కూర్చేదొకరైతే ఊడ్చేది వేరొకరు
అన్న చందంగా ఉంది
మన భారతీయ బ్యాంకుల స్థితి .
కస్టపడి చెమటోడ్చి డబ్బు సంపాదించి
నగానట్రా కుదువబెట్టి ,పొలం పుట్రా అమ్మేసి
ఆపత్కాలం లో అదనుకు ఆదు కుంటుందని
నమ్మకం తో బాంకుల్లో ఆశగా కూడ బెడితే
అనాయాసం గా మోసం చేసి దోచుకుని
ప్రజల ,బాంకుల ,ప్రభుత్వాలనెత్తిపై
శటగోపం పెట్టె జాదూ ధన
పూజారులెక్కువయ్యారు ఇదేం పోయే కాలం ?
ప్రధాని మోదీ రోడ్లూడ్చిస్వచ్చ భారత్ చేస్తుంటే
నీరవ మోదీ నీరవంగా నిశ్శబ్దంగా
బా౦కుల్ని ఊడ్చేసి
సొమ్ముచేసుకుని పరారీ .
పంచనదుల సంగమ క్షేత్రం పంజాబ్
నేషనల్ బాంక్ అప్పనంగా
స్విఫ్ట్ సిస్టం ఆపరేషన్ వివరాలిచ్చేసి
ఇప్పుడు లబో దిబో మంటే ఏం లాభం ?
రోటోమాక్’’ కొఠారి ‘’
తెలివి తేటల కఠారి
మెత్తని కత్తితో నున్నగా చేశాడు క్షవరం .
పూర్వం లలితమోడీ ,హవాలా
కుంభ కోణాలకు దీటైనవి ఇవి
‘’ఆర్టి ఫిషియల్ ఇంటలిజెన్స్’’కు పరాకాస్టేమో!
మరో ‘’చొక్కీ ‘’ఎంచక్కా మెక్కి
వెక్కి రించి వెళ్లి పొయ్యాడు .
‘’మేరా భారత్ మహాన్ ‘’మోడీజీ!
బాంకుల్లో పేరుకు పోయిన నగదును
భారిగా ఊడ్చేసిన సంఘటనలివి
‘’కాంగీ హయాం ‘’లో అవినీతి జరిగిందని
నెత్తీ నోరూ కొట్టుకుని వీధినబడి
ఓట్లు దండుకుని అందలమెక్కిన కమల నాధులూ!
కాషాయ దారులూ ! తమనిర్వాకం మాత్రం
ఏం గొప్ప గా మెప్పుగా ఉంది ? అంటున్నాడు ఆం ఆద్మీ
రిటైర్ మెంట్ అయ్యే ముందు స౦భావనలు
అందుకోటం,దండుకోటం సర్వ సాధారణమే
కాని సదరు’’ పాంచ్ ఆబ్ ‘’ డిప్యూటీ మేనేజర్
బోనస్ గా బాంక్ నే కొల్లగొట్టాడట ఝారీగా భారీగా
నాలుగు గంటలకో ఉద్యోగి బాంక్ లను
మోసగిస్తున్నాడట –చిత్తగించారా జైట్లీ మహాశయా !
అందులో గోకుల్ శెట్టి లాంటి వారెందరో ఉన్నారట
గమనించారా దేశ వ్యవహారాల మంత్రీజీ
ఈ సారి పద్మ పురస్కారాలు
ఆనవాయితీకి భిన్నంగా ఇచ్చామని
ఘన మోడీ ఘంట కొట్టిమరీ బజాయించారు
కాని అక్రమదార్లకే అవార్డులని సామాన్యుడు
గొణుక్కుంటున్న సంగతి చెవిన బడిందా సారూ !
పై ముఠాలో ఇలాంటి వారూ ఉన్నారట తెలుసా సారూ !
‘’ఎవరు అధికారం లోకి వచ్చినా
మెక్కేది బొక్కేది ఆగదు గాక ఆగదు
మెక్కేవాళ్ళు బొక్కేవాళ్ళు మారుతారు అంతే’’
అన్నది ఆధునిక చాణక్య నీతి గురువర్యా .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –20-2-18-ఉయ్యూరు