వీక్లీ అమెరికా -26 (18-9-17 నుండి 24-9-17 వరకు )-1
57 వ సుందరకాండ ,3 రుద్రాభిషేకాలు 4 భోజనాల వారం -1
18-9-17 మా శ్రీమతి ప్రభావతి 72 వ పుట్టిన రోజు . మా అమ్మాయి కొత్త చీర జాకెట్ కొని పెట్టింది .మా అమ్మాయి అల్లుడు లకు, మనవలు ముగ్గురికి దసరా కానుకగా నగదు ఇచ్చి కావలసినవి కొనుక్కోమన్నాం ..ఆధునిక ప్రపంచానిర్మాతలు డిటిపి చేసి ప్రకాష్ గారు పంపిన 151-200 పేజీలలో తప్పులు దిద్ది వెంటనే పంపేశాను .
మంగళవారం -.రమణ ఫోన్ చేసి ప్రక్కనున్న మల్లికాంబగారబ్బాయి మోహన్ తో కూడా మాట్లాడించాడు . .
21-9-17 -గురువారం -శరన్నవరాత్రులు దసరా ప్రారంభం . ఉదయం మామూలు పూజతోబాటు మహాన్యాసం తో దశశాంతి సామ్రాజ్య పట్టాభిషేకంలతో రుద్రాభిషేకం శివ అష్టోత్తర శతనామ ,బిల్వాష్టోత్తరం తో పూజ చేశాను . మైనేనిగారు సూచించిన దానిప్రకారం గీర్వాణం -3 అంకితం స్పాన్సర్ ఆర్టికల్స్ రాసి మా శర్మకు పంపి మొత్తం ఫైల్ తయారు చేయమని రాశాను
52 ఏళ్ళ క్రిందటి శిష్యురాలి పరిచయం
గురువారం సాయంత్రం డా ఫణిమోహన్ డా శ్రావ్య దంపతుల ఇంట్లో నవరాత్రి సందర్భంగా శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణకు మమ్మల్ని ఆహ్వానించగా సాయంత్రం 6 గం కు, డా ఫణిమోహన్ గారు మమ్మల్నిద్దర్నీ కారులో వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్లారు .ఫణిగారిది ఖమ్మం .మా పెద్ద తోడల్లుడు మూర్తిగారి పెద్దబ్బాయి రవికి అక్కడ క్లాస్ మేట్ .వాడు ఇక్కడికొచ్చినప్పుడు తప్పక వీళ్ళింటికి వెడతాడు . వారం క్రితం వచ్చినప్పుడు రవి దంపతులు వెళ్లి చూసొచ్చారు . రాత్రి 7 గం లకు డా శ్రావ్యగారి స్నేహితురాండ్రు అయిదు కుటుంబాలవారు వచ్చి ముందుగా పాటలుపాడి తర్వాత పారాయణ చేశారు మళ్ళీ కొన్ని కీర్తనలు పాడారు .నేను 10 నిమిషాలు లలితా నామ విశిష్టత పై మాట్లాడాను . మాటల సందర్భంగా అమ్మవారి ‘’లావణ్యం ‘’గురించి చెబుతూ లవణం అంటే ఉప్పు అనీ అది స్పటికంగా ఉన్నప్పటి మెరుపు ను లావణ్యం అంటారనీ చెప్పాను ఇంతలో పాటలు పాడిన అమ్మాయి నాపేరు లావణ్య అన్నది .పైన నాలాగే ‘’పీఠాధిపతి’’ అంటే కింద కూర్చోలేక కుర్చీలో కూర్చున్నావిడ ‘’మా అమ్మాయే నండీ ‘’అన్నది .