వీక్లీ అమెరికా -24 (4-9-17 నుండి 10-9-17 వరకు )
పిక్నిక్ ,ఫెసివల్ ఆఫ్ ఇండియా వారం
4-9-17 సోమవారం -వేసవి సెలవులతర్వాత మా అమ్మాయి మళ్ళీ ఇంట్లో ఆగస్టు 27 ఆదివారం నుండి తెలుగు క్లాసులు ప్రారంభించింది .మా అల్లుడు 28 ఆగస్టు ఇండియా కు కాకినాడలోభాద్రపద శుద్ధ ద్వాదశి నాడు ఆయన తండ్రిగారి ఆబ్దీకం పెట్టటానికి బయల్దేరి వెళ్ళాడు . తర్వాత తిరుపతి ,తిరువన్నామలై సందర్శించి 15 వ తేదీకి తిరిగి షార్లెట్ చేరతాడు
5-9-17 మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవం నాడు మా కోట గురువరేణ్యుల గురుపూజోత్సవాన్ని ఉయ్యూరులో నిర్వహించటం గురుపుత్రులు శ్రీ కోట సీతారామాంజనేయులుగారు వారి కజిన్ శ్రీ కోట సీతారామ శాస్త్రిగారూ హాజరవడం పేద ప్రతిభగల విద్యార్థులకు శ్రీ మైనేని గారు గురు భక్తితో ఏర్పాటు చేసిన రెండు 10 వేల రూపాయల నగదు బహుమతులను ,గురుపుత్రులు తాముఏర్పరచిన తమ తలిదండ్రుల స్మారక నగదు బహుమతి 10 వేల రూపాయలు ,శ్రీ వేమూరి సదాశివ తమతల్లి గారు కీశే శ్రీమతి దుర్గ గారి జ్ఞాపకార్ధం అందజేసిన 5 వేల రూపాయలు అర్హులకు అందజేయించి ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా 10 మంది ఉపాధ్యాయులకు సన్మానం చేసిన సంగతి మీ కు తెలిసిన ,తెలిపిన విషయమే .
ఇవాళ శ్రీ అనంత పద్మనాభ చతుర్దశి సందర్భంగా శ్రీ రాంకీ భార్య శ్రీమతి ఉష ఇంటి వద్ద నోము నోచుకోని ,అట్లు వాయనం తెచ్చి మా శ్రీమతికి ఇచ్చి చీరె జాకెట్ ,;;ఘ నగదుతాంబూలం ‘’ఇచ్చి నాకూ బట్టలు పెట్టి ఆశీర్వాదం పొంది వెళ్ళింది .ఇక్కడున్నా సంప్రదాయాన్ని ఆమె అంత శ్రద్ధగా పాటిస్తోంది . అభినందనలు .పట్టుబట్టను ‘కాశా బోసి’’గా మన ఇళ్లవద్ద పెద్ద ముత్తైదువులు కట్టుకొనే తీరులో కట్టుకొని ముఖాన పెద్ద కుంకుమ బొట్టు తలలో పూలు చేతులనిండా గాజులు ,చేతులకు గోరింటాకు తో వాయనం ఇవ్వటం చూస్తే సాక్షాత్తు అమ్మవారిని చూసినట్లు అనిపించింది మా ఇద్దరికీ .మనసులో ఎంతో అభినందించాముశ్రీమతి ఉషను .
బుధవారం -విహంగ మహిళా వెబ్ మాసపత్రిక సెప్టెంబర్ సంచికకు వ్యాసం రాసి పంపాను ..రాత్రి మా మనవడు చి సంకల్ప్ చికాగో నుంచి ఫోన్ చేసి కొత్తకారు కొన్నానని మంచి రోజు చెబితే ఇంటికి తెచ్చుకొంటానని అంటే గురువారం బాగుందని చెప్పాను .
గురువారం ఫ్లారిడా లో ఇర్మా తుఫాను భీభత్సం సృష్టించింది .ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు .దానితో పెట్రోల్ డీజల్ ధరలు పెరిగాయి . బంకుల వద్ద కార్ల క్యూలు అంతులేకుండా ఉంది భయం తో అవసరమైన వస్తువులను కొని దాచుకొంటున్నారు .
