28-8-17 సోమవారం నంద్యాల ఉప ఎన్నిక ఫలితాలు భూమా నాగి రెడ్డి కుమారుడు 28 వేల భారీ మెజార్టీతో గెలుపు .. సోమవారం సాయంత్రం పవన్ ,రాధా వచ్చి శనివారం వాళ్ళ ఇంట్లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించమని కోరారు .సరే అన్నాను వ్రతం అయ్యాక దాదాపు 5 నెలలనుండి వాయిదా వేస్తున్న కారీ ప్రయాణం చేద్దామనుకొన్నాం మా అమ్మాయి మేము .రాత్రి నాటక నటుడు రచయిత సినీ హాస్య నటుడు లంకా భద్రాద్రి శ్రీరామ్ అనే ఎల్ బి శ్రీరామ్ తీస్తున్న షార్ట్ ఫిలిం సీరీస్ ‘’he ’art “‘films ‘’మళ్ళీ చూశా . అందులో గంగిరెద్దు అద్భుత . దేవాలయం లో ప్రసాదం గా మంచి పాతపుస్తకాలుపంచి పెట్టె కాన్సెప్ట్ తో ఉన్న ‘’ప్రసాదం ‘’ ‘’రాళ్లు’’ ఫిలిం లో శిల్పి అందరికి నయనానందం కల్గిస్తాడుకాని అతని ఇంట్లోపొయ్యిలో పిల్లిలేవటానికి యెంత కష్టపడతాడో తెలిపే సినిమా గొప్పగా ఉంది . దేవుడు గుడిలో మాత్రమే లేడు సర్వత్రా ఉన్నాడు చూసే కళ్ళు ఉంటె అని తెలియజెప్పే ‘’దేవుడు ‘’తండ్రి ఇంటికి వస్తున్నాడంటే డబ్బు అడుగుతాడేమోనని కొడుకు కోడలు భావించి వెంటనే పంపించేద్దామని అనుకొంటున్న వారిద్దరికీ షాకింగ్ గా తండ్రి 20 వేల రూపాయలు కొడుకు చేతిలో పోసి ,కోడలి జబ్బు నయం చేయించమని చెప్పగా వాళ్ళిద్దర్నీ అవాక్కు చేసిన ‘’నాన్న ‘’లఘు చిత్రం ,కూతురు తండ్రి అనుమతి లేకుండా ఎవర్నో పెళ్లి చేసుకొంటే భరించలేక పోయిన తండ్రి మరణ శయ్యమీద కూతురు ఫోన్ నంబర్ నర్సుకు ఇస్తే ,మానవత్వమున్న నర్స్ ఆఅమ్మాయికి ఫోన్ చేసి పిలిపించి ఆమె బాధ పడకూడదని తండ్రి ఆఅమ్మాయిని క్షమించినట్లు తానె ఉత్తరం రాసి ,చనిపోయిన తండ్రిని చూడటానికి వచ్చిన కూతురుకు మనశాంతిని ,చనిపోయిన తండ్రికి ఆత్మ శాంతిని కలిగించిన నర్స్ ఔదార్యం తెలియ జేసే ‘’నర్స్ ‘’చిత్రం హృదయాలను కదిలించాయి .
గొల్లపూడి మారుతీరావు తనికెళ్ళ భరణి ,బలభద్ర పాత్రుని రమణి వంటి లబ్ధ ప్రతిష్టులతో తీసిన సెంటిమెంట్ చిత్రం ‘’పల్లకి ‘’గుండెలను కదిలిచేస్తుంది .అందరూ జీవించారు ఇందులో .దీన్ని అపర అన్నపూర్ణ నిరతాన్న ప్రదాత కీశే శ్రీమతి డొక్కా సీతమ్మగారి మనవడి కొడుకు అంటే ఇన్ని మనవడు శ్రీ డొక్కా ఫణి డైరెక్ట్ చేశారు ఫణిగారు అట్లా0టాలో ఉంటూ తమ ఇంట సాహిత్యకార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ఉంటె తమ్ముడు శ్రీ డొక్కా రామభద్ర ఆస్టిన్ లో ఉంటూ సాహిత్య సామాజిక సేవ చేస్తూ ,పుస్తకాలు రాసి ప్రచురిస్తున్నారు ..ఈ లఘు చిత్రాలలో శ్రీరామ్ నటన పారాకాష్ట కు చేరింది . ఎక్కడా కృత్రిమత కనిపించదు సహజత్వం ఉట్టి పడుతుంది తప్పని సరిగా ‘’హార్ట్ ఫిలిం ‘’ లను అందరూ చూసి ఆన0 దించమనీ ,ఎల్బీ ఇందులోనూ శిరాగ్రాన నిలవాలని కోరుతున్నాను . మానవీయ కోణాల ఆవిష్కరణ జేజేలు పలుకుతున్నాను .
