ఆధునిక ప్రపంచ నిర్మాతలు -జీవితాలలో చీకటి వెలుగులు జగదభ్యుదయాభివృద్ధి కారకులకు జేజేలు

ఆధునిక ప్రపంచ నిర్మాతలు -జీవితాలలో చీకటి వెలుగులు 

జగదభ్యుదయాభివృద్ధి కారకులకు జేజేలు

                                         రచన –మైనేని గోపాలకృష్ణ –హ౦ట్స్ విల్-యు. ఎస్ .ఏ .

19 ,20 శతాబ్దాలను ప్రభావితం చేసి జగత్ అభివృద్ధి అభ్యుదయాలకు కారణభూతులైన మహానుభావులను గురించి తెలుసుకొని అవగాహన కలిగించుకోవటానికి  ‘’ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు ‘’గ్రంథం నేటి యువతరానికి ఉపయుక్తంగా ఉంటుంది .ఇందులోని మహనీయులు జీవితం లో ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొన్నారు .కాని తమ లక్ష్యాన్ని మాత్రం విస్మరించక ముందుకు సాగారు, అనుకొన్నది సాధించారు .అవహేళనలు అవమానాలు వారికి పూలదండలే అయ్యాయి . వీరి సిద్ధాంత,ప్రయోగ,ప్రవచనాలను  అర్ధం చేసుకొన్నవారు కొందరైతే, అపార్ధంచేసుకొన్నవారు  మరికొందరు . అయినా లక్ష్యపెట్టక ముందుకే మును ముందుకే సాగిపోయారు .అందుకే చిరస్మరణీయులై ఆరాధ నీయులయ్యారు . వారి జీవితాలు స్పూర్తిదాయకాలు మాత్రమే కాదు  వారు వేసిన తప్పుటడుగులు మనం వెయ్యకుండా జాగ్రత్తపడాలి . నిశితంగా వ్యక్తులను పరిశీలించి విమర్శించటం నేర్చుకోవాలి .లేకుంటే వారి అభి వృద్ధిమార్గానికి అవరోధం కలిగించిన వారమవుతాం . కొత్తది అంతా మోతా ,పాతది అంతా రోతా అనుకోకూడదు .రెంటిలోని మంచినీ గ్రహించి ముందుకు అడుగు వేయాలి . ఆత్మ సాక్షిగా  మాత్రమే వీరు అభ్యుదయ మార్గం లోపయనించారు .అందుకే వీరిని చదవాలి, అర్ధం చేసుకోవాలి . మన ప్రయత్నం లో స్పూర్తి నింపుకోవాలి .వీటికి ఈ గ్రంథం కరదీపికగా నిలుస్తుంది .

  డార్విన్ తాత మన ఆలోచనా విధానం లోనే గొప్పమార్పు తెచ్చాడు .ఎన్నో జీవిత సత్యాలను పరిణామ సిద్ధాంతం ద్వారా వ్యాప్తి చెందించాడు .మార్కొని వైర్ లెస్ కనుక్కొని ప్రసార వ్యవస్థలో కీలక వ్యవస్థకు రూపకల్పన చేశాడు . బాక్టీరియా అంటే హాని కలిగించేవి మాత్రమే కావని అందులోనూ మన జీవికకు ఉపయోగపడేవీ రోగ నిరోధక శక్తి కలిగించేవి ఉన్నాయని లూయీ పాశ్చర్ కనుగొని ఉండకపోతే ప్రపంచం శవాల గుట్టగా మారి ఉండేది .పెన్సిలిన్ మందు కనిపెట్టి ఫ్లెమింగ్ మానవాభ్యుదయాన్ని కొత్తదారి పట్టించాడు  . అకాల మరణాలను ఆపి ,జీవనఅభి వృద్ధి రేటుకు , ,రోగ రహిత  సమాజానికి బాటలు వేశాడు . క్యూరీ రేడియం మొదలైన ధాతువులను కనిపెట్టి   రోగ నిర్ణయం  రోగ నివారణలకు నూతన ఆవిష్కారం చేసింది .మహా మేధావి ఐన్ స్టీన్ సాపేక్ష్య సిద్ధాంతం ఆధునిక భౌతిక శాస్త్ర చరిత్రనే మార్చేసింది .రైట్ సోదరుల పుణ్యమా అని ఇవాళ ప్రపంచమంతా ‘’లోహ విహంగ’’-ఎయిరోప్లేన్స్  లలోగంటల్లో   ప్రపంచం చుట్టివస్తున్నాం .ప్రపంచాన్ని ఒక కుగ్రామమే చేసేశాం .నిమిషానికో విమానం గగన తలం లో ఎగురుతుంటే పక్షులేమో ననే భ్రమ కలుగుతోంది .ఎడిసన్ మహాశయుడే లేకుంటే ఇంకా చీకట్లోనే బ్రతుకులు తెల్లారేవి. అందరికి  వెలుగు వెన్నెలలు పంచిపెట్టాడు ఆ నిరంత పరిశోధక సృజన శీలి . మాక్స్ ప్లాంక్ క్వాంటం థీరీ వేల మైళ్ళు ముందుకు నడిపించింది .వీరంతా సైన్స్ ద్వారా మానవ సమాజం లో ,జీవితాలలో గణనీయమైన మార్పులు తెచ్చినవారు .

 మానవుడు భౌతికంగా ఎదగటమేకాదు ఆధ్యాత్మికం గానూ ఎదగాలి అన్న సత్యాన్నిఆవిష్కరించే వారు తత్వవేత్తలు .వారి అంతరంగం స్వచ్ఛం ,నిర్మలం .  వీరిలో ఎన్నో సిద్ధాంతాలు ఉండ వచ్చు . కాని  వారివి మానవ మానసిక అభి వృద్ధి మార్గాలు . అంతరంగాన్ని ఆవిష్కరించే పధాలు .కిర్క్ గార్డ్ అస్తిత్వవాదం ,సైకాలజీ ద్వారా మార్పు తెచ్చిన విలియం జేమ్స్ ,నీషే ,ఫ్రీవిల్ చెప్పిన బెర్గ్ సన్ ,వ్యవహారిక సత్తా వాదప్రముఖుడు జాన్ డ్యుయీ ,విధిపై మానవ విజయాన్ని చెప్పిన మాల్రక్స్ అందరూ అందరే .ఆదర్శ ప్రాయులే .

  అడవులలో తపస్సు చేసుకొనే మునీశ్వరులకు శాంత౦ భూషణం .అహింస వ్రతం .కాని నిత్య జీవితం లో దాన్ని అమలు చేయటం అసాధ్యమని పిస్తుంది.  సాధ్యం చేసి చూపాడు గౌతమ బుద్ధుడు ఆనాడు . నేటి రాజకీయాలలో అందునా పరాయి బ్రిటిష్ పాలనలో ఉంటూ భారత స్వాతంత్ర్య౦ కోసం వారిపై  నిత్య పోరాటం చేస్తూ శాంతి అహింసలకు పట్టాభిషేకం చేసి, అదే సత్యవ్రత౦ గా దీక్ష చేబూని   సత్యాగ్రహాలతో బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడ లాడించి స్వాతంత్ర సిద్ధిని సుసాధ్యం చేసిన అహింసా మూర్తి  భారత జాతిపిత పూజ్య బాపూజీ మనకే కాదు విశ్వ వంద్యుదయ్యాడు ,ప్రాతస్మరణీయుడయ్యాడు  . ఆయనపై  థోరో  ప్రభావం ఉన్నా దాన్ని సమస్యల సాధనకు ఆయుధంగా మార్చి విజేత అయి ,నెల్సన్ మండేలా ,మార్టిన్ లూధర్ కింగ్ , ఆన్ సాంగ్ సూకీ వంటి వారికి ఆదర్శమైనాడు మహాత్మా గాంధీ .ఆయన సాధించిన శాంతి విప్లవం ప్రపంచ చరిత్రలోనే సువర్ణాధ్యాయం .

 ఆధునిక రష్యా నిర్మాతలు  లెనిన్, స్టాలిన్, చైనా భవిష్యత్తు తీర్చిదిద్దిన సన్యట్ సేన్  ,బ్రిటిష్ ప్రధాని చర్చిల్   నిశిత బుద్ధి ,యుద్ధతంత్ర నైపుణ్యం   ,న్యు డీల్ తో  అమెరికా భవితవ్యాన్నే మార్చేసిన అమెరికా అధ్యక్షుడు రెండవ ప్రపంచ యుద్ధం లో కీలక పాత్ర పోషించిన  రూజ్ వెల్ట్ లు స్మరణీయులు .వీరు రాజకీయ నాయకులేకాదు-వరల్డ్ ఫేమస్ గ్రేట్ స్టేట్స్ మెన్ కూడా .

