వీక్లీ  అమెరికా -23-2 (28-8-17 నుండి 3-9-17 వరకు ) శ్రీ సత్యనారాయణ వ్రతం ,కారీ ప్రయాణ వారం-2

వీక్లీ  అమెరికా -23-2 (28-8-17 నుండి 3-9-17 వరకు )

శ్రీ సత్యనారాయణ వ్రతం ,కారీ ప్రయాణ వారం-2

పవన్ ఇంట్లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

2-9-17 శనివారం -ఉదయమే లేచి ఇంట్లో సంధ్య ,పూజాదికాలు ముగించి 9-30 కు మా అమ్మాయి కారులో మేమిద్దరం పవన్ వాళ్ళ ఇంటికి వెళ్లాం . అప్పటికే కొంత ఏర్పాటు చేశారు .మేము వెళ్ళాక స్పీడ్ పెంచి  అన్ని ఏర్పాట్లు చేసేసరికి 11 అయింది .. పవన్ ,రాధా దంపతులు ముఖ్య తారాగణం గా  రాంకీ ,ఉష దంపతులు ,పవన్ సాయి పద్మజ దంపతులు ,పవన్ బంధువులు శ్రీనాధ్ దంపతులు ,బులుసు సాంబమూర్తి పద్మజా దంపతులు అతిథి నటులుగా వ్రతం లో కూర్చున్నారు . ముందుగా విఘ్నేశ్వర పూజ చేయించి తర్వాత శ్రీ రామా సహిత సత్యనారాయణ స్వామి ప్రాణ ప్రతిష్ట చేయించి ,నవగ్రహాల ఆవాహనం ప్రతి గ్రహానికి అష్టోత్తర పూజ అక్కడ వాడవలసిన రంగుపుష్పాలతో చేయించి అష్ట దిక్పాల పూజ మొదలైన వాటి తర్వాత ,లక్ష్మీ  సమేత శ్రీ సత్యనారాయణ ప్రతిమలకు రూపులకుపురుషసూక్త ,స్త్రీ సూక్త భూసూక్తాలతో  అభిషేకం చేయించి ,పిమ్మట సత్యనారాయణ అస్టోత్తర  విష్ణు సహస్ర నామ ,లక్ష్మీ అష్టోత్తర పూజ చేయించి సత్యనారాయణ స్వామి ప్రసాదం నైవేద్యం పెట్టించి వ్రతకధలు అయిదు చెప్పి  మళ్ళీ అష్టోత్తరపూజ ,చేయించి  ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర దీపారాధన అష్టోత్తర పూజ చేయించి మహా నైవేద్యం పెట్టించాను .మంగళహారతి ఇప్పించి  తర్వాత అందరం లేచి ఏకకంఠంగా మంత్రపుష్పం ఉచ్చై స్వరం  తో పఠించి పూజ పూర్తి చేయించాను . తర్వాత ఉద్వాసన మంత్రమూ చెప్పించి చేయించాను .దంపతులందరికి మా శ్రీమతి రాధ బంధువులావిడ మొదలైన ముత్తైదువులు మంగళ హారతి  పట్టారు .నేను ఆశీర్వాద మంత్రాలు క్రమ జట  ఘనం తో ఒక వేదపనస చదివి ఆశీర్వ దించాను . తర్వాత తీర్ధ ప్రసాద 0 అందరికి ఇచ్చాను . ఈ రోజు ప్రాముఖ్యతను ,అన్నవరం క్షేత్రాన్ని గురించి చెప్పాను . అంతా  అయ్యేసరికి మధ్యాహ్నం 3 దాటింది .అంటే సుమారు మూడున్నర గంటలపూజ

ఈ రోజు ప్రత్యేకత –    అన్నవరం క్షేత్రం

ఇవాళ అంటేభాద్ర పద శుద్ధ ఏకాదశి ద్వాదశి కలిసిన పుణ్య ఘడియలలో శ్రీ సత్యనారాయణ వ్రతం చేయటం అనంత పుణ్య ప్రదం .

