సాహితీ బంధం కవి సమ్మేళన కవితలు

             సాహితీ బంధం కవి సమ్మేళన కవితలు

24-12-17 ఆదివారం సాయంత్రం రేపల్లెలో’’ గ్రంథద్వయ ఆవిష్కరణ’’ సందర్భంగా జరిగిన ‘’సాహితీ బంధం ‘’కవి సమ్మేళన కవితలు

1-       సహజ కవి డా ఐనాల మల్లేశ్వరరావు –తెనాలి -9347537635

సీ –‘’సాహితీ బంధంబు సత్సంగముం బెంచి-సచ్ఛీల సుధలను చవుల జూపు

సాహితీ బంధంబు సహ్రుదుల్ పులకించ –సాంగత్య మధురిమల్ జగతి పంచు

సాహితీ బంధంబు సద్గ్ర౦థ పఠన చే –సుజ్ఞాన జ్యోతుల సుగతి జూపు

సాహితీ బంధంబు సమతానురాగాల –శాంతి సౌభాగ్యాల కాంతులీను

తే.గీ .-‘’ఎచట సాహిత్య బంధంబు హేల లీల – విరిసి వ్యాపించి భువి దివి విస్తరిల్లి

నవ నవోద్భవ లోకాల నవ్య సృష్టి –దివ్య కాంతుల తేజమ్ము దీప్తి జిమ్ము ‘’

2-‘’సాహితీ బంధమ్ము సమయజ్ఞాతాన్ బెంచి –సరస సంభాషణా సౌరు బెంచు

సాహితీ బంధమ్ము సౌశీల్య మందించి –సాంగత్య సంపదన్ సతము మించు

సాహితీ బంధమ్ము సౌహార్ద్ర మొలికించి –సహ్రుదిని పులకించ సహకరించు

సాహితీ బంధమ్ము సహనమ్ము దీపించ –సత్కార్య సఫలతన్ సంతరించు

తే.గీ .-ఎచట సాహితీ బంధమ్ము ఇగురు తొడగు –నచట నవపారిజాతాల హోరి విరియు

        ప్రమద పరిమళ ప్రభలచే పరిఢ విల్లి –శాంతి దాంతుల భూకాంత సంతసిల్ల ‘’

3-క౦-‘’ఈ మా  సాహితీ బంధము –నేమని వర్ణింతు నేను ఇహలోకమునన్

ప్రేముడి నడవడి నేర్పును –కామిత వర్దినిగ వరల కల్పక మనగన్.

4-కం-‘’కృతి కర్తయు కృతి భర్తయు –అతులిత ఆత్మాను బంధ మది ఇది యనగన్

         క్షితి నెవ్వరికి సాధ్యము –నుతులందెడి నలువ రాణి నుడులకు గాకన్ ‘’

  2-శ్రీ దండి భొట్ల దత్తాత్రేయ శర్మ –విజయవాడ -9247558854

                  రస బంధుర –సాహితీ బంధమ్ము

1-చిననాట శతకము లప్ప జెప్ప-చప్పట్ల పతకము తెచ్చె నే బంధమ్ము

పద్య భావార్ధములలో నుడువగా –ఈవితార్ధము చెప్పే నే బంధమ్ము

పసి పాఠకుడనై నడక సాగని వేళ-‘’చందమామ ‘’గ వెలుగు దారులు చూపె నే బంధమ్ము

బ్రతుకు భారమై భయపెట్టు వేళ –ఆత్మ బలము పెంచి వెన్ను తట్టె నే బంధమ్ము

విశిష్ట సాహితీ శ్రస్టల నడుమ తిష్ట వేసెడి-తెగువ నిచ్చె నే బంధమ్ము

సౌశీల్య ,సౌహార్ద్ర ,సుహృన్మిత్రుల మైత్రి నిచ్చె నే బంధమ్ము

సమభావ సూత్రీకరణ తోడ ప్రపంచామంతను –ఉయ్యూరు రప్పించు ఇంద్ర జాలమ్ము

యాసలు వేరై వీడిపోయిన గాని –‘’బాస ‘’గా కలిపి బాసట గా నిల్పు సాధనమ్ము

రసబంధుర సింధూరమ్ము –సుఖ జీవన సుమ గంధమ్ము

చదువులమ్మ అమృత నైవేద్యము –పంచునట్టి సౌజన్యమ్ము

అనవతర నిత్యనూత్ననాదు సాహితీ బంధమ్ము .

3-లయన్ శ్రీ కాకరపర్తి సుబ్రహ్మణ్యం –తెనాలి -9848297711

                  సాహితీ బంధం

అమ్మానాన్నలతో ఆనందం –

ఆచార్యులతో అనుభవం

ఆలోచనలతో అసమర్ధతకు బంధం

దేవుని దర్శనం లో తన్మయత్వం –

ఆయన అభయం తో పరవశం

ఆలయంతో ఒక ఆధ్యాత్మిక బంధం

మంచిమనిషికి మనసుతో

మంచి మనసుకి ప్రేమతో

జీవితం భార్యాభర్తలకి బంధం

అల్లుకున్న తీగె తో పందిరికి

పుష్పించే కొమ్మతో కాయకి

ఆహారం తో ఆకలికి బంధం

వెలుగుతో చీకటికి

సాయంతో చిరునవ్వు కి

ప్రేమతో చిట్టి గుండె కి బంధం

మంచి పుస్తకం తో విజ్ఞానానికి

 ‘మంచి దృశ్యంతో వినోదానికి

కాగితం తో కలానికి సాహితీ బంధం .

