల ప్రవర్తన సహించలేక యాదవ కులం లో ముసలం (రోకలి )పుట్టించి వారందరి నాశనానికి కారకుడయ్యాడు ఆయన ధర్మ పక్షపాతం అంతటి విశిష్టమైనది అందుకే ”ధర్మ సంస్థాపనార్ధం సంభవాయై యుగే యుగే ”అని అభయమిచ్చాడు . ఇంతటి ఆకర్షణీయ పురుషునికి అంతటి పాగా ద్వేషమా అని అని అని పిస్తుంది అది ధర్మ సంస్థానార్ధమే అని గ్రహించాలి .
నంద వంశ పురోహితుడు గర్గ మహర్షి నంద బాలుడికి ”కృష్ణ ”అని నామకరణం చేశాడు .”కృష్ అంటే శాశ్వతత్వం ఉన్నవాడు” ణ ” అంటే చిదానందమైనవాడు అంటే శాశ్వత చిదానంద రూపుడైనవాడు అని అర్ధం .. ఇంకో అర్ధం సర్వాన్ని ఆకర్షించేవాడు .కృష్ -ఆకర్షణీయే.అధవా ఆకర్షయేత్ సర్వం జగత్ స్థావరం జంగమం -కృష్ణం ”అని గర్గముని తెలియజేశాడు .ఆయనే ”నామ్నా0 భగవతో నందః కోటీనాం స్మరణేచ యత్ ”అని వివరించాడు స్మరణ మాత్రం చేత తరింపజేసేవాడు .కృష్ణ అంటే సమస్త సమ్మోహ పరచేవాడు ,ఆకర్షించేవాడు .సకాలానికి ఆత్మా అయినవాడు -ఆయనే ఆదిపురుషుడు . ..కృష్ణంధర్మం సనాతనం ” అంటే కృష్ణుడే ధర్మం .మనకు రాముడుకాని కృష్ణుడు కానీ వాళ్ళ ధర్మాన్ని ఏదీ కొత్తగా బోధించలేదు సనాతన వైదిక ధర్మాన్నే వాళ్ళమాటలలో చెప్పారు అని మనం తప్పకుండా గ్రహించాలి ..వ్యాసుడు ”నిష్కల్మషులైన గోపా గోపీ జనాలకు ఆయన అతి దగ్గరవాడయ్యాడు ”అన్నాడు .
శ్రీ కృష్ణుడు తాను పుట్టిన దగ్గర్నుంచి ప్రతి సందర్భం లో తన పరమేశ్వరతత్వాన్ని ,సర్వ సాక్షిత్వాన్ని ,సర్వజ్ఞత్వాన్ని ,సర్వ కారణత్వాన్ని ప్రదర్శించిన సంపూర్ణ అవతారం .అందుకే కృష్ణం వన్డే జగద్గురుమ్ అన్నారు .జగద్గురుత్వం అంటే ఎవరు ఎలా పూజిస్తే ,వాళ్ళను ఆ ప్రకారం అనుగ్రహిస్తాడని అర్ధం . ఎవరు ఏ మార్గం లో సేవించినా ,ఆ దారి తననే చేరుతుంది అని స్పష్టంగా చెప్పాడు .అందుకే అన్ని ధర్మాలను అన్నిమార్గాలను సమన్వయము చేస్తూ ”భగవద్గీత ”అర్జునిద్వారా మనకు బోధించి తన అవుతార తత్వాన్ని తెలియజేశాడు. పూర్ణ కళలతో భగవంతుడు కృష్ణావతారం దాల్చాడు .