శుక్రవారం -మౌంట్ సోమా నుండి అక్కడి శివాలయ పురోహితులు శ్రీ ప్రసాదావధాని గారి భార్య శ్రీమతి అనసూయ గారు ఫోన్ చేసి ‘’బాబాయ్ గారూ !మీరు షార్లెట్ వచ్చి 5 నెలలు దాటింది ఒక్కసారికూడా మౌంట్ సోమాకు రాలేదు .మావారు ‘’గబ్బిట వారు ఇంతవరకూ రాలేదే ‘’అని అంటున్నారు వీలు చూసుకొని తప్పకరండి ;;అన్నారు .సరే అన్నా
కిందటి శనివారం శ్రీ రఘు గారింట్లో రుద్రాభిషేకం నాడు రుద్రం బాగా చదివింది అని నేను మెచ్చుకొని బహుమతి పంపిన శ్రీమతి కాకాని లక్ష్మి ఫోన్ చేసి త్వరలో ఇంటికి వచ్చి కలుస్తాను ‘’అన్నది .సంతోషం అన్నాను
సాయి సెంటర్ వారి పిక్నిక్
ఇక్కడి సాయి సెంటర్ వాళ్ళు అందరికి మంచి లొకేషన్ లో పిక్నిక్ ను 9-9-17 శనివారం మధ్యాహ్నం నుంచి ఏర్పాటు చేశారు . అందరం ఉదయం 11-45 కు బయల్దేరి రమణ కోచింగ్ సెంటర్ నుంచిమా మనవడు శ్రీకేత్ ను పికప్ చేసుకొని వాడిని డౌన్ టౌన్ లో ఉన్న ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వద్ద దింపి పిక్నిక్కు చేరేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అయింది .అప్పుడే అందరూ భోజనాలు ప్రారంభించ బోతున్నారు .పులిహోర ,రవ్వలడ్డు పెరుగన్నం ,అరటి,ద్రాక్ష పళ్ళు,చిప్స్ ,పళ్ల ముక్కలు తో భోజనం .
తర్వాత పిల్లలకు సర్టిఫికెట్స్ ఇచ్చారు . తర్వాత పిల్లలకు ఆటలపోటీలు ,పెద్దలకు నడక . నేనూ పవన్ కలిసి కాసేపు తిరిగాం . ఆతనిని అంపైర్ గాపెట్టుకొని పిల్లలు క్రికెట్ ఆడారు .మా మనవడు చి పీయూష్ టీమ్ 30 పరుగులు చేసి గెలిచింది . మావాడుఅందులో 18 పరుగులు చేసి మాన్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యాడు .మెచ్చిన నేను వాడికి ఇంటివద్ద 10 డాలర్లుబహుమానంగా ఇచ్చాను . పురాతత్వ సంస్థలో పని చేసిన మా రెండవ బావగారి చెల్లెలు శాంతగారబ్బాయి రాంబాబు చిరివాడ వెళ్లాడని ,అక్కడ వేలూరాయన చేసిన విగ్రహాలుపాడు పడి ఉంటె ,చూడలేక హైదరాబాద్ లో తన ఇంటికి తీసుకు వెళ్లి భద్రపరచాడపవన్ చెప్పాడు .ఈయన అన్నగారు శ్రీ వేలూరి రాధాకృష్ణ ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారులు .భోపాల్ లో ఉండేవారు . మా కాలిఫోర్నియా మేనల్లుడు శాస్త్రికి ఈ విషయం రాసి ఆ శిల్పి చరిత్ర తెలుసుకొంటే ఆయన గురించి ఒక ఆర్టికల్ రాస్తానని చెప్పా . వెంటనే స్పందించి ఆ ప్రయత్నం లో ఉంటానని సమాధానమిచ్చాడు . సాయంత్రం అందరికి టీ ఏర్పాటు చేశారు . ఇక్కడి ఐటెమ్స్ సాయి భక్తులు ఇళ్లవద్ద తయారు చేసి తెచ్చినవే . ఎవరి వద్దా డబ్బు తీసుకోవటం ఈ సెంటర్ కు అలవాటు లేదు అందరూ వాలంటీర్ గా సేవలు అందించటమే .
వనవిహారం నుండి సాయంత్రం 4 కు బయల్దేరి రాంకీ తమ్ముడు పవన్ భార్య శ్రీమతి పద్మజ వద్ద మా మనవాళ్ళు అశుతోష్ ,పీయూష్ లు సంగీతం క్లాస్ కు తీసుకొచ్చాము .పవన్ మాటల సందర్భంగా మోపిదేవి శ్రీ సకలేశ్వర స్వామి ఆలయం వారి అడుసుమిల్లి వంశం వారిదేనని చెప్పాడు .ఆతను తీసిన శిలా ఫలకం ఫోటో నాకు పంపాడు .. ఇంటికి వచ్చేసరికి రాత్రి 7 అయింది .ఉయ్యూరులో మా గురు పుత్రుడు నా సహాధ్యాయి వేమూరి దుర్గయ్య అన్నకామేశ్వరరావు కుమార్తె శ్రీమతి లక్ష్మి మా అమ్మాయి కి మంచి స్నేహితురాలు .వాళ్లబ్బాయిని తండ్రిశ్రీమోహన్ పిక్నిక్ వద్ద దింపి మాకు అప్పగించి వెళ్ళాడు . రాత్రి 8 కి వచ్చి కాసేపు కబుర్లు మాట్లాడి కుర్రాడిని తీసుకు వెళ్ళాడు .
