వీక్లీ అమెరికా -28(చివరిభాగం ) (2-10-17 నుండి 8-10-17)-రెండవభాగం (చివరి భాగం )

వీక్లీ అమెరికా -28(చివరిభాగం ) (2-10-17 నుండి 8-10-17)-రెండవభాగం (చివరి భాగం )

సఫల షార్లెట్ యాత్ర -రెండవభాగం (చివరిభాగం )

4 వ తేదీ బుధవారం రాత్రి 8 గంటలకు బోస్టన్ కు ఫ్లయిట్ లో చేరాం .అక్కడినుంచి ఎమిరేట్స్ ఫ్లయిట్ లో దుబాయ్ వెళ్ళటానికి అన్నీ ఫార్మాలిటీస్ పూర్తియై తెచ్చుకున్న పులిహోర ,పెరుగన్నం తిని గేట్  వద్ద సిద్ధంగా ఉన్నాం .అక్కడ కేరళ వెళ్లే ఆయన దగ్గర సెల్ తీసుకొని మా అమ్మాయికి సమాచారం తెలియజేశాను . రాత్రి 11 గంటలకు దుబాయ్ కి విమానం బయల్దేరింది . నాపక్కన ఇస్కాన్ ఆయన కూర్చున్నాడు . వీలైనప్పుడల్లా జపమాలతో జపం చేసుకొంటున్నారు . దుబాయ్ లో దిగే దాకా అంటే 11 గంటలపాటు ఆయన సీట్ లో నుంచి లేవలేదు .ఆశ్చర్యమేసింది . విమానం -50 సెంటీగ్రేడ్ డిగ్రీల ల లో సుమారు భూమినుండి  30 వేలకు నుంచి 50 వేల అడుగుల ఎత్తులో యావరేజ్ గా గంటకు 950 కిలోమీటర్ల వేగం తో ప్రయాణం చేసింది .నాముందున్న బుల్లితెరపై విమానం పోకడ హాస్య చిత్రాలు చూస్తూ గడిపాము .నిద్ర పట్టలేదు .”గాలి కన్యలు ” ఏవేవో తినటానికి తాగటానికి ఇస్తూనే ఉన్నారు .ఏవీ సయించలేదు .కాఫీ మాత్రం తాగాము ఆపిల్  ,మాంగో జ్యుసి అడిగి తాగాం . దుబాయ్ చేరేసరికి రాత్రి 7 అయింది . వీల్ చెయిర్ లాగటానికి ఒక ఆఫ్రో అమెరికన్ అమ్మాయి ఒక అమెరికన్ అమ్మాయి వచ్చారు .ఒక చోట లిఫ్ట్ లో వెళ్ళాలి సొస్తే అక్కడ అమెరికామ్మాయి నన్నుఆవిడ మీకేమవుతుంది అనిఅడిగితే భార్య అన్నాను .పెళ్లి అయి ఎన్నేళ్లయింది అని అడిగితే  53 ఏళ్ళయిందన్నాను బోల్డు ఆశ్చర్యపోయి” ఓ మైగాడ్” అంది . తర్వాత ”ఈవిడ మీకు ఎన్నవ భార్య ?”అని అడిగితె నాకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయి ”నా ఏకైకభార్య ”అన్నాను . మళ్ళీ మరింత ఆశ్చర్యపోయి ”ఓ వాట్ ఏ గ్లోరియస్ థింగ్ .వి ఆర్ వెరీ వెరీ హాపీ టు హియర్ దిస్ న్యూస్ ” అంటూ ”విష్ యు వెరీ లాంగ్ హాపీ మ్యారీడ్ లైఫ్ ”అని మనసారా శుభాకాంక్షలు తెలిపింది .అంటే పాశ్చాత్య దేశాలలో దాంపత్యాలు క్షణ భంగురాలు అని ఇంతకాలం మేమిద్దరం భార్యా భర్తలు గా జీవించటం వాళ్లకు అమితమైన ఆశ్చర్యాన్ని కలిగించింది .అందుకే నిండుమనసుతో శుభాకాంక్షలు తెలిపారు ఆ ఇద్దరూ .ఇక్కడ నాకొక చిన్న జోక్ జ్ఞాపకం వచ్చింది.  దీన్ని దసరా సరదాల్లో చెబుదామనుకొని మర్చే పోయాను –

