భారత తొలి మహిళా మంత్రి –రాజకుమారి అమృత కౌర్ – గబ్బిట దుర్గాప్రసాద్
1889 ఫిబ్రవరి 2 ఉత్తర ప్రదేశ్ లోని లక్నో నగరం లో రాజకుమారి అమృత కౌర్ జన్మించింది .పంజాబ్ ప్రాంత కపుర్తలా రాష్ట్ర రాజు హర్మమ్ సింగ్ , రాణి హర్నాం సింగ్ దంపతుల ఎనిమిది మంది సంతానం లో ఒకరు .రాణి తల్లి బెంగాలీ ప్రేస్బెటేరియన్ ,ఆంగ్లేయ దంపతుల కుమార్తె .ఆమె ప్రాధమిక విద్య ఇంగ్లాండ్ లో డోర్సేట్ లోని షేర్ బార్న్ బాలికా పాఠ శాలలో , కాలేజి ఉన్నత విద్య ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి లో నేర్చి ఇండియా కు తిరిగి వచ్చింది .
తండ్రి రాజా హర్నాంసింగ్ కు కాంగ్రెస్ మిత్రులు చాలా మంది ఉండేవారు .ఆయనపై గోపాల కృష్ణ గోఖలే తోపాటు అందరకి గొప్ప విశ్వాసం ఉండేది . ఇండియాకు తిరిగి వచ్చాక తమ ఇంటికి వచ్చే కాంగ్రెస్ ప్రముఖుల తో పరిచయమేర్పడి వారి ప్రభావం తో అమృత కౌర్ భారత స్వాతంత్ర ఉద్యమం లో పాల్గొనాలని ఉత్సాహ పడింది .1919 లో బొంబాయిలో మహాత్మా గాంధీ ని మొదటి సారి దర్శించినప్పుడు ,ఆమె మనసు పూర్తిగా స్వతంత్ర ఉద్యమం కు అంకితమైంది .జలియన్ వాలాబాగ్ లో సిక్కుల ఊచకోతకు హృదయం తల్లడిల్లి భారత దేశం బ్రిటిష్ కబంధ హస్తాలనుండి విడుదల కానిదే గత్యంతరం లేదని నిర్ణ యించుకొన్నది .కాంగ్రెస్ సభ్యత్వం తీసుకొని పూర్తిగా ఉద్యమం లో పాల్గొని సాంఘిక సంస్కరణలకూ మద్దతు నిచ్చింది .
1927 లో అఖిల భారత మహిళా సంఘం ఏర్పాటు చేయటం లో సహకరించి ,1930 లో కార్యదర్శి అయి ,19 33 లో అధ్యక్షురాలైన చురుకైన పాత్ర పోషించింది. 1930 లో గాంధీ గారితో 240మైళ్ళ దండీ మార్చ్ లో పాల్గొని ,రాజ్య వ్యతిరేక నేరం పై అరెస్ట్ అయింది అమృత కౌర్ .విడుదలైన తర్వాత గాంధీ గారి ఆశ్రమం లో తన రాజ వంశ వారసత్వాన్ని కుసుమ కోమల శరీరాన్ని కఠిన నియమాలతో ఒక సాధారణ మహిళగా పవిత్ర జీవితం గడిపింది .16 సంవత్సరాలు గాంధీగారి కార్య దర్శులలో ఒకరుగా పని చేసింది .
1937 లో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా కైబర్ ఫక్తూన్ స్క్వ లో ఉన్న బన్ను కు సౌహార్ద్ర యాత్ర లో పాల్గొనగా ,బ్రిటిష్ పాలకులు ఆమె పై దేహద్రోహ నేరం మోపి అరెస్ట్ చేశారు . 1942 క్విట్ ఇండియా ఉద్యమం లో పాల్గొని మళ్ళీ అరెస్ట్ అయింది .ఇండియాలో అందరికి సమానంగా ఓటుహక్కు భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలని తీవ్ర ప్రచారం చేసి లోధియన్ కమీషన్ ముందు తనవాదన వినిపించింది .బ్రిటిష్ పార్లమెంట్ జాయింట్ సెలెక్షన్ కమిటీ కి సంస్కరణ విధానాల అవసరాన్ని గట్టిగా సమర్ధించి తెలియ జెప్పింది .
