వీక్లీ  అమెరికా -22 -1  (21-8-17 నుంచి 27-8-17 వరకు )

వీక్లీ  అమెరికా -22 -1  (21-8-17 నుంచి 27-8-17 వరకు )

వినాయక చవితి ,మూడవ రుద్రం వారం

21-8-17 సోమవారం -ఈ రోజు సంపూర్ణ సూర్యగ్రహణం -ఉదయం 11 గంటలకే భోజనాలు పూర్తి చేసాం .సాయంత్రం గ్రహణం వదిలినతర్వాత విడుపు స్నానం చేసాం .

‘’నాహం కర్తా -హరి కర్తా ‘’అని తిరుపతి దేవుని నమ్మిన ఆలయ పరిపాలనా దక్షునిగా భక్తులకు ఎన్నెన్నో సేవలు అందించి ముఖ్యమంత్రుల సెక్రెటరీగా ఎన్నో ప్రజాహితకార్యక్రమాలు నిర్వహించి ,ప్రధాని నరసింహారావు కార్య దర్శిగా సాహసోపేత నిర్ణయాలకు సూత్రధారి అయిన శ్రీ పత్రి  రామకృష్ణ ప్రసాద్ అంటే పి .ఆర్.కె .ప్రసాద్ మరణించారు .ఆయన సేవలగురించి మూడు నాలుగు వ్యాసాలూ నిరుడే నేను నెట్ లో రాశాను .సర్వ సమర్ధుడు అయిన ఒక మహా భక్త  శిఖామణిని  సేవకుని మరణం తీవ్రమైన లోటు.  ఆ మహామహుని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిద్దాం .

 మా అబ్బాయి రమణ ఫోన్ చేసి సోమవారం ఉదయం లాయర్ గోవింద రాజు శ్రీనివాస్ గుడివాడలో హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడని చెప్పాడు హై స్కూల్ లో నా శిష్యుడు మా అబ్బాయి క్లాస్ మేట్ , మా లాయర్ కూడా శ్రీనివాస్ . శ్రీనివాస్ తండ్రి అబ్బి అనే శర్మ నాకు క్లాస్ మేట్  . శీను తమ్ముడు వేణు కూడా శిష్యుడే .ఈ సోదరులు తమ తండ్రి శర్మగారి స్మారక0గా శ్రీ సువర్చలా మారుతి శతకానికి స్పాన్సర్ లు గా ఉన్న సంగతి మీకు తెలుసు .శ్రీనివాస్ఆత్మకు శాంతి కలగాలని ఆకుటుంబ0 ఈ విషాదాన్ని తట్టుకొని ధైర్యం గా ముందుకు సాగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం .

  గీర్వాణం -3 లో 427 వరకు రాశాను .

మంగళవారం -సుమారు 30 ఏళ్ళ క్రితం రామ గుండం  నుంచి మంచి చదువుకోసం ఉయ్యూరు వచ్చి హైస్కూల్ లో చేరి  నాదగ్గర ట్యూషన్ చదివిన  నా శిష్యుడు ,నా క్లాస్ మేట్ స్వర్గీయ చేవూరి సుదర్శన రావు మేనల్లుడు   వజ్రాల జస్వంత రావు ఉయ్యూరులో కనపడ్డాడని మా అబ్బాయి రమణ ఫోన్ చేసి అతని నంబర్ నాకు ఇస్తే రాత్రి  ఫోన్ చేసి మాట్లాడాను  ఆతను అంటే నాకు మంచి అభిమానం .చాలా వినయంగా ఉండేవాడు .హెవీ మెషిన్ లపై ట్రెయింగ్ ఇచ్చే ఆఫీసర్ గా రామ గుండం లో ఉన్నాడట .కాసేపు ఆ నాటి సంగతులు మాట్లాడుకున్నాం .

 గీర్వాణం -3 లో 433 వరకు రాశా . సుప్రీం కోర్ట్ మూడు సార్లు తలాక్ రాజ్యాంగ విరుద్ధమని చారిత్రాత్మక తీర్పు ఇచ్చి ముస్లిం మహిళలకు ఊరట కలిగించింది . మా బావమరిది ఆనంద్ తో మాట్లాడాం .

