గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
445-సంస్కృతం లో క్రైస్తవ సాహిత్యం -(1808-1978)
1808 లోనే బైబిల్ కు సంస్కృత అనువాదం ప్రారంభమైంది .1843లో కలకత్తా బాప్టిస్ట్ మిషన్ హీబ్రూ భాషలోని బైబిల్ ను సంస్కృతం లోకి అనువదించి ముద్రించింది . కలకత్తాలోని సేరమ్ పూర్ లో విలియం కారీ మూల గ్రీకు భాషలోని న్యూ టెస్టమెంట్ ,లార్డ్ అండ్ సేవియర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లనుమూడు భాగాలుగా సంస్కృతం లోకి అనువదించాడు . వీటి ముద్రణకు మూడేళ్లు పట్టి మూడవది 1811లో విడుదలైంది . 1821 లో మళ్ళీ న్యూ అండ్ ఓల్డ్ టెస్టమెంట్ లు సంస్కృతానువాదం పొందాయి .1843లో హీబ్రూ భాషలోని ‘’బుక్ ఆఫ్ జెనెసిస్ ‘’ను సంస్కృతం లోకిఅనువాదం చేసి బాప్టిస్ట్ మిషన్ ముద్రించింది .కలకత్తా స్కూల్ బుక్ సొసైటీ ,బాప్టిస్ట్ మిషన్ ‘’సాల్మన్ సామెతలు ‘’ను సంస్కృతీకరించి1842,1846 లలో తెచ్చింది 1845 లో కలకత్తా బాప్టిస్ట్ మిషన్ ప్రెస్’’ప్రాఫిట్ ఐసయ్య ‘’ను సంస్కృతం లో తర్జుమా చేసి ప్రచురించింది . 1860 లో లండన్ లోని జె ఆర్ బాలన్ టైన్ సంస్కృతం ,ఇంగ్లిష్ లలో బైబిల్ వ్యాఖ్యానం రాశాడు .ఆ తర్వాత నుంచి వరుసగా సంస్కృత అనువాదాలు వస్తూనే ఉన్నాయి .బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా1962లో న్యూ టెస్టమెంట్ ను ‘’’’ప్రభున యేసు క్రీస్తేన నిరూపితస్య నియమస్య గ్రంథ స0గ్రహః ‘’గా సంస్కృతాను వాదం తెచ్చింది . 1878లో న లుగురు క్రిస్టియన్ ఎవాంజలిస్ట్ ల ‘’గాస్పెల్స్ ‘’ను ఒకే పుస్తకంగా ‘’క్రైస్త చరితం -అర్హతో మతి -మార్క -లూకా -యోహానైర్ విరచితం సు సంవాద చతుష్టయం ‘’గా కలకత్తా బాప్టిస్ట్ మిషన్ ముద్రించింది .తరువాత ఒక్కొక్కరి గాస్పెల్స్ కు సంస్కృతానువాదం విడివిడిగా తెచ్చింది . అవే ‘’మార్క లిఖిత సు సంవాదం ‘’,’’సత్య ధర్మ శాస్త్రం ‘’,యేసు క్రీస్టియ చరిత దర్పణం 1878 ,1884లలో వచ్చాయి .1878 లో ‘’లూకా లిఖిత సు సంవాదః ‘’వస్తే బెంగళూర్ నుంచి ‘’యోహాను లిఖిత సంవాదః ‘’వచ్చింది .
1928 లో ఢిల్లీ లోని లక్ష్మీధర శాస్త్రి’’సె ర్మన్ ఆన్ ది మౌంట్ ‘’ను సంస్కృతీకరించి ప్ర చురించాడు .దీనికి మళ్ళీ మూడు స్వేచ్చా సంస్కృతానువాదాలు వచ్చాయి .అనువాదా లేకాకుండా సృజనాత్మక క్రైస్తవ సంస్కృత సాహిత్యం కూడా 19 ,20 శతాబ్దాలలో విస్తృతంగా వచ్చింది .ఈశ్వరోక్త శాస్త్ర ధార’’,పరమ స్తవ ‘’క్రీస్తు ధర్మ కౌముది ‘’,’’క్రీస్తు ధర్మ కౌముది సమాలోచనం ‘’వంటివి సంస్కృతం లో డజనుకు పైగా రచింపబడ్డాయి .
1977 లో కేరళకు చెందిన సంస్కృత విద్యావేత్త మహాకవి పి. సి దేవాస్సియా ‘’క్రీస్తుభాగవత మహాకావ్యం ‘’33 కాండలలో ,1600 శ్లోకాలతో 433పేజీలలో రాసి అకాడెమీ బహుమతిని అందుకున్నాడు . ఈవిధం గా క్రైస్తవ సాహిత్యమూ గీర్వాణ గౌరవాన్ని పొంది సముచిత స్థానం సంపాదించుకున్నది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -31-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా