సరస భారతి 116 వ సమావేశంగా  ‘’గ్రంధద్వయం ‘’ఆవిష్కరణ సభ -1

 సరసభారతి ఏర్పడి 8 సంవత్సరాలు దాటి 9 వ  సంవత్సరం లో  ప్రవేశించింది .అన్నికార్యక్రమాల విశేషాలూమీకు ఎప్పటికప్పుడు తెలియ జేస్తూనే ఉన్నాం .8 ఏళ్ళకు నెలకొకటి లెక్కేస్తే 96 కార్యక్రమాలు జరగాలి .కాని ఈ ఆవిష్కరణ సభ 116 వ సభకావటం మరింత ఉత్సాహాన్నిస్తోంది .ఇప్పటికి సరసభారతి ,సువర్చలాన్జనేయ  బ్లాగుల వీక్షకుల సంఖ్య 5 లక్షల 30 వేలకు దాటటం మరొక శుభవార్త .ఇప్పుడు నిన్నటి సభా విశేషాలు తెలియ జేస్తాను .

 24-12-17 ఆదివారం మధ్యాహ్నం 1-15 కు నాలుగు కార్లలో మేమందరం  రేపల్లెకు బయల్దేరి  దేవరపల్లి వద్ద కృష్ణ కరకట్ట ఎక్కి పెనుమూడి వంతెన మీదుగా మండలి కృష్ణారావు వంతెన దాటి రేపల్లెలో ప్రవేశించి ఉప్పూడి రోడ్డులో ఉన్న రామకోటయ్య కళ్యాణ మండపానికి మధ్యాహ్నం 2-25 కి అంటే గంట 10 నిమిషాలో చేరాం .సభ రెండవ అంతస్తులో . మా వెంట రెండు గ్రంధాలు చెరొక 200 పుస్తకాలు తీసుకు వెళ్లాం . అతిధులకు ,కవులకు శాలువాలు ,గీర్వాణం -3 లో చోటు చేసుకున్న కవులకు రెండిటినీ సభకు సభకు పరిచయం చేసినవారికీ ,అతిధులకు శాలువాలు జ్ఞాపికలు వెంట తీసుకు వెళ్లి వేదిక వద్దకు చేర్చాం .మాకు మధ్యలో ,పైనా చెరొక గదీ కేటాయించారు . అలసట తీర్చుకోవటానికి ఆడవాళ్ళకు అవకాశం కలిగింది .మాతో మేమిద్దరం కాకుండా ,హైదరాబాద్ నుంచి వచ్చిన మా రెండో అబ్బాయి శర్మ ,మనవడు ఛి హర్ష ,ఉయ్యూరులో ఉన్నమూడవకోడలు రాణి మనవడు చరణ్ మనవరాలు రమ్య ,మా నాలుగోవాడు రమణ  కోడలు మహేశ్వరి ,మా అన్నయ్యగారబ్బాయి రామనాద్ బాబు , మాదిరాజు శివలక్ష్మి, భర్త శర్మగారు ,కుమార్తె బిందు ,శ్రీ బలరాం ,శ్రీ కోనేరు చంద్ర శేఖరరావు  వీడియో గ్రాఫర్ ,అన్నిటికి సహాయానికి ఇద్దరు  మనుషులు మందీ మార్బలం తో మగపెళ్లి వారిలా రాజసంగా,దర్జాగా ‘’శీతల’’ కార్లలో  తరలి వెళ్లాం .డబ్బుమాదికాదుకదా-మైనేని వారిదే కదా అన్న ధీమా .పైగా వారు మేము ఎసి కార్ లలో తప్ప రేపల్లెకు  వెళ్ళ రాదు అనే ఆజ్న ముందేజారీ చేశారు . వారిది మాకు సుగ్రీవాజ్న .

   బానర్ రేపల్లె లోనే ప్రింట్ చేయించాడు రమణ .మధ్యాహ్నం మూడున్నరకు వేదికపై బానర్ రమణ ,శర్మ  వీడియో గ్రాఫర్ లు కస్టపడి కట్టారు అక్కడ ఎవరూ సహాయానికి రానే లేదు .సందట్లో సడేమియా –బానర్ లోని ‘గీర్వాణం -3పుస్తకం  తిరగబడి ప్రింట్ అయింది .అడికవార్ చేయటానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది .అల్పాహార విందు 3 గంటలకు .కాని అవీ ఆలస్యంగా నే చేరాయి .కుర్చీలు కూడా మా సహాయకులే వేశారు .అప్పుడు దిగారు’’ మైకాసురులు ‘’.అన్నీ సిద్ధం అయేసరికి సరిగ్గా సాయంత్రం 4 అయింది .ఇక ఆలస్యం చేయకుండా  కార్య క్రమం ప్రారంభించాం . ఉయ్యూరులోనే తయారు చేయించిన కవి సామ్రాట్ నోరి నరసింహ శాస్త్రి గారి రెండు ఫోటోలను వేదికపై ఏర్పాటు చేసి  ,సభకు విచ్చేసిన డా శ్రీ వేదాల వెంకట సీతారామాచార్యులు ,డా శ్రీ మొవ్వ వృషాద్రి పతి గార్లతో  పుష్పహారాలు వేయించి నేను నోరి వారిని సభకు పరిచయం ఇలా చేశాను –

‘’శ్రీ నోరి నరసింహ శాస్త్రి గారు 6-2-1900  న  గుంటూరు లో శ్రీ నోరి హనుమచ్ఛాస్త్రి ,మహా లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు .తండ్రి తాతగార్లు గోప్పపండితులేకాక మహా రచయితలుకూడా .శాస్త్రిగారికి బాల్యం లోనే సంప్రదాయ కవిత్వం అబ్బింది .19 వ ఏట ‘’గీత మాలిక ‘’పద్య సంపుటి రాసి ప్రచురించారు 23 వ ఏట ‘’సోమనాధ విజయం ‘’నాటకం రాశారు .గుంటూరు చదువులో శ్రీ తల్లావఝల శివ శంకర శాస్త్రి గారితో పరిచయమేర్పడి ‘’నవ్య కవితా ధోరణి’’  అబ్బింది మద్రాస్ లో బి ఎల్ చదివి ,గుంటూరులో ప్రాక్టీస్ ప్రారంభించారు .

 1928 లో రేపల్లె చేరి న్యాయవాద వృత్తిలో కొనసాగుతూనే ,శాసనోల్లంఘన ఉద్యమం లో పాల్గొన్న దేశభక్తులు నోరివారు ఆంద్ర ,ఆంగ్ల సాహిత్యాల లోతులు తరచారు .కన్నడ భాషలోనూ మంచి ప్రవేశం కలిగింది . నోరి వారంటే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది వారి చారిత్రాత్మక నవలలే చారిత్రాత్మక తెలుగు నవలలు మార్గ దర్శకులు వారే .శాస్త్రి గారు రచించిన ’’రుద్రమ దేవి ,నారాయణ భట్టు ,మల్లారెడ్డి ,ధూర్జటి ,వాఘీరా ,కవి సార్వ భౌముడు ,కవిద్వయం’’ నవలలు ఆ రోజుల్లో విపరీతమైన ఆసక్తి కలిగించి గొప్ప హిట్ అయ్యాయి .’వీరి తర్వాత డా శ్రీ ముదిగొండ శివ ప్రసాద్ గారు లల్లాదేవి వగైరా 11 6 కు పైగా చారిత్రాత్మక నవలలు రాశారు .శాస్త్రి గారి ’నారాయణ భట్టు ‘’నవలకు 1950లో తెలుగు భాషా సమితి పురస్కారం లభించింది .బాలలకోసం ‘’కర్పూర ద్వీప యాత్ర ‘’రాసి మన సంస్కృతీ సంప్రదాయాలపై వారికి గొప్ప ప్రేరణ కలిగించారు .24 వచన గేయ నాటికలు రాశారు .అందులో సోమనాధ విజయం ,భాగవతావతరణం ,తేనే తెట్టే,సర్ప సత్రం ,ఖేమా భిక్షుని ,శబ్ద వేది ,షన్నవతి ముఖ్యమైనవి .

  శాస్త్రిగారి సంస్కృత జ్ఞానమూ గొప్పదే .సంస్కృతం లోని’’దేవీ భాగవతం ‘’లోని రెండు ,మూడు స్కందాలను వెయ్యి పద్యాలలో తెనిగించారు .అంతే కాదు నారాయణ తీర్దులవారి ‘’కృష్ణ లీలాతరంగిణి’’ని దేవ నాగర లిపి లో సంస్కృత ,ఆంగ్ల ,హిందీ భాషలలో సుదీర్ఘ భూమిక రాసి ప్రచురించారు .శాస్త్రి గారు మంచి కథలెన్నొ రాశారు .అందులో ‘’వదూసర ,మరు విషయం ,పరీక్షా ఫలితాలు  గానభంగి ‘’మొదలైనవి .పాశ్చాత్య ,భారతీయ విమర్శనా ధోరణి ని సమన్వయ పరచి ఎన్నో మంచి వ్యాసాలూ రచించారు .శాస్త్రి గారి బహుభాషా పాండిత్యానికి ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమి గుర్తించి సభ్యులను చేసి గౌరవించింది ఈ పదవిలో 12 ఏళ్ళు న్నారు .

  శాస్త్రి గారికి క్రమంగా లౌకిక విషయాలపై ఆసక్తి తగ్గి ,ఆధ్యాత్మిక తపై దృష్టి నిలిపారు .1941లో పూర్ణ దీక్ష పొంది ‘’విజ్ఞానానంద స్వామి ‘’నామధేయంతో గడిపారు .వారి సాహిత్య తపస్సుకు ‘’కవి సమ్రాట్ ‘’,’’కవి మార్తాండ ‘’బిరుదు గౌరవం పొందారు .1977 లో రేపల్లె వదలి ,హైదరాబాద్ చేరి అక్కడే ఉండిపోయి 80 వ ఏట 1980 లో మరణించారు .

  రేపల్లెలో అర్ద శతాబ్దం సాహిత్య సేవ చేసిన శ్రీ నోరి వారిపేరును ఈ వేదికకు నామకరణం, చేసి ఈ రోజు మొత్తం కార్యక్రమం వారికి అంకితమిస్తున్నాము ‘’అని చెప్పగానే అందరూ హర్ష ధ్వానాలతో ఆమోదం తెలిపారు .మళ్ళీ నేను అందుకుని’’రేపల్లెలో శ్రీ ముళ్ళపూడి నారాయణ శాస్త్రిగారు ‘’సంస్కృత పాఠ శాల స్థాపించి దిగ్విజయంగా నడిపారని ‘’పుత్ర సంజీవనం ‘’అనే సంస్కృత కావ్యం రాశారని ,వారి కుమారులు డా  శ్రీ జయ సీతా రామ శాస్త్రి గారు  హర్ష నైషద సంస్కృత కావ్యం లో దర్శన విభాగం పై పరిశోధన చేసి దిట్ట అనీ ,అలాగే రేపల్లె వాసులు శ్రీ ఇసుకపల్లి నరసింహ శాస్త్రి (ఐ ఎల్ యెన్ శాస్త్రి ),శ్రీ ఇసుకపల్లి దక్షిణామూర్తి శాస్త్రి ,ఇసుకపల్లి కుటుంబ శాస్త్రి గార్లు గొప్ప కధానికలు నవలలు రాసి ప్రసిద్ధి చెందారని తెలియ జేశాను  .

