దశాశల దసరా పై నీళ్ళు చల్లిన వేళ
మా బామ్మర్ది బ్రాహ్మి దిగాలుగా మొగం వేలాడేసుకొని కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చి కుర్చీలో కూలబడ్డాడు .’’ఏం వాయ్ మై డియర్ షేక్స్పియర్ –పొద్దున్న చంద్రబాబిచ్చిన ఎల్ సి డి బల్బ్ లాగా వెలిగే మొహం తో వచ్చినవాడివి ,ఇప్పుడు నిరాహార దీక్షలతో సెల్ఫ్ గోల్ చేసు కొంటున్న ‘’ఫానాయన ‘’లాగా మొహం చాటేసుకొని వచ్చినట్లు వచ్చావ్ “’అన్నాన్నేను .’’అవును బావా !దసరా రోజున ఉద్దందపాలెం లో అమరావతి శంకు స్థాపనకు మోడీ గారు వచ్చి ,యేవో కోటాను కోట్లు రాలుస్తాడనుకొన్నా.తీరా స్థాపన మాత్రం అయిందికాని వరాల జల్లు కురవ లేదు దశాశల దసరా రోజున చొప్ప దంటు ఉపన్యాసం తో నీళ్ళు గార్చి వెళ్ళిపోయాడు .అందుకే జీర్ణించుకోలేక జగన్ ఫెసేసుకొనొచ్చా.’’అన్నాడు .నాకు విపరీతంగా నవ్వు వచ్చి నవ్వేశాను .వాడికి ‘’ఎక్కడో ‘’కాలింది .’’ఇక్కడ కొంపలంటుకు పోతుంటే నీ నవ్వ్వేమిటి’’ బా ‘’.అన్నాడు ఏడవ లేక నవ్వుతూ .’’ఒరే బామ్మర్దీ ! అసలు అంతటి ఆశలెందుకు ?అవి తీరలేదను కోవటమెందుకు ?’’అన్నాను .’’గొప్ప రాజ దాని అమరావతి నిర్మిస్తున్నాం .ప్రపంచ దేశాల వారంతా వస్తున్నారు .ఆరు కోట్ల ఆంధ్రులు ఎదురు చూస్తున్నశుభ ముహూర్తం సమయం లో సాక్షాత్తు ప్రధాని స్వయం గా పాల్గొని ఒక్క మాట అంటే ఒక్కమాట స్వయం ప్రతిపత్తి విషయం కాని హోదా విషయం కాని ,ప్రత్యెక పాకేజీ కాని ఏదీ ప్రకటించ కుండా’’ మూటల సంచీ’’ కాకుండా ‘’మాటల సంచీ దులిపేసి ’’వెళ్ళిపోయాడు .కడుపు మండి పోతోంది . ‘’అన్నాడు ఆవేశం గా .’’అరే బాబా ! ఇప్పుడు బీహార్ ఎన్నికలు జరుగుతున్నాయి .సభలో కే సి ఆర్ ఉన్నాడు .మొదటి ది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం ,రెండోది ప్రక్క రాష్ట్ర సి ఏం కూడా ‘’నాకేంటి ?’’అని మొహం పెడితే మోడీ పరిస్తితి ఇబ్బందికరం .ఈ మాత్రం తెలియక పొతే ఎలా ?’’అన్నా .’’బీహార్ కు రెండు లక్షల కోట్ల సంచీ దులిపినోడు మనకు సగమైనా రాల్చక పోతాడా ?నాతొ సహా అను కొన్నారందరూ . ‘’అన్నాడు కన్నీళ్లు ఒక్కటే తక్కువ వాడికి .ఎందుకైనా మంచిదని కర్చీఫ్ మొహానికి అడ్డం పెట్టు కొన్నాడు పాపం .
‘’ఏదో ఉద్ధరిద్దామని ఉద్దండ పాలెం వెళ్లావు కదా .! దాని గోప్పతనమేమిట్రా?శంకుస్థాపన అక్కడే ఎందుకు ?’’అడిగా .’’నాకేం తెలుసు’’ బా ‘’.’’ గుంపులో గోవింద’’ లా వెళ్ళా. అందరి తో పాటూ నేనూ ఆనందిద్దామని .ఇంతకీ దాని విశేషమేమిటి ‘’బా ‘’.అని అడిగాడు .’’ఏదైనా తెలుసుకొని వెడితే మంచిది .తెలియ కుండా వెడితే ఇలానే ఉంటుంది .అయినా అడిగావు కనక చెప్పాలను కొంటున్నాను .నీకు ఎన్ని దుర్గుణాలున్నా ,తెలుసుకోవాలన్న నీ తపన నాకు నచ్చింది ‘’అన్నాను .’’సరే బావా !చెప్పు .విని సంతోషిస్తా .’’అన్నాడు అరవిరిసిన మోము తో బ్రాహ్మి బామ్మర్ది .
