తెనాలివారి ‘’బాపు రస రేఖ ‘’
గుంటూరు జిల్లా తెనాలిలోని బాపు అభిమానులుశ్రీ రవి కృష్ణ గారి ఆధ్వర్యం లో బాపు రమణలను తెనాలిలో సన్మానించాలనుకొని ఆహ్వానించటం మొహమాటంగా ఇద్దరూ ఒప్పుకోవటం , బాపుగారి పై ప్రత్యేక పుస్తకం తేవాలనే సంకల్పం ,శ్రీ గిరిధర్ గారిచే బాపు చిత్రం వేయి౦చాలనుకోవటం ,అయన ఒప్పుకొని వేసివ్వటం ,ఆయన తన అభిమాన చిత్రకారులని ,మంచి స్టడీ చేస్తారని బాపు చెప్పటం 2013లో చకచకా జరిగిపోయాయి ..కానికార్యక్రమం కార్య రూపం పొందకుండా ముందు రమణ ఆ వెంటనే రెండేళ్లకు బాపు మనల్ని వీడి వెళ్ళిపోయారు .కాని పట్టువదలని విక్రమార్కులైన తెనాలివారు ఆ ఇద్దరూ లేకుండానే పుస్తకాన్ని తేవాల్సి వచ్చి తెచ్చి 2015 జూన్ లో మనసులోని కోరిక ‘’ బాపు ‘’అనేపేరుతో ఆయన ముఖ చిత్రం తో తీర్చుకొన్నారు ..శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు అష్టవిధ నాయికలపై రాసిన పద్యాలకు బాపు వేసిన బొమ్మలూ చేర్చి ప్రచురించారు .దీనికి పూర్తీ సహకారం శ్రీ రమణ అంద జేశారు .బాపు శిష్యులైన చిత్రకారులు మోహన్, చంద్ర మొదలైనవారు ,భరణి వంటి రాయసగాళ్ళు బాపుపై తమ అభిప్రాయాలను పొందుపరచారు .శ్రీరమణ తానదైన శైలిలో ఎన్నో విషయాలు గుది గుచ్చి తెలియ జేశారు .పుస్తకం అందంగా సర్వాంగ సుందరం గా వెలువడింది .బాపు కి ఉన్న అభిరుచులు ,ఇష్టాలు ,అయిస్టాలు ,అభిప్రాయాలు అన్నీ ఇందులో పొందు పరచారు .ఒక రకంగా ఇది ‘’బాపు గీతోపనిషత్ ‘’.అయింది .అందులోని మేలిమి సారాంశాన్ని అంటే ఎసెన్స్ ను అనగా సారాన్ని నేను మీకు ‘’తెనాలివారి బాపు రస రేఖ ” ‘’గా అందజేస్తున్నాను .పుస్తకం చదవనివారికి ఇది ఉపశమనం కలిగిస్తు౦దని ఆశ .ఇందులో తెలిసినవిషయాలు, తెలియనివి, తెలుసుకో దగ్గవి, తెలియాల్సినవి ఎన్నో ఉన్నాయి .ఈ ‘’బాపు ‘’ను నాకు పంపించమని మా ఆత్మీయులు అమెరికాలో ఉంటున్న శ్రీ మైనేని గోపాల కృష్ణగారు తెనాలి లో ఉన్న తమ గురువు, స్నేహితులు, మార్గ దర్శి, మెంటార్ అయిన శ్రీ కోగంటి సుబ్బారావు గారి అబ్బాయి శ్రీ శివ ప్రసాద్ గారికి ఫోన్ చేసి చెప్పగా ఆయన పంపితే నాకు సుమారు నెలక్రితం చేరింది..దీనికి పైవారందరికి కృతజ్ఞతలు .దీనిని ఇవాళే చదివాను.
బాపుగారి భార్యతెనాలికి చెందిన ప్రఖ్యాత నాటక సినిమా నటులు ,డాక్టర్ స్వర్గీయ గోవిందరాజుల సుబ్బారాగారి కుమార్తె .అంటే బాపు తెనాలి వారి అల్లుడన్నమాట శ్రీ .సి నా రే ‘’సుదర్శనం ‘’పేరుతొ రాసిన కవిత లో ‘’పాపలాంటి పసినవ్వు చిలికే బాపు వెనక –ఓ కొంటె మేధావి ఉన్నాడని కొందరికే తెలుసు ‘’అంటూ మొదలుపెట్టి ‘’బాపు బొమ్మలునిరాడంబరంగా ఉన్నా గుండెల వెనక ఉన్న స్వాభిమానా లకు చురకలు పెడతాయి.’’అన్నారు .’’బాపులో ఒక దార్శనికుడు, దర్శకుడు ఉన్నాడు .ఒక్కొక్కబోమ్మా ఓ రంగుల మినీ కవిత ‘’అని శ్లాఘించారు .’’అన్ని అంచులున్న సుదర్శనం బాపు .బాపును వరించిన’’ డాక్టరేట్ ‘’తరించింది ‘’అని కొత్తకోణం లో చెప్పారు .
