గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 (నాలుగవ భాగం ) 1-,ఆంధ్ర-సంస్కృత నిఘంటు కర్త – ‘’ఆంధ్ర బిల్హణ’’- శ్రీ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి (1911 –1981)9(

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 (నాలుగవ భాగం )

సాహితీ బంధువులకు వైకుంఠ(ముక్కోటి )ఏకాదశి శుభాకాంక్షలు –

— Inline image 2

మా అబ్బాయి శర్మ గ్రంధ ద్వయ ఆవిష్కరణ సభకు ఉయ్యూరు వస్తూ కెసిఆర్ సభలలో అమ్మకానికి పెట్టిన 15 రూపాయల పుస్తకాలు 5 తెచ్చాడు అందులో సంస్కృత కవుల గురించి ఉన్న పుస్తకాలలో ఇప్పటికి మనం తెచ్చిన మూడు గీర్వాణాల లో లేని కవులు కనిపించారు .నిన్న డా గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారు మా ఇంటికి వచ్చినప్పుడు ‘’నేను రాయకుండా వదిలేసినా సంస్కృత కవులు ఎవరైనా ఉంటె చెప్పి వారి వివరాలు ఇవ్వండి ‘’అని అడిగితె ‘’అన్నగారూ !దాదాపు అందర్నీ రాశారు .కాని కొందరికి వాటిలో చోటు దొరకలేదు ‘’అని సుమారు పది మందికవుల పేర్లు చెప్పారు .కాశీ వెళ్ళాక వారి వివరాలు సేకరించి పంపిస్తానన్నారు .ఇలా ఒక సారి వారబ్బాయి ఛి డా జయమానిక్య శాస్త్రి కూడా చెప్పాడు .కాని ఫలితం కనిపించలేదు ఇంతవరకు .సరే ఇవాళ పవిత్రమైన ముక్కోటి ఏకాదశిపర్వదినాన  ముక్కోటి దేవతలా ఆశీస్సులతో మా శర్మ ఇచ్చిన వాటిలో శ్రీ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి గురించి రాస్తూ నాలుగవ గీర్వాణం కు శ్రీకారం చుడుతున్నాను .చూద్దాం ఎంత మంది దీనిలో చోటు చేసుకొంటారో ..మీకు తెలిసిన ,నేను స్పృశించని సంస్కృత కవులు ఎవరైనా మీకు తటస్థ పడితే వారి పేర్లు వివరాలు అందించి సహకరించమని మనవి చేస్తున్నాను .

  గమనిక –అని చెబుతూ నేను గీర్వాణం -1 లోనే శ్రీ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి గురించి ‘’సంస్కృతమే అన్నీ ‘’శీర్షికతో రాశాను అన్నసంగతి విస్మరించి మళ్ళీ శాస్త్రిగారి గురించి నిన్న నాల్గవ గీర్వాణం లో మొదటి కవిగా వారి గురించి రాసి  అందరికీ పంపాను .ఇవాళ నేను చేసిన పొరబాటు గ్రహించాను .అందులో ఉన్నవి ఇందులో లేనివి కలిపి సమగ్ర మైన సరి కొత్త వ్యాసం(రివైజ్డ్ ) రాసి  అందిస్తున్నాను . నాలుగవభాగం కప్పగంతుల వారితోనే ప్రారంభం . మరోపొరబాటు కూడా దొర్లింది .శాస్త్రి గారి బిరుదు ‘’ఆంధ్ర బిల్హణ’’అయితే నిన్నటి వ్యాసం లో ‘’ఆంధ్ర కల్హణ ‘’అని నేను రాశాను .నా కుప్పి గంతులకు ,కప్ప గంతులకు ఈ ‘’కప్పగంతుల ‘’వారి పై ఈ వ్యాసమే సాక్షి –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-12-17 –ఉయ్యూరు

1-,ఆంధ్ర-సంస్కృత నిఘంటు కర్త – ‘’ఆంధ్ర బిల్హణ’’- శ్రీ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి (1911 –1981)9( మార్పులు చేర్పులుచేశాక )