4-శ్రీ పంతుల వెంకటేశ్వరరావు (తపస్వి )విజయవాడ -9908344249

      సాహితీ బంధం

-1-సీ .దేశభాషలందు దేదీప్యమానమై –వెలుగొందునట్టి దీ తెలుగు భాష

అవధాన క్రీడలో నానందమందించు –ఆంద్ర తెలంగాణ అమ్మభాష

సంస్కృత భాష కు సన్నిహితంబైన –లలిత సౌందర్యాల  ద్రవిడ భాష

సాహితీ లోకాన సౌలభ్యమౌ రీతి –జ్ఞానంబు నిచ్చు సంస్కార భాష

తే. గీ.-అట్టి తెలుగు భాషను కడు నాదరించి –బ్రౌను వంటి ఆంగ్లేయులు పటిమ పెంచె

నాటి నేటికవులు ఘనాపాటి లగుచు –ఆంద్ర భాషకు సర్వత్ర యశము గూర్చె.

2-సీ –నాచన సోమన నన్నయాది కవుల –కమ్మని పద్యము ఘనత నిచ్చె

ఎఱ్ఱన పిల్లలమఱ్ఱి కవిత్వము –వర్ణనాతీతమై వన్నె తెచ్చె

తిక్కన మారన తీయని భావాలు –తెలుగు పదాలకు వెలుగు నిచ్చె

గోన బుద్దారెడ్డి శ్రీనాథ పోతన –వైవిధ్యభరితమై చేవ నిచ్చె

తే.గీ. అష్ట దిగ్గజకవులు రాయల రచనలు –నవరసాల ప్రబంధమై అవతరించె

మధుర కావ్య రస ఝరితిమ్మక్క మొల్ల –సాటి నారీ జగత్తున మేటి యయ్యె.

3-సీ.-బద్దెన వేమన ఫక్కి అప్పల నర-సయ్య లక్ష్మణ కవి శతక పటిమ

త్యాగయ్య క్షేత్రయ్య అన్నమాచార్యుల –సంకీర్తనామృత సారమహిమ

ఆధునిక యుగంబు నందున గురజాడ- కుందుర్తి జాషువా కందుకూరి

పద్య గద్య౦బుల వ్యాస ప్రహసనాల –సాహితీ బంధమై సంగమించె

పలు విధ ప్రక్రియల పుష్పముల నొసంగి –తెలుగు భాష యజ౦తమై దేశమందు

సర్వ జగతికి నిచ్చు సౌరభమ్ము –అద్భుతంబుగ నిలవాలి అవని యందు .

5-శ్రీ తుమ్మోజు రామ లక్ష్మణాచార్యులు –విజయవాడ -9703776650

                 సాహితీ బంధం

1-ఎక్కడి ఉయ్యూరో మరి నెక్కడి రేపల మేరి కెక్కడో –ప్రక్కల జేర్చేనో సరసభారతి యుక్కున సాహితీ సభన్

చొక్కగ రేపలెన్ జనులు శోభనమాయెను పండితాళిచే-చక్కటి బంధ మేర్పడెను స్వాగత మీయగ క్రొత్త యేటికిన్ .

2-ఘన రేపల్లె పురాన  సొంపెగగా కైతన్ మనోహారులై –వినిపించన్ పోరుగూళ్ళ నుండిటకు నుద్వేగాత్ములై వచ్చుటల్

కన సాహిత్య రసాను బంధమిది యౌగా !సాహితీ ప్రేమికుల్ –తనివారంగ ప్రసంగ మాధురుల   డెందమ్ముల్ ముదా పూరమై .

3-ఎంతటి దివ్య బంధమిది ఎల్లలు లేనిది యుల్లమెంతయో-సంతస మంద కూడిరిట సార కవీంద్ర వరేణ్య సాక్ష్యమౌ

చింతగ శారదా చరణ సేవకు కన్నుల పండువాయెగా –నింతలు నంతలై సహకరించుచు సాగగ క్రొత్త బంధముల్ .

4-అందగా రాని బంధమిది అక్షరమించుక నేర్వకున్న సం –బంధము సాహితీ సరస బంధుర మౌ నెడ నంద గించెడిన్’

ఎందరొ మేటి పండితులు నిచ్చును క్రిందును లేక సాహితీ –బంధము తోడ దగ్గరయి పంచరె మోదము తెల్గు జాతికిన్ .

5-వ్యాసుని భారతంబు మరి వాల్మికి రామ కథేతి హాసమున్ –భాసుర కావ్య గాధలయి వాజ్మయ మెంతయు నేటి దన్కయున్

మోసులు వార వెల్వడెను మోదము నందగ సాహితీ రసా –శ్వాసిత బంధ మియ్యదియు  సాగెడు గాక యుగా౦త రంబునన్ ‘.

   సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-1-18 –ఉయ్యూరు

.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in కవితలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.