బాపు రమణనలను నాలుగు దశాబ్దాలుగా సునిశితంగా తరచి చూసిన అంతేవాసి శ్రీరమణ ‘బాపు నిగర్వి కాని బాపు గర్వం రమణ ‘’అని రాశాడు .ఆంద్ర జ్యోతిలో శ్రీ రమణ పని చేస్తున్నప్పుడు విజయవాడవచ్చిన బాపు ఆఫీసుకు వెళ్లి శ్రీరమణ తో ‘’నన్ను బాపు అంటారండి .నా కార్టూన్లు ఒక సంపుటిగా రా బోతోంది .మీరు ముందుమాట రాస్తే సంతోషిస్తాను .అది అడగటానికే వచ్చాను ‘’అని మాడెస్ట్ గా అంటే కుంచించుకు పోయాడు శ్రీ రమణ .నాలుగు రోజుల్లో ‘’నానృషి’.కృతే కార్టూన్ ‘’అని రాశాడు .ఒక ఏడాదికే మద్రాస్ చేరి బాపు రమణ కుటుంబ సభ్యుడైపోయాడు .’
’సీతాకల్యాణం ‘’చికాగో ఫిలిం ఫెస్టివల్ కి ఎంపికై అక్కడ వారి ఆహ్వానం పై మొదటి సారి విదేశీ ప్రయాణానికి మద్రాస్ ఎయిర్ పోర్ట్ కు వెళ్ళాడు బాపు .అందరు వీడ్కోలు చెప్పటం పూర్తీ అయింది .ఇక బాపు లోపలి వెళ్లిపోవాలి .ముందుకు వెళ్ళబోయి బాపు వెనక్కి నాలుగు అడుగులు వేసి నోటి దగ్గర కర్చీఫ్ పెట్టుకొని నిలబడ్డ రమణ దగ్గరకు వెళ్లి అమాంతం పాదాభి వందనం చేసి తల వంచుకొని వెళ్ళిపోయాడు .దీనిపై శ్రీరమణ’’వారిద్దరి మధ్యా ఉన్నది చనువుకాదు .గౌరవం ఉన్నప్పుడే స్నేహమైనా ,బంధమైనా పదిలంగా ఉంటుంది అని రమణ అనేవాడు అని చెప్పాడు .’’బాపు –పైపు వీరుడు ‘’అని అందరికి తెలుసు .ఆయన దగ్గర వెయ్యిదాకా రకరకాల పైపులు ఉండేవి .’’ఈజన్ బర్గ్ అనే ఆయన కు బాపు బొమ్మలన్నా బాపు-రమణలు అన్నా చాలా ఇష్టం . ఫోర్డ్ ఫౌండేషన్ తరఫున దక్షిణ భారతం లో పుస్తక ప్రచురణ ని, చదివే అలవాటునీ పెంపొందించటానికి ఆయన వచ్చాడు .ఆ రోజుల్లో ఎమెస్కో వారి ‘’ఇంటింటా గ్రంధాలయపధకం ‘’ఇలా వచ్చిందే .అప్పటికే బాపు గొప్ప డైరెక్టర్ .. .బాపు’’ తీసే సినిమాలలో ఎక్కడైనా ఒక చోట ఫ్రేములో కనిపించేట్లు నాలుగు పుస్తకాలు పెట్టు ‘’అని సలహా ఇచ్చాడు దాన్ని పాటించి సలహాకు విలువనిచ్చాడు బాపు .బాపు మౌత్ ఆర్గాన్ ఘనాపాఠీ.ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఆర్కెస్ట్రాలో వాయించేవాడు .అయితే ఒక రోజు ఒక పాట రికార్డ్ చేస్తుంటే ‘’అచ్చు ఇదే ట్యూన్ రాత్రి రేడియో లో విన్నానండీ ‘’అన్నాడు మ్యూ జిక్ డైరెక్టర్ తో .అంతే మళ్ళీ అవకాశం రాలేదట .