             బాల్య విద్యాభ్యాసాలు

  శ్రీ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి వెలనాటి బ్రాహ్మణ శాఖలో కప్పగంతుల శ్రీనివాసులు ,శ్రీమతి పద్మావతి దంపతులకు 2-7-1911 న మెహబూబ్ నగర్ జిల్లా వనపర్తి లో జన్మించారు.తండ్రి ,తల్లి ఉభయ వంశాలు పాండిత్య కవిత్వాలకు ప్రసిద్ధి చెందాయి . ఇరువంశాలవారు  ‘’ శ్రుతి స్మృతి ప్రేస్టాధ్వర ప్రజ్ఞులు’’.శాస్త్రిగారి విద్యాభ్యాసం అనుముల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వద్ద జరిగింది .1930 లో తిరుపతి లో ఉన్నత విద్య నేర్చారు .చిన్ననాటనే తండ్రిని కోల్పోయిన శాస్త్రిగారిని  వనపర్తి వాస్తవ్యులు స్వాతంత్ర సమరయోధులు వదాన్యులు అయిన ‘’వామన నాయక్ ‘’ పుత్ర వాత్సల్యం తో ఆదరించి విద్యా బుద్ధులు నేర్పారు .

  లక్ష్మణ శాస్త్రి మురారి వలెనె ‘’గురుకుల క్లిస్టుడు’’.తిరుపతి వెంకటేశ్వర సాస్కృత కళాశాలలో పదేళ్ళు అలంకరణ –వ్యాకరణ శాస్త్రాలు చదివి స్నాతక పరిణతి పొందారు .’’సాహిత్య శిరోమణి ‘’పట్టా పట్టుకొని మద్రాస్ చేరి మైలాపూర్ సంస్కృత కళాశాలలో అద్వైత విద్యలో ఆరితేరి ‘’విద్వత్ శిరోమణి’’ అని పించారు .అన్నామలై విశ్వ విద్యాలయం లో శ్రీ పులిసి కృష్ణమాచార్యులు ,లక్ష్మీ నరసింహ శాస్త్రి ,సేతు  మాధవరావు ,కురు౦గళం కృష్ణ శాస్త్రి ,రామ చంద్ర దీక్షితులు ,వెంకటేశ్వర దీక్షితులు ,చక్రాల నరసింహా చార్యులు ,గిరిధరాచార్యులు వంటి ఉద్దండుల వద్ద  వ్యాకరణ శాస్త్రం నేర్చి వ్యాకరణ ఉద్దండ పండితులయ్యారు . తిరుపతి లో విద్య నేర్చేటప్పుడు ‘’మదూకరం ‘’ఎత్తి అంటే ఇంటింటికి వెళ్లి భిక్ష అడుగుకొని దానిని మిత్రులతోకలిసి భుజిస్తూ అయిదు నెలలు గడిపారని శ్రీ తిరుమల రామ చంద్ర ‘’భవతీ భిక్షాం దేహి ‘’శీర్షిక కింది ‘’హంపీ నుంచి హరప్పా దాకా ‘’పుస్తకం లో రాశారు .అప్పటికి ఆయన వయస్సు 10 లేక 11 సంవత్సరాలు .తిరుమలవారి సహాధ్యాయి శాస్త్రిగారు

   లక్ష్మణ శాస్త్రి పేరు సార్ధకం చేసుకున్నారు .లక్ష్మణుడు ఆది శేషుని అవతారం .విద్యలకు ఆయనే పెద్ద .అందుకే శాస్త్రిగారికి పారశీక ఆంగ్ల  ,ఆంద్ర ,కన్నడ తమిళ  హిందీ మరాటీ భాషలలో గొప్ప పాండిత్యం అబ్బింది .అనర్గళంగా ఆభాషలలో సంభాషించేవారు .వారే ‘’పారశీక మహారాష్ట్ర భవ్య తమిళ –కన్నడాంగ్ల  హిందీ భాష లున్నతముగ-నేర్చి రచనలు సేయగా నేర్చినాడ –నస్మదాచార్య పాద పద్మాషిముల’’అని చెప్పుకున్నారు .  

