వీక్లీ  అమెరికా -22 -2  (21-8-17 నుంచి 27-8-17 వరకు )

వీక్లీ  అమెరికా -22 -2  (21-8-17 నుంచి 27-8-17 వరకు )

వినాయక చవితి ,మూడవ రుద్రం వారం

                  మూడవ రుద్రాభిషేకం

శ్రీ కృష్ణాష్టమి నాడు మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో సాయంత్రం జరిగిన భజనకు వచ్చిన శ్రీ గౌడు రఘు గారి భార్య శ్రీమతి సుచిత్ర 26-8-17 శనివారం సాయంత్రం  తమ ఇంట్లో రుద్రాభిషేకం ఉందని నన్ను చేయించమని మా అమ్మాయికి మాకు చెప్పారు .సరే అన్నాను .ఇది ఇక్కడ నేను చేయించిన మూడవ రుద్రాభిషేకం . వీరి అమ్మాయే కుమారి రచిత కిందటినెలలో కూచిపూడి రంగప్రవేశం చేస్తే వెళ్లి చూసాం

నిన్న మధ్యాహ్నం 2-45 కు వాళ్ళు పంపిన శ్రీ వెంకట్ అనే అనంతపురం జిల్లా ఆయన కారులో మా ఇంటికి వచ్చి నన్ను ఎక్కించుకొని ,దారిలో వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్లి భార్యను పిల్లలలను ఎక్కించుకొని సుమారు 45 మైళ్ళదూరం అంటే దాదాపు 70 కిలోమీటర్లదూరం లో ఉన్న రఘు గారింటిలో దింపారు .వెంకట్ గారిభార్య కృష్ణా జిల్లా ఘంటసాల వాసి .అక్కడి హై స్కూల్ సైన్స్ మేష్టారు ,తర్వాత హెడ్మా స్టర్ అయినా శ్రీ మూల్పూరి  చిన్నారావు గారు నాకు మంచి స్నేహితులుడు .ఆయనదగ్గర ఈమె చదివింది అవి గుర్తు చేసుకున్నాం దారిలో . .చెన్నారావుగారబ్బాయిశ్రీ వెంకటేశ్వరరావు  అమెరికాలో  ఉంటారు .ఘంట శాల గ్రామం ఆ పాఠశాల అభిరుద్దికి తండ్రీ కుమారులు చేసిన సేవ నిరుపమానం . చెన్నారావుగారు మరణించి సుమారు ఆరునెలలు పైనే అయింది .