‘’ఆంద్ర కర్నాటక రాజ్య సార్వ భౌముడు శ్రీ కృష్ణ దేవరాయలు తన దక్షిణ దేశ జైత్ర యాత్రలో ఉద్దండ పాలెం లో బస చేయాల్సి వచ్చింది .ఆయన సేనాని’’ ఉద్దండ రాయడు ‘’ఆ గ్రామం లో ఉండటం వలన దానికి’’ఉద్దండ రాయ పాలెం ‘’అని పేరొచ్చింది .ఇక్కడే కృష్ణానది రెండుపాయలైంది .ఈ రెండిటి మధ్య రాజధాని అమరావతి వెలుస్తోంది .వాస్తు రీత్యా చాలా అనువైన స్థలం . ఉద్దండ మహోద్దండం గా అమరావతి ‘’అమృత నగరి’’ గా వెలిగి పోతుంది .’’అన్నాను ‘.
‘’మరి తుళ్ళూరు సంగతేమిటి ?’’ప్రశ్న సంధించాడు బ్రహ్మి .’’తుళ్ళూరు పూర్వం పేరు ‘’శివ తాండవ పురి ‘’అంటే శివుడు సంధ్యా నృత్యమైన ఆనంద తాండవ నృత్యం చేసిన చోటు .తుళ్ళూరు పేరు రావటానికీ,రాయల వారి కధకూ సంబంధం ఉంది .రాయలు కొండవీడు ,విను కొండ దుర్గాలను స్వాధీనం చేసుకొని ,కొండపల్లి ని పట్టుకోవటానికి వెడుతూ కొంతకాలం ఈ ‘’శివ తాండవ పురి’’లో మకాం పెట్టాడు .రాయలు ‘’తుళువ ‘’వంశం వాడు కదా .జనం నోళ్ళలో తుళువ పేరు నాని నాని ‘’తుళ్ళూరు’’గా మారిపోయింది ‘’అని చెప్పాను .మా వాడి ముఖం సహస్ర దళ పద్మం లా పూర్తి వికాసం పొందింది..దిగులు స్థానం లో జ్ఞాన జ్యోతి కనిపించింది .’’తుళ్ళూరు లో పరశురాముడు ప్రతిష్టించిన ‘’శ్రీ రామ లింగేశ్వర దేవాలయం ‘’కూడా ఉండటం తో’’ యాడెడ్ అట్రాక్షన్ ‘’అయింది అన్నా .
‘’పేపర్లలో ,మీడియా లో ‘’రాయ పూడి ‘’పేరు వినిపిస్తోంది .అ కధా ‘’కమా మీషూ ‘’ఏమిటి బా!’’అడిగాడు బామ్మర్ది .’’దీనికీ రాయలవారికీ సంబంధం ఉంది .తుళ్ళూరు నుండి కృష్ణానది దాటి కొండపల్లి కోటను ఆక్రమించుకోవాలి అన్న ఆలోచనలో రాయలవారున్న సమయం లో కృష్ణానదికి’’ పూటు ‘’గా వరదలొచ్చాయి .వరద ఉధృతిలో నదిని దాటటం క్షేమం కాదని నిపుణులు సలహా ఇవ్వటం తో ,ఇప్పుడు రాయపూడి అనే పేరుతొ పిలుస్తున్న గ్రామం లో మకాం వేసి వరద తగ్గే దాకా నిరీక్షించాడు .రాయలున్న ఈ గ్రామం ఆయన పేరుతొ ‘’రాయ పూడి ‘’అయింది .అమరావతి ప్రభువు వాసి రెడ్డి వెంకటాద్రి నాయుడు రాయ పూడిలో శ్రీ వేణు గోపాల స్వామి ఆలయ నిర్మాణం చేశాడు .ఈయనే అమరావతిలో అమరలింగేశ్వర దేవాలయం కట్టించాడని మనకు తెలుసు కదా ‘’అన్నాను .