  చిత్రలేఖనం లో వినూత్న మార్గాలకై అన్వేషించి  ,నూత్న మార్గాలకు మార్గ దర్శులై కళలో సంపూర్ణత్వం కోసం జీవితా౦త౦ కృషిచేసిన  పికాసో ,మాటిస్సే,సిజేన్ ,రేనార్డ్ ,మహాశిల్పి రోడిన్ ,ఆర్కిటెక్ట్ లాయడ్ రైట్ మొదలైనవారు ముళ్ళ బాటలలో ప్రయాణించి పూలబాటలలో హారతుల౦దుకొన్నారు .వారి సృజనే వారి కీర్తికి కిరీటం పెట్టింది .రష్యన్ స్వరకర్త ఇగార్ స్ట్రా విన్స్కి , ఫ్రెంచ్ సంగీతాన్ని బంగారు ఉయ్యాలలో ఊపిన రిచార్డ్ వాగ్నర్  ఆల్బర్ట్ స్క్వీజర్ ,సంగీతానికి ఎల్లలు లేవని నిరూపించారు .నవ్వుకే ఒక కొత్త అర్ధాని సృష్టించి ,నవ్వుకు డిక్షనరీ అనిపించి ,హాస్య సర్వస్వం అని తన మూకాభినయం తో ప్రపంచాన్నే ఆకర్షించిన నవ్వుల రేడు చార్లీ చాప్లిన్ ను మర్చిపోగలమా ?అతడు ఏ దేశం వాడో మనకు అవసరమా ?ఆ ప్రభావం అలాంటిది .విశ్వ జన హృదయ విజేత చార్లీ చాప్లిన్ . నృత్యం లో విప్లవం సాధించిన ఇసదోరా డంకన్  సాహసమే ఊపిరిగా జీవించిన అమెరికన్ నృత్యకళాకారిణి.  

  సాహిత్య౦లొ కవిత్వం  విషయానికి వస్తే గడ్డిపరకలతో వెంటి పేని ఏనుగునే బంధించవచ్చు .అలాంటి ‘’గడ్డిపరకలు ‘’అంటే లీవ్స్ ఆఫ్ గ్రాస్ కు సాహిత్యగౌరవం తెచ్చి ,అట్టడుగు వర్గాలవారిని హీరోలను చేసి ,అభ్యుదయమార్గాన్ని పట్టించి మానవీయతకు పట్టాభిషేకంచేసి అమెరికన్ జాతీయ కవి మహర్షి  అనిపించుకొన్న వాల్ట్ విట్మన్ ప్రభావం పడని దేశం లేదు . ఎమిలీ డికేన్సన్ ,శతాబ్దాల వారధి హార్డీ ,సి౦బాలిజ౦ తో మనసుదోచిన పాల్ వేర్లేన్ ,స్ప్రింగ్ రిధం కర్త మాన్లి హాప్కిన్స్ ,నేటివిజాన్ని నెత్తి కెత్తుకొన్న రాబిన్సన్,వ్యావహారిక భాషా కవిత్వ సారధి రాబర్ట్ ఫ్రాస్ట్ , చైతన్య స్రవంతి కి ప్రాణంపోసిన జేమ్స్ జాయిస్ ,ప్రతీక కవిత్వ మార్గ దర్శిఎజ్రా పౌండ్ ,ఆధునిక కవిత్వ రధ సారధి ఇలియేట్ ,కవిత్వ సంకెళ్ళు తెగ గొట్టిన ఆడెన్ ,,జ్వలించే విప్లభావ కవి డిలాన్ ధామస్ ప్రపంచ కవులలో ఎన్నదగిన వారిలో ఉన్నారు .

  అమెరికన్ ఆధునిక సాహిత్యానికి ఆద్యుడు మార్క్ ట్వేన్ ,  కథ , నవల కు జీవం పోసిన హెమింగ్వే,ఫాక్నర్ ఫిట్జెరాల్డ్ ,అంతఃకరణకు విలువనిచ్చిన నవలారచయిత డి .హెచ్. లారెన్స్,ప్రభావ శాలి కాఫ్కా ,స్టీఫెన్ క్రేన్ ,యేట్స్,  సైంటిఫిక్ ఫిక్షన్ కు దారి వేసిన హెచ్ జి వెల్స్ ,ఎమిలీ జోలా ,బెర్నార్డ్ షా  ప్రపంచ వ్యాప్త అభిమానులున్న రష్యా నవలారచయిత, టాల్ స్టాయ్ ఫారం స్థాపించిన రష్యన్ రచనా మహర్షి టాల్ స్టాయ్ ,చిన్నకథ ల చెకోవ్ ,రియలిజ౦ వ్యాప్తి చేసిన ఫ్లాబర్ట్ ,   నేటివ్ అమెరికా నాటకానికి ఆద్యుడు యూజీన్ ఓ నీల్  ,నార్వేజియన్ నాటక పిత ఇబ్సన్  మొదలైనవారున్నారు .  స్త్రీ జన హక్కులకోసం పోరాడిన సుశాన్ ఆంధోని  ,క్రిస్టియన్ సైన్స్ ఉద్యమకారిణి మేరీ బేకర్ ఎడ్డీ ,సామాన్యుడికి కారు ఎక్కే అదృష్టం కల్పించిన హెన్రిఫోర్డ్ ,ఆధునిక జర్నలిజానికి ప్రతీక ధామస్ ఉల్ఫ్ వంటి సృజన శీలురు ,ప్రాతిభాసంపన్నులు ,భావితరాలకు ,ప్రపంచ దేశాలకు ఆదర్శ మూర్తులు అందరు మీకు ఒక్క చోటే దొరుకుతారు .చదివి ప్రేరణ పొందటం మీ కర్తవ్య౦ .వీరంతా ప్రపంచాభివృద్ధికి అభ్యుదయానికి కారకులు .వారందరికీ  జేజేలు .

  91 మంది మహనీయుల జీవిత చరిత్రలలో వెలుగుతోపాటు చీకట్లనూ ఆవిష్కరించి ,సరళమైన భాషలో ,అందరికి అందుబాటులో ఉండేట్లు రాశారు మిత్రులు శ్రీ దుర్గా ప్రసాద్ గారు . దీని ఆంగ్ల మాతృక రచయిత అమెరికా కు చెందిన లూయీ అంటర్ మేయర్ .దానికి పరిపుష్టి కలిగించారు తెలుగులో, తెలిగింపు లో  శ్రీ దుర్గా ప్రసాద్ .దీన్నిసరసభారతి ద్వారా ప్రచురిస్తున్నందుకు ,ప్రపంచ ప్రసిద్ధ స్టాటిస్టిక్స్ గణిత  శాస్త్ర వేత్త కీ .శే .డా శ్రీ పరుచూరి రామక్రిష్ణయ్యగారికి అంకితం  ఇవ్వటం  చాల సముచితంగా ఉంది .ఇంతటి ఉత్కృష్ట రచన సరస భారతి ద్వారా ముద్రింప జేయటానికి  మా దంపతులం ప్రాయోజకులుగా ఉండటం మాకు దొరకిన అరుదైన అవకాశం గా అదృష్టంగా భావిస్తున్నాము .  ఇది తెలుగు సాహిత్యం లో నూతన మార్గానికి ఆవిష్కరణ అవుతుంది అనటం లో సందేహం లేదు .                        