 రఘు గారింటికి వెళ్లేసరికి అంతా  రెడీ గానే ఉన్నారు . రఘు దంపతులకు ‘’దర్శనీయ దైవ క్షేత్రాలు ‘’అంద  జేశాను . సాయ0త్రం 4-30 కు గణపతి పూజ చేయించి ,శివుని ప్రతిష్టించి అష్టోత్తర శతనామ పూజ ,లలితా అష్టోత్తరం చేయించేసరికి 5-30 అయింది అప్పుడే రుద్రం చదివేవారు సుమారు 10 మందిదాకా వచ్చారు . మా శ్రీమతిని శ్రీ గ్రంధి హరి కుటుంబం వారు ఇంటికి వచ్చి సాయంత్రం 4-30 కు పికప్ చేసుకొని రఘుగారింటికి తీసుకు వచ్చారు . అభిషేకం ప్రారంభించే ముందు నన్ను రుద్రం గురించి చెప్పమని అక్కడి రవీంద్ర గారు అడిగితే  చెప్పాను .ఈయన రఘుగారింట్లో ప్రతి ఆదివారం రుద్రం నేర్పుతున్నారు తర్వాత  లఘున్యాసం ,నమక చమకాలతో  ఏకాదశ రుద్రాభిషేకం పాలు ఫలరసం తేనే పంచదార పెరుగు నెయ్యి  నీరు లతో చేయించి వచ్చినవారందరితో (సుమారు 70 మంది)చేయించి లింగాలను కడిగించి తర్వాత మళ్ళీ షోడశోపచార పూజ అష్టోత్తరం చేయించి నైవేద్యం పెట్టించి హారతి ఇప్పించి ,మళ్ళీ నేను లింగం అంటే ఏమిటి అభిషేకం ఎందుకు చేయాలనే విషయాలతోపాటు సరసభారతి విషయాలూ చెప్పి ,ఏకాదశ రుద్రాలను పుస్తకం చేతిలో లేకుండానే చక్కగా మాతో స్వరం కలిపి చదివిన కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు  అమ్మాయి శ్రీమతి  కాకాని లక్ష్మి భక్తికి ,స్పష్టమైన ఉచ్చారణ ను మెచ్చి ఆమెకు సరసభారతి తరఫున 1 116 రూపాయలు (వెయ్యిన్నూట పదహారు రూపాయలు )నగదు కానుక ప్రకటించి ,వీలయినప్పుడు మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చిసరసభారతి పుస్తకాలతో సహా  తీసుకోమని సభా ముఖంగా తెలియజేసి ,ఆతరవాత మంగళహారతి ,మంత్రం పుష్పం అందరు  లేచి నిలబడి ఏక కంఠంగా చెప్పించి  ఉద్వాసన చెప్పించాను .రఘుదంపతులకు నా చేతులమీదుగా తీర్ధ ప్రసాదాలు అంద  జేశాను . దంపతులు  వారితోపాటు అందరూ ఎంతో బాగా చేయించానని నన్ను అభినందించారు . నాకు కూడా ఇప్పటికి చేయించిన మూడు రుద్రాలలో ఇది చాలా సంతృప్తి నిచ్చింది .రుద్రం గురించి విపులంగా చెప్పే అవకాశమూ వచ్చి అందరికిఆనందాన్ని ,సంతృప్తి ని కలిగించగలిగాను . తర్వాత  -కర్ణాటక స్పెషల్ అయిన హోళిగలు  బేడల చారు, గారే పప్పు కూర సాంబారు పెరుగులతో మంచి భోజనం అందరికి . అయ్యాక నాకు ‘’ఘనమైన నగదు కానుక ‘’నిచ్చి రఘుదంపతులు మా దంపతుల కాళ్లకు మొక్కి పిల్లలతో కూడా మొక్కించి ఆశీర్వాదాలుపొందారు . గ్రూప్ ఫోటో తీసుకున్నారు అలాగే వెంకట్ కుటుంబం హరి కుటుంబం మొదలైనవారు కూడా .అంతా అయేసరికి రాత్రి 11 అయింది .రాత్రి 11-30 కు ఇంటికి చేరుకున్నాం . నేను రుద్రం గురించి చెప్పిన విషయాలు తెలియ జేస్తాను .

                          శ్రీ రుద్రం

‘’నమకం లో 11 అనువాకాలు ,చమకం లో 11 అనువాకాలు కలిస్తే రుద్రం లేక రుద్రాధ్యాయం లేక శత రుద్రీయం అంటారు . శాత అంటే వంద అనికాదు చాలా అని అర్ధం .  అంటే అనంతమైన రుద్రుల గురించి చెప్పేది అని  .రుద్రుడు రోదసి లేక అంతరిక్షం కు అధిపతి . 11 రూపాలతో వ్యక్తమవుతాడు .ఇవే  ఏకాదశ రుద్ర రూపాలు .వీరిని ‘’Gods of vibration ‘’అంటారు . దివి లేక ఆకాశానికి సంబంధించిన 12 మందిని ద్వాదశాదిత్యులు అంటారు  .వీరు  ‘’Gods of radiation ‘’.భూమికి సంబంధించిన 8 మంది దేవతలను అష్ట వశువులు అంటారు వీరికి ‘’Gods of materialization ‘’అని పేరు . సృష్టికి కారణభూతమైనవారు భీష్ముడు ఒక వసువు రూపమే . వీరిని బట్టే సంస్కృత ఛందస్సులు ఏర్పడ్డాయి 12 అక్షరాల ఛందస్సును త్రిష్టుప్ అని,11 అక్షరాలా జగతి ,8 అక్షరాలా గాయత్రి  16 అక్షరాల  అనుష్టుప్ ఛందస్సులు ఏర్పడ్డాయి.