మంగళవారం – గీర్వాణం -3 లో 443 వరకు రాశాను
30-8-17 బుధవారం మంచి మనిషి శ్రీ ఆదిత్యారామ్ ఆకస్మిక మరణం
27 వ తేదీ ఆదివారం మధ్యాహ్నం ఇక్కడ మా కమ్యూనిటీ లోనే మా ఇంటికి మూడవ ఇంట్లో ఉంటున్న దంత వైద్యురాలు శ్రీమతి భావన గారి భర్త ,బాంక్ లో పనిచేస్తున్న అందరికి ఆప్తులు శ్రీ ఆదిత్యారామ్ అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ వచ్చి ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయారు . వయసు 48 మాత్రమే . మా అమ్మాయికి తెలిసి వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి మా ఇంట్లో ఉంచి మామనవాళ్లతో ఆమెతో మాట్లాడిస్తూ ఆ అమ్మాయికి షాక్ కలగకుండా జాగ్రత్త పరచింది అబ్బాయి పెద్దవాడు . అతడూ తరచుగా మామనవడు శ్రీకేత్ కోసం వస్తూంటాడు .ఆదిత్యారామ్ ను ఆంబులెన్స్ లో హాస్పిటల్ కు తీసుకు వెళ్లి అన్ని ప్రయత్నాలు చేయించినా ఫలితం దక్కక సాయంత్రం 5-30 కు డాక్టర్లు చనిపోయినట్లు ప్రకటించారు .అక్కడే ఐ సి లో ఉంచి 30 వ తేదీ బుధవారం మధ్యాహ్నం శవ దహన వాటిక కు చేర్చారు .మా అమ్మాయి స్నేహితురాలు సురేఖ ఆమె భర్త మరో మిత్రురాలు సునీతతో నన్ను అక్కడికి తీసుకు వెళ్లారుకారులో . అరగంటకు పైగా ప్రయాణం మధ్యాహ్నం 1-15 కు చేరాం . అందరూ ఆదిత్యారామ్ పార్థివ దేహాన్ని చూసే వీలు కల్పించి అంతిమ దర్శనం కలిగించారు వాళ్ళ కుటుంబం తోపాటు సుమారు 100 మంది హాజరయ్యారు . రామ్ వాళ్ళు బెంగుళూరు కు తెలుగు కుటుంబం .ఇక్కడ ఈ ఇంట్లోకి వచ్చి మూడేళ్లే అయింది . మంచి స్థితిపరులు .దంపతులిద్దరికీ మంచి పేరు ప్రతిష్టలున్నాయి ఆయనతో దాదాపు 30 ఏళ్ళ అనుబంధం ఉన్న ఒక మిత్రుడు ,15 ఏళ్ళ మిత్రత్వం ఉన్న మరో మిత్రుడు ఇక్కడి అమెరికన్ మిత్రులు స్నేహితులు ఆదిత్య గురించి మనసువిప్పి చెప్పారు భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ,చెప్పలేక చెప్పలేక నాలుగు మాటలు చెప్పింది. కొడుకు చిన్నవాడే అయినా సందర్భాలని బట్టి పెద్ద వాడై హుందాగా ప్రవర్తించాడు .అయిదుసార్లు అమెరికా వచ్చిన నాకు ఇదే మొదటి సారి ఇలాంటి దానిలో పాల్గొనటం .ఇదంతా అయ్యేసరికి మధ్యాహ్నం 3-15 అయింది .సాయంత్రం 4-30 కు అక్కడే ఉన్న విద్యుత్ శ్మశాన వాటికలో దహనం .నన్ను సురేఖను సునీత భర్త మధ్యాహ్నం 3-30 కు మా ఇళ్లకుకారులో తీసుకొచ్చాడు .రాగానే బట్టలు తడిపి ష్ణానం చేసి విభూతి పెట్టుకొన్నాను .
ఆదివారం నుండి ఈకమ్యూనిటీలోని ఆడవాళ్లు మగవాళ్ళుఅందరూ ద్యూటీలు వేసుకొని ఇంటిదగ్గరా హాస్పిటల్ లోనూ ఆకుటుంబానికి అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు .మా అమ్మాయి అందరికి కో ఆర్డినేట్ చేసింది . ఆఫీస్ నుంచి రాగానే కాఫీ టీ పెట్టి ఫ్లాస్క్ లలో వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్లి ఇచ్చి వచ్చేది . మానవత్వం పరిమళించటం అంటే ఇదే .
గురువారం పవన్ రాధా వచ్చి వ్రతానికి ,భోజనానికి పిలిచారు మర్యాద పూర్వకంగా . మా మనవడు అశుతోష్ కు కాలి బొటనవ్రేలు కు దెబ్బతగిలితే .మా అమ్మాయి ఆఫీస్ నుంచి రాగానే దగ్గరలో ఉన్న పీడియాట్రిక్స్ కు తీసుకు వెళ్లాం . ఎక్స్ రే తీశారుకాని రేడియాలజిస్ట్ లేకపోవటం తో మర్నాడు రమ్మన్నారు . నేను హోమియో అందు ఆర్నికా, రూస్టక్స్ వేశాను రాత్రికి ఉపశమనం కలిగి నిద్ర బాగానే పోయాడు శుక్రవారం బడికి వెళ్ళాడు కూడా .
శుక్రవారం అన్నదమ్ములిద్దరూ స్కూల్ కు వెళ్లారు . శ్రీ ఎల్లాప్రగడ రామ మోహనరావు గారికి ఫోన్ చేసి శనివారం సాయంత్రం బయల్దేరి కారీ వస్తున్నట్లు తెలియ జేశాను . చాలా ఆనంద పడ్డారు . మైనేనిగారికీ మామనవాడు హరికీ కూడా చెప్పాం .గీర్వాణం -3 లో 450 వరకు రాశా . శ్రీ చలపాక ప్రకాష్ ఆన్ లైన్ లో పంపిన1-100 పేజీల ఆధుని ప్రపంచ నిర్మాతలు డిటిపి లో తప్పులు దిద్ది వెంటనే ఆ లిస్ట్ ప్రకాష్ గారికి పంపాను .మైనేని గారినీ దిద్దమని చెప్పి ఆ లిస్ట్ కూడా ప్రకాష్ కు పంపి సరి చేయమని ఫోన్ చేసి చెప్పా .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-9-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
—