                                                 మైనేని గోపాల కృష్ణ

                                                12-11-17 –

— సాహిత్యమే శ్వాస గా జీవించిన అమెరికా ఆస్థానకవి   లూయీ అంటర్ మేయర్

 వందకు పైగా గ్రంధాలు రాసిన లూయీ అంటర్ మేయర్ అమెరికా కవి ,జీవిత చరిత్రకారుడు అగ్ర శ్రేణి విమర్శకుడు ,ప్రముఖ పత్రిక సంపాదకుడు అమెరికా దేశపు 14 వ ప్రభుత్వ ఆస్థానకవి అయిన బహుముఖ ప్రజ్ఞాని .వెయ్యేళ్ళ ఆంగ్ల కవిత్వం లో ,కొత్తదారులు తొక్కి మార్గ దర్శకులైన ఇగ్లాండ్ ,అమెరికా దేశ కవుల కవిత్వం జీవిత సరళి గురించి ‘’లీవ్స్  ఆఫ్ ది పోఎట్స్ ‘’ఉద్గ్రంధాన్ని 1959 లో రాశాడు .భావుకత పుష్కలం గా ఉన్న కవి అంటర్ మేయర్ .ఫస్ట్ లవ్ ఫ్రెంచ్ ,చాలెంజ్ సెంచరీ ,వన్ అండ్ వన్అండ్ వన్ అండ్ వన్  ,మొదలైన  20 కి పైగా కవితా సంపుటాలను ,’’ఫ్రం అనదర్ వరల్డ్ ‘’,బైగాన్స్ అనే స్వీయ చరిత్రనూ రాసుకొన్నాడు .’’ప్లే ఇన్ పోయెట్రి ,ది లోయెస్ట్ ఫారం ఆఫ్ విట్ ,ది పర్సూట్ ఆఫ్ పోయెట్రి మున్నగు 6 వ్యాస సంపుటాలను రచించాడు .మోజెస్ నవల ,ది డాగ్ ఆఫ్ పంపే మొదలైన 7 కాల్పనిక సాహిత్య గ్రంధాలనూ రాసి పాఠకులకు సన్నిహితుడయ్యాడు .ట్రెజరీ  ఆఫ్ గ్రేట్ పోయెమ్స్ , మోడరన్ అమెరికన్ పోయెట్రి ,మోడరన్ బ్రిటిష్ పొయెట్రి ,న్యు సాంగ్స్ ఫర్ న్యు వాయిసెస్ ,గెలాక్సీ ఆఫ్ వెర్స్  ,ట్రెజరీ ఆఫ్ లాఫ్టర్ ,ఆంథాలజి ఆఫ్ న్యు ఇంగ్లాండ్ బెస్ట్ పోయెట్స్ ,హ్యూమర్ యాన్యువల్ ,ది గోల్డెన్ బుక్ ఆఫ్ పోయెమ్స్ ఫర్ ది వెరి యంగ్,  మేకర్స్ ఆఫ్ ది మోడరన్ వరల్డ్ మొదలైన  30 కి పైగా జీవిత చరిత్రలు కూర్చాడు .వండర్ఫుల్  అడ్వెంచర్స్ ఆఫ్ పాల్ బన్యన్ ,ఈసప్స్ ఫేబుల్స్ , వరల్డ్స్  గ్రేట్ స్టోరీస్ వగైరా అనువాద గ్రంథాలు డజను కు పైగా వెలువరించాడు .బాల సాహిత్యాన్నీ లూయీ సుసంపన్నం చేసి తాను స్పృశించి స్వర్ణమయం చేయని ప్రక్రియ లేదని నిరూపించాడు .

 1885 అక్టోబర్ 1 న అమెరికాలో న్యూయార్క్ నగరం లో జన్మించిన మేయర్ ,ఒక జామెట్రి లెక్క చేయ లేక పోయినందుకు గ్రాడ్యుయేట్ కాలేక పోయాడు .ఇరవై ఏళ్ళు తీవ్ర కృషి చేసి సాహిత్య ,సంస్కృతులను స్వయంగా అభ్యసించి ,ఏ యూని వర్సిటి లో చదివిన దానికంటే అధిక జ్ఞానాన్ని సాధించాడు .ఇంగ్లాండ్ వెళ్లి కొంత కాలం గడిపి , ఆస్ట్రియ ,ఇటలీ లు చూసి ,అమెరికా తిరిగి వచ్చి,రచనా వ్యాసంగం ,సాహిత్యోపన్యాసాలు ,వ్యవసాయం తోనూ కాలం గడిపాడు .అనేక యూని వర్సిటీలలో ‘’ పోయెట్ ఇన్ రెసిడెన్స్ ‘’గౌరవం పొందాడు .యుద్ధ సమాచార రచయితగా ,ఆర్మ్డ్   సర్వీసెస్  ఎడిషన్ లకు సంపాదకుడిగా ఉన్నాడు .తర్వాత ప్రముఖ టి .వి. చానల్ లో ముఖ్య ప్రోగ్రామర్ భూమికను గొప్పగా పోషించాడు .అమెరికా లైబ్రరి ఆఫ్ కాంగ్రెస్ కు ఆంగ్ల కవిత్వం లో కన్సల్టంట్ గా వ్యవహరించాడు .లూయీ రాసిన ‘’మోజెస్ ‘’నవల విశ్వ విఖ్యాత మైంది .అతని ఉద్గ్రంథాలన్నీ పలు ప్రచురణలు పొంది ప్రాచుర్యం పొందాయి .92 వ ఏట లూయీ అంటర్ మేయర్ 18-12-1977 న మరణించాడు .పేరు లోని మేయర్ పదానికి సాహిత్యంలో ,మేయరై  మేరువై ప్రకాశించాడు .

                      మేకర్స్ ఆఫ్ ది మోడరన్ వరల్డ్ ప్రత్యేకత

 ఈ గ్రంథానికి ముందుమాట రాస్తూ అంటర్ మేయర్ ‘’మన కాలం లోనిప్రముఖ వ్యక్తులందరి గురించి రాయటానికి నేను దీన్ని మొదలు పెట్టలేదు .92 మంది ప్రముఖ స్త్రీ ,పురుషులకు మాత్రమే నేను తీసుకొన్నాను .వారు గత శతాబ్దం లో నూతనత్వానికి దారి చూపారు ,మన సాంస్కృతిక  తీరు తెన్నులను మార్చారు ,మన జీవిత విధానాన్నే సమూలంగా మార్చేశారు .వీరంతా బీజాణువులవంటి వారు .’’కదిలించి చైతన్యం తెచ్చినవారు –మువర్స్ అండ్ షేకర్స్అన్నమాట .వారిని అనుసరించిన వారి పై వారి ప్రభావం స్పష్టం ,అమోఘం అద్వితీయం  .వారి భావాలు ,విప్లవాత్మక ఆలోచనలు ,వ్యక్తీకరణ వలన నే ఆధునిక ప్రపంచం ఇప్పుడున్న రీతిలో  ప్రకాశమానమై  ఉన్నది .

  వీరిపై రాయటానికి నేను చాలా జాగ్రత్త తీసుకోవాల్సి వచ్చింది .కొందరు దారి తప్పించే ప్రయత్నం చేశారు .కాని వారిలోని ప్రయోగ శీలతను ,మార్గ దర్శకత్వానికి మాత్రమే నేను మొగ్గు చూపాను.తటస్తుల మాట వినక తప్పలేదు ఇందులో కళా జీవితం లో సృజనాత్మకంగా నూతనత్వాన్ని ఆవిష్కరించినవారు  అధిక్షే పించ బడ్డారు  ,చులకన పాలయ్యారు కూడా  . సృజనకారులై నవారు, సైంటిస్ట్ లు ,ఆటవిక అవహేళనకు  ఎదురు నిలిచి  వీరుల్లా యుద్ధం చేయాల్సి వచ్చింది .అందరూ నడిచేదారి నుంచి వైదొలగినవారు ,లేక కట్టు బాటు ను కాదన్నవారందరూ ,అచంచల విశ్వాసం ,పట్టుదల ,అపనమ్మకం ,అడ్డంకులను ఎదుర్కొని ప్రప౦ఛ వ్యాప్త నిరసన వ్యతిరేకతను చవి చూశారు .సమాజం ఎప్పుడూ యధా  స్థితినే కోరుకొన్నది .దానికి భంగం కలిగించిన వారిని అనుమానం తో  క్షమించలేదు . స్పష్టమైన అభి వృద్ధి, కొత్త ఆలోచనలతోనే స్థిరం గా సాధ్యపడుతుంది .దీనివలన వ్యక్తిగత శతృత్వం ,సాదారణవ్యతిరేకత తప్పదు . తర్వాత విరుద్ధం నిరంతరం సాగి ,చివరికి అవహేళన చేసి హింసించిన ప్రపంచమే  వారిని అర్ధం చేసుకొని మహా గొప్పగా ఆరాధిస్తుంది .ఈ 92 మంది మహానుభావుల జీవిత చిత్రణలో ప్రపంచం  కృతజ్ఞత చూపలేక పోయిన  వారినీ ఇందులో రాశాను .వారి ప్రభావం ఈ శతాబ్దం పై చాలా మొరటుగా, హింసాత్మకం గా ,అత్యంత అధికార క్రూర రాక్షస ఆధిపత్యాన్ని చెలాయించిన వారిని కూడా  వారు  విస్మరించ తగరు అని భావించి వారి గురించీ రాశాను .