జరాసంధుడు 18 సార్లు ప్రతిసారీ 23 అక్షౌహిణుల సైన్యం తో మధురపై దాడి చేశాడు . ఆసైన్యాన్ని అంతటినీకృష్ణ బలరాములు ఇద్దరే సంహరించారు .ఒక అక్షౌహిణి అంటే 10 వేల రథాలు ,20 వేల గుర్రాలు 40 వేల కాల్బలం . అంటే23 x 18=414 అక్షౌహిణుల సైన్యాన్ని బలరామకృష్ణులిద్దరే సంహరించారు .దేనికోసం ధర్మ సంస్థాపనకోసమే . అంటే కర్తవ్య దీక్ష మూర్తీభవించిన అవతారం కృష్ణావతారం …
స్వామి త్యాగీశానంద గొప్ప వేదాంతి మహా గొప్ప సన్యాసి . ప్రాక్ పశ్చిమ వేదాంతాలను క్షుణ్ణంగా చదివి లోతులు తరచినవారు .ఆయన కృష్ణుని గురించి చెబుతూ ”The lord of the autumn moon ”శరత్ చంద్ర ప్రభువు అన్నారు అంటే శరత్కాలం పౌర్ణమి వెన్నెల మనోహరంగా హృదయాహ్లాదంగా పరవశంగా ఉంటుంది అలాంటి పున్నమిచంద్రుడు కృష్ణుడు అని అర్ధం . ఆయనే శ్రీ కృష్ణుడు గొప్ప రాజకీయ నిపుణుడు – స్టేట్స్ మన్ అన్నారు ఆయనే ఆయన జగదురుత్వాన్ని గురించి చెబుతూ ”Krishna is the first teacher in the history of the world to discover and proclaim the grand truth of love for love’s sake and duty for duty’s sake ”అని గొప్పగా కృష్ణ గురుత్వాన్ని ఆవిష్కరించారు .అందుకే కృష్ణం వ0దే జగద్గురుమ్ . గోలోకం
మనలో చాలామందికి భాగవత భారతాలగురించి తెలుసు .కానీ కృష్ణుడికి ప్రత్యేకంగా ఒక లోకమే ఉందని తెలియక పోవచ్చు .బ్రహ్మ వైవర్త పురాణం ”లో శ్రీ కృష్ణ ఖండం ”లో ఆ వివరాలన్నీ ఉన్నాయి .కొద్దిగా ఆ వివరాలు తెలుసుకొందాం .గోలోకం అన్ని లోకాలకంటే పైన ఉన్నది .అందుకనే ఆశీర్వదించేటప్పుడు ”గోలోకే నిత్యనివాస శాశ్వత సిద్ధి రస్తు ”అని దీవిస్తారు .వైకుంఠ లోకానికి 500 మిలియన్ యోజనాల దూరం లో అంటే 4,00000,0000మైళ్ళు .దాని విస్తీర్ణం(ఏరియా ) 30మిలియన్ యోజనాలు అంటే 24,00000,0000 మైళ్ళు .
గో లోకం లోరాధా కృష్ణులు ఉంటారు . వీరిద్దరితో సహా గోప గోపికల అందరి వయసు 16 సంవత్సరాలే దీనికి ”కిశోర ప్రాయం ”అంటారు .అదీ ఈలోగా ప్రత్యేకత ..చేతిలో మురళి వక్షస్థలంపై కౌస్తుభ మణి ధరించి గోప వేషం లో శ్రీ కృష్ణుడు గోపీ జనం తో సదా రాసమండల విహారిగా సర్వ సిద్ధి స్వరూప ,సర్వసిద్ధి ప్రదాత ,ఆదిపురుష అవ్యక్త స్వరూపంగా ఉంటాడు అని బ్రహ్మ వైవర్త పురాణం చెప్పింది ..రాస లీలలు అంటేవిశృంఖల శృంగారం(రిబాల్డ్రీ ) కాదు ,అది జీవాత్మపరమాత్మల సంధానమే అని నిరూపిస్తూ ఒక పుస్తకం రాసి అందరి కళ్ళు తెరిపించింది అనీబిసెంట్ . శ్రీ కృష్ణుని కుడి భాగం నుండి సత్వ ,రజస్ ,తమో గుణాలు వాటి నుంచి అహంకారం ,పంచభూతాలు ,పంచ జ్ఞానాలు ఏర్పడ్డాయి. తరువాతా నారాయణుడు జన్మించాడు .ఆయన ఎడమభాగం నుంచి లక్ష్మీదేవి పుట్టి భార్య అయింది ..కృష్ణుని ఎడమభాగం నుంచి ”సదాశివుడు ”అయిదు ముఖాలతో దిక్కులే వస్త్రాలుగా (దిగంబరం )సకల సిద్ధేశ్వరునిగా ,గురువుకే గురువుగా ఉద్భవించాడు ఆయన మృత్యుంజయుడు ,మృత్యు స్వరూపుడు ..నాభి నుంచి చతుర్ముఖ బ్రహ్మ కమండలం ,జపమాలతో పుట్టి జీవుల ప్రాణదాత అయ్యాడు .శ్రీ కృష్ణ వక్షస్థలం నుంచి ”ధర్మ దేవత ” ఈయన ఎడమభాగం నుంచి ”మూర్తి ”పుట్టి ఆయన భార్య అయింది ..కృష్ణుని ముఖం నుంచి వీణా,పుస్తక ధారని సరస్వతి షోడశ వర్ష కన్యగా జన్మించి బ్రహ్మ భార్య అయింది .మనసునుంచి మహా లక్ష్మి బుద్ధినుంచి ”మూలప్రకృతి -ఈశ్వరి ”జన్మించి వెయ్యి భుజాలతో దుర్గతి నాశిని దుర్గగా భాసించింది .ఈమె సర్వ శక్తులకు మూలం శ్రీ కృష్ణుని శక్తి స్వరూపమే దుర్గ .
