శ్రీ శంకరుల శివానంద లహరి ఆంతర్యం -9
మనసు ను చాతకం ,చక్రవాకం,చకోరం హంస లతో కూడా పోల్చి శంకరాచార్య శ్లోకాలు చెప్పారు –
‘’హంసః పద్మవనం సమిచ్ఛతి యథా నీలాంబుదం చాతకః –కోకః కోకనది ప్రియం ,ప్రతిదినం చంద్రం చకోర స్తదా
చేతో వా౦ఛతి మామకం ,పశుపతే ,చిన్మార్గ మృగ్యం విభో-గౌరీనాథ,భవత్పాదాబ్జయుగళం కైవల్య సౌఖ్య ప్రదం ‘’
హంస నిండుగా పద్మాలున్న కొలను లో విహరించాలని కోరుకొంటుంది .చక్రవాకం సూర్యుడిరాక కోసం ఎదురు చూస్తుంది .చక్రవాకం చంద్రుని వెన్నెల కోసం నిరీక్షిస్తుంది .చాతక పక్షి నీల మేఘం ఎప్పుడు వర్షిస్తుందా అని అర్రులు చాస్తూ ఎదురు చూస్తుంది .అలాగే నేను జ్ఞానమార్గం చూపించే గౌరీ నాధుని పాద పద్మాలద్వారా మోక్షం కోసం ఎదురు చూస్తున్నాను .
పై నాలుగు పక్షులు కంటికి కనిపించవు .మనసు కూడా అంతే .ఆ పక్షులకున్న విశిష్ట గుణాలవంటివి మన మనసుకు కూడా ఉన్నాయి .ఈ సుగుణాలతో సాధన సాగించమని ఆంతర్యం .
1-హంస పాలు నీళ్ళను వేరు చేస్తుంది .అంటే పాలను వేరు చేస్తుంది .అంటే గుణాన్ని గ్రహించటం హంస లక్షణం .అలాగే హంస తన జీవితకాలం లో ఒక హంస తోనే జత కడుతుంది .మరో హంస వైపు చూడదు .అలాగే భక్తుడు తన చూపును ఈశ్వరుని వైపే చూడాలని ఆంతర్యం .2- చాతక పక్షి శరత్కాల నీల మేఘాన్ని తప్ప మరొక దాన్ని యాచించదు .అన్నికాలాలలోవర్షం పడినా చాతకానికి ఆ నీరు అక్కర్లేదు .అలాగే మనం కూడా మోక్షాన్ని ఇచ్చే ఈశ్వరునే యాచించాలని భావం .3-చకోర పక్షి వెన్నెలలోని అమృతాన్ని ఆస్వాదిస్తుంది .అమృతం చంద్రునిలో మాత్రమే ఉంటుందని దానికి తెలుసు .దీనికోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది .మనం కూడా నిరంతర ప్రయత్నం తో అద్వైతామృతాన్నిపొందాలని సందేశం .- 4- చక్రవాకం పత్నీ వియోగాన్ని పోగొట్టుకోవటానికి సూర్యుని కోసం ఎదురు చూస్తుంది .జీవుడు కూడా పరమాత్మ వైపే దృష్టి సారించాలని సూచన .ఈ నాలుగు పక్షులు తమ గుణాలవలన మానవుని కి గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్నిస్తున్నాయని ఆంతర్యం .
మరొక శ్లోకం లో మనసును చాతకం తో పోల్చారు –
‘’కారుణ్యామృత వర్షిణం ,ఘన విపద్గ్రీష్మ చ్ఛిదాకర్మఠం-విద్యా సస్య ఫలోదయాయ సుమనస్సం సేవ్య మిచ్ఛాకృతిం
నృత్యద్భక్త మయూర మద్రినిలయం సంసజ్జటామండలం –శంభో ,వాంఛతి నీలకంధర,సదా త్వాం మే మనశ్చాతకః ‘’
ఈ శ్లోకం లో నీలకంఠుడైన శివుడికి, మేఘానికి భేదం లేనట్లుగా చమత్కరించారు శంకరాచార్య
ఆ నీల మేఘం కారుణ్యం అనే అమృతాన్ని వర్షిస్తుంది .గ్రీష్మ తాపాన్ని పోగొడుతుంది .పంటలు బాగా పండుతాయి కనుక రైతులు పూజిస్తారు .వాళ్ళు కోరిన కోరికలను మేఘం తీరుస్తుంది .మేఘాలను చూసి నెమళ్ళు ఆనంద పరవశంతో నాట్యం చేస్తాయి. మేఘం ఎత్తైన కొండల మీద ఉంటుంది . కం అంటే నీరు ధర అంటే ధరించినది అంటే నీటిని కలిగిఉన్న మేఘం అని అర్ధం .ఆ నీటితో తన దాహార్తిని తీర్చమని చాతక పక్షి నీల మేఘాన్ని కోరుతోంది
గరళాన్ని మింగటం చేత శివుడి కంఠం నల్లబడింది కనుక నీల కంఠుడు.కంధరం అంటే మెడ కనుక నీల క౦ధరుడు .ఈయన కరుణ అనే అమృతాన్ని వర్షిస్తాడు .ఆపదలను తొలగించి ,జ్ఞానం అనే పంటలు పండిస్తాడు .దేవతలు ఆయనను సేవిస్తారు ,ఆనంద పరవశంతో నాట్యం చేస్తారు .కైలాస పర్వత వాసి ,జటా జూట ధారి శివుడు .అలాంటి కరుణానిధి అయిన శివుడిని నా మనస్సు అనే చాతకపక్షికోసం కారుణ్యం అనే అమృతాన్ని వర్షించమని ప్రార్ధిస్తోంది అని ఆంతర్యం .
