అమెరికాలో తెలుగు యువ అవధాన తేజం

అమెరికాలో తెలుగు యువ అవధాన తేజం————————-
పక్కనే పారుతున్న గోదావరి గలగలతో పోటీ పడి అమెరికాలో ప్రవహిస్తున్న అవధాన చమక్కులు.
దత్తపదిలోపృచ్ఛకు లెవరో బాలు, కాలు, చాలు, పాలు పదాలతో భారత్,పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ ని వర్ణించమని అడిగితే మరుక్షణంలో సమాధానం వచ్చేసింది తేటగీతిలో
బాలు వేసిన వెంటనే బ్యాటునూప
కాలుతగులునో యనుచు ప్రేక్షకులు చూడ
జయము పొందిన జనులు వాచాలులైరి
భరతమాతకు మురిపాలు సరణి మెఱసి

గణపతిని స్తుతించ మన్నారు మరో పృచ్ఛకుడు నిషిద్ధాక్షరిలో. వెంటనే కందము లో వందనమన్నాడు పదహారేళ్ళ ఆ అవధాని.

దేహీ యంచున్ శ్రీలన్
భీహారీ ధీర కాచు వేనన్ గ్లౌభా
నీహార రదన భాసా
పాహీయని వేడుచుంటి భద్రే౦దుముఖా!

సభాప్రాంగణమంతా ఒకటే చప్పట్లు. ఆ బాల అవధాని ప్రతిభకు ప్రశంసలు అంతకుమించి సభాసదులు మోముల్లో ఆశ్చర్యానందాలు.

తెలుగునాడుకు వేల మైళ్ళ దూరంలో వున్న అమెరికాలో పుట్టి అమెరికాలో పెరిగి కనెక్టికట్ లో పన్నెండో తరగతి చదువుతున్న గన్నవరపు లలిత్.
16 ఏళ్ళ వయసులోనే అవధానాలు చేస్తున్నాడు . ఇంత చక్కగా పద్యాలెలా చెప్తున్నావని అడిగితే యిలా చెప్పుకొచ్చాడు.

మా అమ్మ శైలజ, మానాన్న మారుతి శ్రీధర్. హైదరాబాద్ నుంచి 1996 లో ఉద్యోగ రీత్యా న్యూ యార్క్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. నేను అక్కడే సెప్టెంబర్ 23 , 2000 లో పుట్టాను.
మా తాతల కాలం నుంచీ సాహిత్యం మీద ఆసక్తి, ప్రవేశం కలిగిన కుటుంబం మాది.
ఇంట్లో అమ్మా, నాన్న ఎప్పుడూ తెలుగులోనే మాట్లాడే వారు.అలా నా చిన్నతనం నుంచీ
మనభాష అలవాటైంది. బడిలో ఆంగ్లం. యింటికి వచ్చాక తేట తెలుగు.అప్పుడప్పుడూ మనదేశానికి వచ్చినప్పుడు బంధువుల దగ్గరికి వచ్చి పోతుండడం తో భాష మీద పట్టు యింకా పెరిగింది. మా నాన్నకు తెలుగు పద్యాలంటే చాలా యిష్టం. నాకు మూడేళ్ళ వయసునుంచే సుమతి శతకం, వేమన పద్యాలు నేర్పించేవారు.అమ్మ ఇతిహాసాలు చెబుతుండేది.
చిన్నప్పటినుంచీ యింట్లో వుండే భారత రామాయణాలు చదివేవాడిని. సుందరకాండ
చదువుతున్నప్పుడు కలిగే ఆనందం వర్ణనకు అందదు. భారతం లో ఆది, విరాటపర్వాలు చదివాను. పోతన పద్యాలు నేర్చుకుంటూ భాగవత మాధుర్యాన్ని ఆస్వాదించాను.
మనుచరిత్ర, మొల్లరామాయణం, కరుణశ్రీ కవితా సంపుటాలు చదివాను. శ్రీనాథుడు నాకు చాలా ఇష్టమైన కవి.ఆయన శైలి విశ్వనాథగారి పద్యాల్లోనూ కనిపిస్తుంది.

జాషువా, శ్రీ శ్రీ సాహిత్యాలతోనూ, పరిచయం వుంది.పాఠశాల చదువు, సాహితీ సాధన, మధ్య ఎలాంటి ఇబ్బందీ కలుగకుండా ప్రణాళిక వేసుకొని చదువుకునే వాడిని.పైగా ఏకాగ్రతతో చదవడం అలవాటైంది.
సాహిత్యము కాకుండా వీణ నేర్చుకుంటున్నాను.
టెన్నిస్, బ్యాడ్మింటన్ కూడా ఆడతాను.

ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు సంస్కృత వ్యాకరణం, కావ్య పాఠాలూ నేర్చుకోవాలనిపించింది. గురువు కోసం ఆన్ లైన్లో వెదికాను.రాజమహేంద్ర వరానికి చెందిన కామేశ్వరరావు గారు పరిచయమయ్యారు.
నా ఆసక్తిని చూసి ఆయన ఆన్ లైన్లోనే పాఠాలు చెప్పడం ప్రారంభించారు. 2013 లో
అలా ఆయనతో ఏర్పడిన పరిచయం కుటుంబ స్నేహంగా మారింది.గురువుగారి దగ్గర
రఘువంశం లో మొదటి సర్గ, లఘు సిద్ధాంత కౌముదిలో సంజ్ఞాప్రకరణాలు, పంచ సంధులు నేర్చుకున్నాను. అలాగే అమెరికాలోనే మల్లాప్రగడ శ్రీనివాస్ గారి దగర వేదంలో శిక్షణ తీసుకున్నాను. పంచసూక్తాలు,నమక,చమకాలు, తైత్తిరీయోపనిషత్తు,
మహానారాయణోపనిషత్తు, మహన్యాసం, అరుణం అభ్యసించాను. అలా సంస్కృతంలో పట్టు వచ్చింది. మా యింటికి సమీపంలో వున్న సరస్వతీదేవి ఆలయంలో రోజూ ఆసక్తి వున్నవారికి ఆ భాషను నేర్పుతున్నాను.నా దగ్గరికి వచ్చే వాళ్లంతా నలభై ఏళ్లకు పైబడినవారే. వారంతా నన్ను తమ బిడ్డ లాగే చూసుకుంటారు.