‘’సంస్పృశ్య ఏకాదశీ రాజన్ ,ద్వాదశీ మపి సంస్పృశేత్ -శ్రవణం ,జ్యోతిషామ్ శ్రేష్టం బ్రహ్మ హత్యాది వ్యపోహతి -’’

‘’ద్వాదశీ శ్రవణం పృష్ఠ స్పృశేత్ ఏకాదశీమ్ యది -స ఏవ వైష్ణవో యోగః -విష్ణు శృంఖల సౌజ్ఞితః ‘’అని నారద పురాణం చెప్పింది .దీని భావం ఏమిటి అంటే – భాద్రపద మాసం లో శుక్లపక్షం లో ఏకాదశి ద్వాదశీ తిధులు కలసిఉన్నరోజు న శ్రవణా నక్షత్రం ఉంటె చేసే వ్రతం బ్రహ్మ హత్యా దోషాన్ని పోగొట్టి మోక్షాన్నిస్తుంది .దీనికే విష్ణు శృంఖలా యోగం అంటారు .ఈ రోజు బుధవారం కూడా అయితే మరింత ఫలప్రదం .దీన్ని అప్పుడు ‘’మహాద్వాదశి ‘’అంటారు ఉపవాసం ఉండి  వ్రతం చేసి దానా లిస్తే వచ్చే జన్మలో చక్రవర్తిగా పుడతారని మార్కండేయ పురాణమూ  మత్శ్య పురాణమూ చెప్పాయి  . ఇందులో మనకు తిధులు మాత్రమే కలిశాయి కనుక సగం పుణ్యం సాధించినట్లే .ఇవాళ పూర్వాషాఢ వెళ్లి ఉత్తరాషాడ లో ఈ వ్రతం చేస్తున్నాం తర్వాత వచ్చేదే శ్రవణా నక్షత్రం .

 ఇవాళ్టి భాద్ర పద శుద్ధ ఏకాదశిని ‘’పరివర్తన ఏకాదశి ‘’అంటారు వామన ఏకాదశి అనే పేరుకూడా ఉంది . బలి చక్రవర్తిని విష్ణువు వామనమూర్తిగా అవతరించి మూడు అడుగులు దానం అడిగి ఒకడుగు భూమిపై రెండవది ఆకాశం లో పెట్టి మూడో దానికి చోటులేక బలి నెత్తిన పెట్టి పాతాళలోకానికి అదిమి పంపి  తాను ద్వారపాలకునిగా  కావలిగా ఉన్న రోజు ఇది .

                             అన్నవరం

పూర్వం మేరు పర్వతం భార్య మేనక పుత్ర సంతానం కోసం శ్రీ మహా విష్ణువు పై ధ్యాన తపస్సులు చేయగా ,వారు కోరుకున్న పుత్ర సంతానాన్ని వరంగా ఇచ్చాడు . భద్రుడు ,రత్నాకరుడు అనే ఇద్దరు కొడుకులు పుట్టారు . భద్రుడు శ్రీరాముని కోసం తపస్సు చేసి ప్రత్యక్షంకాగా తనకొండపైనే కొలువుండమని కోరటం ఆయన భద్ర గిరిపై సీతా  సమేతంగా  వామాంక స్థితుడై ఉండటం అదే భద్రాచల పుణ్య క్షేత్రం గా ప్రసిద్ధ మవటం మనకు తెలిసిందే .రత్నాకరుడు విష్ణువు కోసం తపస్సు చేసి ప్రత్యక్షమవగానే తనకొండ రత్నగిరి పై శాశ్వతం గా ఉండిపొమ్మనటం తో శ్రీ సత్యనారాయణ స్వామిగా ఉండిపోవటం వలన ఇది అన్నవరం క్షేత్రంగా ప్రసిద్ధమైంది .ఈ  విధం గా  సోదరులిద్దరూ విష్ణు అనుగ్రహ పాత్రులై ఆయననే తమ గిరులపై వెలసేట్లు చేసుకొన్న పుణ్యమూర్తులు . రత్నాచలమే అన్నవరం .రత్నాచల్ ఎక్స్ప్రెస్ అందువలననే ఆ పేరుతొ వచ్చింది .

