శ్రీ శంకరుల శివానంద లహరి ఆంతర్యం -11-
స్థూల సూక్ష్మ కారణ శరీరాల లయం
1- స్థూల శరీరం -పంచ భూతాలూ ,అయిదు కర్మేంద్రియాలు ,అయిదు జ్ఞానేంద్రియాలు ,పంచ ప్రాణాలు ,,నాలుగు అంతః కారణాలు –కలిసిన మొత్తం 24 తత్వాలు కలిస్తే స్థూల శరీరం –ఈ 24 తత్వాలు లయం అయితేనే మోక్షం .అందుకే శంకారాచార్య 24 సార్లు మహేశ్వర పాద పద్మాల స్మరణ చేశారు .ఇలా స్మరణ చేస్తే స్థూల శరీరం పర బ్రహ్మలో లయం అవుతుందని ఆచార్యుల వారి ఆంతర్యం అని గ్రహించాలి .
2- సూక్ష్మ శరీరం –పంచ ప్రాణాలు ,పంచ జ్ఞానేంద్రియాలు ,పంచ కర్మేంద్రియాలు మనసు ,బుద్ధి కలిస్తే సూక్ష్మ శరీరం .ఇవి 17 తత్వాలు .ఇవీ లయం కావాలని 17 సార్లు పశుపతిని స్మరించారు .మనసును 18 వస్తువులతో పోల్చటం ఆ 17 తత్వాల సూక్ష్మదేహం లయం అవటానికే నని ఆంతర్యం .
3- కారణ శరీరం –ఇది ఆకారం లేనిదేకాక పుట్టుక ,చావులకు కారణమైనదికూడా.
దీనికోసం ‘’ఆశాపాశ క్లేశ దుర్వాసనాది —‘’శ్లోకం చెప్పి మనస్సు అనే పెట్టెలో ఈశ్వర పాద పద్మాలుంటే వాసనా క్షయమై కారణ శరీరం లయమౌతుందని అప్పుడే అద్వైత సిద్ధి కలుగుతుందని ఇది వరకే గ్రహించాం . పాదాలు మనం నిలకడ గా ఉండటానికిఆధారం గా తోడ్పడతాయి .అంఘ్రి అన్నా పాదాలే ఉత్తమ గతి పొందించేవి అని అర్ధం .సన్మార్గం లో సంచరి౦చటానికి సహకరించేవి చరణాలు .దేవతల శక్తులన్నీ భగవంతుని పాదాలలోనే ఉంటాయట .
పాద పద్మాలు అనే మాటకు ఆంతర్యం ఆత్మ,పరమాత్మల జ్ఞానాలే భగవంతుని పాదపద్మాలు .భగవంతుని లీలలు ఒక పాదం అయితే ఆ౦తరిక అర్ధం మరో పాదం అన్నారు విజ్ఞులు .శివుడు ఒక పాదం అయితే శక్తి మరోపాదం అన్నారు.
శంకరాచార్య పాదాలను భక్తి పూర్వకంగా పాదపద్మాలన్నారు .జీవులను సంసార లంపటం నుంచి తరి౦పజేసేవి భగత్పాదపద్మాలు .
ఈ విధంగా శివానంద లహరి లో శంకర భాగవత్పాదులవారు సదాశివ పాద పద్మార్చనం ,స్మరణం ,కీర్తనం,పాద సంసేవనం అందరూ చేసి తరి౦చాలని భావించారు . ఇది శిరోధార్యం మార్గ దర్శకం కైవల్య సాధనం ,సంసార తరుణోపాయం .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -31-10-17 –కాంప్- మల్లాపూర్ –హైదరాబాద్