   ప్రముఖుల ఎన్నికలో వారిని తప్పని సరిగా రాయాల్సి రావటం మాత్రమే కాక వారి ప్రాధాన్యత కూడా గణనలోకి తీసుకున్నాను .చరిత్ర రాయాలి అని మాత్రమే కాక రాస్తూనే ఉండాలి అనే నియమం ఉన్నది .ఇందులో కొందరి గురించి పదేళ్ళ క్రితం తిరిగి రాశాను.అంతమాత్రం చేత మిగిలిన వారి విషయం లో విశ్లేషణలో ప్రాధాన్యాన్ని ఏమీ తగ్గించలేదు .డార్విన్ ,వాన్ గొ ,ప్రౌస్ట్ ఐన్ స్టీన్ ,ఎడిసన్ ల కృషి వారి కాలానికి ఉన్న ప్రాధాన్యత ను తెలియ జేస్తుంది .చార్లీ చాప్లిన్ ,ఇసడోరా డంకన్ జీరార్డ్ మాన్లి హాప్కిన్స్ వంటి వారు అత్యవసరం అని పించక పోవచ్చు కాని ,వారి రంగాలలో వాళ్ళ ప్రభావం చాలా విలక్షణమైనది .

     కొందరు ప్రముఖులను వదిలేశాను. ఎందుకు అని ప్రశ్నిస్తే –వారిని చేరిస్తే వచ్చే ప్రశ్నలు అధికమౌతాయనే .రిచర్డ్ స్ట్రాస్  ను గురించి నేను రాయలేదు .దీనికి కారణం ఆయన రిచార్డ్ వాగ్నర్ నుంచి అంగుళం కూడా కదిలి ముందుకు ,ప్రక్కకు కాని పోలేదు .పైగా ఆయన ‘’రిచార్డ్ ది సెకండ్’’అని ముద్ర పడ్డాడు కనుక.  చెవులకింపైన సంగీతం కూర్చిన గ్రీగ్ , చెకోవ్ స్కి  లు గొప్ప ప్రతిభా వంతులే కాని ,ప్రాచుర్యం పొందినవారే కాని ఈ త్రయం లో ఏ ఒక్కరూ కొత్త సంగీత శబ్ద జాలాన్ని సృస్టించనే లేదు . సృజనకారులైన స్కాన్బెర్గ్ ,బార్టోక్ ల , ప్రభావం  విస్మరించ తగనిదే బాగా ప్రత్యేమైనదేకాని వదిలేయాల్సి వచ్చింది .

  కవులలో కారల్  సాండ్ బర్గ్ ,  వాలెస్ స్టీవెన్స్ ,మేరియాన్నే మూర్ ల కృషి గొప్పదే కాని వారు సెల్ఫ్  ఎంక్లోసేడ్ ,సెల్ఫ్ కంప్లీట్ గా  గిరి గీసుకొని ఉండిపోవటం తో  వదిలేశాను .కొందరు పియానో వాద్యకారులను కూడా వదిలేయాల్సి వచ్చింది .కారణం వీరి కృషిని కొందరు ముందే ఊహించి చెప్పటమే .లిస్టర్ పరి శోధనలు పాశ్చర్ అధ్యాయం లో తెరమరుగై పోయాయి .

  ఇందులో ఉన్న స్త్రీ ,పురుషులలో  వారి  ముఖ్య గుణ గణాలను గురించే రాశాను  .యదార్ధానికి అత్యంత సన్నిహితంగా ఉండాలన్నదే నా ధ్యేయం . కాని వ్యాఖ్యాత దృష్టికోణం కాదు .రచయిత నిష్పాక్షికంగా ఉండాలన్నది నా లక్ష్యం .నేను ఏ ఒక్క ఆలోచనా సంప్రదాయానికి అను చరుడిని కాని , లేక ఎవరికీ శిష్యుడను కూడా కాను  .ఏదో ఒక సిద్ధాంతాన్ని రుబ్బి రుచి చూపించేవాడినీ కాను.న్యాయమైన సూక్ష్మ బుద్ధితో సత్యాలనే వెతికి రాసి అంతిమ విలువకు ప్రాధాన్యమిచ్చే వాడినే తప్ప, ఊహాగానాలతో సంచారం చేసే వాడిని కాదు .     

    పుస్తక౦ లో  కవులు ,చిత్రకారులు ,ఫిలాసఫర్లు ,ఫిజిసిస్ట్ లు ,రాజకీయ నాయకులు మొదలైన శీర్షికలు ఎందుకు నేను పెట్టలేదు అనే ప్రశ్న రావచ్చు .దీనికి ముఖ్య కారణం ఇందులో చాలామంది ఒకే కేటగిరి లో ఇమిడేవారు కాదు .బెర్ట్రాండ్ రసెల్ గణితం లో అతి ప్రతిభా వంతుడు మాత్రమేకాక గొప్ప ఫిలాసఫర్ కూడా ..టి ఎస్ .ఇలియట్ కవి మాత్రమేకాదు ,మహా నాటక రచయితా వ్యాసకర్త కూడా .అలాగే గాంధీ ని రాజకీయ నాయకుడి గా మాత్రమే చిత్రించి  ఆయన ఇతర రంగాలలోని సేవా  కార్య కలాపాలను ఆయన మహోన్నత వ్యక్తిత్వాన్ని  విస్మరించలేము .ఆల్బర్ట్ స్వీట్జర్ ను ‘’సెయింట్స్ ‘’లో పెట్టి ,ఆయన మిగిలిన విశేషాలను వదిలేయ లేము .కనుక  శీర్షికలు పెట్టలేదు . వారి బహుముఖీయ ప్రతిభను పరిమితం చేయలేక నే శీర్షికలు పెట్టలేదు .

   నేను కూర్చిన దానిలో ఒక మంచి  సమతుల్యత ,ఒక ప్రత్యేక విరుద్ధత కూడా ఉన్నాయి .ఎకడమిక్ విషయాలు తక్కువగా ఆసక్తికర విషయాల ప్రాధాన్యతతో మార్పుల ఒడిదుడుకులను దృష్టిలో ఉంచుకొని రచించాను .కాలాన్ని అనుసరించి రాయటం వలన సంఘటనలు ఆ కాలానికి ప్రాతినిధ్యం వహించటమేకాక వాటి ప్రభావం కూడా తెలుసుకొనే వీలున్నది .దీనివలన చారిత్రాత్మక అభివృద్ధి  నేపధ్యం వరుసగా సోపానాలుగా దర్శనమిచ్చి వారి వ్యక్తిత్వాలకు మెరుగు పెట్టినట్లు అవుతుంది .పుస్తకం మొదటి నుంచి చివరిదాకా స్వతంత్రమైన  క్రాస్ రిఫరెన్స్ లను అందజేసి చదువరికి ప్రభావాల మెరుగు తరుగులను అర్ధం చేసుకొనే వీలు కల్పించాను .ఇలాంటి అంతర్గత సంబంధాలు నీషే ,వాగ్నర్ ,హిట్లర్ ,లలో బాగా కనిపించి ”అన్ని వైపులా రచయిత చూసి రాశాడు”అనే అభి ప్రాయాన్ని కలిగించాను .ఇందులో మరీ ప్రత్యేకంగా  కర్క్ గార్డ్ ,కాఫ్కా, సాత్రే లలో ఇది బాగా కని పిస్తుంది .

   ఈ గ్రంధం స్పెషలిస్ట్ ల కోసమో ,విమర్శనా దృష్టి తో చూసే విద్యా వేత్తలకో కాదు .వారికి నా అంచనాలు  స్పష్టంగా ,అసంపూర్ణ నమూనా లుగా అని పించవచ్చు .కాని దీనికి విరుద్ధంగా కొంత విషయజ్ఞానం , ముందు ఊహ ,సైంటిఫిక్ సాంకేతికాలలో ఉన్నవారికి  సాహిత్య టెక్నిక్ ఉన్నవారికి ఉపయోగ పడుతుంది .ఈ 92 మంది ప్రభావం  ఇప్పుడున్న మనం ఉంటున్న కాలం పై ఎలా ఉంది  అని నిర్వచి౦చాలను కోవటం సహజమే .,  అందుకని వారి కృషి రసాన్ని వడబోయాల్సి వచ్చింది .ఈ బృహత్తర రచన కోసం నేను 600 గ్రంథాలను తిరగేయటమో  వాటినుండి అభిప్రాయ సేకరణ చేయటమో జరిగింది .అందుకని నాకు ముందు రాసిన జీవిత చరిత్ర కారులకు విమర్శక విశ్లేషకులకు , నేను ఎంతో రుణపడి ఉన్నానని సవినయంగా మనవి చేస్తున్నాను .వారి వివరాలన్నీ గ్రంథం చివర పొందుపరచాను .   ఈ గ్రంథం లోని కొన్ని పేరాలు పూర్వం నేను రాసిన వ్యాసాలలో కనిపించి ఉండవచ్చు .వాటిని నేను యధాతధంగా వాడుకోవటానికి అనుమతించిన  ఆ పబ్లిషర్ లు ‘’హార్ కోర్ట్ బ్రెస్ అండ్ కంపెని ‘’,కంపెని ఫర్ మోడరన్ అమెరికన్ అండ్ బ్రిటిష్ పోయెట్రి ,ది కాలేజ్ సర్వే  ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ ,హెన్రి హాల్ట్ అండ్ కంపెని ,జార్జి మేకీ కంపనీస్ మొదలైన వారికి కృతజ్ఞతలు తెలుపు కొంటున్నాను  . ఈ గ్రంథం రాస్తూ ఉండగా నాకు ఎన్నో సలహాలనిచ్చి ప్రోత్సహించిన జాక్ గుడ్ మాన్ ,ఫిలిప్ వా౦డోరన్ స్టెర్న్, మెర్రిల్ మూర్ ,స్టాన్లీ బర్న్ షా లకు కృతజ్ఞతలు .నా రిసెర్చ్ లో సహాయపడిన అల్రిక్ కాషెల్,ఎలైన్ లార్బర్  ,బీట్రిస్ బ్రాడే ,మా కోడలు నార్మా ఆన్చిన్ అంటర్ మేయర్ లకు ఏమిచ్చి ఋణం  తీర్చు కోగలను ?కృతజ్ఞతలు చెప్పటం తప్ప .