అంతకుముందే నేను గరికిపాటినరసింహారావు, గారి అవధానాలు చూశాను. ఆయన చమత్కారం చాలా నచ్చింది.అలాగే మేడసాని మోహన్ గారి పద్యధార కూడా.వాళ్ళ ప్రేరణతో నేనూ అవధానం చేయాలనుకున్నా. నా విద్యార్థులలో ఒకరితో ఈ విషయం గురించి మాట్లాడినప్పుడు, ఆయన రాజమహేంద్రవరం లోని తన మామగారితో మాట్లాడించారు.అలా అవధానగురువు ధూళిపాళ మహాదేవమణి గారితో పరిచయం కలిగింది. ఈ ఏడాది మార్చి నుంచీ ఆయన ద్వారా వాట్స్ ఆప్ లో అవధానం నేర్చుకోవడం మొదులు పెట్టాను, వాట్స్ ఆప్ లోనే సమస్యలు, యిచ్చి పద్య౦ పూరించమనేవారు. నేను వ్రాసిన వాటిని సరిదిద్దుతూ,సమాధానం పంపేవారు. అలా అవధానం లో పట్టు సాధించాను.
సంస్కృత గురువు కామేశ్వరశర్మ గారింటికి గతం లో వచ్చాను.అయితే మహాదేవమణి
గారిని నేరుగా ఎప్పుడూ కలవలేదు. ఎలాంటి విద్యయైనా గురుముఖంగా నేర్చుకోవడం ఉత్తమ లక్షణం. ఇటీవల అమ్మా,నాన్నలతో హైదరాబాద్ వచ్చినప్పుడు యిద్దరు గురువులతో మాట్లాడి రాజమహేంద్రవరానికి వచ్చాను. వాళ్ళిద్దరినీ కలిసి మాట్లాడి, నా సందేహాలను నివృత్తి చేసుకున్నాను. ఇప్పుడు వారి సమక్షంలో అవధానం చేయటం చాలా సంతోషాన్ని కలిగించింది. పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ, వారి ప్రశంసలు పొందిన ప్రతిసారీ ఉత్సాహం ఉప్పొంగేది.
ఇప్పటికి రెండు అవధానాలు చేశాను. అంతగా యిబ్బంది అనిపించలేదు. ఒకదాంట్లో
‘వారిణీతం తానమాడ పాపంబోవున్’ అన్న సమస్య యిచ్చారు. ‘వరి’ని ‘త్రోవరి’ చేశాను.
దాంతో తేలికై పోయింది. ‘డీ మహనీయమూర్తి’ అన్న సమస్య యిస్తే ‘మోడీ మహనీయ మూర్తి’ అని పూర్తి చేశాను. సాధనా సమయం లో మాత్రం ఒకసారి కష్టంగా అనిపించింది.

‘పిల్లిని పెండ్లియాడి శరభీశ్వరుడంతట బ్రహ్మసాక్షిగా’ సమస్య దీన్నెలా పూరించాలో తోచలేదు. కాసేపటికి ఆలోచన తట్టింది. ఈశ్వరుడు అమ్మవారిని పెళ్లాడినప్పుడు ఆమె ఎలా ఉందంటే, రూపంలో మెరుపుతీగె,గమనంలో గజగమని లా, పరిమళంతో పునుగుపిల్లిలా అని పూరించాను. అవధానం లో దత్తపది ఇంకేవైనా పృచ్ఛకులు ప్రశ్నించి ఊరుకుంటారు. అదే ‘నిషిద్ధాక్షరి’ అయితే ముఖాముఖి స్పర్థలా ఉంటుంది.
అందుకే ‘నిషిద్ధాక్షరి’ అంటే నా కిష్టం.

నా పద్య ధారణ చూసి స్నేహితులు ముచ్చట పడుతుండేవారు. ఇంట్లోవాళ్ల మాటైతే చెప్పనక్కరలేదు. తెలుగు,సంస్కృత సాహిత్యాలను యింకా అధ్యయనం చెయ్యాలి.

ఎప్పటికైనా ఒక మంచి పుస్తకం వ్రాయాలనేది నా కోరిక

తెలుగు కీర్తి దేశదేశాల చాటి౦చి
రాణకెక్కినట్టి రస విలాసి
తెలుగు మహిమ లెల్ల తేజరిల్లగ జేయు
తెలుగుతల్లి వెలుగు తెలుగు వెలుగు.

చిరంజీవి గన్నవరపు లలిత్ !
చిరంజీవ! సుఖీభవ! సుఖీభవ!
(తెలుగువెలుగు మాసపత్రిక సౌజన్యముతో)

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

One Response to అమెరికాలో తెలుగు యువ అవధాన తేజం

  1. anyagaami అంటున్నారు:

    శ్రీ దుర్గాప్రసాద్ గారు, మీ పుణ్యామా అని క్రొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఈవాళ మీ యువ అవధాని పరిచయం బావుంది. మీ వల్లే అమెరికాలో పెరిగిన ఒక కుర్రాడు అవధానం చేస్తున్నట్టు తెలిసింది. ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.