షట్కర్మ యుక్తా
ఒక మొగుడు ఒక పెళ్ళాన్ని ఒక అంటే అనేకమంది పెళ్ళాలు న్నారను కోవద్దు తన స్వంత పెళ్లాన్నే ఒక ”చానల్ రావు ” గారి ప్రవచనం విని శ్లోకం బట్టీ పట్టి భార్యను అందులో ఆమెవిధిగా చేయాల్సినపనులను ,ఆపనులకు తగ్గ పేర్లతో పురమాయిస్తున్నాడు . ఇంత సోది చెప్పి అసలు శ్లోకం శోకి౦చ కుండా ఈ ఊక దంపుడు ఏమిటి స్వామీ అంటున్నారా -చిత్తగించండి
”కార్యేషు దాసీ కరణేషు మంత్రీ ,భోజ్యేషు మాతా ,శయనేషు రంభా
క్షమయేషు దాత్రీ రూపేషు లక్ష్మీ -షట్కర్మ యుక్తా కులధర్మ పత్నీ ”
సీన్ -1-సదరు మొగుడు ఒక రోజు పొద్దున్నే నిద్ర లేచి సదరు భార్య తో పై శ్లోక భావం తో ఆడుకుంటున్నాడు .ఎలానో చూడండి –
”ఒసే పాచిపని దానా పళ్ళు తోముకోటానికి నీళ్ళు బ్రష్ వగైరా రెడీ చేయమని చెప్పాను .చేసి చచ్చావా .నీ దరిద్రం మొకం నాకు పొద్దున్నే చూపించద్దన్నాను .అవక్కడ పెట్టి కనిపించకుండా లోపలి చావు .నేనోచ్చేసరికి కాఫీ కాచి రెడీ గా ఉంచేసి ఏడు . నీ మొహం మండా టిఫిన్ ఏం చేసి ఏడుస్తున్నావు ?నాకు పెసరట్లంటే ఇష్టం .ఉల్లి మిర్చి కలిపి తగలేసి కాల్చి నామోహానపడేయ్యి .పెంద్రాళే ఆఫీసుకు చావాలి నేను .ఇంట్లో తిని వెళ్ళటం కుదరదు .త్వరగా వండి కారీర్ సిద్ధం చేసి చావు .నీ మొహం ఈడ్చా -ఇంకా అక్కడే పాతుకుపోయి చచ్చావేంటి ?పాచి మొహం ప్రక్షాళన చేశాగా ఇక కనపడి చావచ్చు కదా దరిద్రప్పీనుగా . నాకు నిన్నిచ్చి కట్టబెట్టాడు చూడూ -వాడే మీ బాబు ను అనాలి .చేసుకోనేదాకా వెంట వెంట తిరిగి నా మెడ కోశాడు నీ బాబు .అంట్లు తోమి బట్టలు ఇస్త్రీ చేసి నా బూట్లు పాలిష్ చేసి పిల్లల్ని స్కూలుకు టైం కి పంపించి చావు .మధ్యాన్నం నిద్రపోకుండా టివి చూడకుండా నేనోచ్చేసరికి వేడి వేడి గారెలు వండి తగలడు.అల్లం చట్నీ మర్చిపోయి చావకు అదిలేకపోతే గారే ముక్క గొంతు దిగదు .సోకిల్లా లాగా రంగురంగు చీరలు కట్టి బజార్లో నా పరువు తీయకు. నీ మొహం మండా.పెళ్ళాం అంటే గొడ్డు చాకిరీ చేసేది అని అదేదో చానల్లో ”పల్లీలు బటాణీలాయన”ఉవాచ. ఆయనమాట నాకు వేదవాక్కు ..సరే ఇక లోపలి తగలడు.. నువ్వు బై చెప్పాల్సిన పని లేదు బావురు మొకందానా నా చావేదో నే చస్తా . ఇంకా నుంచు న్నావా వీదిమోకాన. లోపలి తగలడు సత్తు లోలకులదానా .
సీన్ -2-ఏమోయ్ చాణక్యీ!ఇలారా .మనబ్బాయి టెన్త్ క్లాస్ మంచిమార్కుల్తో పాసయ్యాడుకదా.ఏకాలేజీలో చేరుద్దాం ? వాడికి కొంచెం బద్ధకం ఉంది కాదోయ్.అదీగాక నీ గారాబం తో వాణ్ని పాడు చేస్తావ్ .హాస్టల్ లో చేరుద్దామా . ”ఖర్చు ఎంతైనా ఫరవాలేదు ” అదినాకు వదిలేయ్ . మాంచి ఉద్యోగం రావాలి వాడికి .బాగా ఆలోచించి నువ్వే చెప్పు .నాకు ఆఫీసు పనులతో తీరికే ఉండటం లేదు .బాధ్యత అంతా నీదే .డబ్బు మాత్రం నువ్వు ఎప్పుడు ఎంత అడిగితె అంతా రెడీ గా ఉంచుతాను ప్లీజ్ ప్లీజ్ నువ్వే నాకు చాణక్యుడి వైనా ,మహామంత్రి తిమ్మరుసువైనా నువ్వేకదా .నా మైండ్ బ్లాంక్ అని తెలుసుకదా డియర్ . మేక పోతు గాంభీర్యం నాది .ఏ సమస్యవచ్చినా నువ్వే కదా సమయానికి తగిన సలహా ఇచ్చి గట్టేక్క౦ చేది. ఇప్పుడు కూడా ఈ పుణ్యం నువ్వే కట్టుకోవాల్రా చిన్నీ .