                       స్వామి ఆవిర్భావం

తూర్పు గోదావరిజిల్లా పిఠాపురం దగ్గర ‘’గోరస ‘’అనే గ్రామానికి ప్రభువు శ్రీ రాజా ఇనగంటి వేంకట  రామాయణిం బహదూర్ .దీనికి దగ్గరలో అరికంపూడి వద్ద ‘’అన్నవరం ‘’గ్రామం ఉంది .అన్నవరం లో శ్రీ ఈరంకి ప్రకాశం రావు అనే బ్రాహ్మణుడు చాలా నిష్ఠగా వేదం వేదాంగాలు నేర్చి మహా భక్తుడుగా ప్రసిద్ధి చెందాడు రాజుగారికి ప్రీతి పాత్రుడు కూడా .ఒక రోజు రాత్రి కలలో ఈ ఇద్దరికీ విష్ణు మూర్తి కనిపించి తానూ వచ్చే ఖర నామ సంవత్సర శ్రావణమాసం శుక్ల విదియ మఖా నక్షత్రం లో ఉన్న గురువారం నాడు రత్న గిరిపై వెలుస్తాననని ,తనను తెచ్చి అన్నవరం కొండపై ప్రతిష్ట చేసి గుడి కట్టించమని చెప్పాడు .

  మర్నాడు ఈ ఇద్దరు కలుసుకొని తమకు వచ్చిన కల గురించి చెప్పుకొని ఆశ్చర్యపోయి ఖర నామ సంవత్సర శ్రావణ శుద్ధ పాడ్యమి నాటికే అన్నవరం చేరి స్వామి కోసం వెదికారు .అక్కడ ఒక ‘’అంకుడు చెట్టు ‘’(కృష్ణ కుటజము )- Nerium Anty dysentirium ‘’కింద సూర్యకిరణాలు పడగా పొదలను తొలగించి చూస్తే సత్యనారాయణ స్వామి విగ్రహం లభించింది .దీన్ని రత్నాచలం పైకి తీసుకు వెళ్లారు .కాశీ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ‘’శ్రీ మత్రిపాద్విభూతి మహా వైకుంఠ నారాయణ యంత్రం ‘’విష్ణు పంచాయతనపూర్వంగా తెప్పించి 1891 ఆగస్టు 6 న ప్రతిష్టించారు .

                ఆలయ నిర్మాణం -ప్రత్యేకతలు

శ్రీ అనంత లక్ష్మీ సత్యదేవీ సమేత  శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయాన్ని 1934లో నిర్మించారు .పంచాయతనం ఉండటం వలన ,దానికి ప్రతీక గ ముందు గణపతి ,శంకరుని చిహ్నాలు ,శూల శిఖరాళల తో  రెండు చిన్న విమాన ,గోపురాలు ,మధ్యగా ప్రధాన విమాన గోపురం ,వెనక ఆదిత్య దేవత ,అంబికా దేవి ప్రతీకలైన శ్రీ చక్రాలున్న మరో రెండు విమాన గోపురాలతో ఆలయాన్ని కట్టారు .ఒకే చోట ఇంతమంది దేవతలు కొలువై ఉండటం ఒక ప్రత్యేకత .గిరిపై శ్రీ కోదండ రామాలయం ,వనదుర్గాలయం కింద గ్రామదేవత ఆలయాలు కూడా ఉన్నాయి ..

