శ్రీశంకరుల శివానంద లహరి ఆంతర్యం -6
నాలుగు రకాల భక్తులకు ఉమా మహేశ్వరుడే శరణు అంటూ వారి విషయమై శంకరాచార్య వివరిస్తున్నారు .’’ఆర్తో ,జిజ్ఞాసు ,రర్ధార్ధీ,జ్ఞానీ చ భరతర్షభ ‘’అని గీతలో భగవాన్ కృష్ణ పరమాత్మ నలుగురు భక్తులను పేర్కొన్నాడు .
1-ఆర్తుడు – ఆర్తుడు అంటే దుఖం తో బాధ పడేవాడు .
‘’అసారే సంసారే నిజ భజన దూరే జడధియా-భ్రమంతం మాం మంథం పరమ కృపయా పాతుముచితం
మదన్యః కో దీనస్తవ కృపణ రక్షాతి నిపుణః-త్వదన్యః కో వా మే త్రిజగతిశరణ్యః పశుపతే ‘’
‘’స్వామీ శివా !స్వస్వరూప జ్ఞానం లేని మూఢుడను నేను .అంథుడను .దయతో ఈ దీనుడిని రక్షించు .ఈ ప్రపంచం చావు ,పుట్టుకలతో కూడి బాధామయంగా ఉంది.ఇందులో సారం అంటే రుచి లేనే లేదు .నేనెవరినో ,ఎక్కడి నుంచి వచ్చానో ,మళ్ళీ ఎక్కడికి చేరుకోవాలో తెలుసుకో లేక పోతున్నాను .దేహమే నేను అనే భ్రాంతి లో పడి కొట్టుకొంటున్నాను .కించిత్తు కూడా ఆత్మ జ్ఞానం లేని వాడిని .ఆత్మ చింతన లేకపోవటం తో ఈ ప్రపంచం నిత్యం, సత్యం అనే మాయలో ఉన్నాను .వయసు మీద పడి ముసలి వాడినై ,కంటి చూపు కూడా లేని వాడినయ్యాను .ఏది సత్యమో ఏది నిత్యమో తెలియ లేకున్నాను .సంసార లంపటం లో కూరుకు పోయి తపిస్తున్న దీనుడిని .నాలాంటి దీనులను రక్షించటం లో నువ్వు మహా నేర్పరివి .నువ్వు రక్షించటానికి నా కంటే దీనుడు ఎవరున్నారయ్యా .త్రిలోకాలలో నువ్వే నాకు దిక్కు .’’అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ’’
ఇక కాపాడే వారెవ్వరూ లేరని ,భగవంతునిపై భారం వేస్తే ,ఆయన రక్షగా నిలుస్తాడు అని ఆంతర్యం .
తర్వాత శ్లోకమూ ఆర్తుని రోదనమే –
‘’ప్రభుత్వం దీనానాం ఖలు పరమ బంధుః పశుపతే –ప్రముఖ్యోహం తేషా మపి కిముత బంధుత్వ మనయోః
త్వయైవ క్ష౦తవ్యాః శివ మదపరాధాశ్చ సకలాః – ప్రయత్నాత్కర్తవ్యం మద వనమియం బంధు శరణిః’’
పశుపతీ !నువ్వు సర్వ సమర్ధుడవు .దీనులకు అత్యంత ఆప్తుడవైన బంధువుడవు .బంధు ,దీన జన రక్షకుడవు నువ్వు .దీనులలో ముఖ్యుడను నీకు బంధువుడను సన్నిహితుడను అని నీకు వేరే చెప్పాలా!నాతప్పులన్నీ క్షమించు .దీనికి ప్రయత్నించటం నీ తక్షణ కర్తవ్యమ్ .బంధు రక్షణ సంప్రదాయంగా వస్తోందికదా .
పరమేశ్వరుడే ఆర్త త్రాణ పరాయణుడు అని ఆంతర్యం సంసార తాప పరితప్తుని గూర్చిన శ్లోకాలివి .