ఒక అమెరికన్ ఆయన ఒక హాలీ వుడ్ నటిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు .ఆమెకు ఎన్నో పెళ్ళో ఆయనకు ఎన్నోపెళ్ళో వాళ్ళిద్దరికే తెలీదు మనకెందుకు .పెళ్లైన నాలుగు రోజులకే భార్య కొత్త భర్తతో ”హానీ !మనం హనీమూన్ కు ఆఫ్రికా వెడదాం అక్కడ సఫారీ బాగుంటుంది ”అంది బుగ్గమీద ముద్దు ముద్ర వేస్తూ .వీడి గుండె జారి  గల్లంతైంది .డియర్ !ఇప్పుడిప్పుడే డబ్బు కూడా బెడుతున్నా .హానీ మూన్ అంటే చాలాఖర్చు కదా ”అన్నాడు .ఆమె ”చిలిపి డియర్ .మా లాంటివాళ్లకు హానీ మూన్ లు రెండేళ్లకో మూడేళ్లకో కదావచ్చేది .కాదనకు హానీ ”అంది గోముగా .వీడు ఆమాటలకు ఐసై పోయి హనీమూన్ చేసి దాచిన డబ్బంతా ఐస్ లాగా కరగించుకొన్నాడట . దుబాయ్ కి రాత్రి 7 గంటలకు చేరింది .హైదరాబాద్ ఫ్లయిట్ రాత్రి 10 గంటలకు .లాగుడు బళ్ల వాళ్ళు రెడీగా ఉన్నారు .కస్టమ్స్ చెకింగ్ నిమిషాలమీద చేయించారు . ట్రెయిన్ లో లిఫ్ట్ లమీద తీసుకొని వెళ్లి చివరికి హైదారాబాద్ విమానం గెట్ దగ్గర కూర్చోబెట్టటారు .ఆవిడకి వీల్ చైర్ దొరికింది నాకు లేదు ”గోవువెంట దగులు కోడె బంగి ”ఆవిడ వెంటే నడిచాను . ఈ వీల్ చైర్ కుర్రాడు చాలామంచివాడు . విమానం ఎక్కబోయేముందు మా ఆవిడ రెస్ట్ రూమ్ కు వెడుతుంటే నడవనివ్వకుండా తీసుకొని వెళ్లి బయట ఉండి  మళ్ళీ చైర్ లో తీసుకొచ్చిన సౌజన్యశీలి .సేవాధరామానికి ప్రతీక . .ఫ్లయిట్ ఎక్కించిన తర్వాత డబ్బు ఇద్దామని జేబులో చేయిపెడుతుంటే ఇంగ్లిష్ లో వద్దు అని మర్యాదగా చెప్పి ”,విష్ యు హాపీ జర్నీ ‘ అన్న సంస్కారి . షార్లెట్ నుంచి దుబాయ్ లో హైదరాబాద్ విమానం ఎక్కేదాకా ఎవరూ మమ్మల్ని డబ్బులు అడగలేదు.  డాలరుకూడా ఖర్చుచేయకుండా అమెరికా నుంచి హైదరాబాద్ చేరాం . ఉదయం 3 గంటలకు హైదరాబాద్ లో దిగాం . ఇండియన్ పాస్ పోర్ట్ వాళ్లకు ఇమ్మిగ్రేషన్ హడావిడి లేదు కస్టమ్స్ చెకింగ్ కూడా నిమిషాలమీద జరిపించాడు వీల్ కుర్రాడు .నేను తెచ్చిన డాలర్లను రూపాయలలోకి ఎక్స్చేంజి లో మార్చేశా డాలర్ కు 60 రూపాయల వంతున ఇచ్చారు బాగేజ్ క్లెయిమ్ కు వెడుతుంటే శాల్తీకి వందరూపాయలు కట్టాలన్నారు కట్టి రసీదు తీసుకొన్నాం .మా లగేజ్ తేలిగ్గా గుర్తుపట్తీసుకొని  మా పెద్దబ్బాయి శాస్త్రికి ఫోన్ చేయగానే వాడు ఎయిర్ పోర్ట్ లోనే ఉన్నామని చెప్పాడు .సామాను తీసుకొని బయటకు రాగానే వాడు వాడిబాస్ బామ్మర్ది ప్రతాప్ గారి కారుతో వచ్చాడు . ప్రతాపిగారే ఏప్రిల్ లో మమ్మల్ని అమెరికా విమానం ఎక్కించటానికి కారు లో తీసుకొచ్చారు .మళ్ళీ ఆయనే .అప్పుడూ ఇప్పుడూ రూపాయిఖర్చులేదు .సామానుకారులో ఎక్కించి 4-40 కి బయల్దేరి మల్లాపూర్ లో మా అబ్బాయి ఇంటికి 6 వతేదీ శుక్రవారం 5-45 కు చేరాం .ఏప్రిల్ 6 బయల్దేరి 6 నెలల తరవాత అక్టోబర్ 6 కు చేరాం . విమానం లో  తిండి పేరుతో ఏదో చెత్త పెడతారు .దాదాపు 80 శాతం మంది ఏదీ తినరు.  అంతా వేస్టే .దీనిపై అధ్యయనం చేస్తే ఎన్నో విషయాలు బయటపడతాయి . చక్కగా బెజవాడ బాబాయ్ హోటల్ నుంచి ఇడ్లీ  కారాప్పొడి రాజమండ్రి వరదరాజు హోటల్ నుంచి పేపర్ అట్టు కాకినాడనుంచికాజాలు ,శరవణ భవన్  నుంచి సాంబారు ,ఉడిపి హోటల్ నుండి ఊతప్పం ,పొంగల్ మరాటా కేఫ్ నుంచి పూరీ ,చపాతీ, కూరా తెప్పించిపెట్టచ్చుగా అనిపిస్తుంది .

