శ్రీ శంకరుల ‘’శివానంద లహరి ‘’ఆంతర్యం -3
‘’అంకోలం నిజ బీజ సంతతి రాయస్కా౦తో పలం సూచికా ,-సాధ్వీ నైజవిభుం క్షితి రుహం సింధుః సరిద్వల్లభం
ప్రాప్నో తీహ యధా తధా పశుపతేః పాదార వింద ద్వయం –చేతో వ్రుత్తి రుపేత్య తిస్టతిసదా సా భక్తిరిత్యుచ్యతే ‘’
ఇందులో జీవాత్మ ,పరమాత్మలస్థితి వర్ణన ఉంది.జీవుడు పరమాత్మను చేరాలి అంటే వ్యాజ భక్తి వలన ,నిర్వ్యాజ భక్తి వలన చేరాలి . ఇందులో నిర్వ్యాజ భక్తి శ్రేస్టం . శివ సాయుజ్యానికి ఇదే మంచి మార్గం .
‘’అంకోలం’’ అంటే ఊడుగు(బూరుగు చెట్టు ) చెట్టు గింజలు . దాని కాయ పక్వమై పగలగానే గింజలుచాలా తేలిక కనుక గాలిలో యెగిరిపోతూ ఉంటాయి . మేఘం ఉరమగానే భయం తో వచ్చి చెట్టు చుట్టూ పడిపోతాయి . గుండు సూది బలమైన అయస్కాంతానికి ఇట్టే ఆకర్షింప బడిఅతుక్కు పోతుంది . .పతివ్రత ఎక్కడున్నా భర్తనే ప్రేమతో ఆరాధిస్తుంది .తీగ భూమిపైకి పాకి చెట్టు లాంటి ఆధారం దొరకగానే దానికేగట్టిగా అల్లుకు పోతుంది .నదులు ప్రవహించి ప్రవహించి అలసి సొలసి చివరికి సముద్రం లో కలుస్తాయి .ఇవన్నీ ప్రకృతి సిద్ధమైన ధర్మాలు .అలాగే మానవుని చిత్త వృత్తులన్నీ భగవంతుని పాదర వి౦దాలపై లగ్నం అవటాన్ని భక్తి అంటారు .ఈ భక్తి కలగటానికి కారణం భయం .కనుక ఇది వ్యాజ భక్తి . వ్యాజం అంటే నెపం .కాని నది సముద్రం లో కలవటం లో భక్తి పరా కాష్టకు చేరుతుంది .ఎందుకంటె ఇక్కడ నది సముద్రం లో కలవగానే దాని అస్తిత్వాన్ని కోల్పోతుంది .తానె సముద్రం అవుతుంది .దీనికి కారణం, నెపం ఉండవు. కనుక ఇది నిర్వ్యాజ భక్తి .మనం కూడా పరమేశ్వరుని చేరితే మన అస్తిత్వం ఇక శూన్యమే అయి మనం పరమాత్మ స్వరూపులమే అవుతాం .ఇంతటి అంతరార్ధం పై శ్లోకం లో ఇమిడ్చారు శ్రీ శంకరులు .
మరి భక్తి మనకేమైనా చేస్తుందా ?చేస్తుంది .ఇది చెప్పటానికే మరొక శ్లోకం రాశారు .
‘’ఆనదాశ్రుభిరాత నోతిపులకం ,నైర్మల్య తశ్చాదనం –వాచా శంఖ ముఖ స్థితైః చ జఠరాం
రుద్రాక్షైః భసితేవ దేవ ! వపుషోరక్షాం భవద్భావనా –పర్యం కే వినివేశ్య భక్తి జననీ భక్తార్భకం రక్షతి ‘’
భక్టి కూడా మనకు శివ మంత్రాన్ని ఉపదేశించి ,భస్మంతో రక్ష కలిగించి, అభయ ప్రదాత్రి అవుతుంది. అర్భకు లైన భక్తులను రక్షించే దయామయి భక్తి . అని భక్తి యొక్క పరమ పూజ్యత్వాన్ని స్పష్టంగా తెలియ జేశారు .భక్తికి అసాధ్యం అంటూ ఏదీ లేదు .
‘’ఆకీర్ణేనఖరాజి కాంతి విభవై రుద్యత్సుధా వైభవైః-రాధౌతే పి చ పద్మ రాగ లలితే హంస వ్రజై రాశ్రితే
నిత్యం భక్తివధూ గణైశ్చ రహసి స్వేచ్చావిహారం కురు –స్థిత్వా మానస రాజహంస గిరిజా నాధా౦ఘ్రి సౌధాంతరే’’
శివుని పాద పద్మాలు ఒక భవనం లాంటిది .అది పరమ శివుని కాలి గోళ్ళ కాంతితో ప్రకాశిస్తుంది .చంద్రుని అమృత కిరణాల వైభవం తో కడగ బడుతుంది. కనుక అత్యంత స్వచ్చంగా తెల్లగా ప్రకాశిస్తుంది . పద్మ రాగ మణుల తో కలిసి ఎర్రగా లలితంగా శోభిస్తుంది . దేహ జ్ఞానం లేని పరమ హంసలకు అది ఆశ్రయ భూమి .ఆ సుందర రమ్య హర్మ్యం లోకి భక్తిఅనే కొత్త పెళ్లి కూతురుతో ప్రవేశించి అన్నీ మరచి హాయిగా విహరి౦చ వే ఓ మనసా అని భావం .అంటే భక్తిని భార్యగా భావించమని ఆంతర్యం .
భక్తి ధేనువు అంటూ మరో శ్లోకమూ చెప్పారు –
‘’అమిత ముద మమృతం ముహు ర్దుహంతీ-విమల భవత్పద గోష్ట మా వసంతీం
సదయ పశుపతే సుపుణ్య పాకాం-మమ పరిపాలయ ,భక్తీ ధేను మేకాం’’
నీ పాదాలపై ఉన్న భక్తి గోవు లాంటిది .నీ పరమ పవిత్రమైన నిర్మలమైన పాదాలు అనే గోశాలలో సురక్షితంగా ఉంటోంది . ఎన్నో జన్మల పుణ్యం వలన అది నాకు లభించింది .ఈ భక్తి గోమాత నాకు మాటి మాటికీ ఆనందామృత౦ అనే శుద్ధమైన క్షీరాన్ని హాయిగా పిండుకోనిస్తోంది. నన్నూ ఈ భక్తి ధేనువు ను సదా రక్షించు.
గడ్డి తిని ఆవు అమృతం లాంటి పాలు ఇస్తుంది .గోవు నుండి వచ్చే ప్రతి ద్రవ్యమూ పవిత్రమైనదే .అలాగే భక్తి కూడా నిరంతరం స్రవించే తైలధార .ఇది పరమాత్మ పాదాలు అనే గోశాలలో సురక్షితంగా ఉంది .నన్నూ ఆ భక్తి ధేనువును నిరంతరం రక్షించి కాపాడి,కైవల్యం ప్రసాదించు అని ఆంతర్యం .భక్తిమామూలు గోవు కాదు .కోరికలు తీర్చే కామ ధేనువు అన్నీ అనుగ్రహించే చింతామణి ,కైవల్య సంధాయిని అని శంకరుల ఆంతర్యం .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -22-10-17- ఉయ్యూరు
—