బుధవారం -దేవుళ్లను ‘’పులిగాపు ‘’చేసి వినాయక చవితికి సిద్ధం చేసాం ..ఫన్ బకెట్ ను అభినందిస్తూ రాస్తే వాళ్ళు ఏవైనా జోక్స్ పంపమని రాస్తే వెంటనే నేను’’ కుట్టిన’’6 జోక్స్ రాసిపంపాను . రాత్రి 2-30 వరకు ఎందుకో నిద్రపట్టలేదు శ్రీ కృష్ణ కర్ణామృతం వింటూ తర్వాత నిద్రపోయాను .

21 సోమవారం జరిగిన నంద్యాల ఉపఎన్నిక లో 80 శాతం ఓట్లు పోలయ్యాయి తెలుగు దేశమే 10 వేలనుంచి 20 వెలవరకు మెజార్టీ తో గెలుస్తుందని లగడపాటి సర్వె చేయించి ప్రకటించాడు .రాత్రి వర్షం బాగానే పడింది ..

 గురువారం -గీర్వాణం -3 లో 435 వరకు కవుల గురించి రాశా . కస్తూరి రాసిన462పేజీల  ‘’లవింగ్ గాడ్ ‘’పుస్తకం పూర్తి చేశాను . ఉయ్యూరులో కూడా వర్షాలు బాగా పడుతున్నాయని రమణ ఫోన్ చేసి చెప్పాడు .

  శ్రీ వినాయక చవితి

25-8-17 శుక్రవారం శ్రీ వినాయక చవితి -ఉదయమే లేచి మామూలు పూజ తోపాటు శ్రీ  వినాయక చవితి వ్రతం చేశాను .మా అమ్మాయి తెల్ల వారుఝామునే లేచి ఉండ్రాళ్ళు పరవాన్నం పులిహోర వంకాయ కూర ,కొబ్బరి చట్నీ ,మైసూర్ పాక్ చేసి ఉదయం 8 గంటలకు ఆఫీస్ కు వెళ్ళింది .మా అల్లుడు నిన్నరాత్రి ఇవాళ పొద్దున పిల్లలతో గణేష్ పూజ చేయించి సంస్కృత శ్లోకాలు నేర్పాడు .

  ఇక్కడ కమ్యూనిటీ సెంటర్ లలో గణేష్ విగ్రహం పెట్టుకొని సామూహిక పూజ నిర్వహిస్తున్నారు .అలాంటి ఒక పూజ’’ టాం  షార్ట్ ‘’సెంటర్ లో జరుగుతుంటే అందరం వెళ్లి నమస్కారాలు చేసి కాసేపు కూర్చుని అటునుంచి జగదీశ్, లక్ష్మి దంపతుల ఇంట్లో సాయి భజనకు వెళ్లాం . 7 గంటలకు మొదలు పెట్టి 8 కి పూర్తి చేశారు . 60 మందికి పైనే వచ్చారు నన్ను కాసేపు మాట్లాడమంటే గణేశుని ప్రశస్తి గురించి చెప్పాను ..ఆతర్వాత భోజనాలు -లడ్డూ మైసూర్ పాక్, గారే ,ఆవడ కొబ్బరన్నం పూరి  వంకాయ కూర ,కొబ్బరి చట్నీ ,పరవాన్నం వగైరా .అంతా అయి  ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 30 అయింది .జగదీశ్ దంపతుల కూతురు ‘’డోలా ‘’కు ఐర్లాండ్ లో మెడికల్ కాలేజీ  సీట్ వచ్చింది .సోమవారం చేరటానికి వెడుతున్న సందర్భంగా ఈ భజన భోజనాలు . ఆడవాళ్లందరి కొబ్బరికాయ జాకెట్ స్టీల్ ప్లేట్ పళ్ళు ఇచ్చారు మా దంపతులకు ఆ దంపతులు అమ్మాయి అబ్బాయి కూడా కాళ్లకు నమస్కారాలు చేసిఆశీస్సులు అందుకొన్నారు . ఇప్పుడు నేను మాట్లాడిన విషయాల సారాంశం రాస్తున్నాను –