  తర్వాత గీర్వాణం -3 ప్రాయోజకులు ప్రొఫెసర్ శ్రీయల్లాప్రగడ రామ మోహనరావు గారి అన్నగారుచేన్నైలో మరణించటం వలన సభకు రాలేక పోయారని తెలియ జేసి, రావు గారి కుటుంబం తో సంబంధం ఉన్నకార్యక్రామం కనుక రావుగారి దివంగత అన్నగారికి రెండు నిమిషాలు మౌనం పాటించాం .

   సరసభారతి కార్య దర్శి శ్రీమతి మాది రాజు శివ లక్ష్మి ‘’సాహితీ బంధం ‘’కవి సమ్మేళనం లో పాల్గొనే గుంటూరు కృష్ణా కవులను వేదికపైకి ఆహ్వానించగా శ్రీ వృషాద్రిపతి గారిని శుభాశీస్సులు పలుకమని కోరగా చక్కగా మాట్లాడి ఆశీర్వ దించారు .ఇంతటి సాహితీ మూర్తి  సమక్షం లో కవి సమ్మేళనం జరుగు తున్నందుకు అందరూ ఆనందించారు .శ్రీ దండి భొట్ల దత్తాత్రేయ శర్మగారు కార్య క్రమాన్ని చాకచక్యంగా  నిర్వహించారు .కవులు కూడా సూటిగా సుత్తి లేకుండా కవితలు చదివి అభినందనలు పొందారు .శ్రీ వృషాద్రి పతిగారికి పుష్పహారం  శాలువా  జ్ఞాపిక వెయ్యిన్నూట పదహార్లు నగదు ఇచ్చి గంధ తాంబూల౦తో   పన్నీరు ,సెంట్ జల్లి సంప్రదాయ బద్ధంగా నేనూ నా శ్రీమతి సత్కరించాం . పాల్గొన్న కవులందరికీ తలొక 500 రూపాయలు నగదు ,పై విధంగా నే సన్మానం చేశాము .హైదరాబాద్ నుంచి వచ్చిన ఇద్దరికీ ,గుంటూరు నుంచి వచ్చిన మరో ఇద్దరికీ  విజయవాడనుంచి వచ్చిన శ్రీ చావాలి సుబ్రహ్మణ్యం గార్నీ కూడా పై విధంగానే సమ్మాని౦చా౦ .వేదికపైకి ఆహ్వాని౦పబడిన  ప్రతివారికీ కమలాఫల ద్వయం ‘’తో స్వాగతం పలికి ఉయ్యూరు సంప్రదాయాన్ని రేపల్లె లోనూ కొన సాగించాం . కవులు ఎంతో సంతృప్తి చెంది ఆనందం ప్రకటించారు .

 కవి సమ్మేళనానినికి ముందు పదినిమిషాలు ఒక అమ్మాయి చక్కగా స్వాగత నాట్యం చేసింది .ఆమెకూ పై విధంగానే అయిదు వందల నగదు తో సహా సన్మానం చేశాం .