2-జిజ్ఞాసువు –జ్ఞానం కావాలని ప్రార్ధించే వాడు జిజ్ఞాసువు
‘’ఛందశ్శాఖి శిఖాన్వితైః ద్విజ వరై స్సంసేవితే శాశ్వతే –సౌఖ్యాపాదిని ఖేద భేదినిసుధా సారైః ఫలైర్దీపితే
చేతః పక్షి శిఖా మణే,త్యజ వృధాసంచార మన్యైరలం-నిత్యం శంకర పాద పద్మ యుగళీ నీడే విహారం కురు ‘’
ఓ మనసా !పక్షీ౦ద్రా!ఎందుకు అటూ ఇటూ వృధాగా తిరుగుతావు ?అదుగో శంకరుని పాదపద్మాలు అనే గూడు అక్కడ ఉంది చూడు .దాంట్లో హాయిగా విహరించు .వేదాలు అనే కొమ్మల చివర ఆ గూడు ఉన్నది .దాన్ని బ్రహ్మ విద్యలో శ్రేష్టు లైన యోగీశ్వరులు సేవిస్తూ ఉంటారు .ఈ గూడు ఆషామాషీ ది కాదు శాశ్వత నివాసం .పరమ సుఖమైన మొక్షాన్నిచ్చేది .సంసార దుఖాన్ని పోగొట్టేది .అది అమృతం నిండిన పండ్లతో శోభిస్తుంది .ఇంకెందుకు ఆలస్యం ? శాశ్వతంగా ఆ శంకరుని పాద పద్మాలలో స్వేచ్ఛగా విహరించి పరమానంద విభూతి పొందు .
మనసు పక్షిలాగా ఒక చోట కుదురుగా ఉండదు .దానికి శాశ్వతమైన గూడు అవసరం. జిజ్ఞాసువుకూడా అలాగే శాశ్వతమైన నివాసం కావాలి . అదే శంకర పాద సన్నిధి అని ఆంతర్యం .
తర్వాత రెండు శ్లోకాలు కూడా జిజ్ఞాసువు నుద్దేశించి చెప్పినవే –
‘’ఆకీర్ణే నఖ రాజి కాంతి విభవైరుద్యత్సుధావైభవైః-రాధౌతేపి చ పద్మరాగ లలితే హంస వ్రజై రాశ్రితే
నిత్యం భక్తివధూగణై శ్చరహసి స్వేచ్ఛావిహారం కురు –స్థిత్వా మానస రాజ హంస ,గిరిజా నాధాంఘ్రి సౌధాంతరే ‘’
ఈ శ్లోకం గూర్చి ఇదివరకేచేప్పుకున్నాం .తర్వాత శ్లోకం –
‘’శంభు ధ్యాన వసంత సంగిని హృదారా మేఘ జీర్ణ చ్ఛదాః-స్రస్తా భక్తి లతాచ్ఛటా విలసితా పుణ్య ప్రవాళశ్రితాః
దీప్యంతే గుణ కోరకా జపవచః పుష్పాశ్చ సద్వాసనాః-జ్ఞానానంద సుధా మరంద లహరీ సంవిత్ఫలాభ్యునతిః’’
శివుని ధ్యానించటం అనేది వసంత ఋతువు .నా హృదయం ఒక పూల తోట. దానిలో శివధ్యానం అనే వసంత ఋతువు ప్రవేశించింది .వెంటనే నాలో ఉన్న పాపాలు అనే ఎండుటాకులన్నీ రాలిపోయాయి .వెనువెంటనే పుణ్యాలు అనే పగడాల లాంటి యెర్రని చిగురుటాకులనే సద్గుణాలు మొలకెత్తాయి .దానితో భక్తి అనే లతలు ఏర్పడి శివుని పైకి ఎగబ్రాకాయి .అవి నవ నవో న్మేమేషంగా గా ఉన్నాయి .అలా అల్లుకు పోయిన లతలకు శివ ధ్యానమే జపం అయింది .ఆ లతలకు జప వాక్కులు అంటే సోహం ,పంచాక్షరి మంత్రం పుష్పాలుగా పూశాయి. ఒక్క సారి శివా అంటే చాలు స్వస్వరూప జ్ఞానం ఏర్పడి వాటి పరిమళాలు అంతటా వ్యాపిస్తాయి .అవే బ్రహ్మానంద పరమైన సంస్కార పరిమళాలు .ఆ పుష్పాలనుండిజ్ఞానానందం అనే అమృతం మకరందంగా ధారా పాతంగా ప్రవహి౦చి౦ది .భక్తిలతకు బ్రహ్మ జ్ఞానం అనే పంట పండింది. ఇదే జ్ఞానానందం అనే సుధా తరంగం .ఇదే కైవల్యం .
