శ్రీశంకరుల శివానంద లహరి ఆంతర్యం -5
శివానంద లహరిలో నవ విధ భక్తి కి శంకరులు చెప్పిన శ్లోకాలు
1- వందనం –‘’కలాభ్యాం చూడాలంకృత శశి కలాభ్యాం నిజతఫః –ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే
శివాభ్యా మస్తోక త్రిభువన శివాభ్యాం హృది పున-ర్భవాభ్యామానంద స్పురదనుభవాభ్యాం నతి రియం ‘’
శివునికి, శివా కు నమస్కారం .ఆ ఆది దంపతులు సకల వేద విద్యా స్వరూపులు .సిగపై చంద్ర కళ కలవారు .ఒకరి తపస్సుకు మరొకరు ఫలంగా లభించినవారు .భక్తులు కోరే ధర్మార్ధ కామ మోక్షాలను ప్రసాది౦చేవారు .మంగళప్రదులై ముల్లోకాలకు అనంత శుభాలనిచ్చేవారు .ధ్యానిస్తే హృదయం లో గోచరించేవారు .ఆనంద స్వరూపులే కాకుండా మనకూ ఆనందాన్ని కలిగించేవారు అయినశివా శివులకు నమస్కారం .
దీనితో పాటు 50 ,51 ,56 శ్లోకాలు కూడా వందనానికి ఉదాహరణలే .’’శివాభ్యాం ‘’అనే మాటలో ఒకే రూపం లో ఉన్న శివ పార్వతులు పరబ్రహ్మ తత్వంగా భావించాలని శ్రీ శ౦కరుల ఆంతర్యం.ఈ శ్లోకం నుంచి 27 వ శ్లోకం వరకు శిఖరిణీ వృత్తం లో రచించారు .27 సంఖ్య నక్షత్రాలకు సంకేతం .అంటే కాల చక్ర స్వరూప దర్శనం చేయించారని భావించాలి .
2- శ్రవణం –‘’దూరీ కృతాని దురితాని దురక్షరాణి-దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వ చాంసి
సారం త్వదీయ చరితం నితరాం పిబంతం –గౌరీశ మామిహ సముద్ధర సత్కటాక్షైః’’
గౌరీశా !నా పాపాలు ,దుఖం దౌర్భాగ్యం దురహంకారం తో వచ్చే చెడ్డమాటలు ,అన్నీ నీ దయ వలన దూరమై పోయాయి . నిత్యం నీ చరిత్రను పానం చేస్తున్న నన్ను ఉద్ధరించు .సంసార లంపటం నుంచి తరింప చేయి .
ఇక్కడ శివ చరిత్ర స్మరణ యిచ్చే ఫలితం చెప్పారు .శివ చరిత్ర గ్రోలితే లభించేది శివానంద లహరి అని ఆంతర్యం .
3- కీర్తనం –‘’కదావా కైలాసే కనక మణి సౌధే సహ గణైః-వసన్ శంభో రగ్రే స్ఫుట ఘటిత మూర్ధాంజలి పుటః
విభో ,సాంబ స్వామిన్ పరమ శివ పాహీతి నిగదన్ –విధాత్రూణా౦ కల్పన్ క్షణ మివ వినేష్యామి సుఖతః ‘’అది కైలాసం లో బంగారు భవనం అందులో మణులు కూర్చబడి అందంగా ప్రకాశమానంగా ఉంది .పరమశివుడు ఆ భవనం లో ఉన్నాడు .ఆయన ముందు శిరస్సుతో అంజలి ఘటిస్తూ ‘’ఓ విభో సాంబ సదాశివా పరమ శివా పాహి పాహి ‘’అంటూ బ్రహ్మ కల్ప కాలాలను క్షణ మాత్రం గా ఎపుడు గడుపుతానో కదా అని శంకర భాగవత్పాదులు ఆర్తిగా కీర్తిస్తున్నారు .
నిజానికి ఇదే శివానంద లహరి అంటే కైలాస వాస వాంఛ.శివ సన్నిధిలో ఒడలు మరచి పోవటం కీర్తనలో పరవశించటం .అంతకంటే జీవి కోరుకొనే ఉత్కృష్ట పదవి ఏదీ లేదని ఆంతర్యం .