భారత మహోత్సవం
షార్లెట్ లో నిన్నా ఇవాళ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా -భారత మహోత్సవం జరిగింది .ఒక సంతలాగా తిరునాళ్ళు లాగా జరుగుతుంది .అయిదేళ్లక్రితం చూసాం . అప్పుడు మా బావమరిది పెయింటింగ్ లు ప్రదర్శనకు పెట్టాం నేనూ మా అమ్మాయి మా అమ్మాయి స్నేహితురాలు నాగలక్ష్మి భర్త కలిసి .అంతా చూసి బాగున్నాయని మెచ్చినవారేకాని ఒక్కరూ కొనే సాహసం చేయలేదు .’’శ్రమ మెప్పు ఫుల్ ఆదాయం మాత్రం నిల్’’ .
10 వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అందరం బయల్దేరి ఈ సంతకు వెళ్లాం మనిషికి 7 డాలర్లు టికెట్ . పదేళ్ల లోపు పిల్లలకు ఫ్రీ . అక్కడే ఉన్న బెల్క్ ధియేటర్ లో నృత్య ప్రదర్శనలు నాన్ స్టాప్ గా జరుగుతాయి భారత దేశం లోని అన్ని రకాల నృత్య రీతులను పిల్లలు ,పెద్దలు ఇక్కడ ఉత్సాహంగా ప్రదర్శించారు .ఒకరకంగా సాంస్కృతిక భారత దేశ దర్శనం చూడగలుగుతాం -మినీ ఇండియా చూసిన అనుభూతి ఉంటుంది .బయట మాత్రం గుడారాలకింద బడ్డీకొట్లు లాంటి హోటళ్లు అన్నిరకాల చిరు తిళ్ళు ,ఇడ్లీ దోసె పునుగు గారే బజ్జీ ,పూరీ చపాతి , సహా అన్నీ అక్కడికక్కడే తయారు చేస్తారు. జనం ఆబగా కొని ఇదివరకు ఎప్పుడూ ఎక్కడా తినలేదేమో అన్నంత గా తినటం ఆశ్చర్య మేస్తుంది . ఈ బయటి’’ కొట్లు ‘’ సంత లాగా తిరునాళ్ల లాగా అని పిస్తుంది . అనేక రకాల చీరెలు చుడీదార్లు డ్రెస్ మెటీరియల్స్ ,నగలు కూడా అమ్ముతారు .
ఆరుబయట కూడా ఒక వేదిక ఉంటుంది .దానిపైనా ఉదయ సాయంకాలాలలో మధ్యాహ్నం కూడా రాజస్థానీ మరాఠీ ,పంజాబీ ,గుజరాతీ నృత్యాలు పెద్దలూ పిన్నలు చక్కగా చేస్తారు . ధియేటర్ లో జనం ఎప్పుడూ నిండుగా ఉంటారు . పవన్ పెద్దకూతురు ,ధియేటర్ లో డాన్స్ బృందంతో డాన్స్ చేస్తే రాంకీ తమ్ముడికూతురు బయట డాన్స్ చేసింది .పెద్దలకు ఇదొక పెద్ద పండగ .. పిల్లల్ని హుషారుగా తీసుకు వెళ్ళటం తరిఫీదు ఇప్పంచటం ,చేయించటం ,పిల్లలు అంత ఉత్సాహం గా డ్రెస్ తో చేయటం గొప్ప విషయం . వాళ్ళ ఎనర్జీ ప్రవాహానికి హాట్స్ ఆఫ్ అని పిస్తుంది . దీనికి భారత ప్రధాని రాజీవ్ గాంధీ గొప్ప ప్రోత్సాహమిచ్చాడు .శ్రీమతి పుపుల్ జయకర్ ఆయనకు సలహాదారుగా ఉంటూ అన్నిదేశాలలో ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఘనంగా జరగటానికి బాగా తోడ్పడింది
ఈ రోజు ఉదయం దర్శనీయ శివాలయాలు లో 72 వ ఆలయంగా మోపి దేవి’’శ్రీ గంగా పార్వతీ సమేత స్వయంభుశ్రీ సకలేశ్వర దేవస్థానం ‘’గురించి రాశాను .
మా పెద్ద తోడల్లుడు శ్రీ శంభుని శ్రీ రామ చంద్ర మూర్తిగారి పెద్దబ్బాయి ఫ్లారిడాలో ఉద్యోగం చేస్తున్న రవి భార్య ,పిల్లాడితో ఫ్లారిడానుండి మూడు రోజుల క్రితం అట్లాఅన్టా వచ్చి ,ఇవాళ మౌంట్ సోమా వెళ్లి స్వామిని దర్శించి రాత్రి7 గంటలకు మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చాడు . ఈ వీక్లీ ఇంతటితో సమాప్తం .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -10-9-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
—