గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
426- నరహరి యతి చరిత్ర కర్త -నరహరి తీర్ధ (1324-1333)
మధ్వాచార్య శిష్యుడు ,దాస సంప్రదాయ కర్త నరహరి తీర్ధ విజయనగర సామ్రాజ్య రాజగురువు ,యతీంద్రుడు 1323 లో జన్మించాడు .ఈయనది ఆంద్ర దేశమే నని భావిస్తారు .పుర్వాశ్రమ నామం శ్యామ శాస్త్రి .కళింగ రాజుల మంత్రి గా 12 ఏళ్ళు ఉన్నానని ‘’నరహరి యతి చరిత్ర ‘’లో చెప్పుకున్నాడు. శ్రీకూర్మం ,సింహాచలం దేవాలయ శాసనాలు ఆయన మంత్రిత్వాన్ని రుజువు చేస్తున్నాయి .కన్నడం వాడుకాకపోయినా ఆయన రచనలు కన్నడం లోనే ఎక్కువగా ఉన్నాయి .కళింగ ఆంద్ర లలో చాలామందిని మధ్వ మతం లోకి మార్చినట్లు ఆధారాలున్నాయి .ఆయన వారసులు ఇప్పటికీ సాగరాంధ్రలో ఉన్నారు .హరిదాసు ఉద్యమానికి ఈయనే ఆద్యుడు అంటారుకాని శ్రీపాద రాయలే ఆద్యుడని ఎక్కువమంది భావిస్తారు . కానీ యక్షగానాలు సృష్టికర్త నరహరి తీర్ధ మాత్రమే అలాగే బాయలత నృత్యానికి ఆద్యుడు ఆయనే .ఈ సంప్రదాయం ఇప్పటికి కర్ణాటక లో కేరళలోని కాసర్ గోడ్ ప్రాంతం లో ఉన్నాయి .ఈయన కృష్ణాజిల్లా శ్రీకాకుళం లో ఆంద్ర మహా విష్ణువు వెలసిన చోట మఠాధిపతి గా ఉన్నాడని కూచిపూడి నృత్య ప్రదాత అని ప్రచారం లో ఉంది .సంస్కృతం లో ‘’దసరాపదాలు ‘’ రాశాడు .
427-గురు కృతి కర్త -ఊత్తుక్కాడు వేంకటకవి (1700-1765 )
ఊత్తుకాడు వెంకటసుబ్బయ్య అయ్యర్ 1700లో తమిళనాడులో జన్మించి గర్వించదగ్గ గొప్ప వాగ్గేయకారుడయ్యాడు .వెంకట కవిగా ప్రసిద్ధుడు . సంస్కృత ,తమిళ మరాఠీ భాషలలో 500 కు పైగా కృతులు రచించాడు . ఇవి ఆయన సంగీత శాస్త్ర పాండిత్యానికి ఉదాహరలుగా నిలిచాయి .కావడి చిందు ,తిల్లానా ,కృతులు ఆయన ప్రత్యేకం . పురన్దరదాసుకు కర్ణాటక సంగీత త్రయానికి వారధిగా వేంకటకవి ని భావిస్తారు .సంగీతం లో సరైన గురువును అన్వేషిస్తూ చాలాకాలం గడిపి చివరికి ఊత్తుక్కాడు కళింగ నర్తన ఆ లయం లో శ్రీకృష్ణుడిని గురువుగా భావించాడు . కృష్ణ భగవానునుని ప్రేరణ చెంది ఆరభి రాగం లో ‘’గురుపాదారవిందం కోమలం ‘’కృతి రాశాడు .తన గురుదేవుడైన కృష్ణుడిపై కనీసం 15 గురు కృతులు రాసి అంకితమిచ్చాడు .ఆయన ఫిలాసఫీ ‘’భక్తియోగ సంగీతమార్గమే పరమపావన మహునే ‘’. అనేక రాగాలను ఉపయోగించాడు .అరుదైన బాలహంస, రసమంజరి రాగాలను ఆలపించి కృతులురాశాడు .మధ్యమావతిలో ‘’శ0కరి రాజరాజేశ్వరి’’సుందర నంద కుమారకృతులు మాధుర్యానికి పరాకాష్ట .ఖండ ధ్రువ ,సంకీర్ణ మధ్యమ వంటి అనేక తాళా ల పై గొప్ప ప్రయోగాలు చేశాడు .సాహిత్య వైవిధ్యాన్ని చాలా అద్భుతంగా పోషించాడు .ఉదాహరణకు అభోగి రాగ పల్లవి ‘’మహశ్యాయ హృదయ ‘’మాధ్యమకాల విధానం లో 1-మధుకర చంపక వన విహార మనమోహన మధుసూదన నవభూషణ 2-మధుకర చంపక వనవిహార నవపల్లవ పదకర మదన గంభీర 3-మధుకర చంపక వనవిహార గోవర్ధనధర భుజగ నర్తన చరణ ‘’
