భక్త పురందర దాసు
‘’దాసరేంద్రే పురందర దాసరాయ ‘’-దాస భక్తులలో పురందరదాసు శ్రేష్ఠుడు’’అని గురువు వ్యాసతీర్థులవారి ప్రశంస అందుకున్న భక్త శిఖామణి పురందర దాసు .సంగీత కర్త ,కవి అయిన వాగ్గేయకారుడు .కర్ణాటక సంగీతానికి ఆద్యుడు అందుకే ‘’కర్ణాటక సంగీత పితామహ ‘’అని పురందరదాసు ను గౌరవంగా సంబోధిస్తారు .నారద మహర్షి అపర అవతారమనీ అంటారు దాసు ను .
‘’ నవకోటి నారాయణ
క్రీశ. 1484 లో కర్ణాటకలోశివమొగ్గ జిల్లా తీర్ధ హళ్లి లో సంపన్న వర్తక కుటుంబం లోవరదప్ప నాయక ,లీలావతుల ఏకైక కుమారుడుగా పురందరదాసు జన్మించాడు .తిరుమల శ్రీనివాసుని దయ వలన జన్మించినందున శ్రీనివాస నాయక్ అని పేరుపెట్టారు ఆయన స్వగ్రామం ‘’పురందర ఘట్ట ‘’.అంటారు . సంప్రదాయ విధానం లో కన్నడ ,సంస్కృతాలతోపాటు సంగీతమూ అభ్యసించాడు 16 ఏళ్లకే సరస్వతీ బాయి తో వివాహమైంది 20 వ ఏట తలిదండ్రులు చనిపోయారు ఆస్తి సంపదకు ఏకైక వారసుడయ్యాడు పురందరదాసు .సంప్రదాయంగా వచ్చిన రత్న మాణిక్య వడ్డీ వ్యాపారం లో ఇబ్బడి ముబ్బడిగా సంపాదించి కోట్లకుపడగలెత్తి ‘’నవకోటి నారాయణ ‘’అని ప్రసిద్ధి చెందాడు
సర్వస్వము త్యాగం చేసిన దాసు .
క్రమంగా సంపాదన ఆస్తి డబ్బు లపై వ్యామోహం తగ్గింది .భౌతిక సుఖాలు శాశ్వతం కాదు అని తోచింది . ఈ భావాన్ని మరింత బలపరచాడు శ్రీనివాసుడు పేద బ్రాహ్మణ రూపం లో రూపం లో కనిపించితన కుమారుని ఉపనయనానికి ధన సహాయం చేయమని కోరాడు. ఎవరికీ చిల్లి గవ్వ కూడా ఇవ్వటానికి ఒప్పుకొని ఆ పిసినారి నవకోటి నాయకుడు ఎంతబ్రతిమిలాడినా కనికరించలేదు .గత్యంతరం లేక బాపడు అతని భార్యకు తన డబ్బు అవసరాన్ని చెప్పాడు .దయామయి అయిన భార్య సరస్వతి తన ముక్కు కున్న ముక్కు పుడకను తీసి భర్తకు తెలియకుండా బ్రాహ్మణుడికి ఇచ్చిపంపింది . తాను ఇచ్చింది సాక్షాత్తు శ్రీనివాసుడి కే అని ఆమెకు తెలియదు ఆ ముక్కుపుడకను పురందరదాసు నగల దుకాణం లో నే అమ్మాడు బ్రాహ్మణుడు . అది తన భార్య నగ అని గ్రహించిన దాసు .హడావిడిగా ఇంటికి వచ్చి భార్యను గద్దించాడు .తనకు భర్త చేతిలో అవమానం తప్పదని పాలలో విషం కలిపి తాగ టానికి నోటిదగ్గర పెట్టుకోగానే అందులో తన ముక్కుపుడక కనిపించింది. భర్తకూడా ఆశ్చర్యపోయాడు ఆ పేద బ్రాహ్మణుడికోసం వెతి కారుకాని జాడ లేడు ఇదంతా భగవల్లీల అం తన భార్యను కాపాడినవాడు సాక్షాత్తు తిరుమల శ్రీనివాసుడే నని గ్రహించి తప్పు తెలుసుకొని సంపదమీద ఎక్కువ దృష్టిపెట్టటం వలన జరిగిన అనర్ధం అని గ్రహించి 30 వ ఏటనే తన సంపదనంతా త్యాగం చేసి పరమ భక్తుడై హరిదాసుడై భాగవతోత్తముడైనాడుపుణ్యపురుషుడు పురందరదాసు
వ్యాస తీర్థుల శిష్యరికం
కృష్ణదేవరాయల రాజగురువు వ్యాస తీర్థులవారి దర్శనం వలన మార్గం సుగమం అయి శిష్యుడై పురందరదాసు నామం తో40 వ ఏట ప్రసిద్ధుడయ్యాడు విజయనగర ఆస్థానం లో తన భక్తికీర్తనలు గానం చేసి రాజుతో సహా అందరి మెప్పూ పొందాడు .
