శ్రీ శంకరుల శివానంద లహరి ఆంతర్యం –10
అన్తఃకరణాలలో రెండవదైన బుద్ధి గురించి శంకర భగవత్పాదులు చెప్పిన శ్లోకాలను తెలుసుకొందాం .
విషయాన్ని నిశ్చయించే మానసిక స్థితి ని బుద్ధి అంటారు .జడ బుద్ధి ఉన్నవాడు పరమేశ్వర చి౦తనానికి దూరం గా ఉంటాడు అనే భావంగా చెప్పిన శ్లోకం –
‘’అసారే సంసారే నిజభజన దూరే ‘’శ్లోకం లో దీని వివరణ ఇదివరకే తెలుసుకొన్నాం .మరో శ్లోకం –
‘’యథా బుద్ధి శ్శుక్తౌ రజత మితి కాచాశ్మని మణి-ర్జలే పైస్టేక్షీరం భవతి మృగ త్రుష్ణాసు సలిలం
తథా దేవ భ్రాంత్యా భజతి భవదన్యో జడజనో –మహా దేవేశం త్వాం మనసి చ న మత్వా పశుపతే ‘’
దేవతలే ఆరాధించే పరమ శివా పశుపతీ !మూఢుడు సత్యం కాని దాన్ని సత్యం అని భ్రమ పడుతున్నాడు .తాను వేరు బ్రహ్మం వేరు అనుకొంటున్నాడు .అది నిజం కాదని ఆ వెర్రి మాలోకానికి తెలీదు పాపం .నువ్వు నిత్య సత్య సచ్చిదానంద స్వరూపుడివి .కాని వాడు నిన్ను వదిలేసి చిన్న దేవతలనే నమ్ముతున్నాడు .ఇది ఎలా ఉందీ అంటే ముత్యపు చిప్పను చూసి వెండి అని, గాజు ముక్కను చూసి మణి అని, ఎండమావి ని చూసి నీరు అని భ్రమించటం లాగా ఉంది .కనుక నిన్నే సేవిస్తే ఈ భ్రమ ప్రమాదం వాడికి ఉండదు .ఇతర దేవతలను సేవిస్తే లౌకిక తాత్కాలిక ప్రయోజనాలే నేర వేరుతాయి . నిన్ను సేవిస్తే శాశ్వత ముక్తి లభిస్తుంది .నువ్వుఅవిద్యా నిర్మూలనం చేసి మోక్షం ప్రసాదిస్తావు .జీవుడు మాయావృతుడు .నీవు మాయాతీతుడవు .
అలాగే ‘’గభీరే కాసారే విశతి విజనే –‘’శ్లోకం లోనూ ఇదే భావాన్ని వివరించారని తెలుసుకొన్నాం
జడ బుద్ధిని జ్ఞానం లో నిలపాలి అప్పుడే తరుణోపాయం అని చెప్పెశ్లోక౦
‘’మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్ర ఫణితౌ –కరశ్చాభ్యర్చాయాం శ్రుతి రపి కథాకర్ణన విధౌ
తవ ధ్యానే బుద్ధిః నయన యుగళం మూర్తి విభవే -పరగ్రంథాన్ కైర్వాపరమశివ జానే పరమతః ‘’
నా మనసు నీ పాద పద్మాల మీద లగ్నమవ్వాలి .తామర పువ్వుకు ఏమీ అంటనట్లు నామనసుకు ఏ మాలిన్యమూ అంటరాదు.శివ జ్ఞానం అనే మకరందాన్ని మాత్రమే ఆస్వాదించాలి .నిన్ను స్తుతించే వేద,ఇతిహాస ,పురాణ స్తుతినే వింటూ ఉండాలి .కావ్యాలు, గేయాలు, పద్యాలలో నీ స్తుతే వినిపించాలి చేతులు నిన్నే అర్చించాలి .చెవులు నీ గాథలే వింటూ ఉండాలి . నాబుద్ధి నీధ్యాన లగ్నమవ్వాలి .నాకళ్ళు నీ రూప సౌందర్య దర్శనం తో ధన్యమవాలి .నువ్వే ప్రపంచం,ప్రపంచమే నువ్వు అనే భావన మనసు ,బుద్ధి లో నిండిపోవాలి .నా సర్వేంద్రియాలు నీ చుట్టూనే పరి భ్రమించాలి .ఇలా బుద్ధిని నీకై సర్వ సమర్పణ చేస్తే ,సాయుజ్యమే కదా కలిగేది .