  శత రుద్రీయం అమృతత్వ సార్ధకం .శివ అంటే అవాజ్మానస గోచర సత్య ,జ్ఞాన ఆనంద లక్షణ పరబ్రహ్మం . అంటే అమృతత్వ భావన -మోక్షానికి మార్గం .ఇదే శ్రీ విద్యా రూపం కూడా .నమకమ్ మొదటి అనువాకం -’’నమస్తే రుద్రమన్యవ ఉతోషత ఇశవే నమః ‘’మంత్రం తో ప్రారంభమవుతుంది .ఇందులో అన్ని వ్యసనాలకు మూలకారణం అయినక్రోధానికి నమస్కారం చెప్పబడింది . తర్వాత బాధను కలిగించే శివ ధనుస్సుకు బాణానికి దాన్ని చేబట్టే చేతులకు నమస్కారం చెప్పారు . అంటే ఈ జగత్తును లయం చేసే రుద్రుడు అయిన శివుని యొక్క ‘’ఘోర రూపం ‘’వర్ణించబడింది .శివుడు ‘’అఘోర రూపం ‘’లో కూడా ఉంటాడు -’’అఘోర ఘోర తరే భ్యహ ‘’రెండవ అనువాకం లో సుఖాన్ని కలిగించే శాంత  స్వభావం వర్ణించబడింది    8 వ అనువాకం లో శివ పంచాక్షరీ ఉంది . ఇది బంధ విచ్చేదనం చేసి జ్ఞానాన్నిచ్చి ముక్తినిస్తుంది . అందుకనే రుద్రాధ్యాయంలో  దీన్ని మణిపూస అంటారు .క్రోధం నశిస్తే శాంతికలుగుతుంది అని భావం.  శాంతి ఉంటె సకల సౌఖ్యాలు కలుగుతాయి .విష్ణువును ‘’శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం ‘’అనే శ్లోకం తో, శివుడిని ‘’శాంతం పద్మాసనస్థం శశిధర నయనం పంచ వక్త్రం త్రినేత్రం ‘’అనే శ్లోకం తో ప్రార్థిస్తాం రెండింటిలోనూ శాంతమే మొదటి పదం .నమకం అంతా అనేక రూపాల రుద్రునికి నమస్కారాలను తెలియ జేస్తుంది .

చమకం ‘’ఆజ్ఞా  విష్ణూ సజో ష  సేమా  వర్ధంతు వాంగిరః -ద్యుమ్నై ర్వాజే భి రాగతం ‘’అనే మంత్రం తో ప్రారంభమవుతుంది .చమకం లో శివుడికి మన కోరికల చిట్టా విప్పుతాం . నాకు అదివ్వు  ఇదివ్వు  అని వేడుకొంటాం .దీన్ని ‘’చమే ‘’పదం సూచిస్తుంది . దీని అర్ధం అదికూడా అని .మనకోరికలలిస్ట్ చాలా  ఉంటుందికనుక ‘’చమే ‘’చాలా సార్లు వస్తుంది ..ఇందులోనే ;;కల్పతాం ‘’అనే మాటకు అర్ధం కలుగుగాక ..రుద్రం లో రెండు వాక్యాలమంత్రాన్ని ఋక్కులని ఒకే వాక్యం ఉంటె యజుస్సు అని అంటారు .శివ తమా అంటే శివ తత్త్వం -అంటే మోక్షమే .రుద్రుడు ధరించే ధనుస్సు మొదటి సగం మన శిరసులోని బ్రహ్మ రంధ్రం నుంచి ముందువైపుకు భ్రూమధ్యం వరకు ఉంటుంది .ఇక్కడే ‘’మన్యువు ‘’అనే శక్తి ఉంటుంది రెండవ సగం భ్రూమధ్యం నుంచి మెడవరకు ఉంటుంది . .కనుబొమలనుండి మెడ వరకు అడ్డంగా పుర్రెపై  వ్యాపించి ఉన్న రేఖయే  శివధనుస్సు .అందుకే శివుడు ‘’కపాలం ‘’చేతిలో ధరిస్తాడు ఇది సాంకేతికం ..ఆకాశం లో సూర్యుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు పయనించేదారి ఒక ఆర్క్ లాగా ఉండే శివ ధనుస్సే  .దీనివలన పగలు రాత్రి ఏర్పడుతాయి .శివుడు కాలస్వరూపం .మహా కాలుడు అంటారు ఉజ్జయిలో ఉన్న శివుడు మహా కాళేశ్వరుడు .మన ఇంద్రియ శక్తులు కపాలం నుంచి రుద్ర గ్రందివరకు అంటే మెడుల్లా మీదుగా పని చేస్తాయి అందుకే మెడుల్లా చాలా ముఖ్యమైనది . అది పని చేయకపోతే  జీవితం వ్యర్థం . 5జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు మనసు ను ఆశ్రయించి ఉన్న రుద్రుని 11 రూపాలే శివుని 11 బాణాలు .