  ముఖ్యంగా సైంటిఫిక్ డేటా విషయం లో సేకరించిన  విషయాలను చెక్ ,కౌంటర్ చెక్ చేసుకోవాల్సి వచ్చింది .దీనికి నాకొడుకు జాన్ మూర్ చాలా సహాయం చేశాడు .ప్లాంక్ , ఎడ్డింగ్టన్ ల పై రాసిన చాప్టర్లలో అతను అంద జేసిన విలువైన సమాచారం ఉంది.సంపాదకత్వం లో చక్కని చతురత ,నిపుణత ఉన్న నా భార్య  బ్రినా ఐవెన్స్ నా వెన్నంటి ఉండి నడిపించి ఈ మహత్తర గ్రంధాన్ని  గట్టెక్కించటానికి  చేసిన తోడ్పాటుకు ఆమెకు జీవితాంతం కృతజ్ఞుడను .’’

 అని అతి స్పష్టంగా అత్యంత వినయం గా తన ప్రణాలికను వివరించి ,సహకరించినవారందరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపిన సహృదయ మూర్తి లూయీ అంటర్ మేయర్ . ‘’మేకర్స్ ఆఫ్ ది మోడరన్ వరల్డ్ ‘’ బృహద్గ్రంధాన్ని1955 లో అంటర్ మేయర్ ప్రచురింఛి లోకానికి మహోపకారం చేశాడు .అది  20-10-2014 న అంటే సుమారుగా 60 ఏళ్ళకు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి ద్వారా నాకు చేరింది .దీన్ని ఆ రోజునుంచే చదవటం ప్రారంభించి 23-1-2015 కు అంటే 3 నెలల లోపు చదివి పూ ర్తి చేశాను .ఆతర్వాత కథ అంతా ముందే వివరించాను .ఇంతమంచి ఉపయుక్త గ్రంథాన్ని అనుసరించి తెలుగులో ‘’ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు ‘’గా అంతర్జాలం లో రాసి, ఇప్పుడు పుస్తక రూపం లో అందజేస్తున్నందుకు ఆనందంగా ఉంది.దీనికి సహకరించిన వారందరికీ మరో మారు కృతజ్ఞతలు .ఇందులోని  గుణాలన్నీ అంటర్ మేయర్ కు, దోషాలన్నీ నాకు దక్కుతాయని సవినయంగా మనవి చేసుకొంటున్నాను .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –24-3-17 –ఉయ్యూరు  

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు

స్వర్గీయ డా శ్రీ పరుచూరి రామకృష్ణయ్య గారికి అంకితం

లూయీ అంటర్ మేయర్ ఆంగ్లం లో రాసిన బృహద్గ్రంథం’’మేకర్స్ ఆఫ్ ది మోడరన్ వరల్డ్ ‘’ఆధారం గా నేను దాదాపు సంవత్సరన్నర కాలంగా అంతర్జాలం లో 245 ఎపిసోడ్ లుగా 91 మంది మహానుభావులపై  రాసిన ‘’ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు ‘’ను ఎవరికి అంకితం ఇవ్వాలా అని ఆలోచిస్తుంటే   ఆప్తమిత్రులు ,సరస భారతి శ్రేయోభిలాషి ,ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణగారు (అమెరికా ) తమ బావమరది ,ప్రపంచ ప్రముఖ  స్టాటిస్టిక్స్ గణిత శాస్త్ర వేత్త ,వితరణ శీలి, సుమనస్కులు  స్వర్గీయడా. శ్రీ పరుచూరి రామకృష్ణయ్య గారికి ఇంతటి విశిష్ట  రచన అంకిత మిస్తే గ్రంథ ప్రాముఖ్యత ద్విగుణీకృతం అవుతుందని సూచించి,నా అనుమతిని కోరటం, నేను క్షణం కూడా ఆలోచించకుండా ఆమోదించటం క్షణాల మీద జరిగి పోయింది .ఈ గ్రంథాన్నిసరసభారతి ద్వారా ముద్రించటానికి అవసరమైన ధనాన్ని శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి దంపతులు రేపల్లె వాస్తవ్యులు కీ శే .పరుచూరిభావనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ పరుచూరి శ్రీనాధ్ గారిని సంప్రదించి వారి ఆమోదాన్ని నాకు తెలియ బరచారు . ఇంతటి బృహత్ గ్రంధానికి బృహత్ ప్రోత్సాహం నన్ను సంతృప్తి పరచింది .   .ఇంతటి ఆచూకీ గ్రంధం అంటే రిఫరెన్స్ పుస్తకం సరసభారతి 26 వ గ్రంథంగా వెలువడటం ,నేను రాసిన 15 వ పుస్తకం కావటం మహదానందంగా ఉన్నది .ఒక సర్వ శ్రేష్ట గ్రంథం ఒక సర్వ శ్రేష్ట మహాన్నత  వ్యక్తి  స్వర్గీయ డా శ్రీ పరుచూరి రామ క్రష్ణయ్యగారికి అంకితం ఇస్తున్నందుకు  సంతోషిస్తూ వారి గురించి వ్రాయటానికి ఉపక్రమిస్తున్నాను .

      స్టాటిస్టిక్స్ లో శాశ్వత కీర్తి నార్జించిన  స్వర్గీయ డా శ్రీ పరుచూరి రామ కృష్ణయ్యగారు

                జనన విద్యాభ్యాసాలు

శ్రీ పరుచూరి రామ క్రష్ణయ్యగారు ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు జిల్లా రేపల్లె దగ్గర నల్లూరు అనే చిన్న గ్రామం లో 15-7-1932 న మధ్యతరగతి రైతు కుటుంబం లో శ్రీ పరుచూరి భావన్నారాయణ చౌదరి ,శ్రీమతి రత్న మాణిక్యమ్మ దంపతులకు జన్మించారు.వీరి బాల్య విద్యాభ్యాసం నల్లూరు, రేపల్లె లో జరిగింది .నేటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో సెకండరీ విద్య పూర్తి చేశారు .  మద్రాస్  లయోలాకాలేజి లో ఇంటర్ చదివి ,ప్రెసిడెన్సి కళాశాలనుండి  గణిత శాస్త్రం లో ‘’స్టాటిస్టిక్స్ ‘’అభిమాన విషయంగా  బి .ఎస్ .సి .ఆనర్స్ డిగ్రీ  పొందారు .అమెరికాలోని మిన్నెసోటా యూని వర్సిటి లో చేరి తమ అభిమాన స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ (గణాంక శాస్త్రం )లో ఎం .ఎస్ . ను పి .హెచ్ .డి.సాధించారు .1956 లో నార్త్ కరోలిన యూని వర్సిటి ప్రొఫెసర్ శ్రీ ఎస్. యెన్. రాయ్ మిన్నెసోటా సందర్శించినపుడు క్రష్ణయ్యగారిని ‘’మల్టి వేరియేట్  స్టాటిస్టికల్ అనాలిసిస్ కోర్స్ ‘’లో చేరమని ప్రోత్సహించగా  ,కొలరాడో లోని బోల్డర్ లో ఉన్న ఐ .ఎం. ఎస్ .సమ్మర్ ఇన్ స్టి ట్యూట్ లో 1957 లో స్టూడెంట్ మెంబర్ గా చేరారు .ఇక్కడ ఉండగానే అనాలిసిస్ ఆఫ్ వేరిఎన్స్, దానికి సంబంధించిన  సమస్యలపై జరిగిన సెమినార్ లలో బోస్ ,  కెం ఫ్టోర్నే ,కృస్కాల్ , షెఫే మొదలైన ప్రొఫెసర్ ల  ప్రభావం తో తన ప్రతిభకు రాణింపు తెచ్చుకొన్నారు .ఏడాది తర్వాత మిన్నెసోటా లో జరిగిన మరొక సెమినార్ లో శ్రీ  క్రష్ణయ్య’’రా0కింగ్  అండ్ సెలెక్షన్  ప్రాబ్లెమ్స్ ‘’పై ఆకర్షితులయ్యారు .ఈ మూడు ప్రత్యేక విషయాలే ఆ తర్వాత ఆయన కు కన్సల్టేషన్ ,పబ్లికేషన్ కు బాగా తోడ్పడినాయి  .1959- -60 లో ఆయన చాపెల్ హిల్ లో ఒక ఏడాది గడిపి ఈ సబ్జెక్ట్ ల  పై   ప్రొఫెసర్ రాయ్ తో విస్తృతం గా చర్చించారు .