6-10-17- శుక్రవారం -దంతధావనాదులు పూర్తి చేసి కాఫీ స్నానం  చేసి మాకోడలు సమత చేసిన పెసరట్లు తిని హాయిగా కడుపు నిండిందని సంతోషించా.  విమానాలలో తిన్నది 10 శాతం పారేసింది 90  శాతం .ఉసూరుమనిపించింది . మాకోడలు స్కూల్ కు మనవడు భువన్ కాలేజీ కి ఉదయం 8 కె వెళ్లారు .నెట్ లో పోస్ట్ చూసి కాసేపు నడుం వాల్చా . నిద్రపట్టలేదు . 12 గంటలకు భోజనం చేసి కాస్త పడుకున్నా .గబ్బిట గిరిజ ఫోన్ చేసింది . మధ్యాహ్నం 3 గంటలకే లేచి షార్లెట్ లో నాకు డబ్బులు డాలర్ లలో ముట్టజెప్పినవారి లిస్ట్  ,వారెంత ఇచ్చిందో రూపాయలలో తయారు చేశా . మా అక్కయ్య భావలకు ఆదివారం ఉదయం వాళ్ళ ఇంటికి వస్తామని అక్కడిఉంది మా రెండవబ్బాయి  శర్మ ఇంటికి మధ్యాహ్నం భోజనానికి వస్తామని మా కుటుంబ డాక్టర్ చి యాజికి మంగళవారం మధ్యాహ్నం హెల్త్ చెకప్ కు వస్తామని తెలియజేశాను .శ్రీ పసుమర్తి శర్మగారికి శ్రీ రేమెళ్ళ అవధానిగారికి ఆదివారం సాయంత్రం వారిని కలుస్తానని ఫోన్ లో తెలియజేశాను .

షార్లెట్ లో నాకు డబ్బు అందజేసినవారు -చెన్నై వెళ్ళిపోతూ శ్రీ మతి వీటూరి పద్మజ మా సువర్చలాన్జనేయస్వామికి ఇచ్చింది (ఇదే బోణీ ),గ్రంధి హరి గారింట్లో  రఘు గారింట్లో మాలిని గారింట్లో నాగరాజు గారింట్లో లో రుద్రాభిషేకానికి ఇచ్చిన తాంబూలాలూ ,వేలూరి పవన్ ఇంట్లో పుణ్యాహవాచనం ,సత్యనారాయణవ్రతం లలో ఇచ్చిన తాంబూలం ,రాంకీ ఇంట్లో వ్యాసజయన్తి నాడు ,పవన్ ఇంట్లో వ్రతం నాడు ,అతనిభార్య ఉష అట్లతద్దినాడు ఇచ్చిన తాంబూలాలూ  ,నా పుట్టిన రోజుకు మైనేని గారు పంపినది ,కారీ లో డా భండారు దంపతులు ఇచ్చిన తాంబూలం ,మా అన్నయ్యగారి మనవడు హరి ఇచ్చినది,మా మనవడు సంకల్ప్ ఇచ్చింది ,సాయి ఇంట్లో రుద్రానికి ,పవన్ ఇంట్లో వ్రత సమయం లో ఇచ్చన  తాంబూలాలూ  ,మౌంట్ సోమా అర్చక దంపతులు ఇచ్చిన తాంబూలం ,గోసుకోండ అరుణ దంపతులు ,రావి ఉషా ,సురేఖ వేణి మా అమ్మాయి ఇచ్చింది అంతా రూపాయలలో లిస్ట్ తయారు చేశా . ముద్రించబోయే ”ఆధునిక ప్రపంచనిర్మాతలు -జీవితాలలో చీకటి వెలుగులు ”గ్రంధం లో దాతల లిస్ట్ లో  ప్రచురిస్తాం  ఈ ధనాన్ని అవసరం మేరకు స్వామి సేవకు ,గ్రంథ ముద్రణకు వాడుతాం .దీనినీ  ఫిక్సెడ్ డియాజిట్ లో వేస్తాం .