ఇదేకాక గౌళరాగం లో ‘’అగణిత మహిమ ‘’లో కూడా ఇలాంటి వైవిధ్యాన్ని ప్రదర్శించాడు .ధన్యాసిరాగం లో కూర్చిన ‘’భువనమోహన’’లో ఆరుసార్లు పునరావృత్తమై 11 సార్లు వినిపించి అలౌకిక ఆనందాన్ని సృష్టించాడు .సంస్కృతం లోని ఈరచన కర్ణామృతమే -’’అతినూతన కుసుమాకర ,వ్రజమోహన సరసీరుహ దళ లోచన మమమానస పటు చోరసు -స్వరగీతసు -మురళీధర సుర మోదిత భవమోచన ‘’/ఆయన సంస్కృత పాండిత్యం అమోఘం .దానిలోని సొగసులన్నీ కృతులలో దింపేశాడు .ఆయన ప్రసిద్ధ తమిళకృతి తోడిరాగం లోని ‘’తాయి యశోద’’సంగీతకచేరీలలో తప్పని సరి అయి శ్రీ కృష్ణలీలకు పరమ భాష్యమై నిలిచింది .ఇందులో 8 చరణాలున్నాయి .ఒక్కో చరణం లో ఒక్కో లీల దర్శనమౌతుంది .రాధా కృష్ణకల్యాణాన్ని కృతి మాధ్యమంగా రాశాడు .మహాభారతం దక్షయజ్ఞం ప్రహ్లాద చరితం లకూ కృతి గౌరవం కల్పించి శాశ్వతత్వం చే కూర్చాడు .సామూహిక కృతులైన సప్త రత్న ,కామాక్షి నవ రత్నం ,ఆంజనేయ రత్నం వంటివీ రాశాడు .మాధవ పంచకం ,నృసింహ పంచకం ,రంగనాధ పంచకం వంటి స్తోత్రాలుకూడా రాశాడు .’’త్యాగ రాజ పంచరత్నాలు’’వంటి ‘’సప్త రత్న కృతులు ‘’రాశాడు -1 నాట రాగం లో ‘’భజనామృత 2-గౌళ రాగం లో ‘’అగణిత మహిమ ‘’,3-కళ్యాణిరాగం లో ‘’మాధవ హృది కేళిని ‘’4-కీరవాణిరాగం లో ‘’బాలసరస మురళి ‘’5-తోడి రాగం లో ‘’జటధార 6-పరాస్ రాగం లో ‘’అలవ0దె న్నెలో 7-మాధ్యమావతి రాగం లో ‘’సుందర నంద కుమార’’.
ఆంజనేయ సప్తవర్ణ సంస్కృత కృతులలో హనుమ వైభవ విశేషాలన్నీ చూపించాడు-
1-వసంత రాగం లో -’’పవన కుమార 2-కేదార గౌళ లో -’’వీక్షితోహం 3- తోడిరాగం లో -’’అంజనానందన అమ్బోధి చంద్ర 4-సురటి రాగం లో -శ్రీరాఘవ దూతం 5-మాధ్యమావతి రాగం లో -’’భక్త భాగ ధేయ ‘’6-రసమంజరి రాగం లో -’’సత్వ గుణ విరచితాంగ 7-మలయ మారుత రాగం లో ‘’వాహిని తట ‘’.
దసరాలలో శ్రీ విద్య పై పాడే నవ వర్ణకృతులు వినాయక స్తుతి ,ధ్యాన స్తుతి ఫలస్తుతి కూడా రాశాడు .కూచిపూడి భరతనాట్య ,కథక్ ,ఒడిశా నృత్యకళాకారులు ఆయన కృతులకు నాట్య ఆకృతులను కూర్చి బహుళ వ్యాప్తి చేశారు. అందులో వైజయంతిమాల ,కమలా లక్ష్మణ్ బిర్జు మహారాజ్ పద్మా సుబ్రహ్మణ్యం వెంపటి చినసత్యం వంటి వారెందరో ఉన్నారు .ఆయన రాసిన హరికథలను శ్రీ కృష్ణ ప్రేమి అన్న ,గురు హరిదాసు గిరి వంటి హరికథా కళాకారులు వీనుల విందుగా వినిపించి ప్రచారం చేశారు .ఆయనకే ప్రత్యేకమైన -’’కళింగ నర్తన నటంగం,కృష్ణ పాదాది కేశాంతవర్ణనం ‘’నభూతో అనిపిస్తాయి .భజన సంప్రదాయం లోకూడా వేంకటకవి రచనలు స్థానం పొందాయి . ,శివ తాండవం ఆయన సంస్కృత భాషా పటిమకు పరమ భక్తికి తార్కాణంగా నిలీచింది . .నిత్య జీవితం లో పారాయణకు తోడ్పడి ప్రతి ఇంటా మార్మోగుతూ వినిపిస్తాయి . 65 సంవత్సరాలు జీవించి శ్రీ కృష్ణ శిష్యుడైన వేంకటకవి 1765లో శ్రీ కృష్ణ ధామం చేరాడు
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-8-17- కాంప్-షార్లెట్-అమెరికా