                                గణిత శాస్త్ర మేధావి  –పరిశోధన

మిన్నెసోటా యూని వర్సిటి లో విదార్ధిగా 1955 – 60 వరకు  బ్యూరో ఆఫ్ ఎడ్యు కేషనల్ రిసెర్చ్ డిపార్ట్ మెంట్ లో ‘’స్టాటిస్టికల్ అనలిస్ట్ ‘’గా సేవ లందించారు . 1960-నుండి1962 వరకు  పెన్సిల్వేనియాలో  బ్లూబెల్ లో ఉన్న   రెమింగ్ట న్ రాండ్ కంపెనీలో సీనియర్ స్టాటిస్టీషియన్ గా పని చేశారు . ,1963 నుంచి 1976 వరకు  ఒహాయో లో డేటన్ లోని రైట్ పాటర్సన్ వైమానిక స్థావరం మాధమాటికల్  స్టాటిస్టీషియన్ గా ఉండి .గణిత శాస్త్ర పరిశోధన ,అభి వృద్ధి లో కృషి చేశారు .1976 లో  పిట్స్ బర్గ్ యూని వర్సిటి స్టాటిస్టిక్స్ శాఖ లో  ప్రొఫెసర్ గా  బోధనా వ్రుత్తి లో ప్రవేశించి ఉత్తమ ఆచార్యునిగా గుర్తింపు పొందారు .స్టాటిస్టిక్స్ లో ఆధునిక ప్రోగ్రాం రూపొందించి  స్టాటిస్టిక్స్ కు అమెరికాలో విశేషమైన ,విశిష్ట స్థానాన్ని చేకూర్చారు .ఎన్నో ప్రభుత్వ ,ప్రైవేట్ రిసెర్చ్ ప్రాజెక్ట్ లకు నిర్దుష్టంగా ప్రపోజల్స్ తయారు చేసి ,సకాలం లో వాటిని పూర్టి చేసి,వందల వేల డాలర్ల ఫండ్ ను డిపార్ట్ ట్ కు సమకూర్చి ,ఆర్ధిక పరి పుష్టి కి తోడ్పడి అడ్మినిస్ట్రేషన్ వారి గౌరవ ప్రశంసలకు ప్రీతి పాత్రులై ,  ఆ శాఖ కు, యూని వర్సిటి కి గొప్ప పేరు ప్రతిష్టలను  చేకూర్చారు . .  .ఇక్కడితో ఆగిపోకుండా ‘’మల్టి వేరియేట్  విశ్లేషణా కేంద్రం ‘’ను 1982 లో స్థాపింఛి వ్యవస్థాపక డైరెక్టర్ గా ఉంటూ ,గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ప్రొఫెసర్ గా,కార్నెగి మెల్లన్ విశ్వ విద్యాలయం లో  కన్సల్టంట్ గా వ్యవహరించారు .  . మల్టి వేరియేట్  విశ్లేషణ పై 1965 ,68 ,72 ,75 ,78 ,1983  సంవత్సరాలలో  6 అంతర్జాతీయ  సింపోజియం లను నిర్వహించిన ఘనత శ్రీ రామ క్రష్ణయ్యగారిది . ఈ సి౦పోజియం   ‘’ప్రొసీడింగ్స్ ‘’ను ప్రచురించి శాశ్వతం చేశారు ..అందులోమొదటి సమావేశ ప్రొసీడింగ్స్ ను ఈ రంగం లో తమకు విశేష అభి రుచి కలిగించి ,మార్గదర్శనం చేసిన  ప్రొఫెసర్ ఎస్ .యెన్ .రాయ్ జ్ఞాపకార్ధం ప్రచురించారు .తరువాతి వాటిని  తమ అభివృద్ధికి సాయపడిన హెచ్ .హోటెల్లింగ్, పి .సి. మహలనోబిస్ ,హెచ్ .షెఫే ల కు కృతజ్ఞతగా అంకితమిచ్చిఋణం తీర్చుకున్నారు . ,  దీనిపై భావధార కోసం ఒక ప్రత్యేక పత్రిక’’జర్నల్ ఆఫ్ మల్టి వేరియేట్ అనాలిసిస్ ‘’ స్థాపించి ,దానికి అంతర్జాతీయ గుర్తింపు కలిగించారు . నార్త్ హాలండ్ ప్రచురించిన ‘’హాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ‘’కు జనరల్ ఎడిటర్ గా ఉన్నారు .ఇవి కాక ‘’స్టాటిస్టికల్ ప్లానింగ్ అండ్ ఇన్ఫరెన్స్  ‘’ కు ఎడిటోరియల్ బోర్డ్ సభ్యులుగా ,నార్త్ హాలండ్ సిరీస్ ‘’స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీస్ ‘’కు కోఆర్దినేటింగ్ ఎడిటర్ గా సేవలందించారు .నిరంతర పరిశోధన ,అమలు వీరి అభిమాన విషయాలు .’’ప్రాబబిలిటి అండ్ మాధమాటికల్ స్టాటి స్టిక్స్ ‘’పై రష్యాలోని వెల్నియస్ లో  జరిగిన మూడు  అంతర్జాతీయ సమావేశాలకు ఆహ్వాని౦ప బడి విలువైన ప్రొఫెషనల్ పత్రాలను సమర్పించి దిశా నిర్దేశనం చేశారు .1981 లో చైనా లో యూనివర్సిటీల ఆహ్వానం పై  మూడు వారాలు పర్యటించారు . జపాన్ సొసైటీ ఫర్ ప్రమోషన్ సైన్స్  ఫెలోషిప్ అందుకోవటానికి 1986 -87 లో ఒక నెలరోజులకు ఆహ్వానించగా కేన్సర్ వ్యాధి తో తీవ్ర అస్వస్థులైనందువలన వెళ్ళ లేక పోయారు . . 1966 లో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్ స్టి ట్యూట్ కు విజిటింగ్ ప్రొఫెసర్ గా ,వార్సాలోని బెనాక్ సెంటర్ కు ,పోలిష్ అండ్ యు .ఎస్ .నేషనల్  అకాడెమి ఆఫ్ సైన్సెస్ కు చెందిన మాధమాటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్ మెంట్ కు విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉన్నారు .. 1960  లో ఆంధ్రా యూని వర్సిటి మాధమాటిక్స్ డిపార్ట్ మెంట్ ,1968 లో మద్రాస్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ మాధమాటికల్ సైన్సెస్ యాజమాన్యాల ఆహ్వానం మేరకు ‘’మాధమాటికల్  మరియు స్టాటిస్టికల్ సైన్సెస్ లో నూతన పరిణామాలు ‘’ పై ప్రసంగాలు చేశారు .