‘’నా రుద్రో రుద్ర మర్చయేత్ ‘’  అంటే రుద్రుడు కానివాడు రుద్రుని అర్చించటానికి అర్హుడు కాదు .అందుకే రుద్రుని యొక్క విభూతిని అంటే బూడిదకాదు ఐశ్వర్యాన్ని మన శరీరం లో ఒక్కొక్క అవయవం లో ఉంచుకొని అంటే న్యాసం చేసి మనం రుద్రులం అయి అప్పుడు రుద్రాభి షేకం చేస్తాం . దీన్నే మహాన్యాసం అంటారు . గొప్పగా ఉంచుకోవటం .. ‘’దేహో దేవాలయ ప్రో క్తో జీవో దేవ స్సనాతనః ‘’అంటే దేహమే దేవాలయం జీవుడే సనాతను డైన పరమేశ్వరుడు . శివుడు  వ్యోమ కేశుడు అంటే ఆకాశమే జుట్టుగా కలవాడని భావం  .దిక్కులే ఆయన వస్త్రాలు కనుక దిగంబరుడు అంతేకాని  బట్టలు విప్పుకొని తిరిగే వాడు అని అర్ధం కాదు .ఆయన జటాజూటి -అన్ని రహస్యాలు తెలిసినవాడు ..

 ఇప్పటిదాకా రుద్రార్చనా విధిని తెలుసుకున్నాం ,ఇప్పుడు శివలింగం గూర్చి దానికి ఎందుకు అభిషేకం చేయాలి అనే దాన్ని  తెలుసుకొందాం  .

          శివ లింగం

శివుడే లింగం  ,శివుడైన లింగం శివ లింగం.  లింగాన్ని పూజించాలి అని శివ పురాణం లో ఉంది .శివ లింగం లో ప్రజ్ఞానం లో బ్రహ్మ ,పాదం లో విష్ణువు ,హస్తం లో హరుడు ,బాహువుల్లో ఇంద్రుడు ,జఠరం లో అగ్ని ,హృదయం లో శివుడు ,కంఠం లో వనవాసి ,నాలుకతో సరస్వతి ,ముక్కులో వాయువు ,కళ్ళల్లో సూర్య ,చంద్రులు ,చెవులలో అశ్వినీ దేవతలు  లలాటం లో రుద్రుడు ,మూర్ధ భాగం లో ఆదిత్యుడు ,శిరసులో మహాదేవుడు ,పృష్టం లో పినాకిని ,ముందు శూలి ,ప్రక్కల శివుడు ,శంకరుడు , అన్నిటా వాయువు ,దాని బయట అగ్ని జ్వాలా ,సర్వాంగాలలో సర్వ దేవతలు యధా స్థానం లో ఉండి  నన్ను రక్షించుగాక యజమానులు రక్షించుగాక ‘’అని ఆవాహన చేసి ప్రార్థిస్తాం  . ‘’లిం  గమయతే ఇతి లింగహ్ ‘’అంటే దేనిలో నుంచి విశ్వం ఆవిర్భవించి దేనిలోకి లయం అవుతుందో అదే లింగం .ఆది మధ్యాంత రహితమై అవాజ్మానస గోచరమైనది లింగం