                      ఉద్యోగ విశేషాలు –రెడ్డి –శాస్త్రీయం

శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి ఆత్మీయ ఆహ్వాననం అందుకుని హైదరాబాద్ వివేక వర్ధినిఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా చేరి ,తర్వాత వనపర్తి హైస్కూల్ లో పదేళ్ళు పని చేసి విశేఖ ఖ్యాతి చెందారు. వీరి శిష్యులు గురువు కీర్తిని పెంచి ఘనత వహించారు .వనపర్తి రాజా వారికి కొందరు అసూయా పరులు ‘’మూటలు మోసి ‘’అంటే చాడీలు (తాకట్లు )చెప్పి రాజుగారు వాటిని నమ్మటం తో వనపర్తి వదిలి 1947లో హైదరాబాద్ చేరారు .సిటీ కాలేజిలో కొద్దికాలం ,పనిచేసి 1948 లో ‘’సమాచార పౌర సంబంధ శాఖలో ‘’అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యారు .’’ఆంద్ర ప్రదేశ్ ‘’పత్రిక కు ‘’ హైదరాబాద్ టుడే’’ పత్రికకు సంపాదకులుగా ,ప్రచురణ శాఖాధిపతి గా ఉన్నారు .విద్యా శాఖలో డిప్యూటీ డైరెక్టర్ అయి ప్రాచ్యభాషాబి వృద్ధికి ‘’ఓరియెంటల్ కళాశాలల’’ స్థాపనకు కృషి చేశారు .ఈ కళాశాలలో పని చేసే ఉపాధ్యాయులకు  మిగిలిన డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయుల జీతాలతో సమానంగా జీతాలు వచ్చేట్లు చేసి ,భాషా పండితులకు గౌరవప్రదమైన జీతాలు లభించేట్లు కృషి చేసి వారి విశేష మన్ననలు అందుకున్నారు 1970లో పదవీ విరమణ చేశారు .రెడ్డిగారు –శాస్త్రిగారు అనునిత్యం కలుసుకొని సాహితీ చర్చలు చేసేవారు .రెడ్డిగారు తమశబ్ద ‘’రత్నాకరం ‘’శాస్త్రిగారికి కానుకగా అందించారు .ఈ నిఘంటువులో అన్నిపేజీలలోనూ అందులో లేని  శబ్దాలను అర్ధాలను  సురవరం వారు రాసుకున్నారు .ఈ గ్రంధాన్ని శాస్త్రిగారు రెడ్డిగారి స్మృతి చిహ్నంగా పవిత్రంగా దాచుకున్నారు .శాస్త్రిగారిని రెడ్డిగారు నిజంగా నే ‘’సురవరం ‘’అయ్యారు .సంస్కృత భాష ‘’స్పెషల్ ఆఫీసర్ ‘’గా కొనసాగి ,దేశమంతా పర్యటించి ,గీర్వాణభాషావ్యాప్తికి నిరంతర కృషి చేశారు .సమాచార శాఖలో మళ్ళీ డిప్యూటీ డైరెక్టర్ అయి ఆంధ్రప్రదేశ్ మొదలైన ప్రభుత్వ పత్రికలకు సంపాదకులయ్యారు .

  ప్రతాపరెడ్డిగారు హైదరాబాద్ లో తెలుగులో పటిష్టమైన రచయితలను తయారు చేసే ఉద్దేశ్యం తో మిత్రులతో కలిసి ‘’విజ్ఞాన వర్ధిని పరిషత్ ‘’స్థాపింఛి ‘’మృత్యు సిద్ధాంతం ,ఆంద్ర ప్రతాప రుద్ర యశోభూషణం ,అలంకార వసంతం ,,గంగాపుర మహాత్మ్యం ,రామాయణ విశేషాలు మొదలైన చాలాపుస్తకాలు ప్రచురించారు .ఇదంతా గోల్కొండ పత్రిక కార్యాలయం లోనే జరిగేది .దీని సభ్యులలో ముఖ్యులు కప్పగంతులవారు కేశవ పంతుల నరసింహ శాస్త్రి, ఖండవల్లి లక్ష్మీ రంజనం వంటి ప్రముఖ సాహితీ దిగ్గజాలున్నారు .శాస్త్రిగారు ఎన్నో గ్రంధాలను అనువదించారు .

                             కుటుంబం

శాస్త్రిగారి తల్లి పద్మావతి గారు ,భర్త ను కోల్పోయి  కుమారుడిని వనపర్తి నుంచి తిరుపతి తీసుకు వెళ్లి పట్టు బట్టి సంస్కృత౦ నేర్పించిన మాతృమూర్తి  అనేక భాషలలో  రాణించటానికి విద్యలో ఉన్నతస్థానం సాధించటానికి తన మాతృ మూర్తియే కారణం అని శాస్త్రి గారు చెప్పుకున్నారు . ‘’పద్మావతీ పుత్రుండ ,లక్ష్మణ కవీన్ద్రుండ’’అని రాసుకున్నారు ఆమెతో కాశీ మొదలైన క్షేత్ర యాత్ర చేయించి ,భాగవత సప్తాహాలు నిర్వహించి మాతృభక్తిని చాటుకున్నారు .