                           వివాహం సంతానం

 శ్రీ రామ క్రష్ణయ్యగారు 1960 లో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వాస్తవ్యులు ప్రముఖ న్యాయవాది శ్రీ కాను మిల్లి రామ చంద్ర రావు శ్రీమతి లీలావతి గార్ల జ్యేష్ట పుత్రిక శ్రీమతి ఇందిర ,బి .ఏ . గారిని వివాహమాడారు.ఈ దంపతులకు   శ్రీ రఘురాం , శ్రీ నిరంజన్ రాం అనే ఇద్దరు కుమారులు . చిన్నతనం లోనే తండ్రి ని కోల్పోయిన  వీరిద్దరినీ ఆదర్శ సతీమణి శ్రీమతి ఇందిర గారు మాతృ మూర్తిగా వారికి సద్బుద్ధులు గరపి ,తీర్చి దిద్దిన ఆదర్శ మూర్తి .  వీరిద్దరూ తమకు అభిమానమున్న  ప్రముఖ విద్యా ,పారిశ్రామిక ర౦గాలలో రాణిస్తూ ,వివాహాలు చేసుకొని సత్సంతానం తో అభి వృద్ధి చెంది ,తండ్రి గారి పేరు నిలబెడుతూ ,తల్లి గారిని గౌరవ ,ప్రేమాభిమానాలతో  కంటికి రెప్ప లాగా కాపాడు కొంటూ జీవితాలను సార్ధకం చేసుకొని ధన్యులై   కుటుంబ గౌరవాన్ని చక్కగా కాపాడు కొంటున్నారు ..  శ్రీమతి ఇందిర గారు  ప్రస్తుతం  పిట్స్ బర్గ్ కమ్యూనిటి కాలేజి లో డెవలప్ మెంట్  రీడింగ్  ఇన్ స్ట్రక్టర్  గా ఉన్నారు . శ్రీ రామ కృష్ణయ్య గారి పేరు లోని ‘’కృష్ణయ్య’’  పదం ఇప్పుడు  వారికీ ,వారి వారసులకు ఇంటి పేరు(ఫామిలి నేం )గా మారిపోయి స్థిరపడి పోయి గౌరవాన్ని కల్గించింది .

                     గ్రంథ ప్రచురణ –పరిశోధకులకు చేయూత

 తమ అభిమాన స్టాటిస్టిక్స్ లో ఆధునిక నైపుణ్యాలను వివరిస్తూ వీరి సంపాదకత్వం లో అనేక విశిష్ట గ్రంథాలను ప్రచురించారు .పిట్స్ బర్గ్ యూని వర్సిటి లోని డిపార్ట్ మెంట్ ఆఫ్ మాధమాటిక్స్ అండ్  స్టాటిస్టిక్స్  అభి వృద్ధికి కీలక పాత్ర పోషించారు . ఎన్నో యూని వర్సిటీలు ఆహ్వానించినా ప్రొఫెసర్ సి .ఆర్ .రావు గారిని ఒప్పించి  ఈ డిపార్ట్ మెంట్  కు ఆహ్వానించి వారి సేవలను అందింప జేయటం లో   రామక్రష్ణయ్యగారి పాత్ర ,కృషి అద్వితీయమైనది . ఆయన బహుముఖ ప్రతిభకు ఉదాహరణలే ‘’థీరిటికల్ అండ్ కంప్యు టేషనల్ స్టాటిస్టిక్స్ ,సిగ్నల్ ప్రాసెసింగ్ ,పాటర్న్ రికగ్నిషన్ ,మెడికల్ స్టాటిస్టిక్స్ ,ఎకనామెట్రిక్స్ లలో ఆయన అమోఘ సృజనాత్మక కృషి   .అనేక రంగాలలోని సైంటిస్ట్ లకు 30 ఏళ్ళు విలువైన సంతృప్తికరమైన  సేవలు అందించారు శ్రీ రామ  కృష్ణయ్య గారు .  మూడవ ప్రపంచ దేశాలలో సైంటిఫిక్ హెల్త్ ,అల్లైడ్ రిసెర్చ్ ఎడ్యుకేషన్ ల కోసం అంకిత భావం తో కృషి చేస్తున్న లాభాపేక్ష లేని స్వచ్చంద సంస్థ ‘’SH A R E ‘’సంస్థకు అధ్యక్షులుగా రామ క్రష్ణయ్యగారు మరణించే వరకు సేవ చేశారు .  ఆయన 19 విలువైన గ్రంథాలకు , మోనోగ్రాఫ్ లకు సంపాదకులుగా ఉన్నారు. రెండు రిఫరెన్స్ గ్రంథాల ను రచించారు .1976 నుండి చనిపోయే దాకా పిట్స్ బర్గ్ యూని వర్సిటి కు రిసెర్చ్ కాన్ ట్రాక్ట్స్ కు ప్రిన్సిపల్ ఇన్వెస్టి గేటర్  గా ఉన్నారు . థీరిటికల్ స్టాటిస్టిక్స్ ఆయన అభిమాన విషయమే అయినా అప్లికేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ను ఎప్పుడూ  దృష్టి లో ఉంచుకొనేవారు ..

గణిత  శాస్త్రం లో పరిశోధన చేసే అనేక మంది విద్యార్ధులకు వేలాది  డాలర్ల స్కాలర్షిప్ లను మంజూరు చేస్తూ ప్రపంచ వ్యాప్త ప్రశంసలను అందుకున్నారు .వీరి పర్య వేక్షణ లో డాక్టరేట్ పొందిన విద్యార్ధులు  పలు దేశాలలో ప్రముఖ శాస్త్రజ్ఞులు గా  రాణిస్తూ గౌరవం పొందుతున్నారు .ఆరోగ్య రంగం లో డాక్టర్ల నైపుణ్యం పెంచటానికి అమెరికన్ షేర్ సంస్థ ఏర్పరచి తాము చైర్ పర్సన్ గా ఉన్నారు .దీనికి అనుబంధంగా ఇండియాలో హైదరాబాద్ లో ఒక శాఖ ను ఏర్పాటు చేశారు .వీరి సేవానిరతికి గుర్తింపుగా అమెరికాలో పెన్సిల్వేనియా యూని వర్సిటి లో ‘’పెన్ –రామ కృష్ణయ్య ఫండ్ ‘’ను ఏర్పరచి విద్యార్ధులకు ఉపకార వేతనాలు అందజేస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు .

                గౌరవ పురస్కారాలు

డా రామకృష్ణయ్య గారి బహుముఖీన ప్రతిభను గుర్తించి అంతర్జాతీయ స్టాటిస్టికల్ సంస్థ ,అమెరికా స్టాటిస్టికల్ అసోసియేషన్ ,అమెరికా సైన్స్ పురోభి వృద్ధి అసోసియేషన్ ,స్టాటిస్టికల్ విద్యా సంస్థ మొదలైనవి సభ్యత్వమిచ్చి గౌరవించి వారి సేవలను అందుకొన్నాయి . శ్రీ  కృష్ణయ్య  రూపొందించిన స్టాటిస్టికల్ టెస్ట్ ‘’కృష్ణయ్యాస్ ఫైనైట్ ఇంటర్ సెక్షన్ టెస్ట్ ‘’ గా వారి పేర గౌరవం గా నామకరణం చేయబడి ప్రసిద్ధి చెందింది . భారత ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ  19 80 దశకం లో శ్రీ రామ కృష్ణయ్య గారితో పాటు ,ప్రముఖ శాస్త్ర వేత్తలను ఢిల్లీ లో సత్కరించి  వారి విశిష్ట సేవలకు గుర్తింపు కలిగించారు .  1985 లో అమెరికాలోని తెలుగు సంస్థ ‘’తానా ‘’శ్రీ రామ క్రష్ణయ్యగారిని ‘’గొప్ప శాస్త్ర వేత్త ‘’గా గుర్తించి ఘనంగా సన్మానించింది .శ్రీ రామకృష్ణ య్య గారు మద్రాస్ ప్రెసిడెన్సి కాలేజి విద్యార్ధిగా ఉన్నప్పుడు ‘’సత్యాగ్రహం ‘’నాటికలో బాపూజీ గా నటించి ,వాస్తవికత కోసం తల వెంట్రుకలు తీయించుకొని (గుండు చేయించుకొని ) నటించి ,అందరి ప్రశంసలు అందుకొన్నారు .

‘’చిరంజీవి’’డా .పరుచూరి రామకృష్ణయ్య

డా .పరుచూరి రామ కృష్ణయ్య గారి స్మృతులను శాశ్వతం చేయటానికి 1992లో పెన్సిల్వేనియా స్టేట్ యూని వర్సిటి లో ‘’విజిటింగ్ స్కాలర్స్ ప్రోగ్రాం ‘’ను  ప్రారంభించి ,శ్రీ రామ కృష్ణయ్య స్మారక ఉపన్యాసాలను ,లేక  ఈ ప్రోగ్రాం లో  రిసెర్చ్ వర్క్ లో పాల్గొనే కార్యక్రమాన్ని ‘’పి .ఆర్ .కృష్ణయ్య మెమోరియల్ లెక్చర్స్ ‘’అని నామకరణం చేసి  ,అసాదారణ ప్రతిభా విశేషాలున్న వారిని ఆహ్వానించి ప్రసంగాలు చేయిస్తూ గౌరవిస్తూ రామ క్రష్ణయ్యగారిని స్మృతి పధం లో చిరంజీవి ని చేస్తున్నారు .

