శ్రీ శంకరుల ‘’శివానంద లహరి ‘’ఆంతర్యం -4
భక్తి ధేనువు ,రక్షా అని చెప్పిన శంకరులే భక్తిఒక తీగ ,ఒక సంకెల ,ఒక త్రాడు ,ఒక పంట అని కూడా చెప్పారు .
‘’ఆనందామృత పూరితా ,హర పదాంభోజా లవాలోద్యతా –స్థైర్యోపఘ్నముపేత్య ,భక్తిలతికా ,శాఖోపశాఖాన్వితా
ఉచ్ఛైః మానస కాయమాన పటలీ మాక్రమ్య నిష్కల్మషా-నిత్యాభీష్ట ఫలప్రదా భవతు మే సత్కర్మ సంవర్ధితా ‘’
భక్తి ఒక తీగ .అది ఆనందం అనే అమృతం తో ని౦పబడింది . అది పర మేశ్వరుని పాద పద్మాలు అనే పాదులో పుట్టి పెరిగింది .స్థిర చిత్తం అనే గట్టి కంప ను పట్టుకొని ,చిక్కగా అల్లుకు పోయి ,శాఖోప శాఖలుగా పెరిగి పోయింది .స్వచ్ఛ ఉన్నత మైన మనస్సు అనే పందిరిని ఆక్రమించింది .చీడ పీడలు లేకుండా పరమేశ్వర చింతనం తో ఏపుగా పెరిగి,కోరిన కోరికలను ప్రతి రోజూ ఇస్తోంది .పుణ్య కర్మలతో ఈ తీగ వృద్ధి చెందుతోంది .అంటే భక్తిఒక తీగగా ఉండి పుణ్యాలను సముపార్జించి పెడుతోంది అని ఆంతర్యం .భక్తితీగ పాకుతూ పోయి శిఖరాగ్రం చేరి కైలాస వాసి ,వాసిని అయిన ఉమా మహేశ్వరుల సన్నిధానానికి చేర్చి ,ఇక వదిలి పెట్టకుండా అక్కడే పరమేశ్వర పాద పద్మ లగ్నమై ఉండి పోతుంది అని ఆంతర్యం .
భక్తిఒక శ్రు౦ఖల అన్నారు కదా –అదెట్లాగో చూద్దాం –
‘’ధైర్యా౦కుశేన నిభ్రుతం –రభసాదాకృష్య భక్తి శ్రుంఖలయా
పురహర ,చరణాలానే-హృదయ మదేభం బధాన చిద్యంత్రైః’’
భవానీశంకరా !నా మనసు ఒక మదపు టేనుగు .అయినా నీ చేతిలో అంకుశం ఉందికదా అనేధైర్యం తో ఉన్నాను .నన్ను నీకు బంధించుకోవాలను కొంటే భక్తిఅనే గొలుసు ఉండనే ఉంది .మరి కట్టెయ్య టానికి ఒక గుంజకాని స్థంభం కాని కావాల౦టావా –ఉందిగా నీ పాదం. అదే కట్టు గొయ్య .బంధించటానికి యంత్రం ఏదీ అంటావా ? అదే జ్ఞానం అనే యంత్రం .అంటే మనం భగవంతునికి జ్ఞాన యంత్రం తో బంధింపబడాలి . మదం ఉన్న ఇభం అంటే మదేభం అంటే మదించిన ఏనుగు .దీన్ని అంటే మదహంకారాన్ని తొలగించుకోవాలి అంటే భక్తిమాత్రమే సాధనం అని ఆంతర్యం .
దీని తర్వాత శ్లోకం లో కూడా మనసు మదపు టేనుగు అని దాన్ని కట్టెయ్యటానికి భక్తిత్రాడుగా ఉపయోగ పడుతుందనీ చెప్పారు –
‘’ప్రచరత్న భితః ప్రగల్భ వృత్త్యా –మదవా నేష మనః కరీ గరీయాన్
పరిగృహ్య నయేన భక్తిరజ్జ్వా –పరమ స్థాణుపదం దృఢం నయాముమ్’’
దేవాదిదేవా సర్వేశ్వరా !మదపు టేనుగు లాంటి నామనసు కు హద్దూ పొద్దూ లేదు .విశ్రు౦ఖలంగా స్వేచ్చా విహారం చేస్తోంది .నాలో భక్తికలిగించి ఆ భక్తిఅనే త్రాడుతో స్థిరమైన నీ పాదానికి కట్టేసెయ్యి .