అప్పుడు ఎవరు ఏమిటి ఎక్కడి వారు అనే ప్రశ్నోపనిషత్ ప్రారంభమై ఆతల్లి కృష్ణాజిల్లా పెదప్రోలు ఆవిడని పసుమర్తి వారి ఆడబడుచుని కూ చిభోట్ల వారి కోడలని విషయం బయట పడింది. అప్పుడు నేను 1963లో మోపిదేవి హై స్కూల్ లో నా ఉద్యోగం ప్రారంభించి 65 వరకు పని చేశానని పెద ప్రోలులో కాపురం ఉండేవాడినని అనగానే ఆవిడ ‘’మాస్టారూ !మీరు సైన్స్ మా స్టర్ దుర్గా ప్రసాద్ గారేనా ?“‘అని ఆశ్చర్యం గా అడిగితె ఔనన్నాను .అప్పుడు అక్కడి పసుమర్తి సీతారామ శర్మగారు సోషల్ మాష్టారని నన్ను ,లెక్కలమేస్టర్ స్వర్గీయ జె వి రమణా రాప్ గారిని శర్మగారింట్లో ‘’నెలరోజులు పెళ్లి కొడుకులను మేపి నట్లు మేపారని’’అనగానే ,ఆవిడ ‘’మేష్టారు !నేను పసుమర్తి లక్ష్మిని అందరూ పి .లక్ష్మి అనిపి ల్చేవారు .మీ దగ్గర ట్యూషన్ కూడా చదివాను శర్మగారి చెల్లెలు దుర్గతోపాటులాంతర్లు తీసుకొని రాత్రి ట్యూషన్ కు వచ్చేవాళ్ళం ‘’అని పాత జ్ఞాపకాల తేగల పాదు తవ్వింది . కావలసినన్ని కబుర్ల రుచికరం విషయాల తేగలన్నీ బయట పడ్డాయి .నాకు లెక్కలమేష్టారికీ వీపులు రుద్ది తలంట్లు పోశామని తానూ నా సైకిల్ వెనక ఎక్కి పెదప్రోలు నుంచి మోపిదేవి స్కూల్ కు వచ్చేదాన్నని లెక్కలమాస్టారి బైక్ మీద దుర్గ ఎక్కి వచ్చేదని గుర్తు చేసింది ఎందుకో నాకు లక్ష్మి అసలు జ్ఞాపకం రాలేదు . పెదప్రోలు లో శర్మగారి బాబాయి గారమ్మాయట ఈమె సుబ్రహ్మణ్యం చెల్లెలట .మణ్యమూ జ్ఞాపకం రాలేదు .శర్మగారి తమ్ముడు భగవంతం మోపిదేవి పూజారి కొడుకు సుబ్బయ్య ,లొల్లా వారు కరణంగారు సాయి నళినీ జయంత్ మండవ వెంకటేశ్వరరావు అనే మార్క్సిస్టు పార్ట్ నాయకుడి కూతురు ,అడివి శ్రీరారమ మూర్తి కృత్తివెంటి మాధవ అందరూ గుర్తున్నారు ఈ లక్ష్మి మాత్రం గుర్తులో లేనే లేదు . మాధవ తమ్ముడు శ్రీనివాస్ ఇప్పుడు కేంద్ర సాహిత్య అకాడెమీ సెక్రెటరీ అని జ్ఞాపకం చేసుకున్నాం అప్పుడు లక్ష్మి 6 ,7 తరగతులు చదివి ఉంటుంది మా క్లాసులు 8 . 9, 10 తరగతుల బోధన.అందుకే గుర్తు లేక పోయిఉండచ్చు .సాధారణం గా నాకు నాదగ్గర చదివిన పిల్లలెవరైనా గుర్తే వుంటారు ఒకవేళ మర్చిపోయినా వాళ్ళు జ్ఞాపకం చేస్తే వెంటనే ‘’బల్బు వెలుగుతుంది ‘’ లక్ష్మి విషయం లో ఎన్ని సార్లు స్విచ్ వేసినా బల్బ్ వెలగలేదు .ఆ అమ్మాయికి అన్నీ జ్ఞాపకం ఉన్నాయి .నాకే లేవు ఇది తమాషా .