 శ్రీ సత్యనారాయణస్వామి త్రిముర్త్యా త్మక విష్ణు స్వరూపుడు .అందుకే ‘’మూలతో బ్రహ్మ రూపాయ ,మధ్యతశ్చ మహేశ్వరం -ఆదతో విష్ణు రూపాయ త్రైక్య రూపాయతే నమః ‘’అని భక్తితో అర్చిస్తారు

   ఆలయ ప్రత్యేకతలు

ఈ ఆలయం రుద్రాకృతిలో ఉండటం ఒక ప్రత్యేకత . ఆలయ నైరుతిభాగం లో సూర్యుడు ,ఆగ్నేయం లో గణపతి ,వాయవ్యం లో అంబికా ,ఈశాన్యం లో ఈశ్వరుడు ,మధ్యలో ప్రత్యేక యంత్ర వేదిక  పై లింగాకార0 లో బిందు స్థానం  లో పంచాయతన స్వామిగా సత్య దేవుడు ప్రతిష్ఠితమై ఉన్నాడు .ఆలయం రెండు అంతస్తులతో ఉండటం మరో విశేషం ..పై అంతస్తులో దివ్య మంగళ విగ్రహ స్వరూపుడుగా శ్రీ అనంత లక్ష్మీ సత్యదేవీ  సమేత  శ్రీ వీర వెంకట సత్యనారాయణ మూర్తి విరాజిల్లుతూ దివ్య దర్శనమిస్తాడు .ఈరెండిటి మధ్య పానవట్టం లాంటి నిర్మాణం ఉండటం వింతలలో వింత .దీనిలో బీజాక్షర సంపుటి ఉన్న యంత్రం ఉండటం వింతలకే  వింత .

 క్రింద ఉన్న వృత్తాకార శిలాయంత్రం బ్రహ్మ స్వరూపం ,మధ్యలో శివ స్వరూపం ,పై విగ్రహం శ్రీమన్నారాయణ మూర్తి అవటంఅత్యంత  విశేషం..సత్యదేవుడిని ‘’త్రిపాద్విభూతమహా నాయకుడు ‘’అంటారు .అమ్మవారు అనంత లక్ష్మీ సత్యదేవి ‘’

 ఈ ఆలయం లో నిత్యం సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరుగుతాయి .ఇక్కడి సత్యనారాయణ స్వామి ప్రసాదం మహా రుచికరమేకాదు అత్యంత పవిత్రం కూడా ‘’

  ఈ మొత్తాన్ని  నేను ఈ రోజు వ్రతం లో 5 కధలు అయ్యాక 6 వ కద చెబుతాను అని ఊరించి సరదాగా  విశేషంగా ఈ కథ చెప్పి సస్పెన్స్ కు తెరదించాను .

   పవన్ ఇంట్లో వ్రతం అయ్యాక పవన్ రాధా దంపతులు  మా దంపతులకు నూతన వస్త్రాలు  ‘’ఘనమైన తాంబూలం’’ తో అందజేసి ఆశీసులు అందుకొన్నారు . రాంకీ ,ఉషా దంపతులు పవన్ సాయి పద్మజా దంపతులు ‘’యధాశక్తి తాంబూలాలు ‘’ఇచ్చి ఆశీస్సులు పొందారు .

 తర్వాత భోజనాలు . పప్పు వంకాయ కూర బీన్స్ కూర ,దోసావకాయ ,చట్నీ ,పునుగులు ,పరవాన్నం పులిహోర ,మామిడిపండు ముక్కలతో సుస్టైన భోజనం చేసాం . నా బోటి ‘’పీఠాధిపతులం ‘’కుర్చీలలో కూర్చుని భోజనం చేస్తే మిగిలిన వారందరూ కింద కూర్చుని పవన్ స్పెషాలిటీ అయినఅరటి ఆకులలో చక్కగా ఆంద్ర బ్రాహ్మణ లోగిళ్ళు లో చేసే విధానం లో భుజించి తెలుగు విందు భోజన వైభవాన్ని  ఇక్కడ ప్రదర్శించి కను విందు చేశారు .