  తర్వాత మహామహోపాధ్యాయ భారత భారతి ప్రవచన సమ్రాట్ ,తర్క వ్యాకరణ శిరోమణి  విశ్రాంత సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్  డా శ్రీమాన్ వేదాల వెంకట సీతారామ శాస్త్రి గారిని ‘’ఆశీరనుగ్రహ భాషణం ‘’చేయవలసినదిగా వేదికపైకి ఆహ్వానించి ,ముఖ్య అతిధి ,ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘాధ్యక్షులు ,పులిచింతల ప్రాజెక్ట్ స్పెషల్ డిప్యూటి కలెక్టర్ శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య ,వరంగల్ డాక్టర్ ,శతాధిక గ్రంధకర్త ,నాలుగు భాషలో అద్వితీయ పాండిత్యం ఉన్న డా శ్రీ లంకా శివరాం ప్రసాద్  ,నాగార్జున విశ్వ విద్యాలయ మాజీ రిజిస్ట్రార్ డా శ్రీ రావెల సాంబ శివరావు ,కేంద్ర సాహిత్య అకాడెమి బహుమతి గ్రహీత ,కవి విమర్శక విశ్లేషకులు డా శ్రీ పాపినేని శివ శంకర్ ,రేపల్లె మునిసిపల్ చైర్మన్ శ్రీ తాడివాక శ్రీనివాసరావు కమీషనర్ శ్రీ ఏ ఎస్ యెన్ వి ఎం దివాకర రావు ,జి డి సిసి బ్యాంక్ చైర్మన్ శ్రీ ముమ్మలనేని వెంకట సుబ్బయ్య,మాజీ శాసన సభ్యులు శ్రీ దేవినేని మల్లికార్జున రావు ,కొ ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ శ్రీ కొర్రపాటి రామ మోహనరావు డా శ్రీగబ్బిట ఆంజనేయ శాస్త్రి ,డా శ్రీ ఇనగంటి ఉమా రామారావు  ,అసమాన అవధాన సార్వభౌమ ,కాశీకవి ప్రాచార్య డా శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ,మచిలీపట్నం హిందూ కాలేజి చరిత్ర శాఖాధిపతి డా.శ్రీ  సవరం వెంకటేశ్వరరావు మున్నగు దిగ్దంతులు వేదికను సుసంపన్నం చేయగా శ్రీ వేదాల వారు తమ అమూల్య భావధారను ప్రవహింప జేసి సభను ధార్మిక ధారతో ఉత్తేజపరచారు .

  తరువాత గంధ ద్వయం ఆవిష్కరణ సభ జరిగింది .శ్రీ సోమేపల్లి ,మునిసిపల్ చైర్మన్ గార్లు ‘’ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు ‘’గ్రంధాన్ని ఆవిష్కరించారు .  గ్రంథ పరిచయం చేశారు శ్రీ సవరం వారు .తర్వాత’’గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 మూడవ భాగం ‘’ను శ్రీ రావెల ,శ్రీపాపినేని ,శ్రీ లంకా ,మునిసిపల్ కమీషనర్ గార్లు ఆవిష్కరించారు .దీనిని సభకు పరిచయంచేశారు శ్రీ పాలపర్తి వారు .ఈ రెండు గ్రంథాల రచన ,ప్రచురణ ,అంకిత ప్రాయోజక, విశేషాలను సరసభారతి ప్రగతినీ ఇవి సరసభారతి 27, 28 పుస్తకాలు ,నేను రాసిన 15, 16 పుస్తకాలని  సంక్షి ప్తంగా వివరించాను .29 వ పుస్తకంగా ‘’వసుధైక కుటుంబం ‘’కవితా సంకలనం జనవరిలో గుడివాడలో శ్రీ వసుధ బసవేశ్వరరావు గారి ఆధ్వర్యం లోనూ సరసభారతి నిర్వహించే శ్రీ విలంబి ఉగాది వేడుకలలో 18-3-18 ఆదివారం నా యాత్రా రచన ‘’షార్లెట్ మైత్రీ బంధం ‘’30 వ పుస్తకం గా ఆవిష్కారం ఉయ్యూరులోను అక్కడ అమెరికాలో షార్లెట్ లోనూ జరుగుతుందని ,దీనిని షార్లెట్ సరసభారతి కి కానుకగా అందిస్తున్నామని తెలియ జేశాను .