ఇది అవగానే అక్కడ భోజనం ఏర్పాటు .ఆవడ, గారే పులిహోర రవ్వకేసరి వంకాయ కూర,ఆలూ ఫ్రయ్ , అల్లం చట్నీ దోసావకాయ ,పాయసం ,ముక్కలపులుసు ,అప్పడం పెరుగు తో చాలా కమ్మటి భోజనం కడుపు నిండా తిన్నాను ముక్కలపులుసు అదరహా అంత బాగుంది . శ్రావ్యగారు కొసరి కొసరి వడ్డించి తినిపించారు . తర్వాత మళ్ళీ పాట కచేరి .శ్రీమతి పద్మజ ఆమె ఆడబడుచు ,లావణ్య ,శ్రావ్య అమ్మవారిపై చక్కగా శ్రావ్యంగా పాటలు పాడారు .అందరం గ్రూపు ఫోటోలు తీసుకొన్నాం . నేను ఒకఫోల్డర్ ‘’పసుమర్తి లక్ష్మి ‘’అని పెట్టి తీసిన ఫోటోలన్నీ అందులో పెట్టాను . శ్రావ్య గారింట్లోనే మొదటిసారి వాళ్ళ అమ్మ నాన్నల షష్ఠి పూర్తికి వెళ్ళినప్పుడు శ్రావ్య అమ్మమ్మ గారు పరిచయమైనారు ఆమె మా గురువుగారు స్వర్గీయ మహంకాళి సుబ్బరామయ్య గారి తమ్ముడి భార్య .ఆ ఉదంతం అంతా ఇదివరకె వీక్లీ లో కుక్కేశాను .ఆ ఉత్సవం లో లక్ష్మీ పిల్లా జిల్లా వచ్చారట .కానీ అప్పుడు పరిచయం కాలేదు ఆడో తమాషా .
శుక్రవారం -ఈ రోజు నుంచి విజయదశమి వరకు 57 వ షార్లెట్ లో 3 వ శ్రీ సుందరకాండ 9 రోజుల పారాయణ ప్రారంభించాను .. ‘’ కర్ణాటక సంగీత పితామహ పురందరదాసు ‘’ఆర్టికల్ రాశా
ఉదయం పారాయణ తర్వాత చల్లపల్లి -పెదప్రోలు మధ్య ఉన్న కప్తాను పాలెం లో ఉంటున్న నా 52 ఏళ్ళ పూర్వపు శిష్యుడు అడవి శ్రీరామమూర్తికి ఫోన్ చేసి పసుమర్తి లక్ష్మి పరిచయమైన సంగతి చెప్పా వాడు చాలా సంతోషించాను వాళ్ళమ్మగారితోనూ మాట్లాడా ఆవిడ నాకు కొన్ని నెలలు అన్నం వండి పెట్టారు వాళ్ళింటికే వెళ్లి రెండు పూట్లా తినేవాడిని ఆ మహా తల్లిని నేను జీవితాంతం మరువ లేను . వాళ్ళు వండిపెట్టిన దానికి నేను వాళ్ళకేమైనా ధనరూపం లో ఇచ్చిన దానికీ సరిపోల్చలేను .సిగ్గుతో నేనే తలవంచు కోవాలేమో . అంతటి ఉన్నత హృదయం ఆమెదీ భర్త గారిదీ .కొడుకుకు గురువు నేనుగనక నే భక్తి తో చేసిన సేవ ఎంత నేను వారికిచ్చినా ఆకుటుంబం ఋణం తీర్చుకోలేను శ్రీరామ మూర్తి తరచూ కనిపిస్తూనే ఉంటాడు ఉయ్యూరుకు సరసభారతి కార్యక్రమాలకూ వస్తోనే ఉంటాడు . మాధవతండ్రి చనిపోగానే బొంబాయి వెళ్లి ఉద్యోగం చేస్తూ తమ్ముళ్లను చెల్లెళ్లను పెంచి పోషిస్తూ తల్లిని ఆప్యాయంగా చూశాడు వాడూ ఒకటి రెండుసార్లు ఉయ్యూరు వచ్చాడు .మాధవ తమ్ముడే ఇప్పుడు అకాడెమి సెక్రెటరీ .ఒక తెలుగువాడు పొందిన అత్యున్నత గౌరవ0 న అది అందునా నా శిష్యుడి తమ్ముడవటం అతని చిన్న తనం నాకు తెలియటం ఈపదవిలో ఉంటూ తెలుగు రచయితల సభలో ఆతను పాల్గొనటం కిందటి సారి అంటే 2012 లో మేము అమెరికాలో ఇక్కడే ఉండగా ఆతను ఉయ్యూరు మాకోసం రావటం మా అబ్బాయి రమణ అతనికి ఆత్మీయ ఆతిధ్యం ఇచ్చి సరసభారతి పుస్తకాలు అందజేయటం వరుసగా గుర్తుకొచ్చాయి ఎక్కడ తీగో లాగితే ఎక్కడి డొంకో కదిలింది తీపి గుర్తుల పరిమళాలను వెదజల్లింది .