  శాస్త్రిగారి భార్య అన్నపూర్ణమ్మ గారు అపర అన్నపూర్ణా దేవిగా వ్యవహరించేవారు ‘’అన్నపూర్ణ కు నుద్దియౌ నన్నపూర్ణ ‘’అని చెప్పుకున్నారు .శాస్త్రి గారి మరణా నంతరం ఆమె .ఆయన తెలుగు వచనం లో రాసిన ‘’వ్యాస భారతం ‘’ను తనవద్ద ఉన్న కొద్ది ధనం తో ముద్రించి భర్త కీర్తి వ్యాప్తికి కి కారణభూతులయ్యారు .ఇందులోని ఏడుపర్వాలకు కుమార్తె డా శ్రీమతి కమల సంపాదకత్వం వహించారు .సంస్కృత విద్యలో ఆరితేరిన కమల ఎం ఏ చేసి ‘’సీనియర్ డిప్లొమా ఇన్ జర్మన్ లాంగ్వేజెస్ ‘’పొందింది .ఉస్మానియాలో ‘’లైఫ్ ఇన్ ఎన్శేంట్ ఇండియా యాజ్ డేపిక్టేడ్ఇన్ ప్రాకృత్ లిటరేచర్ ‘’అంశం పై పరిశోధన చేసి పి హెచ్ డిపొందింది . ఉస్మానియాలో సంస్కృత లెక్చరర్ గా ప్రొఫెసర్ ,శాఖాధిపతి గా ఉన్నది. ’’సంస్కృత భాషా సేవ ‘’అవార్డ్ అందుకున్నది .పదవీ విరమణ తర్వాత కూడా భండార్కర్ ఓరియెంటల్ మాన్యు స్క్రిప్ట్ గ్రంధాలయం తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నది .’’నేను సంస్కృతం నేర్చింది ఋషులు ,మునులు పుట్టిన భారత దేశం లో ప్రచారం చేయటానికే కాని ,భారతీయ ఆత్మను గ్రహించలేని యూరోపియన్లకు కాదు .భారతీయ సంస్కృతీ ,సంస్కృతం పెనవేసుకొన్నాయి కనుక ఆ భాష ఇక్కడే బాగా రాణిస్తుంది ‘’అని డా కమల దృఢ విశ్వాసం

                            శాస్త్రి గారి జైత్ర యాత్ర

 1944 లో వనపర్తి ప్రభువు ఆస్థానం లో ఆస్థాన విద్వాంసులుగా గౌరవ స్థానం అలంకరించారు శాస్త్రిగారు .మూడవ రామేశ్వరరావు పట్టాభి షేకం జరిగినప్పుడు శాస్త్రిగారు ‘’నవరత్నాలు ‘’రాసి ఉపదగా అందించారు .ఆస్థానం లో జరిగే కవి గాయక  విద్వత్ సభలలో శాస్త్రిగారిదే అగ్ర తాంబూలం .చాలా సంస్థానాలు సందర్శించి కవిత్వ పాండిత్య ప్రకర్ష చేత మెప్పించి ఘన సత్కారాలు అందుకున్నారు.