3-అర్ధార్ధి-ధనంమొదలైన కోరికలు కోరేవాడు అర్ధార్ధి.సాధకుడికి ఇవి అక్కరలేదు కావలసింది శాశ్వతమైన ముక్తి బ్రహ్మానందం .దీనికోసం మళ్ళీ మళ్ళీ తపస్సు చేస్తారు .పొందే దాకా వదిలి పెట్టరు వీరు అర్ధార్ధులు.
‘’కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే భవ విభో-విధిత్వం ,విష్ణుత్వం దిశసి ఖలుతస్యాఃఫలమితి
పునశ్చ త్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షి మృగతా – మదృస్ట్వా తద్ఖేదం కథ మిహ సహేశంకర విభో ‘’
శంకర ప్రభూ !నీ పూజ చేస్తున్నా .దానికి ప్రతిఫలంగా బ్రహ్మ పదవో విష్ణు పదవోఇస్తానంటావేమో .అవి నాకు వద్దే వద్దు .నిన్ను పూజించే విష్ణువు సృష్టి కార్యం చేస్తున్నాడు .బ్రహ్మకు నువ్వే వేదాలు ఇచ్చావు. విష్ణువు నీ మూల స్వరూపం తెలుసుకోవటానికి భూమిని త్రవ్వి త్రవ్వి అలసి సోలసి వెనక్కి వచ్చేశాడు పాపం .బ్రహ్మ సృష్టి కార్యం లో మునిగి పోయి ,నీ అంతం ఎక్కడుందో తెలుసుకోవటానికి హంసగా మారి యెగిరి యెగిరి తిరిగి తిరిగి ఆయాసం తో దిమ్మ తిరిగి మైండ్ బ్లాకై అబద్ధం చెప్పి శాపానికి గురై పూజకు అనర్హుడయ్యాడు .కనుక నాస్వామీ !బ్రహ్మత్వం విష్ణుత్వం నాకు వద్దు మహాప్రభో .నీ ఆది ,అంతాలు చూడలేని ,తెలుసుకోలేని ఆపనికి మాలిన పదవులు నా కెందుకయ్యా-ఏం చేసుకోను నేను ? ఆ దుఖం ఎందుకు ఆ వ్యధ ఎందుకు వృధా ఆయాసం ఎందుకు నాకు ? నీ పూజా ఫలంగా మోక్షం ప్రసాదించు తండ్రీ .చాలు .
శివుని అశాశ్వతమైన కోరికలు కోరరాదు .శాశ్వతమూ నిత్యమూ అయిన మోక్షాన్నే కోరుకోవాలని ఆంతర్యం .
1- జ్ఞాని –బ్రహ్మజ్ఞాని నిశ్చలంగా నిశ్చింతగా ,పరమార్ధం లో మునిగి తేలుతూ ఉంటాడు .శివుడు నాలో కొలువై ఉన్నాడు నాకు భయమెందుకు అనుకొంటాడు –ఈ విషయాన్నే –‘’దీయంత్రేణ వచో ఘటేన కవితా కుల్యోప కుల్యాక్రమై –‘’శ్లోకం లో విపులంగా చెప్పుకొన్నాం .మరో శ్లోకం –
‘’కరలగ్న మృగః కరీంద్ర భంగో –ఘన శార్దూల విఖండనోస్త జంతుః
గిరిశో విశదాకృతిశ్చ చేతః –కుహరే పంచ ముఖోస్తి మే కుతో భీః’’
చేతిలో జింక గజాసుర వ్యాఘ్రాసుర సంహారి ప్రాణులను తనలో విలీనం చేసుకొనేవాడు భస్మలేపనం తో తెల్లగా ఉన్నవాడు ,పర్వత శయనం కలవాడు ,అయిదు ముఖాలున్న శివుడు నా మనస్సు అనే గుహలో ఉండగా నాకు భయం ఎందుకు ?
సింహాన్ని కూడా పంచముఖఃలేక పంచాస్య అంటారు .అదీ గుహలోనే ఉంటుంది.దాని చేతిలో వేటాడిన జింక ఉంటుంది .ఏనుగు, పెద్దపులినిఅది చంపుతుంది .సింహం ఉన్న గుహలో ఇక ఏ జంతువూ ధైర్యంగా ప్రవేశించలేదు .పంచముఖుడైన శివుడిని ,పంచాస్య అయిన సింహాన్ని కలిపి పోల్చి చెప్పారిక్కడ .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-10-17 –ఉయ్యూరు
‘