శ్రీ శంకరుల ‘’శివానంద లహరి ‘’ఆంతర్యం -2
‘’ఆద్యా యామిత తేజసే శ్రుతిపదైః వేద్యాయ సాధ్యాయతే –విద్యాయానంద మయాత్మనే ,త్రిజతస్సరంక్షణోద్యోగినే –
ధ్యేయాయాఖిల యోగిభిః సుర గణైః గేయాయ మాయావినే –సమ్యక్ తాండవ సంభ్రమాయ జటినే సేయం నతిఃశంభవే ‘’
సృష్టికి పూర్వమే ఉన్న పరబ్రహ్మ ప్రళయ కాలం లోనూ నిశ్చలంగా ఉండే మహా జ్యోతిర్లింగ స్వరూపుడు కనుక ఆది ,అంతం లేనివాడు .ఆయన తేజస్సు సాటిలేనిది .వేద వాక్యాలవలననే ఆయన తెలియ బడతాడు . భక్తులను అనుగ్రహించటానికి మాత్రమే లింగ రూపం లో దర్శన మిస్తాడు .జ్ఞానానంద స్వరూపుడు ,అన్ని లోకాల సంరక్షణ బాధ్యత ఉన్నవాడు .యోగి పుంగవుల ధ్యానానికి ఆయనే ధ్యేయం .దేవతల చేత కీర్తింపబడే మాయా మయుడు .సాయం వేళ తాండవ నృత్యానికి ఇష్టపడేవాడు .అటు వంటి శంకరునికి నమస్కారం .ఈ వర్ణన అంతా నిర్గుణ పర బ్రహ్మ వర్ణనే .మరో శ్లోకం లో సగుణ నిర్గుణ పరబ్రహ్మను వర్ణించారు శ్రీ శంకరులు –అ వైభవం చూద్దాం –
‘’త్రయీ వేద్యం ,హృద్యం ,త్రిపుర హర మాద్యం త్రినయనం –జటా భారోదారం ,చలదురగ హారం ,మృగధరం
మహా దేవం ,దేవం ,మయి సదయ భావం ,పశుపతిం –చిదానందం ,సాంబం,శివ ,మతి విడంబం ,హృది భజే ‘’
మూడు వేదాలచే తెలియ బడే వాడు ,మనోహర రూపుడు ,త్రిపురాలను అంటే స్థూల, సూక్ష్మ ,కారణ శరీరాలను సంహారం చేసేవాడు ,లేక త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించినవాడు ,ఆది పురుషుడు ,మూడుకన్నులున్న జటాధారి,గంభీరుడు ,కదులుతున్న సర్పాల ఆభారణాలు కలవాడు ,మృగం అంటే జింక ను చేతిలో ధరించినవాడు ,దేవ దేవుడు ,కరుణాళువు,అజ్ఞానాన్ని నిర్మూలించే జ్ఞాన స్వరూపుడు ,అసలు జ్ఞానానికే ఆధారమైన వాడు ,లోక క్షేమం కోసం కాలానికి తగిన రూపాలు ధరించేవాడు ,సాంబుడు అంటే –సా –అంబ -ఉమాదేవితో కూడిన వాడుఅయిన పరబ్రహ్మను నా మనసులో ధ్యానిస్తాను అని భావం .ఇందులోని పదాలు నిర్గుణ పరబ్రహ్మను తెలియ జేసే సార్ధకమైన పదాలు .నిర్గుణ పరబ్రహ్మను చేరాలి అంటే ముందుగా సగుణ పరబ్రహ్మపై సాధన చేయాలి . త్రయీ నయనం మొదలైనవి సగుణ పరబ్రహ్మను తెలియ జేస్తాయి .కనుక ఈ శ్లోకం లో సగుణ ,నిర్గుణ పరబ్రహ్మ తత్త్వం అంతా కళ్ళ ముందు ఉంచారు భగవత్పాదులు .సగుణం అంటే మనలాగా శరీర ధారణ కలవాడు అలంకారాలు,అహంకారాలు ఉండి భార్యాపిల్లలతో ఉండేవాడు .నిర్గుణ అంటే వీటికి అతీతమైనవాడు అని భావం .
సగుణ పరబ్రహ్మ తత్వాన్ని చెప్పేమరో శ్లోకం –
‘’కరలగ్న మృగః కరీంద్ర భంగో ,ఘన శార్దూల విఖండనోస్త జంతుః-గిరిశో ,విశదాక్రుతి శ్చ చేతః కుహరే పంచముఖోస్తి మే కుతో భీః’’
చేతిలో జింక కలిగి గజాసుర సంహారం చేసిన వాడు ,వ్యాఘ్రాసురుని చంపినవాడు ,పర్వతాలలో నివాసం ఉండేవాడు ,స్వచ్చమైన అతి తెల్లని రూపం ఉన్నవాడు ,పంచ ముఖ అంటే తత్పురుష సద్యోజాత వామదేవ ,అఘోర ,ఈశాన అనే ముఖ స్వరూపుడు ,ఊర్ధ్వంగా మరొక ముఖం ఉన్నవాడు అంటే విశ్వ వ్యాప్తుడైన పరమాత్మ నా మనస్సులో .ఉన్నాడు.కనుక నాకింక భయం ఎందుకు ?’’చేతః ‘’పదం ఆయన మోక్ష ప్రదాత అని తెలియ జేసేది .ఆశలు నశిస్తే చేతస్సు నశిస్తుంది .చేతస్సు నశిస్తే వచ్చేది మోక్షమే .చిత్తం నాశనమవటమే ముక్తి అని అంతర్యం .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-10-17 –ఉయ్యూరు