2-షార్లెట్ లో సరసభారతి నిర్వహించిన దసరా సరదా సాహితీ కదంబం ”లో కవర్ లో పెట్టి సరసభారతి కి కానుకగా ,పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ కోసం అందించిన, మీకు 2 వ తేదీ తెలియజేసిన 726 డాలర్లతో పాటు మా అమ్మాయి, రావి ఉష ,అరుణ ,సురేఖ ఇంటివద్ద అందజేసిన దానితో కలిసి 1,000 డాలర్లు .అంటే 60 000 రూపాయలు .దీన్ని నేను ఉయ్యూరు వెళ్ళగానే నెలనెలా వడ్డీ వచ్చేట్లు ఫిక్సెడ్ డిపాజిట్ చేసి ,దానిపై వచ్చే వడ్డీ ని అవసరమైన అర్హులైన చదువుకొనే విద్యార్థులకు స్కాలర్షిప్ లను ”షార్లెట్ సరసభారతి ”తరఫున ఇచ్చే ఏర్పాటు చేస్తాను .ఒక వేళ అత్యవసరంగా నెలవడ్డీకి మించి ఇంకా ఎక్కువ డబ్బు ఇవ్వవలసివస్తే నేనే ఇచ్చి తర్వాత అసలులో తగ్గించే ఏర్పాటు చేస్తా .ఒకవేళ ఇంకెవరైనా ఉపకారవేతనాలు సరసభారతి ద్వారా ఇవ్వాలని పి0చి  పంపితే, ఫిక్సెడ్ డిపాజిట్ లో చేరుస్తాం . అంతవరకూ అసలు తీయకుండా వడ్డీ నే వాడుతాం . ప్రస్తుతానికి ఇదీ నా ఆలోచన .ఇంత డబ్బు నా దగ్గర ఉంచటం మంచిదికాదు అనే ఈ ఏర్పాటు .

రాత్రి నిద్ర పట్టక పొతే 1-30 కే లేచి 5 గంటలదాకా వీక్లీ మొదటిభాగం రాసిన సంగతిమీకు  తెలుసు .

7-10-17 శనివారం -మేమిద్దరం షుగర్ టెస్ట్ చేయించుకొన్నాం.సాయంత్రం కాఫీ పొడి ,స్వీట్లు   కొని 11 వతేది రాత్రి బస్ కు ఉయ్యూరుకు టికెట్లు బుక్ చేశా . సాయంత్రం కృష్ణాజిల్లా నందమూరు అంటే ఏంటి రామారావు గారి స్వగ్రామం లో జూనియర్ రెసి డెన్షియల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా పని చేసిన శ్రీ సీతా పతి గారు ఫోన్ చేసి తానూ రిటైర్ అయ్యానని ,తూర్పుగోదావరిజిల్లాలో తమ స్వగ్రామం వెడుతున్నామని ,నేను పంపిన సరసభారతి పుస్తకా లన్నీ చదివానని  అవి చాలా విలువయినవని రిఫరెన్స్ పుస్తకాలనీ చెప్పారు మంచి  హృదయం ఉన్నవారు . నాకు మంచి మిత్రులు .ఇద్దరం కృష్ణా జిల్లా రచయితల సంఘం లో క్రియా శీలకంగా పని  చేసినవాళ్ళం సంఘం ప్రచురించిన తెలుగుపసిడి వజ్రభారతి ,మొదలైన రిఫరెన్స్ గ్రంధాలలో  విలువైన  వ్యాసాలను రాసాం .రెసిడెన్షియల్ కాలేజీ సర్వతోముఆభివృద్ధికి తీవ్రంగా కృషిచేసిన సమర్ధుడైన ప్రిన్సిపాల్ ఆయన .తమ చిరునామా మెయిల్ చేస్తే సరసభారతి త్వరలో ప్రచురించబోయే 3 పుస్తకాలను పంపిస్తాను అని చెప్పాను . .

             మా అక్కయ్య బావగార్ల ఇంటికి

8-10-17-ఆదివారం -ఉదయం 9-30 కు కాబ్ లో మేమిద్దరం మామనవాడు భువన్ ఓల్డ్ బోయినపల్లి లో ఉన్న మా చిన్నక్కయ్య  శ్రీమతి దుర్గ, మాబావగారు శ్రీ వేలూరి వివేకానంద్ గారింటికి వెళ్లి ,కాఫీ తాగి  అమెరికానుంచి మా చిన్నమేనల్లుడు శాస్త్రి ఫోన్ చేస్తే మాట్లాడి మా పెద్దమేనల్లుడు అశోక్ కూడా ఇక్కడికే వస్తే చూసి ,ఫోటొలుది గి ,11-30 కు మళ్ళీ కాబ్ లో మేం  ముగ్గురం బాచుపల్లి లోని మా రెండవ అబ్బాయి శర్మ ఇంటికి చేరాం భోజనం చేసి కాసేపు పడకపై దొర్లా

