నవలా ప్రక్రియలోనూ తనదైన శైలితో హృదయపు లోతులను తరచే ”పూజారి ”నవల రాశారు దీనినే ప్రఖ్యాత సినీ దర్శకుడు మల్లీశ్వరి ఫేమ్ బి యెన్ రెడ్డి గారు ”పూజా ఫలం ”చలన చిత్రంగా తీసి అవార్డులు రివార్డులు అందుకున్నారు . అందులో నారాయణ రెడ్డిగారి పాటలు ,రాజేశ్వర రావు గారి సంగీతం ఘంటసాలగానం ఆ సినిమాను క్లాసిక్ ను చేశాయి సృజనాత్మక సాహిత్యం తన అసమాన ప్రతిభను ఆవిష్కరించిన రాజుగారు సాహిత్య విమర్శలోనూ ముందున్నారు తన సాహితీ వ్యాసాలను 1-సాహితీ మంత్రనగరి లో సుస్వరాలు 2-జర్నలిజం లో సృజన రాగాలు గా సాహితీ లోకానికి అందజేశారు .
మునిపల్లె రాజుగారు తమ ప్రతిభకు తగిన గుర్తింపు పొందారు . ఆయన కదా సంకలనం ”అస్తిత్వనాదం అవతలి తీరాన ”కు కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారం 2006లో లభించింది. దీనికే పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయ పురస్కారం 20 04లోనే ఇచ్చింది . 20 04లో గోపీచంద్ పురస్కారం తోపాటు నూతులపాటి గంగాధరం పురస్కారం ,జ్యేష్ట లిటరరీ పురస్కారం,రావి శాస్త్రి స్మారక పురస్కారం ,పులికంటి సాహితీ సత్కృతి ,అందుకున్నారు ఆంద్ర సారస్వత సమితి సహృదయ సాహితీ సంస్థ వంటి ప్రసిద్ధ సాహితీ సంస్థలెన్నో రాజుగారిని గౌరవించి అవార్డ్ లు అందజేశాయి . ఆంద్ర దేశం లో అనేక ప్రదేశాలలో జరిగిన సభలలో రాజుగారు ప్రసంగించి స్పూర్తి కలిగించారు ఆసక్తి రేకెత్తించారు ”సమకాలీన సాహితీ నావికులకు ముని పల్లె రాజు గారు ఒక లైట్ హౌస్ .-కదా ఋషి”అని గొప్ప కితాబు ఇచ్చారు మహా కధకులు శ్రీ మధురాంతకం రాజా రాం . సాహితీ సమర్ధతను అంచనా వేయటం లో దిట్ట అయిన మంజుశ్రీ అనే అక్కిరాజు రమాపతి రావు గారు ”కధకుల కధకుడు మునిపల్లె రాజు ”అని రాజుగారి మహోత్క్రుస్ట తను సమర్ధతను చాటారు
మేజికల్ రియలిజం కు కొత్త ఒరవడి సృస్టించినవారు ముని పల్లె రాజుగారు . రాజుగారిప్రతి కధలో అంతస్సంఘర్షణ ,అస్తిత్వ వేదన ,తాత్విక శోధన ఉంటాయి ఇవే ఆయన్ను మిగిలిన సమకాలీనులుర కంటే గొప్పవారిని చేశాయి ఇంతకీ మేజికల్ రియలిజం అంటే ఏమిటి .?సృష్టిలో జరిగే దైనందిన కార్యక్రమాలను ఆధ్యాత్మిక కోణాలలో అన్వయించి మానవులకు ,జరుగుతున్న సంఘటనలకు మధ్య ఉన్న సంబంధాలను విశ్లేషించటం అన్నమాట . ఇందులో నిష్ణాతులై ”రాజు”అనిపించుకున్నారు మునిపల్లెవారు.
ఆంగ్లేయుల బానిస సంకెళ్ళనుంచి మనదేశం విముక్తి కాకముందు నుంచి నేటి స్త్రీ దళిత బహుజన గిరిజన మైనారిటీ వాదాల వరకు, నాటకరంగం మొదలుకొని మూకీ టాకీల నుంచి నేటి ఐ మాక్స్ల వరకు, ఏతాలు, గూడలు, కపిలలు, ఎడ్లబండ్లు మొదలు కార్లు విమానాలు ఉపగ్రహాల వరకు, గ్రామ ఫోను రికార్డులు, టేప్ రికార్డులూ, సీడీలు మొదలుకొని నేటి అతర్జాలం వరకు ఒక ప్రవాహంలో వచ్చిన మార్పులకు ప్రత్యక్షసాక్షిగా నేటికీ కలం వదలని అరుదైన కథకుడు మునిపల్లె రాజు.
సోషల్ రియాలిటీ సోషల్ ఫిలాసఫీ మొదలుకొని మేజిక్ రియలిజమ్ వరకు, మార్క్సిస్టు భావజాలం దగ్గర నుంచి మానవ జీవితాలను శాసించే సూత్రాల వరకు అన్నింటినీ తన కథలలో ప్రతిభావంతంగా ప్రయోగించి మెప్పించిన ఏకైక కథారచయిత మునిపల్లె రాజు.
వీరి కథా కథనం గంభీరంగా ప్రవహించే గంగా ప్రవాహంలా జీవిత పార్శ్వాలను స్పృశిస్తూ పాఠకుల్ని కథాకాలం నుంచి సమాజంలోకి లాక్కెళుతుంది. పాఠకుడి మనసు ప్రక్షాళనం చేస్తుంది. ఆతని హృదయ క్షేత్రంలో మానవత్వపు విత్తనాలను నాటి జీవితాన్ని సారవంతం చేస్తుంది. వీరి కథలు మదురానుభూతినే గాక జీవిత రహస్యాలవగతమయ్యే జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. మనసుకు పట్టిన తుప్పును వదిలిస్తాయి.
మునిపల్లె రాజు ప్రతి కథా ఒక లయాత్మకమైన జీవన సంగీతాన్ని కలిగివుంటుంది. అయితే ఆ సంగీతం సాధారణమైంది కాదు. అమరత్వాన్ని సాధించే మాధుర్యం కలిగిన సంగీతమది. కాబట్టి ఈ కథలు రచయితకు, పాఠకుడికి మధ్యన ఒక భావాతీత ఆత్మికబంధాన్ని పదిలపరుస్తాయి. మరి అలాంటి అద్భుతమైన అనుభూతిని, సాహిత్య అనుబంధాన్ని నేటి యువత పెంపొందించుకోవాలంటే ఈ కథల్ని చదవాల్సిందే.
రాజుగారి కధలు ”హృదయపు పునాదిమీద కట్టినవి ”అందుకే అంత విశిష్టంగా ఉంటాయి
93ఏళ్ళు జీవించి 24-2-18 శనివారం హైదరాబాద్ లోని సైనికపురి లో స్వర్గస్తులయ్యారు మునిపల్లె రాజుగారు .ఆయన ప్రసంగాలు ఆలోచనాత్మకాలు .హృదయాలను తాకి మానవత్వాన్ని చిగురింప జేసే శక్తి ఉంటుంది వారిమాటలలో రాతలలో. మహా కథకులు శ్రీ మునిపల్లె రాజుగారు లేని లోటు తెలుగు సాహిత్యం లో తీర్చలేనిది పూడ్చలేనిది .శ్రీ మునిపల్లె రాజు అమర్ రహే .
గబ్బిట దుర్గాప్రసాద్- 26-2-18 -ఉయ్యూరు
