సరస భారతి ఆధ్వర్యం లో’’వేద సభలు ‘’?
కాశీలో బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం ‘’న్యాయ శాస్త్ర ‘’ప్రొఫెసర్ ,సంస్కృతం లో మహాదిట్ట ,కృష్ణా జిల్లా ఎలమర్రు గ్రామస్తులు ,గీర్వాణం -3 లో చోటు చేసుకొన్న కవి ,గ్రంథద్వయ ఆవిష్కరణ సభకు కాశీ నుంచి శ్రమపడి రేపల్లెకు విచ్చేసిన గీర్వాణ భాషాభిమాని డా . శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రిగారు నిన్న మా ఇంటికి వచ్చి తాము ఆదివారం సభలో అందరికీ చెప్పాలనుకొన్న విషయం సభ హడావిడిలో మర్చిపోయానని,దానిని నాకు చెప్పటానికి వచ్చానన్నారు .సంతోషం అన్నాను .
శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారి మనసులో ఉయ్యూరులో సరసభారతి ఆధ్వర్యం లో ఘనం గా వేద సభలు నిర్వహించాలని ఉన్నదట .అదేదో సరసభారతి సభల్లా తేలికే అనుకోని ‘’సరే ‘’అన్నా . ‘’అన్నగారూ !సంస్కృత కవుల పై ఇంత విస్తృతంగా వరుసగా మూడు గ్రంధాలు మూడేళ్ళలో రాసి ప్రచురించిన మీరు సరసభారతి ఆధ్వర్యం లో ఉయ్యూరులో వేద సభలు నిర్వహించి వేదమాత సేవ కూడా చేస్తే ,పుణ్యం పురుషార్ధం దక్కటమే కాదు వేద పండితులకు సహకారం చేసి, వేద వ్యాప్తికి దోహదం చేసిన వారవుతారు ‘’అన్నారు .’’బాగానే ఉంది.ఎన్ని రోజులు ,ఎంత మంది వేద పండితులు వస్తారు ,వారికి ఎంత సంభావన ఇవ్వాలి వారి వసతి భోజన భాజనాదుల సంగతి ఏమిటి ?’’అని అడిగాను .దానికి వారు 3 రోజులు జరిపితే బాగుంటుంది .మూడు రోజులూరెండుపూటలా కాఫీ టిఫిన్లు భోజనాల ఖర్చు అంతా నేను పెట్టుకుంటాను .సంభావన ,దారి ఖర్చులు మీరు ఏర్పాటు చేయాలి ‘’అన్నారు .నేను మనసులో తలా ఒక వెయ్యో రెండు వేలో ఇవ్వచ్చులే అనుకోని వారినిఅడిగా ‘’ఒక్కో వేద పండితునికి 10 వేల రూపాయలు ,వారు వచ్చిన ప్రదేశాన్నుంచి రానూ పోనూ ఖర్చులు ఇవ్వాలి ‘’అన్నారు .లెక్క వేస్తె సుమారు 6 లక్షలకు పైమాటే అయింది .ఒక్కసారి అవాక్కయ్యాను .ఇది మనవల్ల కాదులే అనిపించి వారికి చెప్పేశాను .వారు ‘’పోనీ రెండు రోజులే జరుపుదాం ‘’అన్నారు .’’భోజనం ఖర్చు తగ్గవచ్చుకాని సంభావన ఖర్చు లో మార్పు రాదుకదా’’ అన్నాను .’’అవునని’’ఏకీభవించారు .’’ఇంత భారీగా చేయాలంటే నాకు, సరసభారతికి ఉన్న పరిచయాలు చాలాతక్కువ .అందులో మాకు సభ్యులు అంటూ ఎవరూలేరు. సభ్యత్వ రుసుమూ ఉండదు .’’అన్నాను .’’దాతలను వెతికి పట్టుకోవాలి ‘’అన్నారు .’’లక్ష రూపాయల చందా ఇచ్చేవారు కనీసం 7 గురు దొరకాలి .లేకపోతె 50 వేలు ఇచ్చేవారు కనీసం 14 మంది , లేకుంటే 25 వేలు ఇచ్చేవారు సుమారు 30 మంది ,దొరకాలి .లేనిచో 11, 116 లు ఇచ్చేవారు 60 మంది ఉండాలి . అంత ఖర్చు పెట్టె వారు దొరకటం కష్టం .మేము ఎవరినీ ఏ కార్యక్రమాలకు డబ్బు అడగము .కార్యక్రమం తెలియ జేస్తాం .ఇచ్చేవారు ముందుకొచ్చి సహకరిస్తారు తప్ప డిమాండ్ చేయం ‘’అన్నాను .వారు ‘’అన్నగారూ !ఎలాగైనా మీ, మా ఆధ్వర్యం లో మనం జరపాలి ‘’అన్నారు .’’నేనేమీ మాట ఇవ్వలేను .నెట్ ద్వారా విషయం అందరికీ తెలియ జేస్తాను .ఇది వేద విధి కనుక దీనికి మాస్వామి శ్రీ సువర్చలాన్జనేయుల అనుగ్రహం కూడా కావాలి కనుక మా గుడిలో కూడా ఈ విషయం ప్రకటిస్తాను . స్పందనను బట్టి ఆలోచన చేద్దాం ‘’అని చెప్పాను .’’సరే’’నన్నారు వారు .
ఇవాళ మంగళవారం ధనుర్మాస ప్రభాత పూజలో భక్త జనం క్రిక్కిరిసి ఆలయానికి వచ్చారు .మంత్రపుష్పానికి ముందు స్వామి సమక్షం లో పై విషయాలన్నీ తెలియ జేసి ,భారం స్వామిదే నని ఆయనపైనే భారం వేశాను .ఇప్పటిదాకా జరిగిన వన్నీ ఆయన అనుగ్రహం తో జరిగినవే కదా .మేము నిమిత్తమాత్రులం .ఇదీ విషయం . దీనిపై భక్తులు ,సరసభారతి సాహితీ బంధువులు ,వేదాభిమానులు,దాతలు ,వితరణ శీలురు స్పందించే తీరు ను బట్టి ‘’ముందుకు ‘’అడుగు వేస్తాం .
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -26-12-17- ఉయ్యూరు