  శ్రీ పసుమర్తి శర్మగారిని 40 ఏళ్లతర్వాత చూడటం
మధ్యాహ్నం  3-30 కు మా అబ్బాయి కారులో నేనూ మా మనవాళ్ళు హర్ష ,భువన్ అమీర్ పేట లో ఉన్న 1963 లో నాతోపాటు మోపిదేవి హై స్కూల్ సోషల్ మేష్టారు పెదప్రోలు వాసి మంచికి సహృదయత కు ,సౌజన్య సౌశీల్యాలకు నిలయం నా శ్రేయోభిలాషి నాకు మార్గ దర్శి అయిన 90 ఏళ్ళ జ్ఞాన వయో వృద్ధులు శ్రీ పసుమర్తి సీతారామ శర్మగారి అబ్బాయి శ్త్రి గారింట్లో దాదాపు 40 ఏళ్లతర్వాత మళ్ళీ శర్మ గారిని చూశాను . వినికిడి కొద్దిగా తగ్గిందికాని ఆయనకు షుగర్ బిపి లు లేవు చక్కని ఆరోగ్యంతో ఉన్నారు కంటి చూపు ఏమీ తగ్గలేదు వారబ్బాయి శ్రీ ఉమామహేశ్వర శాస్త్రిగారు కోడలుగారు ఎంతో ఆత్మీయంగా మర్యాదగా ,సకల సౌకర్యాలు కలిగించి ఇరవైనాలుగు గంటల నర్సు సహకారం తో ఓర్పుగా చూసుకొంటున్నారు.  ప్రక్కనే ఇండో యు ఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది .ఏమాత్రం తేడా వచ్చినా అక్కడ చేర్పించి చక్కని వైద్యం అందిస్తున్నారు .శర్మగారు దేవునితో సమానం .శర్మ గారికి కొడుకు కోడలు చేస్తున్న పితృసేవ అందరికీ ఆదర్శంగా ఉంది . నిష్కల్మష మనస్కులు .విశుద్ధ వర్తనూలు  గొప్ప సహాయ కారి నన్నూ లెక్కలమేస్టారు రమణారావు గారినీ పెదప్రోలు లో వారింట్లో నెల రోజులు మాకు సకల రాజ లాంఛనాలతో వసతి ,భోజనం,కాఫీ టిఫిన్లు పెట్టి పెళ్లి కొ డుకులను చూసినట్లు మేపి  మర్యాదగా చూశారు .ఆయనమాట అంటే మాకు శిరోధార్యం .పడమట హై స్కూల్ హెడ్ మాస్టర్ గా రిటైర్ అయ్యారు .కృష్ణా జిల్లా టీచర్స్ గిల్డ్ కు మేమందరం కలిసివారిని ఏకగ్రీవంగా అధ్యక్షులను చేసాం . నిష్కర్షత నిర్భీకత వారి సహజ లక్షణాలు జిల్లాలో పేరెన్నికగన్న హెడ్ మాస్టర్ గా పేరు పొందినవారు .నేను రాస్తున్న ”నా దారితీరు ”లో”గెలాక్సీ ఆఫ్ హెడ్ మాస్టర్స్ ”లో శర్మగారి గురించీ రాసిన సంగతి మీకు తెలుసు . శర్మగారిని నేను నూతన వస్త్రాలు ,ఫలాలు సమర్పించి సరసభారతి పుస్తకాలను అందజేశాను .నేను వారింటికి రావటం తనకు మహదానందంగా ఉందని నలభై ఏళ్లతర్వాత మళ్ళీ కలుసుకోవటం అపూర్వమైన విషయమని అన్నారు .దీనికంతటికి కారణం షార్లెట్ లో నాకు పరిచయమైననాశిష్యురాలు శ్రీమతి పసుమర్తి లక్ష్మి .