1- చిత్తం –‘’చింతన కతృత్వం చిత్తం –‘’జ్ఞాపకాల పొరలు ఉన్నది చిత్తం.చిత్తం లో పరమేశ్వర పరిమళాలు నింపుకోవాలి అని –
‘’పాపోత్పాత విమోచనాయ రుచి రైశ్వర్యాయ మృత్యుంజయ –స్తోత్ర ధ్యాన నతి ప్రదక్షిణ సపర్యాలోకనా కర్ణనే
జిహ్వా చిత్త శిరో౦ఘ్రి హస్త నయన శ్త్రోత్రై రహం ప్రార్ధితో –మా మా జ్ఞాపయ ముహుర్మామేవ మా మే వచః ‘’
మృత్యుంజయ మూర్తీ శివా !నాఇంద్రియాలన్నీ నిన్నే ప్రార్దిస్తున్నాయి .ఎందుకంటె తమవలన నేరాలు ఏవైనా జరిగితే అవి పాపాలకు కారణం అవుతాయని .పాపాలు మనోహరమైన ఈశ్వర సంబంధమైన జ్ఞాన సంపదను అనుభవించ కుండా అడ్డుపడతాయి .కనుక పాపాలవల్ల జరిగే ఉత్పాతాలు కలగకుండా ఇంద్రియాలన్నీ నిన్నే సేవిస్తున్నాయి .నాలుక నిన్ను స్తోత్రం చేయటానికి , చిత్తం నీ సంబంధమైన ధ్యానం చేయటానికి చేతులు నిన్ను పూజించటానికి ,కళ్ళు నిన్నే దర్శించటానికి ,శిరస్సు నీకే నమస్కరించటానికి ,పాదాలు నీ చుట్టూ ప్రదక్షిణం చేయటానికి ,చెవులు నీకథలే వినటానికి అనుకూలంగా ఉంచమని వేడుకొంటున్నాయి.అందుకని ఓ ప్రభూ నన్ను ఆ ఇంద్రియాలు కోరినట్లు ఆజ్ఞాపించు .నాకు మూగతనం చెవుడు ,గుడ్డితనం కుంటితనం రాకుండా చూడు .ఈ ఆవ లక్షణాలు లేకపోతె హాయిగా నాఇంద్రియాలు నీ సేవలో ధన్యమౌతాయి
4-ఆహ౦కార౦ -.’’అహం కర్తా అహంకారః ‘’అని శకరాచార్య నిర్వచనం .నేను చేస్తున్నాను అనే భావమే అహంకారం .ఇది అనర్ధ హేతువు దాన్ని వదిలించుకోవాలి .దీనికోసం
‘’త్వత్పాదాంబుజ మర్చయామి –‘’శ్లోకం లో ఈ విషయాన్నే చెప్పారు. దీన్ని మనం తెలుసుకొన్నాం .అలాగే
‘’మనస్తే పాదాబ్జే –‘’శ్లోకం లోని భావాలూ గ్రహించాం –
‘’సా రసనే తే నయనే –తావేవ కరౌ స ఏవ కృతకృత్యః
యా యే యౌయో భర్గం-వద తీక్షతే సదార్చత స్స్మరతి’’
శివ నామం ఉచ్చ రించే నాలుకే నాలుక .శివుని దర్శించే నేత్రాలే నేత్రాలు .మహా దేవుని పూజించే చేతులే చేతులు .నిరంతరం సదాశివుని స్మరించేవాడే కృతకృత్యుడు .పోతనగారుకూడా ‘’కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాధు వర్ణించు జిహ్వ జిహ్వ —‘’అన్నారు .చివరగా –
‘’క్రీడార్ధం సృజసి ప్రపంచ మఖిలం క్రీడా మృగా స్తే జనాః –యత్కర్మా చరితం మయా చ భవతః ప్రీత్యై భవత్యేవ తత్
శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేస్టితం నిశ్చితం –తస్మాన్మామక రక్షణం పశుపతే కర్తవ్య మేవ త్వయా ‘’
ప్రపంచాన్ని ఆటగా సృస్టిస్తావు.ఆ ఆటలో మేమందరం క్రీడా మృగాలమే .నువ్వు సృష్టించిన అడవి జంతువును నేను . నీ పెంపుడు జంతువును కూడా .కనుక నేను చేసే పనులన్నీ నీకు ఇష్టంగానే ఉంటాయి .పెంపుడు జంతువంటే యజమానికి వల్లమాలిన అభిమానం కదా .కనుక నన్ను రక్షించటం నీ బాధ్యత ,కర్తవ్యమ్ కూడా .కారణం నువ్వు పశుపతివి .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-10-17 –ఉయ్యూరు
—