                        వినాయకుడు

‘’మనం ఏ కార్యక్రమాన్ని అయినాచేసేముందు ముందుగా గణపతి పూజ చేసి ప్రారంభిస్తాం ఆయన విఘ్నాలను నివారిస్తాడని  మనం అనుకొన్న పనులు నిర్విఘ్నంగా కొనసాగిస్తాడని విశ్వాసం …కానీ ఆయన వికృత మైన రూపం కలవాడు .అట్రాక్షన్ లేనివాడు. కానీ అగ్ర పూజ ఆయనకే .ఇందులో పరమార్ధం ఉంది . బాహ్య సౌందర్యం ముఖ్యంకాదు ఆ0తరంగిక సౌందర్యం ముఖ్యం అనే గొప్ప సత్యాన్ని ఆయన చాటి చెబుతున్నాడన్నమాట .పెద్ద బాన లాంటి గణేశుని పొట్ట పరిపూర్ణమైన ఈ విశ్వానికి ప్రతీక .ఏనుగుతల ,సన్ననికళ్ళు సునిశిత పరిశీలనకు  ,మేధస్సుకు సంకేతాలు .వక్ర తుండం ప్రణవం అయిన ఓం కారానికి ప్రతీక .ఏనుగు లాంటి ఆ శరీరాన్ని మోసేది అనింద్యుడు అనే చిట్టెలుక .ఇది విడ్డూరం అదే ఆత్మ .ఇంతపెద్ద మనశరీరానికి కదలిక నిచ్చేది హృదయం ఆత్మ .శరీర పరిమాణం లో దాని స్థానం ఎంతో  అత్యల్పం .అది లేనిది ఇంతటి శరీరం ఏపనీ చేయలేదు అంతటి ప్రాముఖ్యం దానిది అదే ఎలుక . అదే ఎలుక లేక మౌస్ మన కంప్యూటర్ ను ఆడిస్తుంది నడిపిస్తుంది ఇప్పుడు టచ్ స్క్రీన్ వచ్చాక మన వేలే మౌస్ గా మారింది అంతే తేడా ..

 గణపతి పొట్ట చుట్టూ నాగుపాము బెల్ట్ లాగా చుట్టు కొని ఉంటుంది . నాగుపాము శక్తికి చిహ్నం .భారత దేశం లో నాగుపాము పూజ అనాదిగా ఉంది . జంట పాముల విగ్రహాలను పూజిస్తాం నాగుల చవితికి పాలు పోస్తాం నాగ పంచమి జరుపుతాం . ఆ జంట పాములు ఇడా  ,పింగళా నాడులకు  సాంకేతికాలు ..జగత్తు అంతా  వ్యాపించిన మాయాశక్తి కూడా నాగుపాము గుర్తు ..అయన చేతిలోని పాశం అంకుశం బుద్ధిని మనసును సన్మార్గం లో నడిపించే సాధనాలు .మరో చేతిలో ఉన్నదంతం ఆయనదే .మహా భారతం రాసేటప్పుడు వ్యాసభగవానుని వ్రాయసకాడుగా గణపతి ఉండి ,తన దంతవిరిచి దానితో  తో రాశాడు . మరొక చేతిలో ఉండ్రాయి లేక వెలక్కాయ (కపిత్ధం )ఉంటుంది . ఉండ్రాయిని ‘’మోదకం’’ అంటారు -ఆనంద హేతువు. పైన గట్టిదనం ఉన్నా లోపల గుజ్జు మహా మెత్తగా తియ్యగా రుచికరం గా ఉండటం వెలగ పండు ప్రత్యేకత .గణేశుని మూడవ కన్ను జ్ఞాన నేత్రం .చేట లలాంటి చెవులు ప్రత్యేకమైనవి .భక్తుల కోరికలు ఎన్ని ఉన్నా వినటానికి అవి ఉపయోగిస్తాయి అంతే కాదు చేట తో పొల్లు తప్పా తాళి చెరిగేసి నికార్సైనమంచి దాన్ని తీయటానికి ఉపయోగపడుతుంది .అలాగే మనకోరికలలో స్వార్ధ పూరితమైనవి హానికలిగించేవాటిని వీచెరిగేసి మంచి వాటినే స్వీ కరిస్తాడని భావం మొత్తం మీద వినాయకుని ఆకారం మనం విజ్ఞానం కోసం ,త్యాగం కోసం చేయాల్సిన కృషిని బోధించే రూపం అని గ్రహించాలి