నేను చేయించిన 4 వ రుద్రం
23-9-17 శనివారం – కిందటినెల శ్రీ రఘు గారింట్లో రుద్రం చేయించినప్పుడే శ్రీమతి రంజని ‘’అంకుల్ !మీ రుండగానే మా ఇంట్లో రుద్రం మీతో చేయించుకోవాలని ఉంది తప్పకుండా చేయించాలి ‘’అని అడిగిందిసరే అన్నా . శనివారం మధ్యాహ్నం 3-30 కి మా అమ్మాయి మా ఇద్దర్నీ శ్రీ నాగరాజు శ్రీమతి రంజని దంపతుల ఇంటికి తీసుకెళ్లి దింపింది .అప్పటికే వాళ్ళు అంతా రెడీ గా ఉన్నారు . సాయిరాం సాయిరాం అంటూ అందరూ ఆహ్వానించారు . నాలుగున్నరకుప్రారంభించి గణపతిపూజ రుద్రవాహానా అష్టోత్తర సహస్రనామ లలితా అష్టోత్తర పూజ చేయించాను .రుద్రం చదివేవారు రాగానే లఘున్యాసం తో రుద్రం 5-30కి ప్రారంభించి ఏకాదశ రుద్రాభిషేకం సామూహికంగా చేయటం జరిగింది .రుద్రుడు ఎవరు అనే విషయం పై నేను కాసేపు ఆట్లాడాను -తర్వాత అక్కడ ఒకమ్మాయి పుస్తకం చూడకుండా రుద్రం జమాజెట్టీ లాగా మాతోపాటు చదువుతుంటే ఆశ్చర్యంపోయి ముచ్చట పడి ఆమెకు సరసభారతి తరఫున రఘుగారింట్లో కాకాని లక్ష్మికి ఇచ్చినట్లే 1 116 రూపాయలు సరసభారతి పుస్తకం ఇవ్వాలనిపించి మా అమ్మాయికి ఫోన్ చేసి డబ్బూ పుస్తకం తెమ్మని చెబితే తెచ్చింది .రుద్రం అవగానే శ్రీ కందుల రవీంద్ర గారిని ఆమె పేరు అడిగితె ఆమె కాకాని లక్ష్మి అని చెప్పారు అవాక్కయ్యాను .అప్పుడామె చీర కట్టుకొని పెనుగంచి ప్రోలు తిరుపతమ్మ తల్లిలాగా కనిపించింది ఇప్పుడు చిన్న పిల్ల లాగా డ్రెస్ లో ఉంది .నేను అసలు గుర్తు పట్ట లెకపొయాను . కనుక నేను ఇవ్వాలనుకున్న దాన్ని ఇంత కష్టపడి ఆడవారికి మగవారికి అత్యంత శ్రద్ధతో రుద్రం నేర్పుతున్న శ్రీ కందుల రవీంద్ర గారికే ఇవ్వాలని కొని ఆమాట చెప్పగానే అందరూ హర్షధ్వానాలతో హాలు మారు మ్రోగించారు ఒక సర్వ సమరదుడికి ఇస్తున్నామన్న సంతృప్తి కలిగి వెయ్యిన్నూట పదహారు రూపాయలుశ్రీ సువర్చలేశ్వర శతకం అందజేశాను చాలా వినమ్రంగా ఆయన అందుకున్నారు .ఇదేకార్యక్రమం మొదట్లో నాగరాజుగారికి ‘’మహిళా మాణిక్యాలు ,రవీంద్ర గారికి ‘’సిద్ధ యోగి పుంగవులు ‘’పుస్తకాలు అందజేశాను . మాకు కాకానిలక్ష్మి స్వీట్ పాకేట్ ఇచ్చి తాము డిసెంబర్ లో ఇండియా వస్తామని అప్పుడు ఉయ్యూరువచ్చి శ్రీ సువర్చలేశ్వర స్వామిని తప్పకుండా దర్శించుకొంటామని చెప్పింది .