కౌర్ కున్న దూరాలోచన ,అభి వృద్ధిపై ఆకాంక్ష ,మహిళా సాధికారత పై ఉన్న మక్కువ గ్రహించి ఆమెను ‘’ఆలిండియా వుమెన్స్ ఎడ్యుకేష ఫండ్ అసోసియేషన్’’ కు చైర్ పర్సన్ గా ఎన్నుకొన్నారు .న్యు ఢిల్లీ లేడీ ఇర్విన్ కాలేజ్ ఎక్సిక్యూటివ్ కమిటీ మెంబర్ అయింది .బ్రిటిష్ ప్రభుత్వం ఆమె ను అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మెంబర్ ను చేసింది .క్విట్ ఇండియా ఉద్యమం లో ఈ పదవికి రాజీనామా చేసింది .1945 ,1946 లలో లండన్ ,పారిస్ ల లో జరిగిన యునెస్కో సమావేశాలకు భారత ప్రతినిధిగా ప్రభుత్వం పంపింది .అఖిల భారత స్పిన్నర్స్ అసోసియేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మెంబర్ గా సేవలు అందజేసింది . అక్షరాస్యత కోసం ,బాల్య వివాహాల నిషేధం కోసం ,పర్దా వ్యవస్థ రద్దుకోసం తీవ్రంగా కృషి చేసింది .
భారత స్వాతంత్ర్యానంతరం ఏర్పడిన ప్రధాని జవహర్ లాల్ నెహ్రు మంత్రి వర్గం లో ఆరోగ్య శాఖ కేబినేట్ మంత్రిగా పదవీ బాధ్యతలు చేబట్టి భారతీయ ప్రధమ కేంద్ర మహిళా మంత్రి గా రికార్డ్ సృష్టించింది రాజకుమారీ అమృత కౌర్ .జాన్ మత్తయ్ ,కౌర్ ఇద్దరే ఆనాటి ఇండియన్ క్రిస్టియన్ మంత్రులు .1950 లో ‘’వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ‘’ప్రెసిడెంట్ అయింది .ఆ సంస్థ ఏరడిన 25 ఏళ్ళలో మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు ,మొదటి ఆసియా మహిళాధ్యక్షురాలు అయి మరో రికార్డ్ నెలకొల్పింది . ఇద్దరు మహిళలకే ఈ గౌరవం దక్కింది .
ఢిల్లీ లో ఆలిండియాఇన్ స్టి ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏర్పడటం లో కీలక పాత్ర పోషించింది అమృతకౌర్ .దీని ప్రధమ ప్రెసిడెంట్ అయి సమర్ధత రుజువు చేసుకొన్నది .దీని నిర్మాణానికి న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ,పశ్చిమ జర్మని ,స్వీడన్ ,అమెరికాల నుండి ఆర్ధిక, సాంకేతిక సాయం పొందే కృషి చేసింది .కౌర్ ,ఆమె సోదరులలో ఒకరు సిమ్లా లో ఉన్న తమ స్వంత భవనాలను ,వారసత్వ ఆస్తినీ ఈ ఇన్ స్టి ట్యూట్ లో పని చేసే స్టాఫ్ కు, నర్స్ లకు వేసవి విడిదిగా ఏర్పాటు చేసి తమ త్యాగాన్ని ప్రదర్శించారు .
అమృత కౌర్ 14 ఏళ్ళు ఇండియన్ రెడ్ క్రాస్ కు అధ్యక్షురాలుగా సేవలు చేసింది .భారతదేశం లో రెడ్ క్రాస్ వ్యవస్థ విస్తృతంగా అభి వృద్ధిచెందటానికి ఎంతో కృషి చేసింది.టి.బి . అసోసియేషన్ ,మద్రాస్ లో సెంట్రల్ లెప్రసీ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ ,అమృత్ కౌర్ కాలేజి ఆఫ్ నర్సింగ్ అండ్ నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా ఏర్పడటం ఆమె కృషి ఫలితమే. వీటి సేవలు వర్ణనాతీతం .
1957 నుండి ఏడేళ్ళు 1964 వరకు కౌర్ రాజ్య సభ సభ్యురాలుగా ఉన్నది .ప్రజాసమస్యలపై తీవ్రంగా స్పందించేది .1958 నుంచి 1963 వరకు ఢిల్లీ లోని ఆలిండియా మోటార్ ట్రాన్స్ పోర్ట్ కాంగ్రెస్ కు ప్రెసిడెంట్ .చనిపోయే వరకు ఆలిండియా ఇన్ స్టి ట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ ,టిబి అసోసియేషన్ ,సెయింట్ జాన్స్ ఆమ్బులన్స్ కార్ప్స్ కు అధ్యక్షురాలుగా సేవ చేసింది .బహువిధ సేవలకు కౌర్ ‘’రీనె సాండ్ మెమోరియల్ అవార్డ్ ‘’పొందింది . భారత విముక్తి ఉద్యమం, మహిళా సాధికార ఉద్యమం ,కేంద్ర మంత్రిపదవిలో ఆక్షరాస్య సాధన ,మహిళా శిశు సంక్షేమం వంటి బహువిధ సేవలు అందించి,సార్ధక జీవితం గడపిన రాజకుమారీ అమృత కౌర్ 6-2-1964న 75 వ ఏట మరణించింది .
-గబ్బిట దుర్గా ప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~