 ఆయన సౌందర్యం వినోదం ఇస్తుందేకాని సుందర రూపం కాదు .కనుక మనసు సౌందర్యమే ముఖ్యం బయటి ఆకారం కాదు అని మనకు గట్టిగా తెలియ జేస్తుంది .బాహ్య సౌందర్యానికి ,అంతరంగ సౌందర్యానికి సంబంధం లేదు అనే జ్ఞానాన్ని కలిగించటమే .అంటే జ్ఞాన బోధ చేయటమే ఆయన శరీరం లో ఈ వికృతత్వానికి గుర్తు ..సాధారణం గా మనం ఏవైనా తప్పులు చేస్తేదేవుడి ముందు  చెంపలు వేసుకొంటాం .కానీ వినాయకుని ముందు మన తప్పును ఒప్పుకొంటూ గుంజీలు తీస్తాం అంటే మనకు మనమే శిక్ష వేసుకొంటాం అని అర్ధం ఈ ఆచారం తమిళనాడులో ఎక్కువ అక్కడ గణేష్ ,మురుగన్ ఆరాధన బాగా జాస్తి .

  గణపతికి కృత యుగం లో 10 చేతులు ,సింహవాహనుడు గా ఆరాధింపబడితే ,త్రేతాయుగం 6 చేతులతో నెమలి వాహన 0తో  పూజింపబడ్డాడు.  ద్వాపరం నుంచి నాలుగు చేతులు ఏనుగు ముఖం ఎలుక రౌతు అంటే గుర్ర0 గా ఆవాహన చేయబడినాడు .పరశురాముడి ,గణపతికి జరిగిన యుద్ధం లో ఆయన గండ గొడ్డలితో ఈయన దంతాన్ని నరికేసినట్లు పురాణకథనం .చంద్రుడు అవమానిస్తే దంతం పీకి చంద్రుని పై విసిరాడనీ ఉంది .ఏక  దంతం అంటే -’’ఏక శబ్దాత్మి కా మయా తస్యం -సర్వం సముద్భవం  భ్రాతి మోహదం పూర్ణం -నానా ఖేలాత్మికమ్ కిలః ‘’ఏక అంటే మాయ -దంత అంటే నిజంగా ఉండేది .అంటే సత్తా మాత్రుడుగా  చాలాకుడు -అంటే నడిపించేవాడుగా ఆయన ప్రపంచాన్ని నడిపిస్తాడు .మాయతో ప్రపంచాన్ని నడిపించే చాలకుడు అంటే ‘’మూవర్ ‘’గణేశుడు  .

  వైష్ణవ ఆలయాలలో గణేశుని విష్ణు మూర్తిగా ,మధ్యప్రదేశ్ లో ‘’మండేసేరు ‘’ప్రాంతం లో ,కన్యాకుమారిదగ్గరున్న శుచీన్ద్రం లో ,మధుర సుందరేశ్వరాలయం లో గణపతిని స్త్రీ మూర్తిగా పూజిస్తారు .చైనా బర్మా  కాంబోడియా  మెక్సికో  అమెరికాలలో కూడా గణపతి ఆలయాలున్నాయి .’’ గాణాపత్యం ‘’అనే ఆరాధనా విధానం ఉంది . షణ్మతాలలో ఇదొక్కటి

