లలిత సంగీత రే (రా )రాజు మోహన రాజు
‘’చివురులు వేసిన కలలన్నీ ‘’పాట వినగానే ఆ స్వర మాధుర్యానికి పరవశమౌతాం .ఒక కొత్త కోయిల తెలుగు నేలమీద నవవసంత గానం చేసిందని సంబర పడ్డా౦ . ఆ తీయని పలుకుబడికి పులకించాం.మళ్ళీ మళ్ళీ మళ్ళీ విన్నాం .యెద నిండా ఆన౦దపు అనుభూతులు పంచుకున్నాం .ఇంతటి గాయకుడికి అవకాశాలు ఎందుకు ఇవ్వటం లేదని బాధపడ్డాం.వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుని సత్తా చాటి ప్రతిభను నిరూపించాడు మోహన రాజు .అందరికీ కేబికే మోహనరాజు అంటే బాగా తెలుస్తుంది .అలా బాగా నలిగిన పేరే అది .ఆ సుస్వరం శ్రీ విళంబి వసంతం ప్రవేశించటానికి రెండు రోజులముందే 16-3-18 శుక్రవారం 73 వ ఏట కనుమరుగవటం ఆశ్చర్యాన్ని ,ఆవేదనను కలిగించింది .ప్రతిభకు తగిన స్వర పట్టాభిషేకం జరగలేదు అని బాధ కలిగించింది .
తెలుగు సినీ గాయక దిగ్గజాలైన ఘంటసాల ,బాలు ,సుశీల ,జానకి లతో కలిసి పాడిన అదృష్టవంతుడు రాజు .ప్రముఖ సంగీత దర్శకులురాజేశ్వరరావు మహదేవన్ ,సత్యం ,మాస్టర్ వేణు ల స్వరాలకు తన మోహన సమ్మోహన గానం తో చిరస్మరణీయం చేశాడు .సుదీర్ఘమైన సినీ ,టివి జీవితం ఆయనది .విజయవాడ లో మోహనరాజు 1945 అక్టోబర్ 10న శ్రీమతి ఉషాకన్య శ్రీ శేషయ్య దంపతులకు జన్మించాడు .సంగీతం లో తొలి గురువు తండ్రి శేషయ్యగారే .తర్వాత ఘంటసాల ,కస్తూరినరసింహారావు లు . ఆంద్ర ప్రదేశ్ ఎలెక్ట్రిసిటి డిపార్ట్ మెంట్ లో చేరి అసిస్టెంట్ సెక్రెటరి అయ్యారు .కమలాదేవిని వివాహం చేసుకుని నలుగురు కుమారులకు ఒక కుమార్తెకు తండ్రి అయ్యాడు .లలితగీతాలు ఆలాపించటం లో మహా నేర్పున్న మోహనరాజు అందులో తన ప్రతిభను చాటాడు . విజయవాడలో మొదటి సంగీత ప్రదర్శన చేసి అప్రతి హతంగా దూసుకు పోతూ కనీసం 10 వేల ప్రదర్శనలు దాకా ఇచ్చిన ఘనకీర్తి మొహనరాజు ది.’’రామదాసుకీర్తనలు ‘’మొదటి కేసెట్ గా విడుదల చేశాడు దీనితో ఆయన కీర్తి శిఖరారోహణం చేసింది ‘’పదములు చాలు రామా ‘’అనే గీతం ఆయనకు బాగా నచ్చినది .విదేశాలలోనూ అనేక ప్రదర్శనలు నిర్వహించి లలిత సంగీత మోహన రారాజు ‘’అని పించుకున్నారు .1977 సంగీత సమ్మేళనం ,న్యుఢిల్లీ ఎయిర్ న్యుఢిల్లీ ,దూరదర్శన్ లలో మంచి గుర్తింపు పొందాడు .రాజు సేవను గుర్తించి ఆకాశవాణి ,దూర దర్శన్ కేంద్రాల సలహా సంఘం లో సభ్యుని చేసి గౌరవించారు .చిత్తరంజన్ స్వరపరచిన పాటలు ఎక్కువగా ఆతర్వాత పాలగుమ్మి వారిపాటలు మంచాల జగన్నాధ రావు గార్లు స్వరపరచిన గీతాలు పాడాడు .ఘంటసాల అవార్డ్ ను పొందిన మొదటిగాయకుడు రాజు .బాంబే రేబర్ట్స్ స్టేడియం లో జరిగిన లలిత సంగీతం పాటల గొప్ప పోటీలో 30 వేల మంది ప్రేక్షకుల సమక్షం లో పాడి గొప్ప అనుభూతికి లోనయ్యాడు .భారత దేశం లో అదే మొట్టమొదటి భారీ పోటీ .దీనిని నిర్వహించినవారు డా ఈమని శంకర శాస్త్రి గారు .ఈ ప్రదర్శన ద్వారా ఈమనివారు శాస్త్రీయ సంగీతానికి లలిత సంగీతం ఏ మాత్రం తీసి పోలేదు అని రుజువు చేశారు .