   ఈ రోజు రాంకీ పుట్టిన రోజు అవటం తో కేకు తెప్పించి పవన్ రాంకీ తో కోయించి జన్మ దిన శుభాకాంక్షలు అందరి చేత ఇప్పించి  బర్త్ డే పాటలు పిల్లలల్తో పాడించి శోభతెచ్చాడు .పవన్ కూతురు పెద్దమనిషి  అయినప్పుడు  బంతి భోజనాలనాడు రాంకీ భార్య ఉష పుట్టిన రోజు నాడూ పవన్ ఇదే మాదిరిగా ఏర్పాటు చేసిన  విషయం గుర్తు చేసుకున్నాం . నేను రాంకీ ఉషా దంపతులను ‘’షార్లెట్ వసిష్ఠ అరుంధతులు ‘’అని పవన్ రాధ దంపతులను ‘’షార్లెట్ అత్రి అనసూయ దంపతులు ‘’అని ,పవన్ సాయి పద్మజ దంపతులను ‘’షార్లెట్ ఋష్యశృంగ శాంత దంపతులు ‘’అని చమత్కరించా .చమత్కరించటం కాదు నిజంగానే వాళ్ళు అలా సన్మార్గం లో ప్రవర్తిస్తారు . ఇదంతా అయ్యేసరికి  సాయంత్రం 5-45 అయింది .వెంటనే అందరికీ కాఫీలిచ్చారు .

శ్రీ రఘు సుచిత్ర దంపతుల ఇంట్లో కిందటి శనివారం రుద్రాభిషేకం నాడు రుద్రం బాగా చెప్పిందని నేను మెచ్చిన శ్రీమతి కాకాని లక్ష్మికి ఆ నాడు వాగ్దానం చేసిన రూ 1 ,116 రూపాయలు సరసభారతి పుస్తకాలు ఉన్న పాకెట్ ఇచ్చి శ్రీ రవీంద్ర గారిద్వారా అందజేయించమని పవన్ కు ఇచ్చాను

తర్వాత మేమిద్దరం మా అమ్మాయి విజ్జి ,పిల్లలు ముగ్గురం కారులో  సాయంత్రం  6 కు కారీ  బయల్దేరాం .

    కారీ లో ఇరవై మూడున్నర గంటలు

2-9-17 శనివారం సాయంత్రం 6 గంటలకు కారులో కారీ కి బయల్దేరి రాత్రి 9 గంటలకు మా అన్నయ్యగారి మానవుడు చి వేలూరి హరికిషన్ సారిక దంపతుల ఇంటికి చేరాం . మేమిద్దరం ఏమీ తినలేదు .పిల్లలు ఇడ్లీలు తిన్నారు .మజ్జిగ తాగి పడుకున్నాం .ఎల్లాప్రగడ రామమోహనరావుగారికి ఇక్కడికి వచ్చినట్లు ఫోన్ చేసి చెప్పి ,రేపు మధ్యాహ్నం భోజనం వారింట్లోనే నని చెప్పాను సంతోషించారు . 5 నెలలనుంచీ వేసుకొన్న ప్లాన్   ఇది ఇవాళ కుదిరింది .