మా భువన్ ను బస్ ఎక్కించి మల్లాపూర్ పంపించి మేము మధురానగర్ లో ఉన్న డా రేమెళ్ళ అవధానులు గారింటికి వెళ్లాం వారు మాకోసం ఎదురు చోస్తున్నారు .వారికీ  నూతనవస్త్రాలు ఫలాలు సమర్పించి ”గీర్వాణకవుల  కవితా గీర్వాణం -2 రెండవభాగం ,మాఅన్నయ్య ,దైవ చిత్తం సువర్చ లేశ్వర శతకం అందజేశాను ఆయన కూడా ఎంతో సంబరపడిపోయారు .ఫోటోలు తీయించుకొన్నారు. మాతో.  నాకు వారే పాదాభివందనం చేయటం వారి సంస్కారానికి నిదర్శనం . వయసురీత్యా నేను పెద్దకావచ్చు కానీ సంస్కృత ,సాహిత్య ,వేద గణిత వేదం విజ్ఞాలలో వారికి సాటి లేనివారు లేరు . నవంబర్ 11 ,12 తేదీలలో అఖిలభారతీయ సంస్కృత సెమినార్ నిర్వహిస్తున్నామని నన్ను తప్పక హాజరవమని చెప్పి ఆహ్వానపత్రం ఇచ్చారు ”నేను సంస్కృత పండితుడిని ,కవిని కాదుకదా ”అన్నా .వారు ”నేను సంస్కృతం లో ఏం కృషి చేశాను దానిపై ఉన్న అభిమానమే చాలు రండి ”అన్నారు సరేనన్నాను .వారు  ఇటీవల ముద్రించిన రెండు విలువైన గ్రంధాలు ”భారతీయ గణితశాస్త్ర చరిత్ర  మొదటి ,రెండవభాగాలు ఒక్కొక్కదానిలో వెయ్యి పేజీలున్న ఒక్కొక్కటి 750 రూపాయలున్న గ్రంధాలను నాకు ఆప్యాయంగా బహూకరించారు ,.ఇంతటి  విలువైన రిఫరెన్స్ గ్రంధాలు నాకు లభించటం నా అదృష్టం పూర్వ జనం సుకృతం వారి సౌజన్యం . .అవధాని గారిమిత్రులు శ్రీ మూర్తిగారినీ ఇక్కడ కలవటం యాదృచ్చికం . అవధానిగారు ఉయ్యూరులో కెమిస్ట్రీ లెక్చరర్ శ్రీ జోస్యుల నాగేశ్వరరావుగారికి దగ్గర బంధువట . ఫ్లోరా స్కూల్ కు 2014 లో వచ్చి మాట్లాడారట . మరొక గొప్ప వ్యక్తితో పరిచయం కలగటం నా అదృష్టం వీరి గురించి గీర్వాణం -3 రాశాను . అక్కడినుంచి బాచుపల్లి ఇంటికి చేరే సరికి రాత్రి 8-30 అయింది .ఇలా ఈ ఆదివారం సార్ధకమైంది .

ఈ విధంగా మా షార్లెట్ యాత్ర -అయిదవ అమెరికా ప్రయాణం సఫలమైంది .సాహిత్య సంగీత ,ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఎందరో మిత్రుల పరిచయం తో ,పూర్వపు వారి పరిచయాలతో యాత్ర సంపూర్ణమైంది .అయితే ఒక్కటే లోపం .మొదటి నాలుగు యాత్రలో ప్రతిసారీ కనీసం 300 ఆంగ్ల పుస్తకాలు చదివి వాటిపై నోట్స్ ప్రతిసారీ కనీసం 200 పేజీలు రాశా . అంటే కనీసం 1200 పుస్తకాలు చదివి 800పేజీల నోట్స్ రాశా .ఈ సారి ఎందుకో లైబ్రరీ మీద ఆసక్తి తగ్గింది కేవలం 40 పుస్తకాలే చదివా .కానీ ”వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాథ సూరి మనీష ”నెట్ లో రాసి  పూర్తి  చేశా .గీర్వాణం -3 లో ఇక్కడికి వచ్చి సుమారు 350 మంది సంస్కృత కవులపై రాశా . ఆధునిక ప్రపంచనిర్మాతలు డిటిపి ప్రూఫ్ రీడింగ్ చేసి తప్పులు సవరించా .స్వామి రామ్ రాసిన ‘హిమాలయన్ మాస్టర్స్ ”ఆధారం గా ఒక 8 విలువైన ఆర్టికల్స్ రాశా .ఆస్ట్రో ఫిజిక్స్ పై నాలుగు వ్యాసాలురాశా . ఇవిమాత్రమే కాస్త ఊరడింపు .అన్నిటికి మించి ”వీక్లీ అమెరికా ”శీర్షికతో వారం వారం విషయాలను 28 భాగాలుగా రాశా .నాల్గవసారి 2012 లో షార్లెట్ వచ్చినప్పటి అనుభవాలను ”అమెరికా వీక్లీ ”గా ప్రతివారం రాసి 28 భాగాలరాశా .ఈ రెండు కలిపి పుస్తకం గా తెస్తే మంచిఉపయుక్త సమాచార యాత్రా సాహిత్య గ్రంధమే అవుతుంది .సుమారు 130 పేజీలు రావచ్చు .ఆసక్తి ఉన్న స్పాన్సర్ దొరికినపుడు ఆలోచించవచ్చు .