4 లక్షల 75 వేల కీర్తనలు
హంపీ చేరి ఒక మండపం లో ఉంటూ చివరి జీవితాన్ని గడిపాడు దాదాపు 4 ,లక్షల 75వేల కీర్తనలు రాసిన పరమభక్తుడుపురంధరదాసు మిగిలిన 25 వేల కీర్తనలూ రాసి తాను అనుకొన్న 5 లక్షల కీర్తనలు పూర్తి చేయమని చిన్న కొడుకు’’మధ్వ పతి’’ ని కోరాడు. తాను ఈ జన్మలో అంతటి పని చేయలేనని మరోజన్మలో రాసి తండ్రి కోరిక తీరుస్తామని అన్నాడు .అతడే తర్వాత కర్ణాటకలో రాయపూర్ జిల్లా చీకలపర్వి లో ‘’విజయదాసు ‘’గా జన్మించి తండ్రికి వాగ్దానం చేసినదానిప్రకారం 25 వేల కీర్తనలు శ్రీ లక్ష్మీ నారాయణస్వామిపై రచించి తండ్రికిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు .అందుకే ఆయనను నారదావతారం అన్నారు .త్యాగరాజ స్వామి త’’ ప్రహ్లాద భక్త విజయం’’ గేయ నాటకం లో పురందర దాసును ప్రస్తుతించారు ఆయన నివసించిన మండపాన్ని పురందర మండపం అంటారు
మాయామాళవ రాగ సృష్టికర్త
.. .
.ఆధ్యాత్మిక వేత్తలైన వారికి మాత్రమే బోధపడే శ్రీ మద్ భాగవతాన్ని సుందర సరళతరమైన శ్రావ్యమైన పాటలు గా రాసి సామాన్యులకు కూడా భాగవత పరమార్ధాన్ని తెలియ జేశాడు .కర్ణాటక సంగీతం లో వ్రేళ్లమీద లెక్కింపదగిన వాగ్గేయకారుడిగా గుర్తింపుపొందాడు .స్వరావళి ,అలంకారాలతో సంగీతానికి శోభ సమకూర్చాడు .’’మాయా మాళవ’’ రాగాన్ని సృష్టించి సంగీతం నేర్చుకొనే వారికిమొట్టమొదట పాడుకోవటానికి సులభంగా ఉత్సాహ జనకంగా వరప్రసాదంగా అందుబాటులోకి తెచ్చాడు .ఇప్పటికీ ప్రారంభదశ లో సంగీతం నేర్చుకొనేవారికి వారికి ఈ రాగ0 లోనే సంగీతం బోధించే సంప్రదాయం కొనసాగుతోంది స్వరావాలి ,జంటస్వరాలు ,అలంకారాలు ,లక్షణ గీత ,ప్రబంధాలు యుగభోగాలు ,దాటువరస గీతాలు ,సూలాది మొదలైనవి రాశాడు .ఏదిరాసినా భావ రాగ లయ సమ్మేళనం తో విరిసిన పుష్పంగా కీర్తన శోభిల్లుతోంది .లక్షలాది కీర్తనలు రాసినా లభించి ప్రాచుర్యం లో ఉన్నవి 700 మాత్రమే .
కర్ణాటక సంగీత పితామహ
పురందర దాసు భక్తి ఉద్యమం లో దాస సాహిత్యాన్ని పారిపోషించి వ్యాప్తి చెందించాడు .తనకన్నా చిన్న వాడైనభక్త కనక దాసుకుపురందర దాసు సమకాలికుడు .. కన్నడం లో చాలా క్ర్తనలు రాసినా సంస్కృతం లోనూ పురందరదాసు కృతులు రాసి కీర్తి గడించాడు .ఆయన కృతులలో ‘’పురందర విఠల ‘’అనేది అంకిత ముద్ర గా ఉండటం విశేషం హిందూస్తానీ సంగీతం పై తీవ్రప్రభావం కలిగించాడు పురందరదాసు ఉత్తరాది మహా సంగీత విద్వా0సుడు తాన్సేన్ గురువు స్వామి హరిదాసు పురందరదాసు శిష్యుడే .ఈ భక్త కవి శేఖరుడు 2-1-1564న 80 ఏళ్ళవయసులో పురందర విఠలుని చేరుకొన్నాడు
ఆధునికకాలం లో బిడారం కృష్ణప్ప పురన్దరదాసు కీ ర్తనలను గానం చేస్తూ బహుళ వ్యాప్తిలోకి తెచ్చాడు .ఏం ఎల్ వసంతకుమారి భీం సేన్ జోషీ లు కూడా పురందరదాసు కీర్తనలను పాడి పట్టాభిషేకం చేశారు .తిరుమలలో పుర0దరదాస విగ్రహం ప్రతిష్టించి గౌరవించారు .బెంగళూర్ లో పురందర దాస ట్రస్ట్ ఏర్పడి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది .పుష్య బహుళ అమావాస్య నాడు పురందరదాసు ఆరాధనోత్సవం ఘనం గా నిర్వహిస్తున్నారు . కర్ణాటక సంగీత పితామహుడు పురందరదాసు అందరికి ఆరాధనీయుడే .
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -22-9-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
—