3-9-17 ఆదివారం -ఉదయమే లేచి కాలకృత్యాలు తర్వాత  సంధ్యపూజ కానిచ్చి టిఫిన్ చేసి చి సౌ సారికకు ఒడిలో మా శ్రీమతి చలవ చలిమిడి పెట్టి ,రెండో పిల్లాడితో ముద్ద కుడుములు ఇప్పించి వేడుక చేసింది .సారిక తల్లిగారు కూడా ఇక్కడే ఉన్నారు . పెద్ద పిల్లాడు చి దర్శి మంచి మాటగాడు కలుపుకోలు తనం ఉన్నవాడు . చనువుగా దగ్గరకొచ్చాడు .చిన్నవాడికి మూడు నెలలు . అచ్చం వాళ్ళ నాయనమ్మ అంటే మా అన్నగారి అమ్మాయి వేదవల్లి లాగా ఉన్నాడు . ఈ వేడుక తర్వాత మా ఇద్దర్నీ 6 మైళ్ళ దూరం లో ఉన్న ఎల్లాప్రగడ వారి చెల్లెలు బావగారు హార్ట్ డాక్టర్దంపతులు నందిగామకు చెందిన శ్రీ బండారు రాధాకృష్ణ మూర్తి శ్రీమతి సులోచన దంపతుల ఇంటికి  మధ్యాహ్నం 12 గంటలకు  తీసుకు వెళ్లి దింపి0ది .అక్కడే ఎల్లాప్రగడ వారు వాళ్ళమ్మాయి  శ్రీలక్ష్మి ఉన్నారు మమ్మల్ని అందరూ ఆత్మీయంగా ఆహ్వానించారు . ఒక గంట సేపు సరదాగా మాట్లాడుకొంటూ శ్రీ మైనేని గోపాలకృష్ణ గారితో ఫోన్ లో సంభాషిస్తూ కాలక్షేపం చేసాం . మైనేనిగారి ఈ సమావేశానికి రూపకర్త సంధానకర్త . మధ్యాహ్నం ఒంటిగంటకు భోజనాలు చేసాం .భోజనం లో పప్పు ,చిక్కుడుకాయ కూర పూరీలు బంగాళా  దుంపకూర  ఎల్లాప్రగడ స్వయం గా చేసిన గుంటూరు గోంగూర పచ్చడి, పండు మిరపకాయ పచ్చడి ,అల్లం పచ్చడి  గులాబీ జామ్ ,గారెలు రావుగారి స్పెషల్ ఘుమఘుమల సాంబారు ,రెండురకాల అప్పడాలు ఊరు మిరపకాయలు పెరుగు ,మామిడి పండు ముక్కలతో కమ్మటి తెలుగు భోజనం చేసాం.  కొసరి కొసరి అన్నా చెల్లెలు వడ్డించి మరీ మరీ తినిపించారు . తర్వాత రావుగారు మా అందరికి స్వహస్తాలతో కస్తూరి జాజికాయ జాపత్రి ,ఏలక్కాయ ,లవంగం త్రివేణీ వక్కపొడితో కట్టిన కమ్మని కిళ్లీ తిన్నాం . నేను రెండు తిన్నా . చాలా బాగున్నాయి ఆయన టెస్ట్ కు జేజేలు .రావు గారుసరాదా మనిషి . గుంటూరు జిల్లా రేపల్లేదగ్గర వారికి ఒకప్పుడు వేలాది ఎకరాల సుక్షేత్రమైన మాగాణి మామిడితోటలు ఉండేవి . 400 ఆవులు ఉండేవి .తండ్రిగారి హయాం వరకు పాడీ  పంటా వ్యవసాయం తో ఉండేది . రావు గారు 18 ఏళ్ళు వ్యవసాయం చేశారు ట్రాక్టర్ తో దుక్కి దున్నారు . అన్నదమ్ముల పంపకాలలో అన్నీ అవగా ఇప్పటికీ వీరికి అక్కడ 25 ఎకరాల భూమి ఉంది ప్రతి వేసవిలో ఇండియా వెళ్లి వ్యవసాయం చూసుకొంటారు .తోటలోని  మామిడికాయ ,మిర్చి గోంగూర నిమ్మకాయ వగైరాలతో ఊరగాయలు పెట్టిస్తారు .అమెరికావచ్చి అకౌంటింగ్ ప్రొఫెసర్ గా స్థిరపడి రెండేళ్లక్రితం రిటైరయ్యారు . ఒక అన్నగారు ఎయిర్ ఇండియా పైలట్ చేశారు .రావుగారు కూడా పైలట్ లైసెన్స్ పొంది హాబీగా విమానాలు నడిపేవారు . మంచి సహృదయులు ,స్నేహశీలి మైనేనిగారి క్లాస్ మేట్ .ఏరా అంటే యేరా అనుకొనే చనువున్నవారు .

