శ్రీ శంకరుల శివానంద లహరి ఆంతర్యం -12(చివరి భాగం )
శివానందలహరి లో అద్వైత స్థితి
‘’కిం బ్రూమః తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో –‘’శ్లోకం లో శివుని అద్వైత స్థితి ని వర్ణించారు శంకరాచార్య .మహా ప్రళయం లో కూడా పరమేశ్వరుడు ఆనంద లహరిలో తేలియాడుతూ,నిశ్చలంగా ఉంటాడు .ఇదే అద్వైత స్థితి .ఇ౦దులో ఆన౦ద లహరి ఒక గొప్ప అనుభవ స్థితి .
‘’కిం బ్రూమః తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో ,భవ –ద్ధైర్యం చేద్రుశ మాత్మన స్థితిరియం చాన్యైః కథం లభ్యతే
భ్రశ్య ద్దేవ గణం త్రసన్ముని గణం నశ్య త్ప్రపంచం లయం –పశ్యన్ నిర్భయ ఏక ఏవ విహరత్యానంద సాంద్రో భావాన్ ‘’
శంభో పశుపతీ !నీ ధైర్యానికి జోహార్లు .నీ సాహసానికి జోహార్లు .నీ అచంచల ఆత్మ స్థితి బహు ప్రశంశ నీయం. ప్రళయ కాలం లో దేవతలు కూడా స్థాన భ్రంశం చెందుతున్నారు .భయం తో వణికి పోతుంటారు .నీ కళ్ళ యెదుటనే ప్రపంచం నశించి పోతోంది .ఇదంతా చూస్తూ నువ్వు మాత్రం నిశ్చలంగా ఆనంద సముద్ర లహరి లో హాయిగా తేలియాడుతూ ఉంటావు .అని అద్వైతానందాను భూతిని ఆచార్య శంకరులు అద్భుతంగా ఆవిష్కరించారు .
అలాగే ‘’అంకోలం నిజ బీజ సంతతి –‘’శ్లోకం లోనూ అద్వైత సిద్ధాంత ప్రదర్శన చేసిన సంగతి తెలుసుకొన్నాం .నదులు సముద్రం లో కలిసి తమ నామ రూపాలు అస్తిత్వాన్ని కోల్పోయి సముద్రమే నన్న భావం గా కలిసిపోతాయి .ఇదే అద్వైత స్థితి లో ఆంతర్యం .
ఈశ్వరుడు మనలోనే ఉంటె ఈశ్వర ప్రార్ధన నిరంతరం చేస్తుంటే జ్ఞాన ప్రాప్తి జరిగి ,అరిషడ్వర్గాలు నశించి అద్వైత సిద్ధి లభిస్తుంది అని ఇదివరకటి శ్లోకాలలో తెలుసుకొన్నాం . ఇలాంటి శ్లోకాలు ఎన్ని చెప్పుకొన్నా సంతృప్తి ఉండదు . నిత్య సాధనతో పరమేశ్వర చిత్త లగ్నమానసులమైతే ఆచార్య శంకరులు ప్రవచించిన శివానంద లహరి అనే అద్వైత సిద్ధి లభిస్తుందని గ్రహించాలని మనవి చేస్తూ ‘’శంకరుల శివానందలహరి ఆంతర్యం ‘’ధారావాహిక కు ఇంతటితో సమాప్తి పలుకు తున్నాను .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-11-17 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్ .