  గణ+ఈశ -గణేశ గ అంటే జ్ఞానం ఈశ  అంటే అధిపతి అంటే జ్ఞానానికి  అధిపతి గణ అంటే ఇంద్రియాలు అని కూడా అర్ధం అంటే ఇంద్రియాధిపతి అని కూడా అర్ధం శ్రీ కృష్ణుని పరిపూర్ణ అవతారం గణేశుడు . హేరంబా -అంటే ఓ రక్షకుడా దీన రక్షకా అని అర్ధం .ఏక ద0తాః అంటే సర్వ ఉత్కృష్ట బలశాలి -శూర్పకర్ణా -చేట లంత చెవులవాడా -చెడును చెరిగేసి మంచిని ఉంచేవాడా .మనకు నాలుక బయట ఉంటుంది చెడుమాటలకు మూలమై అవతలివారి గురించి  చెడు గా మాట్లాడటం దాని లక్షణం .మనసు అనే నాలుక చివరను మనవైపే త్రిప్పి ఉంచితే ,అంటే మన దోషాలను మనమే తెలుసుకొంటే ముక్తి లభిస్తుంది. యోగులు నాలుకను ఈ విధంగా ఉంచుకొని అందులో స్రవించే అమృతాన్ని త్రాగుతూ ఏ ఆహారం లేకుండా ఎంతకాలమైనా జీవించగలుగుతున్నారు .గణపతి జిహ్వాగ్రము కంఠం వైపుకు ఉండటం ప్రత్యేకత.  అలా ఉండమని మనకు మార్గ దర్శకం చేస్తున్నాడన్నమాట .

పరశురాముడిని తన తొండం తో బంధించి సర్వ బ్రహ్మా0డ  దర్శనం చివరికి గోలోక0 లో శ్రీ కృష్ణ  దర్శనం చేయించాడు గణపతి అని బ్రహ్మ వైవర్త పురాణం ‘’గణేశ  ఖండం ‘’లో ఉంది .

శ్రీ కృష్ణ గణేశులు అభిన్నులు .అంటే వేరు వేరుకాదు ఒక్కరే .నిర్గుణ సగుణ బ్రాహ్మలు ఆయన అధిపతి . ‘’ఓం నమస్తే గణపతయే త్వమేవ కేవలం కర్తాసి ,త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి ‘’అని గణపతి అధర్వ శీర్ష కృతి చెబుతోంది .

 శ్రీ కృష్ణ దర్శనం చేసి వస్తున్న గణేశుని ధర్మధ్వజుని కూతురు తులసి చూసి తాను  నారాయణుని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకొని గణపతి కృష్ణునికి అభిన్నుడ కనుక తనను పెళ్లి చేసుకోమని కోరుతుంది .ఆ కోరిక తీరదు అన్నాడు.  అప్పుడు ‘’నీకు పెళ్లి అవుతుంది ‘’అని శపించింది ఈయన వెంటనే ప్రతిగా ‘’నువ్వు రాక్షసివై పుడతావు ‘’అని శపించాడు .బ్రతిమిలాడితే వృక్ష రూపం పొంది అందరి చేతా ఆరాధింపబడుతావు అని  విమోచనం కలిగించాడు . తర్వాత జన్మలో శంఖ చూడుడు అనే రాక్షసుని భార్య  గా పుట్టింది. రాక్షసుని ఆగడాలు మితిమీరుతుంటే శివుడు త్రిశూలంతో సంహరించాడు .తన  కళా0శం తో తులసి వృక్ష రూపం పొందింది .ముక్తికి కారకురాలైంది.  అందుకే తులసి దళాలు  గణపతి పూజకు నిషిద్ధాలు . వినాయక చవితికి మాత్రం తులసి  దళాలతో తో పూజ చేయవచ్చు . మిగిలినప్పుడు పనికిరావు . విష్ణు పూజకు తప్పని సరి  . కృష్ణ తులసి సర్వ శ్రేష్టం .

