గీర్వాణకవుల కవితా గీర్వాణం -3
461-పిప్పలాద సంహిత పరిశోధకుడు –ప్రొ .దుర్గామోహన్ భట్టాచార్య (1899-1965 )
13-10-18 99 న ఢాకా లో దుర్గామోహన భట్టాచార్య జన్మించాడు .1900 లో కుటుంబం ముర్షీదాబాద్ జిల్లా సహనగర్ లాల్ బాఘ్ కు తరలి వెళ్ళింది .నిరుపేద కుటుంబం అయిన౦దున పిల్లలను ఆంగ్ల మాధ్యమ పాఠశాలకుపంపించలేక పోయారు .వీధిబడిలో బెంగాలీ సంస్కృతాలు బెంగాలీ భాషా మాధ్యమం లో మాత్రమే నేర్చాడు .దుర్గామోహన్ బుద్ధి తీక్ష్ణత చాలా ఎక్కువకనుక 1915 నాటికే అంటే 16 వ ఏటనే అనేక సంస్కృత ఉపాధి పరీక్షలురాసి అగ్రభాగాన నిలిచాడు .కావ్య ,సాంఖ్య ,పురాణాలలో అత్యుత్తమ డిగ్రీ పొంది ‘’భాగవత రత్న ‘’బిరుదు అందుకొన్నాడు .
విధవరాలైన తల్లి ,తమ్ముడితో కలకత్తా లో ఉన్న మాతామహుల ఇంటికి చేరాడు. మేనల్లుడి ఆంగ్ల భాషాధ్యయనం కోరిక తీర్చటానికి పెద్ద మేనమామ అతనిని ప్రసిద్ధ కలకత్తా టౌన్ హైస్కూల్ హెడ్మాస్టర్ సురేష్ చంద్ర కుందు వద్దకు తీసుకు వెళ్ళాడు .అప్పటికే 16 ఏళ్ళు రావటం వలన 10 ఏళ్ళ కోర్సును కేవలం ఒక్క ఏడాది లో చదవాల్సి వచ్చింది .శ్రమకోర్చి ఇష్టంగా కస్టపడి చదివి 1917 లో యూని వర్సిటి ఎంట్రన్స్ పరీక్ష రాసి ప్రధమతరగతిలో ఉత్తీర్ణుడై అందరికీ ఆశ్చర్యం కలిగింఛి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు . .పట్టుదల ఓర్పు ఉంటె సాధించలేనిది లేదని నిరూపించాడు .1919 లో విద్యాసాగర్ కాలేజి నుంచి ఇంటర్ పాసై ,1921 లో స్కాటిష్ చర్చ్ కాలేజి నుండి సంస్కృతం లో బి ఏ ఆనర్స్ డిగ్రీని పొందాడు .1923 లో కలకత్తా యూని వర్సిటీ నుంచి సంస్కృత ఎం. ఏ . డిగ్రీ తీసుకొన్నాడు .
దుర్గా మోహన్ తన దృష్టిని విద్యారంగం పై నిలిపాడు .హౌరా లో నరసింహ దత్ కాలేజీ సంస్కృత ప్రొఫెసర్ గా చేరి ,తర్వాత స్కాటిష్ చర్చ్ సంస్కృత ప్రొఫెసర్ అయి 30 వ ఏటనే హెడ్ అయ్యాడు .1952లో వెస్ట్ బెంగాల్ సీనియర్ ఎడ్యుకేషనల్ సర్వీస్ లో సంస్కృత కళాశాల పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రెయినింగ్ అండ్ రిసెర్చ్ డిపార్ట్ మెంట్ లో ప్రొఫెసర్ ఆఫ్ వేదిక్ లాంగ్వేజ్ లిటరేచర్ అండ్ కల్చర్ గా నియమింపబడ్డాడు .అర్హతను బట్టి ఉద్యోగాలు వెతుక్కొంటూ వచ్చి నిలిచాయి .చనిపోయేదాకా ఈ పదవిలోనే ఉన్నాడు .భట్టాచార్య సమర్ధత ను గుర్తించి ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ,ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బాంబే ,భండార్కర్ ఓరియెంటల్ రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ వంటి అగ్ర శ్రేణి సంస్థలు ఆహ్వానించి వేదం మొదలైన విషయాలపై ప్రసంగాలను ఏర్పాటు చేసి గౌరవించాయి .సంస్కృతం ,వేద వాగ్మయం లో ఆయన కృషికి ఈ సంస్థలు స్వర్ణ పతకాలను అందజేసి సత్కరించాయి.
అందరూ అనుకొంటున్నట్లుభారత దేశం లో అధర్వ వేదం కనుమరుగు కాలేదని అనేక పరిశోధనలవలన విషయ సేకరణ వలన నిర్ధారించాడు .దీనికి తగిన సాక్షాధారాల సేకరణ కోసం దేశం లోని అనేక ప్రాంతాలను సందర్శించాడు . చనిపోవటానికి కొన్నేళ్ళ కిందటనే ఒరిస్సాలోని’’ గుహిపాల్’’ గ్రామం లో అధర్వ వేదాధ్యయనం నిరంతరంగా కొనసాగుతోందని ప్రత్యక్షంగా చూసి సంతృప్తి చెందాడు . గుహిపాల్ లోనే అధర్వ వేదం లోని తొమ్మిది సంహితలలోముఖ్యమైన ‘’పిప్పలాద సంహిత ‘’ఒరియా భాష లోఅనేక వ్రాత ప్రతులలో కనిపించింది .దుర్గామోహన భట్టాచార్య ఆనందానికి అవధులు లేకపోయింది . అన్వేషణ ఫలించి అధర్వ వేదం అంతరించి పోలేదని లోకానికి సాక్షాధారాలతో నిరూపించి ఒక రకంగా అధర్వ వేద పునః ప్రతిష్ట చేసి దాని ప్రతిష్టను కాపాడి ఉనికిని చాటాడు .ఈ పరిశోధన విశ్వ వ్యాప్తం గా అందరి దృష్టినీ ఆకర్షించి భట్టా చార్యను ‘’అధర్వ వేదోద్ధారకుడు ‘’గా సన్మానించారు .
పిప్పలాద సంహితపై అనేక సంవత్సరాలు పరిశోధించి ,దాని ప్రచురణకు పూనుకొని ప్రపంచ వ్యాప్త గీర్వాణ విద్యా వేత్తల ప్రశంసలు పొందాడు .దురదృష్ట వశాత్తు కేన్సర్ వ్యాధి సోకి దుర్గా మోహన భట్టాచార్య 12-11-1965 న 66 వ ఏట పరమపదించాడు .మధ్యలో ఆగిపోయిన ఈ పనిని కుమారుడు దీపక్ భట్టాచార్య పూర్తిచేసి మొదటి 18 కాండల గ్రంధాన్నితయారు చేయగా కలకత్తా ఏషియాటిక్ సొసైటీ మూడు భాగాలుగా1997 ,2008 ,2011 లో ప్రచురించి లోకానికి అందజేసింది . భట్టాచార్య భార్య భవానీదేవి 1992 లో మరణించింది .ఆ దంపతులకు అయిదుగురు కుమారులు నలుగురు కుమార్తెలు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-11-17- కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్
—