మనసును ఒక పెట్టె గా అభి వర్ణించి మరోశ్లోకం రచించారు –
‘’ఆశా పాశ క్లేశ దుర్వాసనాది-భేదో ద్యుక్తైర్దివ్య గంధై రమందై
ఆశా శాటీకస్య పాదారవిందం –చేతః పేటీం వాసితాంమే తనోతు ‘’
నా మనసు ఒక పెట్టె.దాని నిండా అవిద్య ,అస్మితం ,రాగం ,ద్వేషం అభినివేశం అనే అయిదు క్లేశాలు అనే దుర్వాసనతో ఉంది . ఇవి దుఃఖ హేతువులు .దిక్కులే వస్త్రాలుకల దిగంబరుడైన శివుడిపాద పద్మాలు నా మనస్సు అనే పెట్టెలో ఉంటే ఆ క్లేశ దుర్వాసనలు అన్నీ తొలగి పోతాయి .
అవిద్య అంటే అజ్ఞానం .అస్మితం అంటే సుఖ దుఖాలు నేను అనుభవిస్తున్నాను అనే భావం వలన కలిగే దుఖం .రాగం అంటే ఇష్టమైన దానిపై కోరిక అవి దూరమైతే దుఖం .ద్వేషం అంటే ఇష్టం లేని వస్తువులు దగ్గరైతే కలిగేది .అభినివేశం అంటే తనను తాను ప్రేమించటం మరణాదుల వలన కలిగే దుఖం .ఈ క్లేశాలు నశించాలంటే శివజ్ఞానం ఒక్కటే మార్గం అని ఆంతర్యం .
మనసు ఒక గుర్రం అని ఇంకో శ్లోకం –
‘’కళ్యాణినం సరస చిత్ర గతిం సవేగం –సర్వేంగితజ్నమనఘం ధ్రువ లక్షణాఢ్య౦
చేత స్తురంగ మధిరుహ్య చరస్మరారే –నేత స్సమస్త జగతాం వ్రుషభాధి రూఢః’’
ఈశ్వరా !నామనసు ఒక గుర్రం .దాని నడక చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంది . దాని పరుగు వేగం చాలా ఎక్కువ .మనో భావాలను ఇట్టే పసిగట్టే నేర్పు దానికి ఉంది.దోషాలు లేని మాంచి జాతికి చెందిన సాముద్రికలక్షణాలన్నీ కలిగి ఉన్న కల్యాణి జాతి గుర్రం .నువ్వు సర్వ లోకాధినేతవు .వృషభారూఢుడవు.నువ్వే నా మనసనే పంచకల్యాణి గుర్రాన్ని అధిరోహించి తిరగమని వేడు కొంటున్నాను .
గుర్రానికి ఉండే సరస చిత్ర గతి 5 రకాలు -1-అతి వేగం అతి నెమ్మది కాకుండా మధ్యరకం గా పరిగెత్తటం 2- .వేగంగా చాతుర్యంగా పరిగెత్తటం 3-వంకర టికర కాకుండా తిన్ననైన మార్గం లో గమనం 4-పైకి కాళ్ళు కదిలిస్తూ పరిగెత్తటం 5-ఒకే రకమైన వేగం తో ఎంతదూరమైనా పరిగెత్తటం.
ఈ అయిదు రకాల గమనం మన మనసును నడిపే పంచేంద్రియాలకు సంకేతం .రౌతు అంటే గుర్రాన్ని నడిపే వాడు సమర్దుడైతే పొగరుబోతు గుర్రమైనా చెప్పినట్లు దారికొచ్చి మాట వింటుంది .కనుక సర్వ సమర్ధుడైన ఈశ్వరుడే మన మనసనే గుర్రాన్ని ఎక్కితే అది దారికి తప్పకుండా వస్తుందని ఆంతర్యం .
ఇదికాక మనసును చెరువుతో ,ఇంటితో కూడా పోల్చారు . ఆశ్లోక వైభవాలను ముందే తెలుసుకొన్నాం .
మనసు అనే మొదటి అంతః కరణ పూర్తయింది . రెండవదైన బుద్ధి గురించి తర్వాత తెలుసుకొందాం .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-10-17 –ఉయ్యూరు