 లింగాన్ని ఎందుకు పూజించాలి ? దీనికి మహా భారతం ద్రోణ పర్వం లో ఒక విషయం ఉంది .ద్రోణుడు మరణించాక కొడుకు అశ్వత్ధామ తీవ్ర కోపావేశ0  తో  పాండవ సైన్యం పై విరుచుకుపడి ఒక అక్షౌహిణి సైన్యాన్ని సంహరించి ప్రళయకాల రుద్రుడుగా చెలరేగి పోయాడు అతన్ని ఎదిరించే సాహసం ఎవరూ చేయలేక పోయారు .ఆగ్నేయ బ్రహ్మాస్త్రాలతో భీభత్సం సృష్టించాడు . చివరికి నరనారాయణులైన కృష్ణార్జునపై యుద్ధం ప్రారంభించాడు .చాలా సేపు యుద్ధం చేశాడు . కానీ దీటుగా అర్జునుడు సమాధానం చెబుతున్నాడు .ఇక ఆగలేక చివరి అస్త్రంగా నారాయణాస్త్రం ప్రయోగించాడు ఇద్దరిపైనా .కృష్ణార్జునులు రథం దిగి ఆయుధాలు వదిలేసి దానికి భక్తితోనమస్కరించారు .అది వారిని ఏమీ చేయకుండా నిసఫలమై వెనక్కి వెళ్లి పోయింది .నారాయణాస్త్రం తో ఇదివరకు ఎందరినో జయించిన అశ్వత్ధామకు ఎందుకు ఇలా జరిగిందో తెలీక బుర్ర గోక్కొని వ్యాసమహ ర్షిని ప్రార్ధించాడు ఆయన ప్రత్యక్షం అవగానే కారణం అడిగాడు దానికి ఆయన పూర్వ జన్మలో మీరు చేసిన శివ పూజా ఫలితమే ఇది .కృష్ణార్జునులు మట్టితో శివలింగం చేసి పూజించి అభిషేకాలు చేశారు ..నువ్వు శివుని బొమ్మ తయారు చేసి పూజించావు .లింగ పూజ ప్రతిమ పూజ కన్నా శ్రేష్టం .అందుకే వారిని శివుని వరం వలన నారాయణాస్త్రం ఏమీ చేయలేక పోయింది -’’వారలు లింగాధిష్టా-నారూడుం గా నొనర్చి యర్చించిరి -భవ్యారాధన వరులై మును -గౌరీపతిని అతుల నియామకల్పన వెలయన్ ‘’

‘’శుభ్రమగు నుర్వి మృత్తిక సురు  చిరంపు -బ్రతిమగావించుకొని ,యందు బరము నావహించి -పూజలు  విశేషంబులెల్ల జేసి – దీవు దొలు మేన  గొలిచితి నిష్ఠ తో డ ‘’

‘’లింగంబు నందు బూజించుట -యర్చయందారాధించుట కంటే -ననేక గుణంబు లెక్కువ ‘’అని తిక్కనగారు వ్యాసునితో చెప్పించారు .అందుకే లింగ పూజ సర్వ శ్రేష్టం .