షార్లెట్ లో మా దంపతులను అభిమానించి ఆదరించి ఆప్యాయతా ఆదరణ ఆత్మీయత చూపినవారందరికీ ధన్యవాదాలు . ముఖ్యంగా మమ్మల్ని ఇక్కడికి ఇన్నిసార్లు తీసుకొని వచ్చిన మా అల్లుడు కోమలి సాంబావదాని మా అమ్మాయి చి సౌ విజయలక్ష్మి లకు  మా మనవాళ్ళు చి శ్రీకేత్ ఆశుతోష్ ,పీయూష్ లకు శుభాశీస్సులు .నిజం చెప్పాలంటే మేముఇక్కడికి వచ్చి మా అమ్మాయికి చేసిన సాయం యేమాత్రమూలేదు .కొద్దిగా మా శ్రీమతి వంటపనిలో సాయం చేసి ఉండవచ్చు .నేను మాత్రం నా ”కంపు ”గొడవతప్ప అంగుళం బయటికి  వచ్చి చేసిందిలేదు కనీసం మొక్కలకు నీళ్లు కూడా పట్టేవాడినికాదు మా అమ్మాయి చేయమని చెప్పదు .కానీ కుర్చీలోంచి లేస్తే కొంపమునిగిపోతుందేమోనని దానికే అంటుకు పోయేవాడిని .రెండే రెండు సినిమాలు 1-”బాహుబలి ”బాహుబలి 2-దువ్వాడ జగన్నాధం చూసాం . ఉదయం సాయంత్రం కాసేపు నడక నడిచేవాడిని ఎంత సేపు అనుకొన్నారు ?బాత్ రూమ్ కు వెళ్లోచ్చినంత సేపే .

టెయిల్ పీస్ -నల్లులతో కాపురం
  షార్లెట్ సాయి సెంటర్ వారు రాలీవారు అందరూకలిసి రాలీ లో నిర్వహించిన రిట్రీట్ కార్యక్రమానికి వెళ్లిన మేము రెండు రాత్రులు హోటల్ గదిలోఉండాల్సివచ్చింది .అప్పటికి మేము ఇక్కడికి వచ్చి నెలన్నర అయి ఉంటుంది .ఒళ్ళుమరచి నిద్రపోయాం .రిట్రీట్ నుంచి వచ్చాక ఏదో కుడుతోందే అనిపించటం  ఏం లేదులే అనుకోని కొన్నినాళ్లు గడిపాం . నాకంటే మా ఆవిడ చాలా సెన్సిటివ్ ఆవిడకు నిద్రపట్టక నల్లులు కుడుతున్నాయని తెలుసుకొని హాల్ లో సోఫాలో పడుకునేది .కోడిఒక కోనలో -పుంజు ఒక కోనలో ”’లాగా . ‘నేను నల్లులతో కాపురం  చేసి బాధ భరించలేక అర్ధరాత్రిలేచి దుప్పటిలోదిండులో చూస్తే నల్లులు హాయిగా కాపురం చేస్తూ నారక్తం మరిగి తెగ బలిసికనిపించాయి .మాఅమ్మాయికి చెపితే ఫిట్ లాంటిది తెచ్చి కొట్టింది ,పరుపులు  దుప్పట్లు  ఎండలో వేసి ,ణవాషింగ్ మెషీన్ లో ఉతికాము .కొంత నయం అనిపించింది ఒక వారం తర్వాత మళ్ళీ  సీను మామూలే .మళ్ళీ ఉతుకుడు చంపుడు కొట్టుడు కార్యక్రమం చేసి నల్లుల రూపుమాపా . చివరి మూడువారాలు నల్లులబాధ లేదు . ‘ఈ నల్లులన్నీ రాలీ రిట్రీట్ హోటల్ నల్లులు అని తేల్చాము . అందుకే వాటికి ”రిట్రీట్ నల్లులు ”అని ముద్దుపేరుపెట్టా . ‘ఊసుల్లో ఉయ్యూరు ”లో మా ఇంట్లో పెరిగిన నల్లి ,పిల్లి బల్లి గురించి అదే శీర్షికతో ఆర్టికల్ రాశా .చదివే ఉంటారు .
                    ఐదునెలల మామిడి సీజన్
  ఈ సారి షార్లెట్ అనుభవం లో చిరస్మరణీయమైన మరో విషయం ఉంది .మార్చి 30 న ఉయ్యూరు లో రసం మామిడి పండు తినటం మొదలుపెట్టి ,ఏప్రిల్ 1 హైదరాబాద్ వచ్చేటప్పుడు 100 మామిడిపళ్ళు కొని తీసుకు వెళ్లి 6 వ తేదీ వరకు పూటుగా తింటూ తర్వాత అమెరికా చేరాం .అక్కడ మా అమ్మాయి పటేల్ బ్రదర్స్ లో రోజూ మామిడిపళ్ళు బట్టలకు బుట్టలు కొని తెచ్చిపడేస్తూ మాతో తెగ తినిపించింది .గున్నమామిడి ఏమిటో తెలీదుకానీ షార్లెట్ లో ”దున్నమామిడి ”పళ్ళు బాగా వచ్చేవి మహా రుచిగానూ ఉండేవి .ఈ మామిడి మేత మార్చి నుంచి సెప్టెంబర్ 15 వరకు సాగింది మా జీవితం లో ఇదే ”లాంగెస్ట్ మామిడి సీజన్ ”దీనికి కారకురాలు మా అమ్మాయే దొరికిన మామిడిపళ్లే .ఇదొక రికార్డ్