తర్వాత భోజనాలు -పూర్ణం బూరెలు పులిహోర ,పూరీలు కాస్టికం కూర ,చానామసాలా చట్నీ ,పులుసు ,పెరుగు వంటకాలు .నేను రెండు పూరీలు పులిహోరలో పెరుగు కలుపుకొని అయిందనిపించాను .ఈ కార్యక్రమానికి మా శిష్యురాలు పసు మర్తి లక్ష్మి కూడా వచ్చింది రెండో సారి చూశాను ఆమెతో ‘’మీ అమ్మాయికి మోపిదేవి సకలేశ్వరస్వామి గురించి మిగిలిన ఆర్టికల్స్ గురువారం శుక్రవారం మెయిల్ లో పంపాను చూశావా ‘’అని అడిగితె బంధువులారాకతో చూడలేదని చెప్పింది .డా ఫణి గారికీ పంపాను అప్పుడే .నేను రుద్రుని పై చెప్పిన విషయాలు చాలా బాగున్నాయని శ్రీ చక్రవర్తి గారు నా దగ్గరకొచ్చి తెలుగులోనే అభినందించారు భార్య నిండుగా నవ్వుతూ రెండు చేతులతో నమస్కరించారు అభినందనగా . రుద్రం బాగా చేయించానని అందరూ వచ్చి అభినందించారు నేను సభా ముఖంగానే ‘’నేను ఇందులో ప్రొఫెషనల్ కాదు .ఎవరి వద్దా నేను నేర్చుకోలేదు నాది శ్రుత పాండిత్యం .పుస్తకాలు చదివి నేర్చుకొన్నది మాత్రమే .నాకు గురువులెవరూలేరు .నేను మా ఇంటి దగ్గర ఎలా చేసుకొంటానో మా జిల్లాలో మా శివాలయం లో ఎలా చేస్తారో అలా చేయిస్తున్నాను ఇక్కడ ‘’అని చెప్పాను .నాగరాజు దంపతులు చాలాఆనందం పొంది దక్షిణ తాంబూలం ఇచ్చి ఆశీస్సులు మా ఇద్దరి వద్దా పొందారు ‘
రుద్రుడు ఎవరు
‘’ 2012 లో 5 ఏళ్ళ క్రితం మేము షార్లెట్ వచ్చినప్పుడు ఇక్కడ అంతా’’సత్యసాయి హవా ‘’బాగా ఉండేది .దాదాపు ప్రతివార0 ఎవరింట్లోనో ఒకరింట్లో భజన భోజనాలు చాలా వైభవంగా జరిగేవి .ఇప్పుడు సాయిని తిరగేస్తే వచ్చే ‘’ఈశ ‘’అంటే రుద్రాభిషేకం హోరు బాగా ఉన్నది దానితోపాటు వేద మంత్రం తరంగాలు షార్లెట్ ను పవిత్రీకరించటం ఆహ్వానింపదగిన విషయం ఇలాగే కొనసాగాలని కోరుతున్నాను .రుద్రం నేర్పేవాళ్ళు నేర్చుకొనే వారూ క్షుద్రమైన ఆలోచనలకు దూరంగా ఉండాలి .అప్పుడే భద్రత కలిగి అభద్రత తొలగిపోతుంది నిర్ణిద్ర స్థితి కలుగు తుంది . రుద్రుడు ఘోర రూపం లో నూ అఘోర రూపం లోనూ ఉంటాడు .
