శ్రీ శంకరుల ‘’శివానంద లహరి ‘’ఆంతర్యం -1
శివానంద లహరి అనటం లోనే గొప్ప ఆంతర్యం ఉంది .శివఅంటే శివుని యొక్క , శివా అంటే అమ్మవారి యొక్క ఆనంద ప్రవాహం అని భావం . అంటే అయ్యగారి ,అమ్మగారి ఆనంద రస ప్రవాహం అన్నమాట . దాన్ని చదువుతుంటే మనం ఆ ఆనందాన్ని సంపూర్ణంగా అనుభవిస్తామని అర్ధం .’’గుహాయాం గేహేవా బహిరపి ‘’అనే శ్లోకం లో ఎవడు తన అంతః కరణాన్నిసమర్పిస్తాడో వాడు పరమ యోగి అన్నారు శంకరులు .కీటకం అంటే పురుగు తాను మట్టి గూడులో ఉండి ,తను తుమ్మెదగా మారాలని మనసా వాచా కర్మణా కోరుకొంటుంది ,ఉవ్విళ్ళూరు తుంది . ఇలా తలచి తలచి చివరికి భ్రమరం గా అంటే తుమ్మెద గా మారుతుంది .దీనినే భ్రమర కీటక న్యాయం అంటారు .అసలు ఇందులో ఒక తమాషా ఉంది .కీటకాన్ని తెచ్చి మట్టి గూడులో పెట్టేది భ్రమరమే .పెట్టి ,దాని చుట్టూ ధ్వని చేస్తూ నిరంతరం తిరుగుతూ ఉంటుంది .లోపలి కీటకం ఆశబ్దం వింటూ తానూ భ్రమరం కావాలని తహతహ లాడుతుంది .అది తాను కీటకం అనే స్ప్రుహనే కోల్పోతుంది .అప్పుడు చివరికి కీటకం ఆ భ్రమర నాదం లో లీనమై పోయి భ్రమరం గా మారుతుంది .కనుక మన సర్వ దేహ ఇంద్రియాలను కీటకంలాగా సర్వ సర్పణ చేస్తే ,అదే ధ్యాసలో ఉంటే పరమాత్మగా మారుతాం ,ఆయనలో లీనమైపోతాం .ఈ విషయాన్నే ఆది శంకరులు మరో శ్లోకం లో
‘’ఆత్మాత్వం గిరిజా మతిః,పరిజనాః,ప్రాణాః,శరీరం ,గృహం –పూజాతే విషయోప భోగ రచనా ,నిద్రా సమాధిస్థితిః
సంచారః పదయోః ప్రదక్షిణ విధిః స్తోత్రాణి సర్వాగిరః –యద్యత్కర్మకరోమి తత్తదధికం శంభో తవారాధనం ‘’ అన్నారు
‘’నువ్వే నా ఆత్మ. ,పార్వతీ దేవి నాబుద్ధి .నా పంచ ప్రాణాలు నీ సేవకులు అంటే పరిజనాలు .నాశరీరమే నీ ఆలయం .విషయ సుఖాల కోసం నేను చేసే పనులన్నీ నీ పూజలే .నేను పోయే నిద్ర నీలో తదేకంగా పొందే సమాధి స్థితి .నాపాదాలు చేసే నడక అంతా నీకు చేసే ప్రదక్షిణాలు .నేను మాట్లాడే మాటలన్నీ నీ స్తోత్రాలే .మహేశ్వరా ! నేను చేసే ప్రతి చర్యా నీ ఆరాధనే అనుకొని స్వీకరించు ‘’అంటూ మనలోని 24 తత్వాలూ ఈశ్వరార్పణం గా చేస్తే ,మనలోని ఇంద్రియ లోలత్వం అంటే వ్యామోహం తొలగి మన జీవాత్మ పరమాత్మలో లీనమవుతుంది అని చెప్పారు .అప్పుడు మనకు ,పరమాత్మకు భేదం ఉండదు అంటే అద్వైత స్థితి పొందుతాం .జీవన్ముముక్తులం అవుతాం అని శంకరుల ఆంతర్యం .
మరొక శ్లోకం లో –‘’నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయనీ శ్రేయసే –సత్యాయాది కుటుంబినే ,ముని మనః ప్రత్యక్ష చిన్మూర్తయే
మాయా సృస్ట జగత్రయాయ ,సకలామ్నాయాంత సంచారిణే-సాయం తాండవ సంభ్రమాయ జటినే సేయం నతిః శంభవే’’అని స్తుతించారు .ఈ జగత్తుకు ఆధారం కారణ భూతుడు అయిన పరబ్రహ్మ నిత్యుడు అంటే ఎప్పుడూ ఉండేవాడు .అనగా సృష్టి లయ కాలం లోనూ ఆయన ఉంటాడు .ఆయన త్రిగుణాత్ముడు అంటే స్థూల ,సూక్ష్మ ,కారణ శరీరాలను జయించి అంటే వాటికి లొంగకుండా ,నాలుగవది అయిన స్వస్వరూప ఆనందం లో వెలిగి పోతూ ఉంటాడు . పార్వతీ దేవి తపస్సుకు ఆయన ఫల స్వరూపుడు .అన్నికాలాలలో ఉండే సత్య స్వరూపుడు . భక్తులను అనుగ్రహించటం కోసం ఆది కుటుంబి గా అవతరించి పార్వతీ పరమేశ్వరులు గా ఆది దంపతులై అభీష్ట సిద్ధి కలిగిస్తున్నారు . మహర్షుల అంతఃకరణాలలో అనగా మనస్సులలో మాత్రమే కనిపించే జ్ఞాన స్వరూపుడు .మాయ అనే తన శక్తితో మూడు లోకాలను సృష్టించాడు .అన్ని వేదాలలో ,వేదాంతాలలో సంచరించే బ్రాహ్మీ మయ మూర్తి ఆయన . ప్రదోష కాలం అంటే సాయంకాల సంధ్య వేళ తాండవ నృత్యం చేసే జటాజూట దారి .అలాంటి శుభాలనిచ్చే శివునికి నమస్కారం అని భావం .ఇందులో ప్రయోగించిన పదాలన్నీ అర్ధ వంతమైనవే .పరబ్రహ్మ తత్వాన్ని తెలియ జెప్పే పదాలే .
నిర్గుణ ,సగుణ పరబ్రహ్మ స్వరూపాలను శంకరాచార్య ఎలా వర్ణించారో తర్వాత తెలుసుకొందాం .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -20-10-17- ఉయ్యూరు
—