 ఈ ప్రోగ్రాం లో పాల్గొని ఉపన్యసించి గౌరవ పురస్కారాలు అందుకున్న విజిటింగ్ స్కాలర్స్

 1-1992-సర్ డేవిడ్ ఆర్ .కాక్స్

 2-1993-హెర్మన్ చెనాఫ్

3-1994- బ్రాడ్లీ ఎఫ్రాన్ మరియు పీటర్ జే బ్రికేట్

4-1995-  శ్రీనివాస ఆర్ .ఎస్ .వర్ధన్

5-1999-డేవిడ్ మ౦ ఫోర్డ్

6-2000 –డేవిడ్ ఎల్ .డోనోహో

7-2001-లియో బ్రీమన్

8-2003-జేమ్స్ ఓ బెర్జెర్

9-2006 –జీన్ హెచ్ .గోలబ్

10-2008-ఎలిజబెత్ ధాంప్సన్

11-2013 –స్టీఫెన్ ఫీన్ బెర్గ్

12-2015 –నాన్సీ రీడ్

13-2017-సతీష్ అయ్యంగార్

                        కుటుంబానికి ప్రోత్సాహం

  వీరి అన్నగారు శ్రీ  సుదర్శన రావు గారు ‘’పరుచూరి వారి  పాక శాస్త్రం ‘’రాసి ప్రచురించారు .ఈ పుస్తక విక్రయం వలన లభించిన  వేలాది డాలర్లను పై ఫండ్ కు అందజేసి తమ వితరణ శీలత్వాన్ని ప్రకటించుకున్నారు . రామ క్రష్ణయ్యగారు తమ అన్నగారిని  నలుగురు తమ్ముళ్ళను   ,ఇద్దరు అక్క చెల్లెళ్ళను అమెరికా కు తీసుకొని వచ్చి అక్కడే స్థిరపడేట్లు చేశారు . శ్రీ రామ కృష్ణయ్య గారిది నిష్కల్మష, నిర్మల, నిష్కపట గుణం .వీరిది అతి సుకుమారమైన చిన్న పిల్లల మనస్తత్వం.ఊహలో కూడా ఎవరికీ హాని తలపెట్టని సంస్కారం వారిది .మొదటి నుండి తండ్రి గారి కస్ట సుఖాలలో పాలు పంచుకొని ,కుటుంబ సభ్యుల ,సన్నిహితుల మేలు కోసం పరితపించిన విశాల, ఉన్నత గుణ సంపన్నులు శ్రీ రామ కృష్ణయ్యగారు “.”.తెలుగు దేశం నుండి అమెరికా వెళ్ళిన వారికి  రామ క్రష్ణయ్యగారు సహాయ సహకారాలు అందించి ఆదుకున్నారు .1977 లో  సృష్టించిన  దివి సీమ ఉప్పెన భీభత్సం వలన శకలం కోల్పోయిన వారి కుటుంబాల కడగండ్లను స్వయం గా చూసి ,చలించిన శ్రీ రామ కృష్ణయ్య గారు రేపల్లె  సమీపం  లో  నగరంలో ఉన్న వెలగ పూడి రామ కృష్ణ  కాలేజి  వారి తో కలిసి , నష్ట పోయిన ఆ ప్రాంతం లోనూ, దివి తాలూకా లోను తమ శాయ శక్తులా   సహాయ సహకారాలు అందించి మానవత్వానికి ఎత్తిన పతాక గా నిలిచిన మహోదారులు .

..               మహా ప్రస్థాన౦

 ఇండియాలో ఒక చిన్న పల్లెటూరు లో జన్మించి   తమ మేధా సంపత్తి చేత స్టాటిస్టిక్స్ గణిత శాస్త్ర౦ లో అంతర్జాతీయ ప్రముఖులై ,ఎందరికో విద్యాదానం చేసి ,ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన ,మేధావి ,వితరణ శీలి ,సుమనస్కులు  డా ,పరుచూరి రామ క్రష్ణయ్యగారు  1-8-1987 న  55 వ ఏట కేన్సర్ వ్యాధి తో  మరణించటం   దురదృష్ట కరం ..

                       .

‘’అయం నిజః పరో వేది  గణనా లఘు చేతసాం

‘ఉదార చరితానాం తు పురుషాణా౦  వసుధైక  కుటుంబకం’’ ‘

భావం –వీడు నా వాడు, వాడు పరాయి వాడు అనే బుద్ధి అల్ప మనస్కులకే ఉంటుంది .ఉదాత్త చరిత్ర కల పురుషులకు విశ్వమంతా తన కుటుంబమే నని పిస్తుంది .

శ్రీ పరుచూరి రామకృష్ణయ్య గారి సంగ్రహ జీవిత చరిత్రకు ఆధారం –

1-      20 వ శతాబ్దపు తెలుగు వెలుగులు -2-ప్రొఫెసర్ ఎం .ఎం .రావు  మరియు పద్మ విభూషణ్ ప్రొఫెసర్ సి. ఆర్. రావు గార్లు రచించిన గ్రంథం 3- శ్రీ రామ  కృష్ణయ్య గారి అర్ధాంగి శ్రీమతి ఇందిర గారు ,సోదరులు శ్రీ పరుచూరి శ్రీనాథ్ గార్లు అందజేసిన సమాచారం ,4-వీకీ పీడియా 5- అన్నిటికి మించి  శ్రీ రామ కృష్ణయ్య గారి బావగారు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ,శ్రీమతి సత్యవతి దంపతులు సమకూర్చిన అత్యంత విలువైన సమాచారమే కాక ప్రతి విషయం లో  నిర్దుస్టతకు చేసిన మార్గ దర్శనం .

     గబ్బిట దుర్గా ప్రసాద్ -14–3-17 –ఉయ్యూరు

—  వినయం తో విన్నపం

— రిసెర్చ్ కృషి లాంటి ఈ బృహద్గ్రంథం  ‘’ ఆధునిక ప్రపంచ నిర్మాతలు -జీవితాలలో చీకటి వెలుగులు ”ప్రచురణలోనాకు,సరసభారతికి,,ప్రాయోజకులకు ,అంకితంపొందుతున్నవారికీ ఎవరికీ ప్రతిఫలాపేక్ష ,వ్యా పార దృష్టి లేదని ప్రపంచ పురోగతికి మార్గ దర్శకులైన మహనీయుల జీవిత విశేషాలు సాధించిన ఘనవిజయాలను  ,తెలియని వారికీ ,ముఖ్యంగా నేటి యువతకు ,అభిరుచి ఉన్న ఆసక్తిగల పాఠకుల దృష్టికి తెచ్చి,ఇంతటి సమాచారాన్ని  అందుబాటులో ఉంచటమే మా  ప్రధాన లక్ష్యమని   మనస్పూర్తిగా తెలియ బరుస్తున్నాను .

గబ్బిట దుర్గా ప్రసాద్ – .1-11–17

ఎందరో మహానుభావులు

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –  ఆధునిక ప్రపంచ నిర్మాతలు -జీవితాలలో చీకటి వెలుగులు అన్న ఈ గ్రంథానికి  ముందుమాటలు రాసిన మచిలీపట్నం హిందూ కళాశాల చరిత్ర విభాగం అధిపతి  డా శ్రీ సవరం వెంకటేశ్వరరావు గారికి ,  ,అభిలషణీయమైన ఆకర్షణీయ అర్ధవంతమైన ముఖ చిత్రాలను డిజైన్ చేసిన శ్రీ కళాసాగర్ గారికి ,డిటిపి చేసి సరసభారతి తరఫున అందంగా  ముద్రి0పజేసి ,అందజేసిన ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం  కార్యదర్శి ,రమ్య భారతి సంపాదకులు ,సరసభారతి ఆత్మీయులు శ్రీ చలపాక ప్రకాష్ గారికీ ,  కీ శే డా శ్రీ పరుచూరి రామకృష్ణయ్య గారికి అంకితమిప్పించి  సార్ధకత కల్పించి ,ప్రాయోజకులుగా సరసభారతి తరఫున గ్రంథ ముద్రణకు తోడ్పడిన ఆత్మీయులు శ్రీ మైనేని గోపాలకృష్ణ శ్రీమతి సత్యవతి (అమెరికా )దంపతులకు , నాతోపాటు అడుగులేస్తూ సహకరిస్తున్న సరసభారతి కార్యవర్గానికి కృతజ్ఞతలు . నా రచనలకు ప్రోత్సాహమిస్తున్న నా అర్ధాంగి శ్రీమతి ప్రభావతికి ,నా కుటుంబ సభ్యులకు అభినందనలు.                                                                                   గబ్బిట దుర్గాప్రసాద్ –

వదాన్యులకు వందనాలు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.