4-స్మరణం –‘’నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకతా-పశుత్వం ,కీటత్వం భవతు విహగత్వాది జననం
సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానంద లహరీ –విహారాసక్తం చేద్ధృదయ మిహ కిం తేన వపుషా ‘’
పరమేశా !నేను మనిషిగా దేవునిగా ,పశువుగా ,పురుగు గా ,పక్షిగా జన్మించినా సరే ,ఏ జన్మ లోనైనా నీ పాద పద్మాలను స్మరించి పరమాన౦దాన్నిపొందుతూనే ఉండాలి .దానిలో నా హృదయం హాయిగా విహరించాలి .ఉపాధి అంటే దేహం ఏ రూపం లో ఉన్నా పరమేశ్వర పాదారవింద స్మరణ చేయాలని ఆంతర్యం .
5-పాద సేవనం –‘’నిత్యం యోగి మనస్సరోజ దళ సంచార క్షమస్త్వత్క్రమ-శ్స్శంభో ,తేన కథం కఠోర యమరాడ్వక్షః కవాట క్షతి –
రత్యంతం మృదులం త్వదంఘ్రి యుగళం హా మే మనశ్చింతయ-త్యేతల్లోచన గోచరం కురు విభో హస్తేన సంవాహయే ‘’
పశుపతీ ! అత్యంత కోమలమైన నీ పాదాలు అతి సున్నితాలు .యోగీశ్వరుల హృదయ పద్మాలపై సంచరించే కుసుమ కోమలాలు. అలాంటి నీపాదాలు అతి కఠినమైన తలుపు చక్కలాంటి యముని వక్షస్థలాన్నిఎలా తన్నగలిగాయి ? తన్ని అసలు కందిపోకుండా ఎలా తట్టు కో గలిగాయి? అని నా మనసు శంకిస్తోంది .నీ లలిత కోమల పాదాలు నాకు కనిపించేట్లు చేస్తే నీ బాధ ఉపశమింప జేయటానికి వాటిని నా చేతులతో చక్కగా ఒత్తి సేవిస్తాను .ఆ అనుగ్రహం నాకు ప్రసాదించు .
భక్తుడైన మార్కండేయుని ప్రాణాలు హరి౦చటానికి యమ ధర్మ రాజు వస్తే శివుడు యముని వక్షస్థలాన్ని పాదం తో తన్ని తగిలేశాడు .భక్త రక్షణకు పరమ శివుడు ఎంతటి బాధనైనా భరిస్తాడని ఆంతర్యం .
6-అర్చనం –‘’36 వ శ్లోకం –‘’భక్తో భక్తి గుణా వృతే –‘’దీన్ని గురించి ఇదివరకే చెప్పుకొన్నాం
7 దాస్యం –‘’కదావా త్వాం దృష్ట్వా గిరిశ తవ భవ్యా౦ఘ్రి యుగళం –గృహీత్వా హస్తాభ్యాం శిరశి నయనే వక్షసి వహన్
సమాశ్లిష్యాఘ్రాయ స్పుట జలజ గంధాన్ పరిమళా- నలభ్యాం బ్రహ్మాద్యై ర్ముద మనుభవిష్యామి హృదయే
గిరీశా శివా !నీ పవిత్ర పాదార వి౦దాలను నేను చేతులతో పట్టుకోవాలి . వాటిని నాశిరస్సు మీద పెట్టుకోవాలి .కళ్ళకు అద్దుకోవాలి. నా గుండెలమీద ఉంచుకోవాలి .వాటిని గట్టి గా నేను ఆలింగనం చేసుకోవాలి .నీపాద పద్మాల పరిమళాలను నేను ఆఘ్రాణి౦చాలి . ఇంతటి మహద్భాగ్యం బ్రహ్మమొదలైన దేవతలకు కూడా లభించదు .అలాంటి నీ పాద సేవలో నేను బ్రహ్మానందం అనుభవించాలి .అంతటి పరమ సౌభాగ్యం నాకు ఎప్పుడు నువ్వు అనుగ్రహిస్తావో ?