శ్రీ కృష్ణుని నాలుక చివర వేదమాత గాయత్రి జన్మించింది .మనసునుంచి మన్మధుడు ,అతని ఎడమభాగం నుంచి రతీదేవి పుట్టి భార్య అయింది .శ్రీ కృష్ణ వామభాగం నుంచి రాధ జన్మించింది .ఈమె కిశోర వయస్క .కృష్ణుని రోమాలనుంచి గోపాలుడు రాధ రోమాలనుంచి గోపికలు పుట్టారు .కృష్ణుని మనసునుంచి నారదుడు పుట్టి పుట్టగానే నారం అంటే నీటిని ఇచ్చాడు నారం అంటే జ్ఞానం కూడా .జ్ఞానప్రదాత నారదుడు ..బ్రహ్మ కంఠం నుంచి ”నరదులు ”అంటే మానవులు పుట్టారు .ఈ విధం గా అఖిల ప్రపంచాన్నీ సృష్టించి పాలించి ,తనలో లయం చేసుకొంటాడు శ్రీ కృష్ణ పర బ్రహ్మ . ఇంతటి అఖండ పరమానంద స్వరూపమైన శ్రీ కృష్ణుని మనసారా పూజించి గుణగానం చేసి ఎందరో మహాత్ములు పునీతులయ్యారు .
చింతామణి అనే వేశ్య వలయం లో చిక్కిన బిల్వ మంగళుడు చివరికి తన తప్పు తెలుసుకొని సన్యాసియై ”లీలా శుక” నామం ;;తో ”శ్రీ కృష్ణ కర్ణామృతం ”రాసి ధన్యుడయ్యాడు .మనకు పరిచయమైన”కస్తూరీ తిలకం లలాట ఫలకె ”శ్లోకం అందులోనిదే .ఆయనే తిరువనంతపురం (త్రివేండ్రం )లో శ్రీ అనంత పద్మనాభ స్వామి దివ్య దర్శనం పొంది మొదటగా పూజించిన పుణ్యశాలి ,అనంత పద్మనాభునిలో త్రిమూర్త్యాత్మకం రూపం మూడు తెరలనుండి దర్శిస్తాం . శ్రీ కృష్ణుడు ద్వారక మునిగిపోయేటప్పుడు సోమనాధ్ లో ఒక అడవిలో నేలపై పడుకోగా ఆయన కాళ్ళను లేడికళ్ళు అని భ్రమించిన వేటగాడిబాణం తో ప్రాణాలు విడిచాడు . ఆ వేటగాడు పూర్వ జన్మలో వాలి .కృష్ణుడు తన భక్తుడు ఉద్ధవుడికి తన రూపాన్ని విగ్రహం గా చేసి ,మునిగిపోయే ద్వారకను వదిలి ఎక్కడైకైనా వెళ్ళిపోయి అనువైన చోట ప్రతిష్టించమని చెప్పాడు .ఆయన తిరిగి తిరిగి పరశురాముని సాయం తో శివుని అనుజ్ఞతో కేరళలోని ”గురువాయూర్ ”లో ఆ విగ్రహం ప్రతిష్టించాడు ..ఇది గొప్ప కృష్ణ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది .ఇక్కడి నారాయణ భట్టు కవి ”నారాణీ యం ”రాశాడు
Rtd Head Master
2-405
Sivalayam Street
Vuyyuru
Krishna District
Andhra Pradesh
521165
INDIA
Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D