‘’బాపు త్రాచుపాము . నేను వానపాము ‘’అని రమణ చెప్పేవాడట .తనకేమీరాదు నేర్చుకోవాలి అని రోజుకి ఇరవై గంటలు పనిచేసేవాడు బాపు .తానెక్కడా ఎవరిదగ్గరా చిత్రకళను నేర్చు కోలేక పోయాననే దుగ్ధ ఉండేది .అందుకే తగిన స్థాయికి రాలేక పోయానని అనుకొనేవాడు .అందుకే’’ బాపు స్కూల్ ‘’అవతరించిన్దిసార్ అని శ్రీ రమణ అంటే చిరాకు పడేవాడు బాపు .’’నాలోలోపం నాకు తెలుసు .మీకు తెలుసా ?’’అని గద్దించేవాడు .ప్రసిద్ధ చిత్రకారుల చిత్రాల్ని విశ్లేషణాత్మకంగా వివరి౦చే వాడు .బాపుకు పిలకా నరసింహ మూర్తి చిత్రించే రంగులు ,రూపాలు అంటే ఇష్టం .అందుకే సీతాకల్యాణం సినిమా లో పిలకా వారి చేత బాల సీత చూసే దశావతారాలు వేయించాడు .బులెట్ సినిమాలో ‘మా తెలుగు తల్లికి ‘’పాటచిత్రీకరణ కోసం తెలుగు దనాలను ఆయనతోనే వేయించిన కళాభిమాని .మొక్కపాటి కృష్ణమూర్తి చిత్రాలు దర్పంగా ఉంటాయని మెచ్చేవాడు .బాపు హిందుస్తానీ, రమణ కర్నాటక సంగీతానికి చెవులు కోసుకొనేవారు . .చాలా ఏళ్ళ క్రితం డాక్టర్ సమరం మానవ మనస్తత్వాలపై ఒక పత్రికలో వ్యాసం రాస్తూ ‘’ప్రాణానికి ప్రాణం గా ఉన్న బాపు –రమణ లలో ఒకరు చనిపోతే మరొకరు ఎలా జీవిస్తారు ?’’అనే అంశాన్ని ప్రస్తావించాడు .చాలామంది అభిమానులు సమరం పై సమార భేరి మోగించారు .
బాపు –చాలా సంగతులు రమణ కళ్ళతో చూస్తాడు ఆయన చెవులతో వింటాడు .బాపుని అర్ధం చేసుకోవటం అందరివల్లా కాదు .రమణ ఒక్కడే బాపుకు వెయ్యిమందిపెట్టు .ఫెయిల్యూర్ తో పేచీ పెట్టుకొని దాన్ని ఓడించే శక్తి రమణ కు ఉంది .ఆ గెలుపు లో మూడు వంతులవాటా బాపు కిస్తాడు .పొరుగు రాష్ట్రాలలో ఉంటె ‘’వెంకట్రావ్ ఎలా ఉన్నావ్ ?’’అని రమణకు ఫోన్ చేసే అలవాటు బాపుది..రమణ అసలుపేరు వెంకట్రావ్.’’రమణ బావుంటే అందరూ బావున్నట్టే ‘’అనేవాడు బాపు .ఒక అక్షరం కాని గీతకాని రమణ కు చూపించకుండా బయటికి పంపేవాడు కాదు .రమణ పోయిన తర్వాత’’ గీతాధ్యానం’’ లో ఉంటూ కూడా తెరచి ఉన్న తలుపు వైపుకు మధ్య మధ్యరమణ వస్తున్నాడే మో నని చూసేవాడు . ‘’రమణ ఇక రాడు కదా అనే నిష్టుర సత్యం బాపు మనస్సులో కలుక్కు మంటుంది’’.ముందే చెప్పినట్లు’’ బాపు నిగర్వి .కాని బాపు గర్వం రమణ .రమణ నిగర్వి కాని ఆయన గర్వం బాపు ‘’.బాపుకు డబ్బు ఖర్చు చేయటం తెలియదు .రమణ మనసుతో రమణ చేతులతో ఉదారంగా ఖర్చు చేస్తాడు బాపు .రమణ దివ్య స్మృతికి ఒక పుస్తకం అంకితమిస్తూ ‘’నను గోడలేని చిత్తరువును చేసి వెళ్లి పోయిన నా వెంకట్రావు కోటి కోట్ల జ్ఞాపకాలకు ‘’అని మనసు పొరల్లోంచి వచ్చిన మాట రాశాడు బాపు అని శ్రీ రమణ చెప్పాడు .
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -7-10-15 -ఉయ్యూరు
31-8-17 బాపు వర్ధంతి సందర్భోచితంగా పై వ్యాసం మీకోసం -దుర్గాప్రసాద్ -షార్లెట్-అమెరికా -31-8-17
—