ఇందులో పరబ్రహ్మ చుట్టూ పరిభ్రమించాలానే ఆరాటం ఆవేదన పరబ్రహ్మనై పోవాలన్న తపన ఉండటం తో భక్తి పరాకాష్టకు చేరి ‘’అహం బ్రహ్మాస్మి ‘’ భావం కలుగుతుందని ఆంతర్యం .
8- సఖ్యం –‘’సారూప్యం తవ పూజనే శివ ,మహాదేవేతి సంకీర్తనే –సామీప్యం శివ భక్తి ధుర్య జనతా సాంగత్య సంభాషణే
సాలోక్యం చరాచరాత్మక తను ధ్యానే భవానీ పతే –సాయుజ్యం మమ సిద్ధ మత్ర భవతి స్వామిన్ ,కృతార్దోహం ‘’
పరమశివా ! నిన్ను పూజిస్తూ సారూప్య ముక్తిని ,నిన్ను కీర్తించేటప్పుడుసామీప్యముక్తిని ,నీ భక్తుల స్నేహం తో సంభాషణం తో సాలోక్య ముక్తిని ,కదలలేని పర్వతాదులలో నిన్ను దర్శించి ధ్యానం చేసి సాయుజ్య ముక్తిని ,పొందుతున్నాను .
పూజ సేవ లలో ‘’సోహం భావేన పూజయేత్ ‘’అనే భావం ఉండాలని ఆంతర్యం అప్పుడే అభీస్ట సిద్ధి .
9-ఆత్మ నివేదనం – ‘’కరస్థే హేమాద్రౌ గిరిశనికటస్థే ధన పతౌ –గృహస్థే స్వర్భూజామర సురభి చింతామణి గణై
శిరస్థే శీతాంశౌ చరణ యుగళ స్థేఖిల శుభే –కమర్ధం దాస్యే హం భవతు భవదర్ధం మమ మనః’’
నువ్వు ఉండేది వెండి కొండ మీద నీకు అందుబాటులో బంగారు కొండమీద . నీ కనుసన్నలలో కుబేరుడు ,కామధేనువు కల్ప వృక్షం ,చింతామణి అన్నీ జ్వాజ్వల్యంగా ప్రకాశిస్తున్నాయి .నీ శిరసుపై వెన్నెల వెదజల్లే చంద్ర వంక . సమస్త సన్మంగళాలునీ పాద సమీపం లో ఉన్నాయి .ఇక నీకు ఇచ్చేందుకు నా దగ్గర ఏముంది స్వామీ . అయితే నా మనసు ఒక్కటే ఉంది.దాన్ని మాత్రం నీకు ఇవ్వగలను .తీసుకొని అనుగ్రహించు అంటూ ఆత్మ నివేదన తెలియ జేశారు శ్రీ శంకర భగవత్పాదులు.
చివరగా –‘’త్వత్పాదాంబుజ మర్చయామి పరమం త్వాం చింతయా మ్యన్వహం –
త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో
దీక్షాం మే దిశ చాక్షుషీం స కరుణాం దివ్యైశ్చిరంప్రార్దితాం
శంభో లోక గురో మదీయ మనస స్సౌఖ్యోప దేశం కురు ‘’
లోకానికే గురువైన సాంబశివా .నీ పాదాలనే అర్చిస్తున్నా.నిన్నే మనసులో ఎప్పుడూ చింతిస్తున్నా.నిన్నే శరణు వేడుతున్నా .వాక్కులతో నిన్నే స్తుతిస్తున్నా .దేవతలే నీ కరుణ కోసం నిరీక్షిస్తూ ఉంటారు .వారిపై చూపే కారుణ్యం నాపై కూడా చూపించు .నేను చిన్నవాడిని అనుకో వద్దు మనసుకు సౌఖ్యం కలిగే ఉపదేశాన్నివ్వు .నువ్వు లోక గురుడవు .కనుక నాకూ గురువు నీవే .నేను తరించే శాశ్వత సందేశాన్నిఇచ్చి ,శాశ్వత సుఖాన్ని ప్రసాదించు .
పరబ్రహ్మ జ్ఞానోపదేశం చేసి శాశ్వత ముక్తిని ప్రసాదించమని ఆంతర్యం .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-10-17-ఉయ్యూరు