శ్రీ శంకరుల శివానంద లహరి ఆంతర్యం -8
మనసు కోతి వంటిది .నిలకడ ఉండదు అన్నీ కావాలను కొంటుంది ఎంగిలి చేసి వదిలేస్తుంది .మోహంఎక్కువ అంటూ శంకరులు చెప్పిన శ్లోకం –
‘’సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ –నటత్యాశా శాఖా స్పటతిఝడితి స్వైర మభితః
కపాలిన్ భిక్షో మే హృదయ కపి మత్యంత చపలం –దృఢం భక్త్యా బధ్వా శివ భవదధీనం కురు విభో ‘’
మనసు అనే కోతి అడవుల్లో పర్వతాలలో కుదురు లేకుండా గంతులు వేస్తూ ఉంటుంది .చెట్ల కొమ్మలపై పల్టీలు కొడుతుంది .దాన్ని అదుపు చేసి బంధించటం కష్టం .దానికి మోహం ఎక్కువ .పరుగులు పెడుతూ ఉంటుంది .నా వశం లో లేని నా మనసును నువ్వే భక్తి అనే త్రాడుతో బంధించి నీ స్వాధీనం చేసుకో .నువ్వు భక్తి అనే జ్ఞాన భిక్షను పెట్టే ఆది భిక్షుడవు .
మనసు ఒక ఇల్లు అంటూ –‘’శివ ,తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా –భవ మమ గుణ ధుర్యాం బుద్ధికన్యాం ప్రదాస్యే
సకల భువన బంధో సచ్చిదానంద సింధో-సదయ హృదయ గేహే సర్వదా సంవస త్వం ‘’
సకల భువన బంధువైన శివా !నా మనసు ఒక ఇల్లు .నాబుద్ధి ఒక కన్య .ఆకన్య గుణ గరిస్టురాలు.దాన్ని నీకు అర్పించాలని సంకల్పిస్తున్నా .నా కోరిక మన్నించి నామనసు అనే ఇంట్లో పార్వతీ దేవి తో వచ్చి ఉండిపో .నాబుద్ధికన్యను గ్రహించి ఇల్లరికపు అల్లుడిలాగా ఇక్కడే ఉంటే నిన్ను సదా సేవిస్తూ ధన్యుడనవుతాను .
మనసు ఒక మదపు టేనుగు అని –‘’ధైర్యా౦కుశేన నిభ్రుతిం –‘’అనే శ్లోకంలో వర్ణించారు .దీన్ని ఇదివరకే తెలుసుకొన్నాం . మనసు ఒక గుడారం అంటూ మరోశ్లోకం –
‘’ధృతి స్తంభాధారం దృఢగుణ నిబద్ధాంసగమనాం –విచిత్రాంపద్మాఢ్యాం ప్రతి దివస సన్మార్గ ఘటితాం
స్మరారే మచ్చేత స్పుట పట కుటీం ప్రాప్య విశదాం – జయ స్వామిన్ శక్త్యా సహ శివ గణైః సేవిత విభో ‘’
నా మనసు ఒక గుడారం .దానికి స్తంభాలు ధైర్యం మొదలైనవి. త్రాళ్ళు సత్వ రజస్ తమోగుణాలు .మనస్సనే ఈ గుడారాన్ని ఎక్కడికి పడితే అక్కడికి తీసుకొని వెళ్ళచ్చు .ఈ గుడారం లో మూలాధారం మొదలైన ఆరు చక్రాలు పద్మాలుగా ఉన్నాయి. కుండలినీ శక్తి ఉంది.దీన్ని సాధించి ,భేదించి ముందుకు వెళ్ళచ్చు .ఆత్మజ్ఞానం తో ఇందులో హాయిగా జీవించ వచ్చు .నువ్వు కామారివి అంటే మన్మధుడికి శత్రువుకదా .
మనసు ఒక దొంగ అని చెప్పే శ్లోకం –
‘’ప్రలోభాద్యై రర్ధాహరణ పరతంత్రో దని గృహే –ప్రవేశోద్యుక్త స్సంభ్రమతి బహుధా తస్కర పతే
ఇమాం చేతశ్చోరంకథ మిహ సహేశంకర విభో –తవాధీన౦ కృత్వా మయి నిరపరాధే కురు కృపాం ‘’
నా మనసు ఒక దొంగ .డబ్బు సంపాదించాలనే ఆశ దానికి ఎక్కువ .డబ్బున్న వాళ్ళ ఇళ్ళల్లో ప్రవేశిస్తుంది .నేను వేరు చిత్తం వేరు ..ఇలా నామనసు శరీర సుఖాలకోసం లోభ గుణానికి బానిస అయింది .ఈ దుర్గుణాన్నిఇక నేను భరించ లేను . నువ్వే స్వాధీనం చేసుకోవాలి. నన్ను నిరపరాధిని చేసి దయ చూపించు మహ ప్రభో.