  బండారు డాక్టర్ డంపట్ల హార్ట్ స్పెషలిస్ట్ లుగా ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైరయి ఇక్కడే ఉంటున్నారు   ఇద్దరీళ్లూ ప్రక్క ప్రక్కనే . మూర్తిగారిది కృష్ణా జిల్లా నందిగామ దగ్గర వేములపల్లి అగ్రహారం .ఒకప్పుడువీరికీ అమరావతి ప్రభువు ఇనాంగా ఇచ్చిన గ్రామం .మూర్తి గారు రజాకార్లకు వ్యతిరేకంగానూ స్వాతంత్ర సమరం లోనూ పాల్గొని జైలుకెళ్లినా దేశ భక్తులు తర్వాత బూర్గుల రామ కృష్ణారావు  కె ఎల్ రావు గారు ల హితవుపై చదువు కొనసాగించి అంచెలంచెలుగా ఎదిగి డాక్టర్ పాసై ఉస్మానియా లో పని చేసి ఇక్కడికి వచ్చారు . సులోచనగారు రావు గారి చెల్లెలు . మూర్తిగారి మొదటిభార్య చనిపోతే వీరినిచ్చి వివాహం చేశారు . పిల్లలుఅమెరికాలోనే ఉన్నారు . మూర్తిగారి సహస్ర  చంద్ర మాసోత్సవాన్ని పిల్లలు ఘనం గా ఇక్కడే నిర్వహించారు . అంటే వారికి ఇప్పుడు 85 ఏళ్ళు .భగవద్ ధ్యానం పూజలతో సత్కార్యాలతో కాలక్షేపం చేస్తున్నారు .

   రావుగారు తమల పాకు తీగలను కర్వేపాకు చెట్లను బాగా పోషిస్తున్నారు . మూర్తిగారి పెరడులో రుద్రాక్ష చెట్టు ఇద్దరి పెరడులలో బిల్వ వృక్షాలు ఉండటం విశేషం . అనీ త్రిప్పి మాకు చూపించారు .మధ్యాహ్నం 2 గంటలకు మా అమ్మాయి పిల్లలు హరి కుటుంబం వచారు భోజనాలు చేశారు .తర్వాత రావు గారి కిళ్ళీలు ఆరగాఆరగా తిన్నారు .

  సాయంత్రం నేను శ్రీ మంకు శీను గారు రాసిన శ్రీ సువర్చలేశ్వర శతక0 ఒక పావుగంట లో చదివి రావు గారి హనుమద్ భక్తికి  దోహదం చేశాను ఆయన హనుమ ఉపాసకులు సద్గురు శివానందమూర్తి గారి సామవేదం షణ్ముఖ శర్మగారి శిష్యులు .డాక్టర్ మూర్తిగారింటికి శ్రీ ప్రతాపరాయకులపతి గారైన శ్రీ కుర్తాళం పీఠాధిపతులు వచ్చి మూడు రోజులు అనుగ్రహ భాషణం చేసి ఆశీస్సులందించారు .

  నేను రాస్తున్న గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3గ్రంధాన్ని శ్రీ బండారు డాక్టర్ దంపతులకు అంకితమిస్తున్నాం . దీనికి ముద్రణ ఖర్చుకు స్పాన్సర్ శ్రీ ఎల్లాప్రగడ రామ మోహన రావు గారు . ఈ విషయాలు ముచ్చటించుకొని సరసభారతి కార్యక్రమాలు తెలియ జేశాను . మా దంపతులం  డాక్టర్ దంపతులకు నూతన వస్త్రాలు సరసభారతి జ్ఞాపిక ,శివానందలహరి శ్రీ సువర్చలాన్జనేయ స్వామి చిన్న ఫోటో బహూక రించాము .మూర్తి దంపతులు మా దంపతులకు నూతన వస్త్రాలతో సత్కరించి ‘’ఘనమైన నగదు తాంబూలం’’అందజేశారు .రావు గారికి వారమ్మాయి శ్రీ లక్ష్మికి నూతన వస్త్రాలు మేము అందజేశాము సరస భారతిజ్ఞాపిక ,సువర్చలా మారుతి శతకం సువర్చలేశ్వర శతకం శ్రీ హనుమత్ కధానిధి శ్రీ ఆంజనేయ మహాత్మ్యం ,శివానంద లహరి చిన్న శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ఫోటో కానుకగా అందజేశాము . రావు గారు మా దంపతులకు నూతనవస్త్రాలు తాము తమ కూతురు కలిసి అందించారు .చాలా ఆత్మీయంగా మానసికానందంగా ఈ కార్యక్రమం జరిగింది .రావు గారు పెంచిన మొక్కలు మా వాళ్లకు ఆప్యాయంగా ఇచ్చారు .అందరి వద్దా సెలవు తీసుకొని బయల్దేరాం .