  శ్రీ గబ్బిట ,ఇనగంటి ,లంకా ,సవరం ,పాలపర్తిగార్లకు తలొక వెయ్యి నూట పదహార్లు నూతన వస్త్రాలు   నగదు తో , శ్రీ సోమేపల్లి ,శ్రీ పాపినేని ,శ్రీరావెల ,మైనేనిగారి బావమరది శ్రీనాద్ గార్లకు  సంప్రదాయ బద్ధంగాకవులకు చేసినట్లే పుష్పహారం జ్ఞాపిక ,శాలువా చందన తాంబూల పన్నీరు లతో సత్కారం చేశాం  

ఈ సభలో మరొక అమ్మాయి ,నృత్యం చేసి అలరిస్తే ఒక కుర్రాడు మిమిక్రీ చేసి మురిపించాడు .ఇద్దరికీ కవులకిచ్చిన మర్యాద తోనే నగదు తోపాటు మిగిలినవాటితోనూ సత్కరించాం .

 శ్రీ లంకావారు మా దంపతులను కూర్చోబెట్టి శాలువా కప్పిపుష్ప  హారం వగైరాలతో పైవిధంగా నే ‘’సువర్ణ పతకం ‘’తోనూ సత్కరించారు .తర్వాత శ్రీనాద్ గారికీ చేసి ,ఒక పతకం శ్రీ మైనేని గోపాల కృష్ణగారికి అందజేయమని ఆయనకు అందజేశారు .వీడియోగ్రాఫర్ కు, శివలక్ష్మి కుటుంబానికి రామనాద్ ,బలరాం చంద్ర శేఖర రావు గార్లకు కూడా జ్ఞాపికలు అందజేశాం .సభకు వచ్చిన వారందరికీ గ్రంథ ద్వయం అందజేశాం .సుమారుగా 150 సెట్లు రేపల్లె సభ లో ఉచితంగా పంచిపెట్టాం .ఈ టీవీ విలేకరి నన్ను చక్కగా ఇంటర్వ్యు చేశారు .సోమేపల్లిగారినీ చేశారు .బహుశా ప్రసారం చేసి ఉంటారు .ఇవాళ  ఈ టీవీలో అయిదు నిమిషాలకు పైగా ప్రసారం చేశారని మా అబ్బాయి శర్మ ఫోన్ చేశాడు .ఇవాళ అన్ని వార్తాపత్రికలలోనూ మంచి కవరేజ్ వచ్చింది . మీడియా మిత్రుల సహకారం మరువ లేనిది .

.సభ పూర్తయ్యేసరికి రాత్రి 8-30 అయింది .అప్పుడు అందరికీ విందు .శాఖాహారం పై అంతస్తులో ,మాంసాహారం కింది దానిలో ఏర్పాటు చేశారు .రాత్రి 9-45 కు బయల్దేరి అందరం ఉయ్యూరుకు రాత్రి 10-30 కు చేరాం

 ఈ కార్యక్రమం మొత్తం ఇంట్లో కూర్చుని  కంప్యూటర్ లో వీక్షించటానికి మంచి నాణ్యత తో ప్రత్యక్షంగా ప్రసారం చేయించాం . చూసినవారందరూ అద్భుతంగా ఉందని ఫీడ్ బాక్ చేశారు .మంచి సంతృప్తితో ఈ 116 వ కార్యక్రమం గా ;గ్రంథ ద్వయ ఆవిష్కరణ ‘’సభ రేపల్లెలో జరిగింది .ఇప్పటికి కృష్ణా జిల్లాలో వివిధ ప్రదేశాలలో కార్యక్రమాలు చేశాం .ఇప్పుడు జిల్లాదాటి గుంటూరు జిల్లా రేపల్లె లో జరిపాం .ఏప్రిల్ అక్టోబర్ మధ్య ఖండాంతర సభలు నాలుగు  నార్త్ కరోలినా రాష్ట్రం ‘’షార్లెట్ ‘’లో జరిపాం . అక్కడ సరసభారతి  శాఖా కూడా ఏర్పాటు చేశామని హర్ష ద్వానాలమధ్య తెలియ జేశాను .

  మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -25-12-17- ఉయ్యూరు

 

 

 

     

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సరసభారతి ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.