దేవతలే ఒక సారి రుద్రుని దర్శించి ‘’కో భవానీతి ?’’అంటే నువ్వు ఎవరవు”?అని అడిగితె రుద్రుడు ‘’నేను నిత్య అనిత్య ,పరబ్రహ్మను తూర్పు పడమర ,ఉత్తరం దక్షిణం ,ఆకాశం ,పాతాళం,ఉపదిశలూ నేనే .నేనే బ్రహ్మా0డం .నేనే స్త్రీ నేనే పురుషుడను నేనే సావిత్రి ,గాయత్రి ,సరస్వతి ,నేనే త్రిష్టుప్ ,అనుష్టుప్ ,జగతీ మొదలైన ఛందస్సులు నేనే గార్హపత్య ,దక్షిణాగ్ని ఆహవనీయఅగ్ని నేనే సత్యాన్ని నేను .జ్యేష్ఠుడిని శ్రేష్ఠుడిని,వరిష్ఠుడను నేనే నేనే జలం ,అగ్నీ కూడా రుక్ ,యజుస్ సామ అధర్వ వేదాలు నేనే .నాశనం కానీ సత్యాన్ని ,నాశనమయ్యే సృష్టి కూడా నేనే గూఢత్వ గోపనీయమూ నేనే .అరణ్యాలు పుష్కారాలూ నేనే పవిత్రమైనది అంతానేనే సృష్టికి మూలం మధ్యా అంతమూ నేనే ఉన్నదీ నేనే ,లేనిదీ నేనే .నేనే స్వయం ప్రకాశకుడిని .సర్వత్రా వ్యాపించి ఉండేది నేనే .అని చెప్పాడు కనుక ఒక్కమాటలో చెప్పాలంటే సర్వం శర్వుడే అంటే రుద్రుడే ..
మహర్షులు దేవతలను ‘’రుద్రుడు ఎలా ఉంటాడు ?’’అని ప్రశ్నిస్తే వాళ్ళు ‘’ఎవని శిరసు ఉత్తరాన ,పాదాలు దక్షిణాన నిలిచి ఉంటాయో ,ఎవరు ప్రణవం అయిన ఓంకార స్వరూపుడో ,సర్వం వ్యాపించినవాడో ,ఎవరు అంతమో, ఏది తారేమో ,ఏది సూక్ష్మమో ఏది వైద్యుతమో ,ఏది శుక్లమో అదే పరబ్రహ్మ అదే ఏకం అదే ఏక రుద్రం .ఆయనే ఈశానుడు భగవానుడు ,మహేశ్వరుడు ,మహాదేవుడు ఆయనే రుద్రుడు ‘’అని తెలియ జెప్పారు శివ లింగం అంటే నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం అయినాఅగ్ని అగ్ని నుంచి వచ్చేదే విభూతి అదే భస్మం .భస్మం అంటే జ్యోతిర్లింగం . ప్రకాశించే స్వరూపం కలది అని అర్ధం .భస్మం 5 రకాలు .శివుడి ముఖాలు అయిదు .సద్యోజాతాహం నుండి విభూతి ,వామదేవం నుండి భసిత ,అఘోరం నుండి భస్మం ,తత్పురుష రూపం నుండి క్షారం ,ఈశానం నుంచి రక్ష పుట్టాయి
రుద్రుడు ఎలా పుట్టాడు
బ్రహ్మ దేవుడు సృష్టి చేయాలని సంకల్పించి ముందుగా సనకస సనంద మొదలగు ఋషులను సృష్టించి వాళ్ళను సృష్టి చేయమని కోరాడు దానికి వారు తాము సర్వ స0గ పరిత్యాగులమని ముక్కుమూసుకొని తపస్సు చేయటంతప్ప తాము ఏపనీ చేయలేమని చెప్పేశారు.దీనితో బ్రహ్మకు చిరాకు కోపం వచ్చి నుదుటిమీద చెమట బిందువులేర్పడి అందులో నుంచి ఒక పిల్లాడు పుట్టి ఏడుపు లంకించుకొన్నాడు రోదనం చేస్తున్న ఆబాలుడికి బ్రహ్మ ‘’రుద్ర’’అని పేరుపెట్టారు .రుదం అంటే ఏడుపు అది చేసేవాడు కనుక రుద్రుడు .కాసేపాగి మళ్ళీ ఏడిస్తే భవుడు మళ్ళీ ఏడిస్తే శర్వుడు అంటూ వరుసగా 11 పేర్లు పెట్టాడు రుద్రుడికి వారే ఏకాదశ రుద్రులు