మా మనవడు సంకల్ప్ షార్లెట్ యూనివర్సిటీ లో ఎంఎస్ చేయటం వాడి గ్రాడ్యుయేషను మేము ఉండటం  వాడికి  వెంటనే  చికాగో లో ఉద్యోగం రావటం వాడి అదృష్టం మా అల్లుడు అమ్మాయి ప్రోత్సాహం .మాత్రమే .సరసభారతి సభలు నాలుగు షార్లెట్ లో జరపటం  అందులో చివరిదైన 108 వది అక్టోబర్ 1 ఆదివారం మధ్యాహ్నం 2-30 నుంచి రాత్రి 7-30 వరకు 5 గంటలు సరసభారతి నిర్వహించిన ”దసరా సరదా సాహితీ కదంబం ”ఆద్యంతం ఆనందాన్ని సంతృప్తినిచ్చి చిరస్మరణీయంగా నిలిచింది . షార్లెట్ లో సరసభారతి అనుబంధ శాఖ ఏర్పడింది .ఇంతకు  మించి ఆనందం ఇంకా ఏమి ఉంటుంది ? ఇక్కడి సాహితీ మిత్రులకు  మా సువర్చలాన్జనేయస్వామి యెడల ఉన్న అచంచల భక్తి విశ్వాసాలకు ,సరసభారతిపై గల ఆసక్తి ఆదరణకు అభినందనలతో ధన్యవాదాలు తెలియ జేస్తూ వీక్లీ అమెరికా కు ముగింపు పలుకుతున్నాను .”వీక్లీ ” లో నేనేదో ఉబుసుపోకకు  రాస్తుంటే ఆసక్తిగా చదువుతూ ”అంకుల్ ఏం రాశారంకుల్ ! సూపర్బ్ .మెం తెగ చదువుతున్నాం ”అని నన్ను” ఉబ్బేసి” నిజమేననుకొని నేను నమ్మేసి మరింత రెచ్చిపోయి రాసినా చదివిన అమాయకులందరికి అభినందనలు.  మేము 11 బుధవారం రాత్రికి బస్ లోహైదరాబాద్ మల్లాపూర్ నుంచి బయల్దేరి 12 గురువారం ఉయ్యూరు చేరుకొంటాము .అందరికి మరొక్కసారి శుభాభినందనలు తెలియజేస్తూ —

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-10-17 -కాంప్-బాచుపల్లి -హైదరాబాద్

దీనిని 8 రాత్రి 9-30 కు రాయటం ప్రారంభించి అర్ధరాత్రి 1 -45 కుదాదాపు 4 గంటలు రాసి పూర్తి చేశా .

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

2 Responses to వీక్లీ అమెరికా -28(చివరిభాగం ) (2-10-17 నుండి 8-10-17)-రెండవభాగం (చివరి భాగం )

 1. ramagunturu says:

  బ్రహ్మశ్రీ ప్రసాదు వారికి నమస్కారములు. మీ జాలగూడు (website) లోకి రావటం అనుకోకుండా జరిగినా, నేను మీ యాత్రారచనను ఆసక్తిగా పఠిస్తున్నాను. అక్టోబరు 30 నాటికి నేనూ, నా ధర్మపత్నీ, నాలుగు నెలల అమెరికా నివాసం తరువాత హైదరాబాదు చేరుకొంటాము. ఆతరువాత ఒకసారి ఉయ్యూరు వచ్చి తమ దర్శనం చేసుకొంటాను.
  ప్రణామాలు.
  గుంటూరు శ్రీనివాస రామకృష్ణ (శర్మ).

  • gdurgaprasad says:

   నమస్తే శర్మాజీ – మీ రాక మాకు ఆనంద దాయకం -స్వాగతం -దుర్గాప్రసాద్

   2017-10-09 7:20 GMT+05:30 సరసభారతి ఉయ్యూరు :

   >

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.