ఎమర్జెన్సీ రోజులు మళ్లీ వస్తాయా ?
ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు కిచెన్ కేబినెట్ అన్ని వ్యవహారాలూ చూస్తూ ఇండియా ఏ ఇందిరా అని వందిమాగధ స్తోత్రాలు చేసి ఉబ్బేస్తే నిజమేననుకొని ఆవిడ పట్ట పగ్గాల్లేకుండా విజృంభించించిన కాలం లో మాజీ ప్రధాని చంద్రశేఖర్ మాజీ గవర్నర్ కృష్ణకాంత్ మొదలైన నలుగురైదుగురు ఇందిర ధోరణి నియంతృత్వానికి దారి తీస్తోందని ముందే హెచ్చరించి దేశానికి దిశా నిర్దేశం చేశారు . సరైన సమయం లో సరైన హిత బోధ చేశారు .అధికారమత్తు బాగా వంటబట్టిన ఆమె చివరికి ఎవరినీ లెక్క చేయకుండా ప్రజాస్వామ్యముసుగులో నియంతలా వ్యవహరించిన సంగతి మనకు తెలుసు .నాయకులు దారి తప్పుతుంటే వక్రమార్గాన ప్రయాణిస్తుంటే సక్రమ మార్గం చూపించటం విజ్ఞుల లక్షణం .నాయకత్వానికి భయపడి ,ప్రజాస్వామ్యాన్ని భగ్న పరుస్తుంటే ఉపేక్ష తగదు .అలా చేయలేకపోతే నాయకునితో సహా తామూమట్టి కొట్టుకు పోతారు .చివరికి ఇందిరా ఎమర్జెన్సీ పెట్టటం వాజ్ పేయ్ అద్వాని వంటి వారిని అరెస్ట్ చేయించటం ,దాని ఫలితంగా జనతాపార్టీ ఏర్పడటం ఇందిర పతనం మనకళ్లముందు జరిగిన సత్యాలే .
ఇవాళ దేశ పరిస్థితి చూస్తుంటే మళ్ళీ అవే రోజులు పునరావృత్తం కాబోతున్నాయా అని పిస్తోంది . ఎన్నికలలో గెలుపే ప్రధాన లక్షణం గా నాడు ఇందిర భావించినట్లే నేడు మోడీ కూడా భావిస్తున్నాడు .గెలుపు వినమ్రతకు సూచనకావాలి అహంభావానికి దారి కారాదు .ఈశాన్య ఎన్నికల గెలుపుతో గర్వం తో దేశానికి ప్రజాస్వామ్యబద్ధం గా ఎంతోకాలం సేవ చేసి పార్టీకి అపూర్వ వైభవం సంతరించి పెట్టి కష్టకాలం కాపుగా ఉన్న ,ప్రతిపక్షంకూడా చేతులెత్తి నమస్కరించే లాల్ కృష్ణ అద్వానీని నిండు సభలో అవమానపరచి,నమస్కరించినా ప్రతినమస్కారం చేయకుండా పట్టించుకోకుండా పోయిన మోడీ వైఖరి దేనికి నిదర్శనం ? సోమనాధ్ దేవాలయం లో చేసిన వాగ్దానం బుట్ట దాఖలు చేసినవాడికి పార్లమెంట్ లోనూ అన్ని సభల్లో ఆంధ్రాకు అన్ని రకాల సాయం చేస్తానని హామీలు గుప్పించి ఇప్పుడు నెత్తిన టోపీ పెట్టటం పెద్ద వింతకాదు . సహజ లక్షణం .. ఇంత జరుగుతున్నా మోడీ కి భయపడి పార్టీలోని పెద్దనాయకులు ఒక్కరూ మందలించకపోవటం విడ్డూరం గా ఉంది .ఆ నాటి చంద్ర శేఖర్ ,కృష్ణకాంత్ బృందం ధైర్యం చేసి ఇందిరా నియంతృత్వ పోకడలను హెచ్చరించారు దారి మార్చుకోమన్నారు .చివరికి పార్టీని వదిలి బయటికి వచ్చి ప్రజాస్వామ్య రక్షణలో భాగస్వామ్యులయ్యారు. .ఇప్పటికైనా బిజెపి నాయకులు పెదవి విప్పి నియంతృత్వాన్ని ఎదిరించి పార్టీకి, దేశానికి మేలు చేస్తే మంచిది లేకపోతే ఈ అధికారగర్వం తోబిజెపి కూడా మరో రూపం లో ఎమర్జెన్సీ ప్రకటిస్తుందేమోనని భయమేస్తోంది .ప్రజాస్వామ్య సంరక్షకులందరూ ఏకం కావాలసిన సమయం ఆసన్నమైనట్లే కనిపిస్తోంది . చేతులుకాలాకా ఆకులతో పనేమీ ఉండదు. తస్మాత్ జాగ్రత , జాగ్రత ..
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -19-3-18-ఉయ్యూరు