‘’ అమరలి౦గేశ్వరాలయం’’విశేషాలింకా ఏమైనా ఉన్నాయా ?’’అని అడిగాడు బ్రాహ్మి .’’అవున్రా ఉన్నాయి .ఇక్కడ పౌరాణిక ,చారిత్రిక విషయాలు రెండూ కలగలిసి ఉన్నాయి .మొదట్లో అమర లింగేశ్వర స్వామి విగ్రహం ‘’మల్కపురం ‘’అనే గ్రామం లో ‘’శివాలయం ‘’లో పడి ఉండేది .ఒక రోజు రాత్రి దొంగలు ఈ విగ్రహాన్ని దొంగిలించి పారి పోతుంటే నందీశ్వరుడు వెంబడించాడు .దొంగలు భయ పడి పారి పోతూ అమరేశ్వర లింగాన్ని కృష్ణా నదీ తీరం లో వదిలేసి పారిపోయారు. ఈ లింగాన్నేఅమరావతి లో వాసి రెడ్డినాయుడు ప్రతిస్టించాడు..అసలీ విగ్రహాన్ని ప్రతిష్టించిన వాడు సాక్షాత్తు ఇంద్రుడే అని మనకు తెలుసు .ఇంద్ర ప్రతిష్ట కనుక అమరలి౦గేశ్వరుడైనాడు .’’చెప్పా .
‘’బాగుంది బావా !మరిన్ని విశేషాలు చెప్పి నా షేక్స్ పియర్ మొహం లో నవ్వులు పూయించు ‘’అన్నాడు .’’సరే విను .ఈ ప్రాంతం లో శాతవాహన ,కాకతీయ ,చాళుక్య రాజుల పరిపాలనా ప్రభావమూ ఉంది .రాణి రుద్రమ దేవి తండ్రి కాకతి గణపతి దేవ చక్ర వర్తి ఎన్నో దాన ధర్మాలు చేసినట్లు చారిత్రకాధారాలున్నాయి .పైన చెప్పిన మల్క పురం గ్రామం లో అలాంటి ఒక శాసనం కనిపిస్తుంది .దీనిలో కాకతీయ వైభవాన్ని ,రుద్రమ దేవి శౌర్య పరాక్రమాలను తెలుసు కోవచ్చు .రుద్రమ దేవి మంత్రి శివ దేవయ్య ‘’మండడం ‘’గ్రామం లో శివ లింగం ప్రతిస్టించాడు .’’అన్నాను .
‘’ అమరావతి అంటే బౌద్ధం వికసించిన చోటు ‘’అంటారు కదా బావా ?’’అన్నాడు .’’అవున్రా !క్రీ .పూ. 563-483 ప్రాంతం లో గౌతమ బుద్ధుడు బౌద్ధ మత ప్రచారం చేస్తూ ఈప్రాంతానికి వచ్చాడు .బీజాక్షరాలను ఇక్కడ నిక్షిప్తం చేయటం వలన ఇది ‘’ధరణి కటకం ‘’అయింది .అదే వాడుకలో ధాన్య కటకం అయింది .చివరికి ‘’ధరణి కోట ‘’అయింది .రాజులకు కోట ముఖ్యం .కోట ఉన్న చోట రాజధాని ఉండటం సాధారణం .కనుక నవ్యాంధ్ర రాజధాని అమరావతి లో నిర్మించటం అన్ని రకాలా సర్వోత్త్తమంగా అందరూ భావిస్తున్నారు .ఇంద్ర ,పరశురామాది పురాణ పురుషులు ,రాయలు , గణపతిదేవుడు మొదలైన చక్ర వర్తులు ,అహింసా మూర్తి గౌతమ బుద్ధుడు నడయాడిన పవిత్ర స్థలం .కనుక సర్వ విధాలా శ్రేష్టమైన నగరం అమరావతి .’’అన్నాను ఆయాసపడుతూ .
‘’మొదట్లో తిట్టినా ,చివరికి ఏదో తాయిలం నోట్లో పెట్టి నోరు మూయిస్తావు .ఎన్నో సంగతులు తెలియ జెప్పావు బావా .ఇక బాబు ఇచ్చిన ఎల్ సి డి బల్బ్ లాగా వెలిగే ఫేస్ తో వెళ్లి పోతా.ఇన్ని విషయాలు ఎలా తెలిశాయి బావా ?’’అని బోల్డు ఆశ్చర్య పడ్డాడు .’’బ్రాహ్మీ! వీటిని పద్మశ్రీ తుర్ల పాటి కుటుంబరావు గారు సేకరించి రాస్తే బుధవారం ఆంద్ర జ్యోతి లో ప్రచురిస్తే చదివి తెలుసుకొన్నాను .నీకు చెప్పాను .నీకు చెప్పటమేకాదు ,ఆ రోజే దాన్ని సాహితీ బంధు లకు నెట్ లో పంపాను కూడా . ‘’అన్నాను .ఒక్క క్షణం ఆగకుండా మా వాడు దౌడు తీశాడు ఇంటికి .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-10-15-ఉయ్యూ
—