‘’రుత్ దుఃఖం దుఃఖ హేతుహః ద్రావ యత్యేషణః ప్రభుహ్ -రుద్రా ఇత్యుచ్యతే తస్మాత్ శివమ్ పరమ కారణం ‘’-అంటే దుఃఖాన్నికానీ ,దుఃఖ కారణాన్నికానీ రుత్ త్ అంటారు ఆ రుదం అంటే దుఃఖాన్ని దూరం చేసేవాడు అయిన శివుడిని రుద్రుడు అంటారు అని అర్ధం
‘’నమశ్శం భవేచ మయోభవేచ ,నమశ్శ0 కారాయచ ,మయస్కరాయచ ,నమశ్శవివాయ శివ తరాయచ ‘అని రుద్రుని పూజిస్తాం -మంగళ స్వరూపుడు సుఖాన్నిచ్చేవాడూ ,మోక్ష ప్రదాత భక్తులకు కళ్యాణ కారకుడు అయిన రుద్రునికి నమస్కారం .వేదం నాదం తో ధర్మాన్ని బోధిస్తాడుకనుక ‘’ఈశానస్సర్వ విద్యానాం ‘’అంటారు .’’రు త్యాప్రణవ రూపాయా స్వా త్మాన0 ప్రాపయతీతి వా రుద్రహ్ ‘’-ఓంకారం తో జీవులను తనదగ్గరకు చేర్చుకొని వాడు రుద్రుడు .బ్రహ్మ దేవుడికి వేదాన్ని నేర్పినవాడు రుద్రుడే ‘’రోదనం యత్ దుఃఖం ద్రావయతీతి రుద్రహ్ ‘’ -దుఃఖాన్ని నాశనం చేసేవాడు రుద్రుడు .శ్రీకృష్ణుడు ఒక ఏడాది పాశుపతం అనే దీక్ష పొంది రుద్రాధ్యాయాన్ని అధ్యయనం చేసినట్లు కూర్మ పురాణం చెప్పింది ..మహాన్యాసం మూడవ న్యాసం లో ‘’రౌద్రీకరణం ‘’జపిస్తే పాపాలు నశిస్తాయి ,నాల్గవ న్యాసం ‘’ఆత్మా రక్షా ‘’చదివితే మన ఆత్మా పరమాత్మలో కలుస్తుంది 5వ న్యాసాంశివ సంకల్పం ‘’పఠిస్తే మోక్షం లభిస్తుంది ,దేహం వజ్ర కవచం అవుతుంది ,శత్రుబాధ నశిస్తుంది .
శివ అంటే నిత్యమైన ఆనంద సుఖాలనిచ్చేవాడని అర్ధం .అమృత శక్తి అనిభావం ఆయన నిత్య,శుద్ధ అమృత శక్తి ప్రదాత .శివుడు ‘’త్రిపురాసుర సంహారం ‘’చేశాడు ఆపురాలు ఎక్కడో లేవు .ఏవ్ మన శరీరం లో ఉన్న స్థూల సూక్ష్మ కారణం శరీరాలు వీటిని సంహరించి మోక్షమిస్తాడు ఈ మూడూ అజ్ఞానానికి చిహ్నాలు .శివునిరెండు కళ్ళు సూర్య చంద్ర లైతే మూడవది అగ్ని అది ఆత్మజ్ఞానాన్నిస్తుంది .జీవులందరూ పశువులే అనీ ఆయన పశుపతి అని ఉపనిషత్ కధనం .శివుడు కపాల దారి .