                లక్ష్మణ రచనా శాస్త్రీయం 

‘’సంస్కృత భాష పాఠమాల’’ను రెండుభాగాలలో శాస్త్రిగారు రచించారు .ఆంద్ర –సంస్కృత నిఘంటువు ను ఆచార్య శ్రీ పుల్లెల రామచంద్రుడుగారితో కలిసి కూర్చారు .మాదిరాజు విశ్వనాధ రావు అనే కవితో కలిసి సంస్కృతం లో బిల్హణకవి రచించిన ‘’విక్రమాంక దేవ చరిత్ర ‘’కావ్యాన్ని ‘’కర్ణ సుందరి నాటకాన్ని ప్రబంధ శైలిలో ఆంధ్రీకరించారు . ‘’విజ్ఞానసర్వస్వం ‘’,’’సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశం ‘’లలో నూ వివిధ పత్రికలోనూ లెక్కకు మించిన వ్యాసాలూ రాశారు .మణిమంజూష కధలు రాశారు  ,వ్యాసభారతం ,బదరీశతకం   బౌద్ధ దర్శనం శ్రీ కృష్ణ బ్రహ్మ తంత్ర పరకాల యతీంద్రుల ‘’సూర్యోప రాగ దర్పణం ‘’సంస్కృత రచనకు తెలుగులో తాత్పర్యం  భారతీయసదా చార్ వ్యవహార –హిందీ రచనకు తెలుగు అనువాదం చేశారు .’’శాస్త్రీయ విజ్ఞానం ‘’వ్యాససంపుటికి సంపాదకత్వం వహించారు .అమర సాహిత్యం  తెలంగాణా నాటకాలు  వసంత సేన ,మహాకవి శ్రీ హర్షుడు మొదలైన 8 వ్యాసాలూ రాశారు .లెక్కలేనన్ని రేడియో ప్రసంగాలు చేశారు.శాస్త్రి గారి 101 జయంతినాడు ‘’లక్ష్మణ రేఖలు –భారతీయ సదాచార వ్యవహార దీపిక ‘’ను శాస్త్రి గారి కుమారుడు  డా ప్రభాకర శాస్త్రి వెలువరించారు.సంస్కృత ,కన్నడ తెలుగు మళయాళ మరాటీ ,ఉర్దూ హిందీ ,పారశీక భాషలలో అనర్గళంగా ప్రసంగించే నేర్పున్నవారు .ఏభాష వారు కనిపిస్తే ఆభాష తోనే వారితో మాట్లాడేవారు .ఈ భాష రచనలను తెలుగులోకి అనువదించిన నేర్పరి ..భారత ప్రధమ  రాష్ట్రపతి డా శ్రీ బాబూ రాజేంద్ర ప్రసాద్ గారు హైదరాబాద్ సందర్శించినపుడు లక్ష్మణ శాస్త్రిగారు కావ్య ప్రబంధ ధోరణిలో స్వాగత శ్లోకాలు రాసి ఆహ్వానించారు .ఆ శోభ చూద్దాం –

‘’నిష్ణాతః ప్రాచ్య విద్యా స్వనితర ధిషణే-దుర్గమే రాజ్య తంత్రే –విద్వాన్ పాశ్చాత్య తంత్రేష్వఖిల  భారత భూ –వాసినాంభాగ్య సీమా –రాజ్యానామ్ పాలనే చ ప్రభురతి నిపుణో-ప్యప్రద్రుశ్యొభిగ్యః –జీయాత్ రాజేంద్ర విద్వానతి శత శరద౦ –భారతం సేవమాన ‘’