  లింగానికి అభిషేకం పుణ్యఫలం .బ్రహ్మా0డం  అండా కారం లో ఉంటుంది .శివునిశిరసు పై గంగ ,చంద్రవంక ఆయనకు చల్లదనాన్ని కల్గిస్తాయి . శివుడు కృత్తికా నక్షత్రం లో పుట్టాడు అది అగ్ని నక్షతరం . ఆయన మూడవ కన్ను కూడా అగ్ని గోళమే .అందుకని ఆవేడిని చల్లబరచటానికి ఎప్పుడూ నెత్తిన నీళ్లు పోస్తూండాలి అంటే అభిషేకం చేయాలి .ఆయన చల్లగా ఉంటె లోకాలు చల్లగా ఉంటాయి .కనుల్లనే శివలింగం పై ఎప్పుడూ నీటిధారపడే ఏర్పాటు ఉంటుంది .శివాలయం లో శివలింగానికి ఎదురుగా కూర్చున్న నంది విగ్రహం ఉంటుంది . దీని ఉచ్చ్వాస నిశ్వాసాలు శివలింగాన్ని చల్లబరుస్తాయి . మన మనసులోని కోరికలవలన మనసులు కూడా వేడెక్కుతాయి వీటిని చల్లబరచటానికి అంటే కోరికలు తీర్చుకోవటానికి అభిషేకం చేస్త్తామ్ లేక చేయిస్తాం .పంచామృతాభిషేకం అంతరాత్మ శుద్ధినిస్తుంది .ఇందులోని ఆవుపాలు జ్ఞానానికి గుర్తు .జ్ఞానప్రదాత .తేనే ఆపాత మధురం ఎక్కువ వాడితే మత్తు ఎక్కుతుంది అది విషయం వాంఛలకు ప్రతి రూపం .విషయం వైరాగ్యం కలగాలని ప్రార్ధించాలి .పంచదార అహ0కారానికి ప్రతిరూపం దాన్ని తొలగించమని ,వినయం ఇవ్వమని ప్రార్ధించాలి .ఆవునెయ్యి పాప హరణం .పాపాలను తొలగించమని కోరుకోవాలి .ఇదీ అభిషేకం లో ఉన్న అంతరార్ధం ‘’

 పుష్పదంతుడు అనే  గంధర్వరాజు  మహా శివ భక్తుడు .కామ రూపం ధరించే సిద్ధి ఉన్నవాడు .మహా సంగీత విద్వా 0సుడు .అందుకే ఇంద్రుడు ఆస్థాన గాయకుని చేశాడు .ఒక సారి భూలోకం లో కామ రూపం లో సంచరిస్తూ ఒక రాజు గారి పూలతోటలో శివ పూజకు పెంచుతున్న పుష్పాల సుగంధానికి పరవశుడై రాత్రివేళ వాటికి కోసుకు పోతున్నాడు .రాజుకు శివపూజకు పూలు చాలక నిఘా పెట్టించి పూల ల్లమొక్కల వద్ద నేలపై మారేడు దళాలను పరపించాడు .పుష్పదంతుడు రాత్రివేళ పూలు కోయటానికి మొక్కలవద్దకు వెడుతూ మారేడు దళాలను తొక్కాడు ,కైలాసం లో శివుని తపస్సుకు భంగం కలిగి అతని శక్తులన్నీ లాగేశాడు .దీనితో కాపలా వాళ్లకు పట్టుబడగా రాజు కారాగారం లో బంధించాడు .జరిగిన దానికి చింతిస్తూ శివమహిమలపై స్తోత్రం రాశాడు . అదే ‘’శివ మహిమ్న స్తోత్రం ‘’.  స్తోత్రం పూర్తికాగానే మెచ్చిన శివుడు అతని  శక్తులను మళ్ళీ ఇచ్చివేశాడు.  రాజుకు క్క్షమాపణలు చెప్పి మళ్ళీ గాంధర్వ లోకానికి వెళ్ళాడు . ఆ స్తోత్రం లో ఒక శ్లోకం చాలా తమాషాగా బాగా ఉంటుంది

‘’యత్కృత్యమ్ తన్నకృత్యం యదకృత్యం కృత్య వదాచరితం -ఉభయో ప్రాయశ్చిత్తం శివ ,తవనామాక్షర ద్వయోచ్చరితం ‘’

 భావం -శంకరా !జీవితం లో తప్పకుండా చేయాల్సిన పనులు చేయ లేకపొయాను . ఆచరించ కూడనివి తప్పనిసరిగా ఆచరించాను .ఈ రెండూ దోషాలే ,పాపాలే శిక్షార్హాలే .వాటికి పరిహారం నీ పేరులోని రెండు అక్షరాలైన ‘’శివ ‘’అనే నామం భక్తితో పలకటమే’’ అదీ శివ మహిమ అంటే .

  ఈ  వీక్లీ  ఇంతటితో సమాప్తం .

  మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -27-8-17-కాంప్-షార్లెట్-అమెరికా  ..

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.