సత్య హరిశ్చంద్ర నాటకం లో లోహితాస్యుని పాత్రతో నాటక రంగ నటుడు అయ్యాడు రాజు .లలిత, భక్తి గీతాలు ఆలాపించటం లో అందెవేసిన చేయి సారీ గొంతు అని పించాడు . రామదాసు కీర్తనలు ,అన్నమాచార్య కీర్తనలు పాడి వాటి విలువ పెంచాడు .వైవిధ్యమైన కీర్తనలు అతి సునాయాసంగా నేర్చి పాడి ఆకట్టుకున్నాడు .’’నీదేరా భారత దేశం ‘అనే మొహనరాజు పాడిన దేశభక్తి గీతం బాగా ప్రాచుర్యం పొందింది .పాలగుమ్మి విశ్వనాధం స్వరపరచిన ‘’నిను కోలుచునోయి జగమంతా –ధన్యుడవోయి హనుమంతా ‘’వంటి చాలాపాటలు పాడి తన దైవభక్తిని ప్రదర్శించాడు .చిత్తరంజన్ స్వరకల్పనలో ‘’శ్రీ శేషాచల వాసా ‘’వంటి మధుర భక్తి భావ గీతాలు ఆలపించాడు రాజు .’’నా బతుకొక నావ దానిని నడిపే తండ్రివి నీవ ‘’తనకు మంచిపేరు తెచ్చిందని చెప్పుకున్నాడు.’’వినవమ్మా చెల్లెలా ,గుణభద్రా తుంగ భద్రా –వినవా నాచెల్లెలా గంగాయమునల జోరు –గౌతమికే సై జోడు –బాలవై సయ్యాటలాడు ఈడు పోయెనమ్మ – పోయిన జీవితముమళ్ళీ పొందవు చెల్లీ –ఈ ఇల పండించుటయే నీ ధర్మము తల్లీ ‘’ గీతాన్ని చాలా ఏళ్ళ క్రితమే కృష్ణ శాస్త్రి గారు రాశారు. దానిని పాడే అదృష్టం తనకు కలిగించారు’ .’’సినీకవులలో,ముఖ్యంగా లలిత సంగీత కవులలో కృష్ణ శాస్త్రి గారి తరువాతే ఎవరైనా అని నా నిశ్చితాభిప్రాయం ‘’అని ఘంటాపధంగా చెప్పాడు గాన మోహనరాజు .’’రాత్రి పూట బాలమురళి పాటలు వింటూ నిద్రపోవటం నాకు అలవాటు .నన్ను పరవశం చేసి , వేరే లోకం లో విహరి౦పజేసే పాటలు అవి ‘’అని మహాగాయకుడికి స్వరార్చనగా అన్నాడు .సంగీతం తనజీవితం లో ఒక భాగమే అన్నాడు .
తెలుగు చలన చిత్రాలలో 50కి పైగా సినిమాలలో పాడాడు .అందులో సాక్షి ,పూలరంగడు ,దేవుడమ్మవంటివి ఉన్నాయి .సాక్షి సినిమాలో బాపు దర్శకత్వం లో మహదేవన్ సంగీత కర్తృత్వం లో ఆరుద్ర రాసిన ‘’ఎవరికి ఎవరూ ఈలోకం లో –రారు ఎవ్వరూ నీ కోసం ‘’ను మోహనరాజు అద్భుతంగా విషాద గర్భితంగా పాడాడు .ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం లో పూల రంగడు చిత్రం లో నారాయణ రెడ్డి రాసిన ‘’చిగురులు వేసిన కలలన్నీ ‘’పాటను సుశీలతో కలిసి మోహన రాజు పాడాడు దీనికి మంచి గుర్తింపు వచ్చింది
చిగురులు వేసిన కలలన్ని.. సిగలో పూలుగ మారినవి
మనసున పొంగిన అలలన్నీ.. మమతల తీరం చేరినవి.. మమతల తీరంచేరినవి..
ఆ.ఆ.ఓ…ఓ…ఓ
సన్నజాజి తీగలాగ నిన్ను చేరుకున్నానూ..ఊ..
సన్నజాజి తీగలాగ నిన్ను చేరుకున్నాను
నిండు మనసు పందిరి కాగా నిన్ను అందుకున్నాను.. నిన్నే అందుకున్నాను…
చిగురులు వేసిన కలలన్ని.. సిగలో పూలుగ మారినవి
చరణం 2:
దాగలేని రాగాలేవో దాచినావు ఆనాడు
దాగలేని రాగాలేవో దాచినావు ఆనాడు
నా తనువు అణువణువు.. నీదే నీదే ఈనాడు.. నీదే నీదే ఏనాడు…
చిగురులు వేసిన కలలన్ని.. సిగలో పూలుగ మారినవి
చరణం 3:
నీటిలోని కలువను కోరి నింగి దిగిన జాబిలి నీవే..ఏ..
నీటిలోని కలువను కోరి నింగి దిగిన జాబిలి నీవే
పరిమళాల తరగలలోనే..ఏ…ఆ ఆ ఆ…
పరిమళాల తరగలలోనే కరిగించిన చెలియవు నీవే.. కరగించిన చెలియవు నీవే
చిగురులు వేసిన కలలన్ని.. సిగలో పూలుగ మారినవి
మనసున పొంగిన అలలన్నీ.. మమతల తీరం చేరినవి.. మమతల తీరంచేరినవి..
ఆ.ఆ.ఓ…ఓ…ఓ
చలం నటించిన దేవుడమ్మ సినిమాలో సత్యం సంగీతం లో నారాయణ రెడ్డి ‘’చిన్నారి చెల్లి మా చిన్నారి చెల్లి ‘’పాటను బాలు తో కలిసిపాడాడు
73 ఏళ్ళలలిత సంగీత మధురమోహన రాజు ‘’నింగి లోని కలువ కోసం నింగికే ఎగసి పోయాడు ‘’ ఆ లోటు తీర్చలేనిది .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-3-18 –ఉయ్యూరు
—