   పురస్కార బిరుద ప్రదానాలు

 లక్ష్మణ శాస్త్రిగారు కాశీ సంస్కృత విశ్వ విద్యాలయం ,ఆంధ్రా ,ఉస్మానియా విశ్వ విద్యాలయాల బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యులుగా గౌరవి౦పబడి  ఎనలేని సేవ లందించారు .హైదరాబాద్ లో ‘’సురభారతి ‘’వ్యవస్థాపక అధ్యక్షులు .’’ఆంద్ర సారస్వత పరిషత్ ‘’స్థాపక అధ్యక్షులు .2-1-1844 న తిరుపతి సంస్కృత కళాశాల పూర్వ విద్యార్ధులు ‘’ఆంద్ర బిల్హణ ‘’బిరుదు ప్రదానం చేశారు  .వారి సన్మాన పత్రం లో మచ్చుకు ఒక  శ్లోకం –‘’ఆంధ్రీ సంస్కృత దేశ వాగ్విలసితా భాషామలారాజతే –శబ్ద ద్వంద్వ మిదం మనోజ్ఞ మధురం ,కర్తుం సుదీర్బిల్హణః-శ్రీమల్లక్ష్మణ-విశ్వనాథ కవి రాడ్రూపేన విద్యోతతే –ఏతావాంధ్ర సరస్వతీ పతివరౌ శ్రీ బిల్హ ణౌ రాజతాం ‘’ .ఇదికాక ‘’విమర్శక శిరోభూషణ ,సుధీంద్ర మౌళి మొదలైన సార్ధక బిరుదులెన్నో శాస్త్రిగారిని  . ఉత్తర ప్రదేసశ్ మదన మోహన మాలవ్యా విద్యా సంస్థాన్ ‘’సుధీంద్ర మౌళి ‘’బిరుదం తో సత్కరించింది .’’బ్రహ్మ భూషణ ‘’వీరి సాహితీ గరిమకు లభించింది .కాశీ విద్వత్ పరిషత్ ‘’మహా మహోపాధ్యాయ ‘’నిచ్చి ఘన సన్మానం చేసింది .తిరువాన్కూర్ ,గ్వాలియర్  సంస్థానాదిపతులు జగద్గురు శంకరాచార్యులవారు శాస్త్రిగారిని ఘనం గా అపూర్వంగా సంమానించారు.విద్యా మంత్రి మండలి వెంకట కృష్ణారావు గారి ఆధ్వర్యం లో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారి నిర్వహణ లో జరిగిన మొదటి ప్రపంచ తెలుగు మహా సభలలో లక్ష్మణ శాస్త్రిగారికి ప్రత్యేక సన్మానం చేశారు .శాస్త్రిగారిని సన్మానించి వారి ఉపన్యాస లహరిలో తడిసి ముద్దై  గౌరవించని సాహితీ సంస్థ లేదు అంటే అతి శయోక్తి కాదు .లెక్కలేనన్ని పురస్కారాలు అందుకున్నారు .వీలైనప్పుడల్లా వివిధ ప్రదేశాలను సందర్శిస్తూ  ఆప్రాంత భాషలో అనర్గళంగా ప్రసంగించి నివ్వెర పోయేట్లు చేసేవారు .వారి పాండితీ గరిమ అంతటిది . వీరి ఆధ్వర్యం లో ఏర్పడిన ‘’సార్వభౌమ సంస్కృత ప్రచార కార్యాలయం ‘’కు అధ్యక్షులుగా ఉన్నారు శాస్త్రి గారి గీర్వాణ భాషా పాండిత్యానికి ముగ్ధులైన పండిత ద్వివేదీ శాస్త్రి సంస్కృతం లో వీరిని –‘’మూర్తిర్మత్త గజేంద్ర దర్ప దళినీ వాణీ వినోద ప్రియా –వ్యాఖ్యా లేఖ కవిత్వ కౌశల కళా పారంగతా,శేముషీ –శక్తిః సంస్కృత భాషణే ష్యనుపమావిద్వజ్జనే ష్వాదరః –శ్రీమల్లక్ష్మణశాస్త్రిణా౦ గుణ గణాః కేషాంస తోషా సహాః’’అని ప్రస్తుతించారు .  ప్రధాని పివి నరసింహారావు గారి తో చాలా సన్నిహిత సంబంధం శాస్త్రిగారికి ఉన్నది. అనేక కవి  సమ్మేళనాలలో పాల్గొని వన్నె తెచ్చారు

  శాస్త్రిగారు తుది శ్వాస వదిలే వరకు ‘’కాశీ సంపూర్ణానంద సంస్కృత విశ్వ విద్యాలయం ‘’ఎమిరిటిస్ ప్రోఫెసార్ గా (సమ్మాన్య ప్రాచార్యులు )గా ఉన్నారు .శాస్త్రిగారికి అందరూ మిత్రులే .వారికి తర తమ భేదం లేదు .అందరూ ఆయనకు ఆత్మీయులే ,మిత్ర బృందం లోని వారే అంతటి అజాత శత్రువు శాస్త్రిగారు .80 సంవత్సరాల సార్ధక జీవనం గడిపి 10-1-1981 న మహామహోపాధ్యాయ  ఆంద్ర బిల్హణ శ్రీ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు అనే సంస్కృత వాజ్మయ శిఖరం నేల వ్రాలినది .

 ఆధారం—1- ప్రపంచ తెలుగు మహాసభల ప్రచురణగా ‘’తెలంగాణా మహనీయులు’’ పేరుతో శ్రీ సంబరాజు రవి ప్రకాశరావు రచించిన ‘’కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి ‘’మోనోగ్రాఫ్

2- నా రచన –గీర్వాణ కవుల కవితా గీర్వాణం -1 మొదటిభాగం .

  ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలతో  

  మీ-గబ్బిట  దుర్గా ప్రసాద్ -29-12-17 –-,30-12-17 ఉయ్యూరు  

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.