‘’గణాలలో గణపతివి  కవులకు కవి ,అన్నాన్ని సమృద్ధిగా కలవాడు   ఇచ్చేవాడు   ,అందరికంటే ముందే ప్రకటితమైనవాడు ,వేద మంత్రాలలో ప్రకాశించేవాడు అయిన గణపతికి మా నమస్కారం .మా ప్రార్ధనలు విని అన్ని శక్తులతో మా ఇంటిలోకి రావయ్యా ‘’అని గణపతిని ఆహ్వానించే మంత్రానికి అర్ధం ..

 మహారాష్ట్రలో ‘’గణపతి బప్పా మోరియా ‘’అని పాటలు పాడతారు . బప్పా అంటే తండ్రీ దేవుడా అని అర్ధం .మోరియా అంటే ఏమిటి ?దీనికి ఒక యదార్ధ కథ ఉంది 14 వ శతాబ్దం లో మహారాష్ట్ర పూనా లోని చించివాడ లో మొర్యా గోసావి ‘’అనే గణపతి భక్తుడు ఉండేవాడు ఆయనవలన సిద్ధులు పొందాడు ఆయన. ఈతని భక్తికి మెచ్చి వరం కోరుకోమంటే గణపతి పేరుతోపాటు తనపేరు కూడా శాశ్వతం చేయమని కోరాడు . అలాగే అన్నాడు.  అప్పటినుంచి గణపతిని పిలిచినప్పుడల్లా మోరియా పేరు దానికి కలపి పలకమని గణపతి శాసించాడు .అందుకనే గణపతి బప్పా మోరియా ‘అయింది .

  చిత్తూరు జిల్లాలో తిరుపతికి సుమారు వంద కిలో మీటర్ల దూరంలో కాణి పాకం లోనూతిలో వెలసిన  వరసిద్ధి వినాయకస్వయం భూ విగ్రహం ఉంది . చాలా పవర్ఫుల్ దేవుడు .ఎవరైనా అబద్ధ సాక్ష్యం ఆయన ముందు చెబితే వాళ్లకు ఏదో కీడు తప్పక జరుగుతుంది .అందుకని ఆయన ఎదుట నిలబడి నిజాన్నే చెబుతారు అబద్ధం చెప్పరు కోర్టులు కూడా ఈ సాక్షాన్ని పరిగణలోకి  తీసుకొనేవి .  ,అంటే ఇక్కడ వరసిద్ధి వినాయకుడే సుప్రీం జడ్జి అన్నమాట .ఈ గుడి ప్రక్కన ఉన్న నదికి ‘’బహుదా నది ‘’అనిపేరు .దీనికి ఒక కథ ఉంది .పూర్వం శంఖుడు ,లిఖితుడు అనే అన్నదమ్ములు కాణి  పాకం కి నడుచుకొంటూ వస్తుంటే దారిలో తమ్ముడికి ఆకలి బాగా ఎక్కువై అక్కడ కనిపించిన మామిడి తోటలో పండుకోసుకు తింటానని అన్నకు చెబితే  అడగ కుండా కోయరాదు అని అన్న చెప్పినా వినక కోసి తింటే దాన్ని రాజుగారికి  అన్న తెలియ జేస్తే రాజు అతని తమ్ముడు లిఖితుడి  రెండు చేతులు నరికించాడు చిన్నతప్పుకు ఇంతపెద్ద శిక్షా అని బాధ పడుతూ అన్న తమ్ముడిని ఓ దారుస్తూ కాణి పాకం చే రి అక్కడి నదిలో స్నానం చేయగానే తమ్ముడి చేతులు వచ్చేశాయి .బాహువులను దా  అంటే ఇచ్చిన నది కానుక బాహుదా అయింది ,కాలక్రమాన బహుదా నది అయింది’’ .

  రెండవ భాగం లో శ్రీ గౌడ రఘు దంపతుల ఇంట్లో శనివారం సాయంత్రం జరిగిన  రుద్రాభిషేకం విశేషాలు తెలియ జేస్తాను .

   సశేషం

   మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-8-17-కాంప్-షార్లెట్-అమెరికా


About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.