మనసు ఒక తెల్లకలువ అని చెప్పిన శ్లోకం –
‘’ధర్మో మే చతురంఘ్రికః సుచరితః పాపం వినాశం గతం –కామ క్రోధ మదాదయో విగళితాః కాలాస్సుఖా విష్క్రుతః
జ్ఞానానంత్య మహౌషధి స్సుఫలితా కైవల్య నాథే సదా –మాన్యే మానస పుండరీక నగరే రాజావతంసే స్థితే
ఉత్తమ రాజు పాలనలో ధర్మం నాలుగు పాదాలా వర్ధిల్లు తుంది .కామ క్రోధాది అరిషడ్వర్గాలు నశిస్తాయి రోజులు పక్షాలు నెలలు సంవత్సరాలతో కూడిన కాలం అంతా చక్కగా చల్లగా ప్రకాశిస్తుంది .అనంతమైన జ్ఞానం అనే ఔషధం రాజ్యం లో ఫలిస్తుంది. దాని వలన ప్రజలు విజ్ఞులై సుఖాలనుభవిస్తారు .
అలాగేమనసు ఒక పుండరీకం అంటే తెల్లకలువ .దానిలో తలపై చల్లని చంద్రుని ధరించిన పరమశివుడున్నాడు .అ౦దువల్ల కామక్రోధాదులు నశించి పోయాయి .రాజు అంటే ప్రభువు చంద్రుడు అనే రెండు అర్ధాలున్నాయి .చంద్రుడు మృదుల స్వభావి రాజు కఠినుడు .ఇలాంటి తెల్లకలువ అనే నామనసులో హాయిగా రాజులాగా విహరించు పరమశివా అని అర్ధం .
మనసు ఒక దుర్గం గా భావించి చెప్పిన శ్లోకం –
‘’గాంభీర్యం పరిఖా పదం ఘన ధ్రుతిః ప్రాకార ఉద్యద్గుణ-స్తోమ శ్చాప్త బలం ఘనేంద్రియ చయో ద్వారాణి దేహస్తితః
విద్యా వస్తుసమృద్ధి రిత్యఖిల సామగ్రీ సామేతే సదా –దుర్గాతిప్రియ దేవ మామక మనో దుర్గే నివాసం కురు ‘’
నామనసు ఒక దుర్గం .అంటే కోట .అందులో ప్రవేశించటం కష్టం .దుర్గమమైనది దుర్గం –ప్రవేశించటానికి కష్టమైనది అని అర్ధం .దుర్గానికి రక్షణగా చాలా ఉంటాయి .దాని కందకం గాంభీర్యం .ప్రాకారం ధైర్యం .సద్గుణాలే నమ్మదగిన ఆప్తులు .శరీరం లోని నవరంద్రాలే ఇంద్రియాలు . అందులోని సంపద అంతా విద్య జ్ఞానం మొదలైనవి .కనుక శివుడు ప్రవేశించటానికి కావలసిన సామగ్రి అంతా ఉంది .శివుడు దుర్గా ప్రియుడు .మనసు పరమ శివునికి ఇష్టమైన దుర్గం అని ఆంతర్యం . శివజ్ఞానం ఉంటేనే ప్రవేశానికి అర్హత ఉంటుంది అని అర్ధం .
మనసు ఒక అడవి అని వర్ణించే శ్లోకం –
‘’మా గచ్ఛమితస్తతోగిరిశ భో మయ్యేవ వాసం కురు –స్వామిన్ ఆది కిరాత మామక మనః కాంతార సీమాంతరే
వర్తంతే బహుశో మృగా మద జుషో మాత్సర్య మోహాదయః –తాన్ హత్వా మృగయా వినోద రుచితా లాభం ఛ సంప్రాప్యసి’’
శివా .నువ్వు ఎక్కడికీ పోవద్దు .నాలోనే ఉండిపో.నామనసు ఒక అరణ్యం అని ముందే చెప్పాను .నువ్వేమో ఆది కిరాతకుడవు .నీకు వేటాడటం చాలా ఇష్టం సరదా కదా .నీకు కావలసినన్ని మృగాలు నాలోనే ఉన్నాయి . హాయిగా వేటాడి అనుభవించు .రా .ఆలస్యం చేయకు .ఇవిగో కామ క్రోధ మద మాత్సర్యాలు అనే మృగాలు .వీటిని వేటాడి నీ వేట తీట తీర్చుకో అనుభవించు ,ఆస్వాదించు ,వినోదించు ,ప్రయోజనం పొందు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-10-17- ఉయ్యూరు