అస్థిరమైన తమోగుణానికి ఏనుగు ప్రతి రూపం .కామ క్రోధాలకు చిహ్నం .ఇంతటి దురహ౦కారమైన నా మనసుకు నీతి బోధించి నీ పాదానికి కట్టేయ్యి. శివ పాదం అంటే స్థాణు పదం .దాన్ని పొందించు .అది మోక్షదాయకం అని, అందరూ దానినే ఆశ్రయించాలని శంకరుల ఆంతర్యం .
భక్తి త్రాడు మనసు కలశం అని మరో శ్లోకంలో అన్నారు –
‘’భక్తో భక్తిగుణావృతే ముద మృతాపూర్ణే ప్రసన్నే మనః –కుంభే సాంబ తవాంఘ్రిపల్లవ యుగం సంస్థాప్య సంవిత్రులం
సత్వం మంత్ర ముదీరియన్ నిజ శరీరా గార శుద్ధిం వహన్ –పుణ్యాహం ప్రకటీ కరోమి రుచిరం కళ్యాణ మాపాదయన్ ‘’
సాంబ శివా !నేను మోక్షం అనే కల్యాణం చేసుకో దలచాను .దీనికి ముందు స్వస్తి పుణ్యాహవాచనం చేసుకోవాలి కదా .దాన్ని ప్రారంభిస్తూ నా మనసును కలశం గా చేసి ,దాన్ని సంతోషం అనే అమృత జలం తో ని౦పు తున్నాను .ఇక నాకు వేరే ఆలోచనలే లేవు .భక్తిని త్రాడుగా అంటే సూత్రంగా ఆ కలశానికి చుడుతున్నా .పరమేశ్వరుని పాదాలను మామిడి చిగుళ్ళు గా ఆ కలశం లో ఉంచుతున్నా .ఆహ౦కారం బ్రద్దలవ్వాలంటే జ్ఞానం కావాలి కదా –కనుక జ్ఞానాన్నికొబ్బరి కాయగా ఉంచుతున్నా .మరి మంత్రంఅంటావా ‘’ఓం నమశ్శివాయ ‘’అనే ప్రణవ శివ పంచాక్షరి మంత్రం ఉండనే ఉందిగా –ఆ మంత్రాన్ని జపిస్తున్నా. వీటన్నిటితో నా దేహం అనే ఇంటిని ,అన్తఃకరణాలను శుభ్రం చేసి పవిత్ర వంతం చెయ్యి .ఈ ప్రక్రియ ఫలం అంతా నీకే సమర్పిస్తున్నా .దయతో గ్రహించు .ఇదే నాజీవితం లో జరిగే ఏకైక శాశ్వత మోక్ష కళ్యాణ ఘటన .
ఈ విధంగా భక్తిఅనే త్రాడుతో ప్రతి ఒక్కరూ మోక్ష కల్యాణాన్ని జరుపుకోవాలని ఆంతర్యం .
చివరగా భక్తి ఒక పంట గా ఎలా చెప్పారో చూద్దాం –
‘’ధీ యంత్రేణ,వచో ఘటేనకవితా కుల్యోప కుల్యాక్రమై –రానీతైశ్చ,సదా శివస్య ,చరితాంభో రాశి దివ్యామృతైః
హృత్కేదార యుతాశ్చ భక్తి కలమా స్సాఫల్య మాతన్వతే –దుర్భిక్షా న్మమ సేవకస్య భగవన్విశ్వేశ భీతిః కుతః’’
శివా ! నా హృదయం ఒక పొలం . నీ చరిత్ర ఒక సముద్రం .కాని అందులోని నీరు ఉప్పునీరుకాదు –దివ్యామృతజలం.ఈ అమృత జలాలను కవితలు అనే పంట కాలువలద్వారా ప్రవహింప జేయాలి .వాక్కులు అనే కడవలతో ఆజలాన్ని నింపాలి .బుద్ధి అనే యంత్రం తో మోటబావిలో లాగా పైకి తోడాలి .అలా తోడిన అమృత ధారలను నా హృదయం లో నింపితే భక్తిఅనే పంటలు పండుతాయి .
జన జీవనానికి ఆధారం పంట .అలాగే అద్వైత జీవితానికి ఆధారం భక్తి.మనసు శివ జ్ఞానం తో నిండితే భయం అనేది ఉండదు .అద్వైత సిద్ధి కలుగుతుంది , తరి౦ప జేయటానికి భక్తిమార్గం ఉత్క్రుస్టమైనది అని శ్రీ శంకరుల ఆంతర్యం .అందుకే’’ భక్తిరేవగరీయసి ‘’అన్నారు శంకరాచార్య .
సశేషం
నాగుల చవితి శుభా కాంక్షలతో
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -23-10-17- ఉయ్యూరు