శ్రీ శంకరుల శివానంద లహరి ఆంతర్యం -7
అంతఃకరణ చతుస్టయ సమర్పణ విషయమైన శ్లోకాలు –మనస్సు, బుద్ధి,చిత్తం , అహంకారం అనే నాల్గింటిని అంతఃకరణ చతుస్టయ౦ అంటారు.ఇవి మనలోపల ఉన్నా వాటి చూపు మాత్రం బయటే ఉంటుంది .తాను పరమాత్మకంటే వేరు అనే భావం వలన ఇవి ప్రకోపిస్తాయి . వాటిని అణచి సమర్పణ చేయాలని అంతర్యం .
సంకల్ప ,వికల్పాలు చేసేది మనసు .దీని అధిదేవత చంద్రుడు .నిష్కర్షగా తేల్చేది బుద్ధి .దీనిదేవత బ్రహ్మ .నేను అనే భావమే అహంకారం .దేవత రుద్రుడు .జరిగి పోయినవాటిని చి౦తి౦చేది చిత్తం . వాసుదేవుడు దేవత .భ్రూ మద్యం లో మనసు,కంఠం లో బుద్ధి ,హృదయం లో చిత్తం ,నాభిలోఅహంకార౦ ఉంటాయి .వీటిని ఈశ్వరార్పణం చేస్తే జీవి పరమయోగి ,సుఖి అవుతాడని శంకర భగవత్పాదులవారి ఆంతర్యం .వీటికి శ్లోకాలు రాశారు శివానంద లహరి లో .
1-మనసు
‘’గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే –విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతిః
సమర్ప్యైకం చేతస్సరసిజ ముమానాథ భవతే –సుఖేనావస్థానం జన ఇహ న జానాతి కిమహో ‘’
ఉమానాథా!అదొక అగాధమైన సరస్సు .ఒకవైపు నిర్జర కీకారణ్యం .మరో వైపు ఎత్తైన పర్వతం ..ఇటు నుయ్యి అటు గొయ్యి గా ఉంది పరిస్థితి . వాటిలోకి వెళ్లి పూలు కోసి నీకు అర్చన చేయాలని ఉంది .అటూ ఇటూ తెగతిరుగుతున్నాడు ఆరాట పడుతున్నాడు వెర్రివాడు మూర్ఖుడు .జడుడు.తనలోపలే ఒక పుష్పం ఉందని కదలక్కర లేకుండా వెతకక్కర లేకుండా లోపలే హృదయ పుష్పం ఉందని గ్రహించలేక పోతున్నాడు . అది బురదలో పుట్టినా దానికి బురద అంటదు .మనసు కూడా అంతే.సూర్యుని చూసి పద్మం వికశించినట్లు నిన్ను చూస్తె హృదయ పద్మం వికశిస్తుంది . ఆన౦దానుభవం పొందుతుంది .ఈ హృదయ పద్మాన్ని ఉమానాధునికి కైంకర్యం చేసి ఆనందాన్ని హాయిగా అతి సులభంగా పొందవచ్చు .ఇదంతా చూస్తూఉంటె కస్తూరి మృగం తన నాభి దగ్గరున్న కస్తూరి వాసన గ్రహించకుండా పర్వతాలపై గాలించి అలసి పోయినట్లు గా కనిపిస్తోంది .
అలాగే ‘’పటుర్వా గేహీవా ,యతి రపి జటీవా తదితరో –నరోవా యః కశ్చిన్ భవతు భవ కిం తేన భవతి
యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే –తదీయస్త్వం శంభో భవసి భావ భారం చ వహసి ‘’
బ్రహ్మ చారి గృహస్తు ,వానప్రస్తుడు ,సన్యాసి ఇంకెవరైనా కావచ్చు .వారు శాస్త్రాలు ఆశ్రమ ధర్మాలు నియమాలు పాటించవచ్చు .పాటించి ఉత్తమ బ్రహ్మ చారి ,ఉత్తమ గృహస్తు ,ఉత్తమ వానప్రస్తు,ఉత్తమ సన్యాసి అవవచ్చు .దీని వలన వారికి కొంచెం కూడా ప్రయోజనం ఉండదు. వాళ్ళ మనస్సు నీ అధీనమై ఉండాలి .అప్పుడే వాళ్ళు ధన్యులవుతారు .కనుక ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా మనసు భగవదర్పితమైతేనే జీవికి సాఫల్యత అని ఆంతర్యం .
మరో శ్లోకం లో –‘’భ్రుంగీ చ్ఛానతనోత్కటః కరి మదగ్రాహీ స్పురన్మాధవా-హ్లాదోనాద యుతో మహాసిత వపుః పంచేషుణా చాదృతః
సత్పక్షః సుమనో వనేషు స పున సాక్షాన్మదీయేమనో –రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైల వాసీ విభుః
పరమ భక్తుడైన భ్రుంగి కోరగా శ్రీశైలమల్లేశ్వరా నువ్వు ఇష్టంగా తాండవం చేస్తావు .విష్ణువు మోహినీ రూపం ధరించినపుడు ,ఆయనపై మోహంపొందావు .ఓంకార నాదాలు ధ్వనించేవాడవు.తెల్లని శరీరం కలిగి మన్మధుని చే ఆరాధింపబడేవాడవు .గజాసుర సంహారివి .దేవతలనేకాక వాసనాత్రయం లేని,సజ్జనులను కూడా రక్షించేవాడవు .అలాంటి శ్రీశైల వాసుడవైన నువ్వు నామనస్సు అనే కమలం లో భ్రమరాంబా దేవితో కలసి ఎప్పుడూ విహరించాలి .
జ్ఞానకమలాన్ని వికసింప జేయాలని ఆంతర్యం .
ఈశ్లోకాన్ని తుమ్మెద పరంగా కూడా అన్వయించవచ్చు .మగతుమ్మెద ఆడ తుమ్మెద నాట్యానికి ఆకర్షితురాలవుతుంది . అది ఏనుగు మదజలాన్ని ఆస్వాదిస్తుంది .మనోహర వైశాఖమాసం లో పుష్పాలు వికసించి ఉంటాయి .ఆతుమ్మెద జంట మకరందాన్ని ఆస్వాదిస్తూ ఆనంద ఝంకారం చేస్తూ ఎగురుతాయి . తుమ్మెద నల్లగా ఉంటుంది . మన్మధుడు పంచబాణుడు . ఆయన బాణాలు అరవిందం అశోకం ,మామిడి పువ్వు ,నవమల్లికాపుష్పం ,కలువ పూవు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-10-17- ఉయ్యూరు
—