ఎవరి మనస్సులో సర్వకాల సర్వావస్థలలో శివుని ధ్యానిస్తారో ,అలాంటి వారి కాపాలాలు మాత్రమే అయన ధరించి కపాల మాలాధారి అవుతాడు వాళ్ళ అందరి ఆలోచనలో శివుడు మగ్నమై ఉంటాడు కాలుడు శివుడు ఉజ్జయినిలో మహా కాళేశ్వరాలయం ఉంది బ్రహ్మ రాజా గుణం తో సృష్టి చేస్తే విష్ణువు తమోగుణంతో సృష్టినికాపాడుతాడు సత్వ గుణం తో శివుడు లయం చేస్తాడు ‘’సర్వాన శిరోగ్రీవః సర్వ భూత గృహాశ్రయః -సర్వవ్యాపీ స భగవాన్ -తస్మాసర్వగతః శివః ‘’అందరికంటే గొప్పవాడు ,అందరిలో ఉండేవాడూ ,అంతటావ్యాపించి ఉండేవాడు శివుడు అని అర్ధం ‘’ఆద్యంత రహితం దివ్యం సత్యం జ్ఞాన మనంతం ,జ్ఞాన విజ్ఞానదం మహత్ ‘’అని శివపురాణం -.శివుడు కాలాగ్ని రుద్రుడే కాదు జ్ఞానాగ్ని రుద్రుడుకూడా
కామ దహనం అంటే శివుడు మన్మధుడిని సంహరించటం మాత్రమే కాదు -మన ఇంద్రియాల ఉన్మాదాన్ని నాశనం చేసుకోవటమే మనలో జ్ఞానం అనే మూడవ కన్ను తెరుచుకొంటే ,కామం నశించి ఇంద్రియ నిగ్రహం కలగటమే కామదహనం అని గ్రహించాలి శివుని మూడవ కన్ను మన్మధ దహనం చేస్తే మన మనో నేత్రం తెరుచుకొంటె కోర్కెలు బూడిదైపోతాయి అప్పుడు శివుడూ మనమూ ఒకటే -శివోహం అంటే ఇదే .శివుడు ‘’రసవిరాట్ ‘’అందుకే తనలీల కోసం ఎడమ వైపు పార్వతీ దేవితో అర్ధనారీశ్వరుడై కనిపిస్తాడు .శివ పార్వతులు ఆదిదంపతులు .అందుకే కాళిదాసమహాకవి కుమారసంభవ కావ్యం లో మొదటి శ్లోకం లోనే వారిని ‘’వాగర్దా వివ సంపృక్తౌ వాగర్థ ప్రతి పత్తయే జగతః పితర0 వన్డే పార్వతీ పరమేశ్వరౌ ‘’అని స్తుతించాడు .రసమయ జీవ సృష్టికి ఆదిదంపతులు కారణమయ్యారు ‘’ఏ నద్యోహ్ పృథివీ చాంతరిక్షం చ యే పర్వతాః ప్రదిశో దిశశ్చ -ఏ నేదం జగద్వ్యాప్త0 ప్రజానా0 తన్మే శివ సంకల్పమస్తు ‘’అని రుద్రం లో చెబుతాం -సర్వ జీవ సమాధారణ అనేది శివ తత్త్వం అని గ్రహించాలి .శివుని శిరస్సుపైఉండేది జ్ఞాన గంగ.శివుని ఆయుధం త్రిశూలం -సృష్టి స్థితి లయాలకు అది ప్రతీక ఆయన వాహనం వృషభం అయిన నంది అది ధర్మానికి ప్రతీక . దాని నాలుగు కాళ్ళు -శాతం దయ ,దానం ,శౌచాలకు ప్రతీకలు .అదృష్ట ,అనాహార్య అగ్రాహ్య ,అలక్షణ ,అచింత్య ,అవ్యప్రదేశశ్యా ,ఏకాత్మ ప్రత్యయుసారం ,ప్రపంచ ఉపశమనం ,శాంతం ,శివమ్ అద్వైతం చతుర్ధం ఘన్యంతే -స ఆత్మా స విజ్ఞానం ‘’అని మాండూక్య ఉపనిషత్ వాక్యం ఇంద్రియాలకు కనిపించని ,దేనితోనూ సంబంధం లేని ,ఏదీ చేయని తెలిసికోలేని ,ఊహించటానికి వీలులేని అవాజ్మానస గోచరుడు భావనలో మాత్రమే పొందగలిగేవాడు పరమాత్మ ..
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-9-12- కాంప్-షార్లెట్-అమెరికా