సీన్ -3-అమ్మా లక్ష్మమ్మా -ఇంత కమ్మగా అన్నీ చేసి నన్ను తినిపిస్తున్నావ్ .ఆ రుచికి నా జిహ్వ పదునె క్కిపోతోంది రోజు రోజుకీ .బొర్రా పెరిగిపోతోంది .వంకాయ కూర అదుర్స్ .బెండ వేపుడు సుపర్బ్ .మామిడికాయ పప్పు వహ్వా . దోసావకాయ దిమ్మ తిరిగింది .ఆ ఘాటుకు ముక్కమ్మడి నీరు దారాపాత౦ .అదేంటి తల్లీ ఆ సాంబారు .ఎవరెస్ట్ మసాలా వంటివి వేయకుండా స్వయంగా దినుసులు నూరి దానికి ఘాటు ,మహా రుచి తెచ్చావు ములక్కాడలు ఏం ఉడికాయనుకున్నావ్ .ముట్టుకుంటే విచ్చిపోతున్నాయి .మా అమ్మ వంట జ్ఞాపకం వచ్చింది అవును అత్తగారి ట్రెయినింగ్ కదా నీది! .బాగుండ కేం చేస్తుంది అమ్మడూ. . అమ్మ లా కమ్మని భోజనం చేసి తినిపిస్తున్నావు .తల్లీ లక్ష్మీదేవమ్మా .నీకు ,నీ వంటకు జేజేలు .
సీన్ -4-అబ్బా !రంభా!ఇంకా ఎంత ససేపోయ్ వంటింట్లో .మల్లెపూలు గోల్లుమంటు౦టే .పిల్లలు ఆల్రెడీ గాఢ నిద్రలో ఉన్నారు .నేనూ ఆఫీస్ వర్క్ పూర్తీ చేసి కూర్చున్నా .నువ్విచ్చే ”కప్పురపు విడెం ” కోసం ఎదురు చూస్తున్నా .నువ్వు కిళ్ళీ కట్టినోటికిచ్చి తినిపిస్తే నోరే కాదు ,మన దా౦పత్యమూ పండుతుంది, ,పండింది కదా ఆల్రెడీ . బంగారం లాంటి అబ్బాయిని ,కుందనం బొమ్మలాంటి అమ్మాయిని కన్నావు కదరా పండూ . నీతో పడక రంభా మేనకలతో సరి ఔతుందా కన్నా .జాగు సేయకు .ఆగలేనిక .దగ్గరలో ఉంటూ విరహం అంటే ఇదేనేమో కదా చంద్రవదనా విశాలాక్షీ మృగ నయనా,ఘన జఘనా ,సింహ మధ్యమా ,బాపూ బొమ్మా రా నీ నులి వెచ్చని కౌగిలిలో ఈ రేయి అంతా కరగిపోనీ కుందరదనా .
సీన్ -5-చూడు శాంతా ! ఇంత ఓర్పు నీకెలా సాధ్యమైందో ఆశ్చర్యమేస్తుంది .నాతోపాటు ఎన్ని కస్టాలు పడ్డావు .ఎన్ని సార్లు పస్తులున్నావు . ఎంత హీనంగా నీచమైన పరిస్థితు లలో మనం ఉంటున్నా నన్ను పల్లెత్తు మాట అని ఎరగవు నువ్వు .చాలీ చాలని కొంప ,ఉండీ లేని బట్టలు ఎదాదికోకానుపు .విసుగూ విరామం లేని చాకిరీ . కడుపునిండా తిన్నావో లేదో ఆజా పజా కనుక్కోలేని ఈ దౌర్భాగ్యపు మొగుడిని ఏనాడూ చీదరించుకోలేదు .ఇప్పుదేకడా కాలూ చేయి కూడా దీసుకొని తిండికి బట్టకు ,ఉండటానికీ లోపం లేకుండా ఉన్నాం .దీనికి తగ్గట్టు బంధు జనం రాకా పోకా ,ఆడపడుచుల అచ్చటా ముచ్చటా ,దేనికీ నువ్వు వెనుకడుగు వేయలేదు నాతో ఏడు అడుగులు నడిచినడానికి ధరిత్రిలా ఇంత సహనం నీలో ఎలా వచ్చిందో నాకు అంతుపట్ట లేదు .మీ అమ్మానాన్నల పెంపకం గొప్పతనం అది .నీ క్షమ ఓర్పులకు నేను ఎన్ని జన్మలెత్తినా నీ ఋణం తీర్చుకోలేను పృధ్వీ సహిష్ణూ .
సీన్ -6- లక్ష్మీ ,శ్రీ లక్ష్మీ ,సౌభాగ్య లక్ష్మీ ,ఆనంద లక్ష్మీ ,ఐశ్వర్య లక్ష్మీ !ఎన్ని పేర్లతో పిలిచినా డియర్ . .నీ అందం వర్ణించటానికి తగిన పదం దొరకటం లేదు .నువ్వు నా ఇంట్లో కాలు పెట్టింది మొదలు నాకు అంతా ఐశ్వర్యమే ,భోగమే సదానందమే అస్టైశ్వర్యమే .”యేమని పొగడుదు నిన్ను సకల ప్రదాత్రి తామరస నేత్రీ ”ఈ సౌభాగ్యం చూసే భాగ్యం మీ తలిదండ్రులకు ,మా తలి దండ్రులకు దక్కలేదు .వాళ్ళే ఉంటె ఎంత ఆనందం పొందేవారో ఆనంద లక్ష్మీ .కలకాలం ఇలా మనం మన పిల్లా జేల్లాతో హాయిగా జీవిద్దాం అనంత లక్ష్మీ !.
తమాషాగా మనసులో మెదిలిన భావానికి అప్పటికప్పుడు దాల్చిన అక్షర రూపం ఇది
–