   దారిలో బాలాజీ ,దేవాలయం, శివాలయం దర్శించి ,మా అల్లుడి మేనత్తగారు శ్రీమతి లక్ష్మి, భర్త శ్రీ చీమలకొండ దుర్గాప్రసాద్ రావు దంపతుల ఇంటికి వెళ్లి చూసి పావు గంట ఉండి మా హరి ఇంటికి వెళ్లి అక్కడ వాళ్ళు చేసిన పూరీలలో ఒక్కటి మాత్రమే నేను తిని ఐస్ క్రీమ్ లాగించి మజ్జిగ తాగి ,అందరి టిఫిన్లు అయ్యాక  వాళ్ళు మాకు బట్టలు పెట్టి ఆశీర్వాదం తీసుకొన్న తర్వాత రాత్రి 8-30 లకు కారులో షార్లెట్ బయల్దేరాం అంటే కారీ  లో మేమున్నది కేవలం 23న్నర  గంటలు మాత్రమే .అయినా సత్కాలక్షేపం .ఇదంతా మా మైనేని గారి మహాత్మ్యమే .

   రాత్రి సరిగ్గా 11 గంటలకు షార్ల్లెట్ లో మా ఇంటికి చేరాం .రాగానే రావుగారికి ఫోన్ చేసి చెప్పి మైనేనిగారికి మా అబ్బాయి రమణకు మెయిల్ రాశాను .

 డా మాదిరాజు రామలింగేశ్వరరావుగారు మచిలీపట్నం నుండి మెయిల్ రాస్తూ అందులో తమ బంధువు ఒకరు ఒక భక్తి మాస  పత్రిక  నడుపు పుతున్నారని అందులో నేను రాసిన’’ సిద్ధ యోగిపుంగవు’’లను సీరియల్ గా ప్రచురించాలని భావిస్తున్నారని అనుమతిస్తే అక్టోబర్ సంచిక నుంచి అవి ధారావాహికంగా ప్రచురిస్తారని చెప్పారు . సంతోషంగా అంగీకరిస్తున్నానని  జవాబు రాయగా వెంటనే వారు ధన్యవాదాలు తెలియ జేశారు .

  మరొక ముఖ్య విషయం కేంద్ర మంత్రి వర్గ పునర్వ్యవస్తీకరణలోశ్రీ పరకాల ప్రభాకర్ భార్య కేంద్ర మంత్రి  శ్రీమతి నిర్మలా సీతారామన్   గారిని రక్షణ మంత్రిగా ప్రధాని మోడీ నియమించటం  ఊహించని పరిణామమే కాదు సమర్ధతకు పట్టాభిషేకం .70 ఏళ్ళ స్వాతంత్ర ఆనంతర భారత దేశం లో మొట్టమొదటి సారిగా మహిళకు డిఫెన్స్ పదవి ఇవ్వటం  అపూర్వ మైన గర్వించదగ్గ విషయం . నిర్మల గారు తెలుగు తమిళ రాష్ట్రాల కోడలు కూతురు .ఈ పదవిలో సమర్ధత చూపి రాణించాలని అభినందిస్తున్నాను .

  ఈ  వీక్లీ  ఇంతటితో సమాప్తం

  మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -4-9-17 -కాంప్ -షార్లెట్-అమెరికా

  .

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.