వరకవి యోగి కైవారం నారాయణ తాతగారికి ఘన ‘’వసంత ‘’కైవారం -1
తమిళనాడు హోసూరు లో ‘’కృష్ణరసం ‘’అంటే కృష్ణగిరి రచయితల సంఘం ,బస్తీ మే సవాల్ అన్నట్లుగా ‘’బస్తీ యువజన సంఘం తెలుగు భాషకు సంస్కృతికి ,మాండలికానికి ఇస్తున్న ప్రాచుర్యం అనన్య సామాన్య మైనది .ప్రతి ఉగాదికి కవితా సంకలనం, కతల సంకలనం వంటివి గత ఎనిమిదేళ్లుగా కొనసాగిస్తూ తెలుగు వారికి ఆదర్శప్రాయం అవుతున్నారు .అందులో చురుకైన పాత్ర పోషించే డా అగరం వసంత్ మార్గ దర్శకత్వం లో ఏటి కేడాది వారి సాహిత్య సేవ ఇనుమడిస్తూనే ఉంది .ఈ విలంబి ఉగాదికీ కొత్త పొత్తాలు వెలువరించారు .వాటిని నాకు పంపారు . అందులో శ్రీ వసంత్ రాసిన ‘’కైవారం నారాయణ తాత గారి రచనలు –చిరు పరిశీలన ‘’గొప్పగా ఉన్నది .రచయిత’’ చిరు ‘’అని అన్నా ‘’మేరు ‘’నగ గంభీరం గా ఉన్నది .అందరు తప్పక చదవాల్సిన పుస్తకం .తాత మామూలోడు కాదు క్రాంత దర్శి .ఆంధ్ర దేశం లో పుట్టినా ,తెలుగు వాళ్ళు ఎవరూ పట్టించుకోక పోయినా కస్తూరి వాసన దశ దిశలా వెదజల్లబడినట్లు కర్నాటక ,తమిళనాడు మొదలైన రాష్ట్రాలలో తాతగారి రచనలను తత్వాలను అనువదించుకుని పాడుకుంటూ భావ వ్యాప్తి చేస్తున్నారు .పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదన్న సామెత ఆంధ్రులకు బాగా వర్తిస్తుందని రుజువైంది ఈ విషయం లో .వసంత్ కు తాత గార౦టే ఆరాధ్య దేవతే . ఆయన ప్రభావం లో పెరిగిన జీవితం తనదిగా భావిస్తాడు . కనుక తాతగారి జీవితం ,రచనలను తలస్పర్శగా సమీక్షించాడు .అందులో ముఖ్యంగా తాతగారి జీవితం ,రచనలలో నేను ఒడిసిపట్టిన విషయాలను మీ ముందు ఉంచుతున్నాను .ఇది చదివే దాకా నాకూ తాత గారిపై పూర్తీ అవగాహన రాలేదు మనలో చాలామందికి తెలియక పోవనూ వచ్చు .అందుకని ఈ ప్రయత్నం చేస్తున్నాను .ఇది ఉభయులకు శ్రేయోదాయకం లోక కళ్యాణ కారకం కూడా .
కైవారం నారాయణ తాత గారు
మహా భారతం లో ఉన్న ‘’ఏక చక్ర పుర’’మే కైవార క్షేత్రం .భీముడు బకాసురుని చంపి శవాన్ని ఒక గుహలో పడేసి గుహ ద్వారాన్ని పెద్ద బండరాయి తో మూసేశాడు .ఆ గుండును ఇప్పటికీ ఇక్కడ ‘’బకుని గుండు ‘’గా జనం చెప్పు కుంటారు . తాతగారి రచనలో కూడా దీని ప్రస్తావన ఉన్నది .ఇప్పటి కర్నాటక రాష్ట్రము చిక్క బళ్ళాపురం జిల్లా చింతామణి తాలూకా కైవార క్షేత్రం ‘’కొత్తపల్లి ‘’అనే పల్లె టూరిలో క్రీ.శ.1726లో కొండప్ప ,ముద్దమ్మ దంపతులకు కైవారం నారాయణప్ప పేరుతొ తాత జన్మించాడు .చిన్నతనం లోనే తల్లీ తండ్రీ చనిపోవటం తో ఊరి వారి సంరక్షణలో పెరిగాడు తాత .కైవారం లోని ‘’అమర నారేయణస్వామి ‘’ని సేవిస్తూ ,భక్తి భావంతో పారవశ్య౦గా పాటలు పాడుతూ, భజనలు చేస్తూ ఊరి జనం చేత బాల ప్రహ్లాదునిగా గుర్తింపు పొందాడు .మేనత్త కూతురు ‘’మునెమ్మ’’ను పెళ్ళాడి పెద్దకొండప్ప ,చిన్న కొండప్ప కొడుకులకు ,ముద్దమ్మ కూతురికి తండ్రి అయ్యాడు .గాజుల వ్యాపారం చేసే నారాయణప్ప యాభై వ ఏట చిత్తూరు జిల్లా మొగిలి వెంకట గిరి కనుమల్లో వానప్రస్థాశ్రమం లో ఉన్న ‘’పర దేశి స్వామి ‘’దర్శన ప్రభావం తో సంసారం త్యజించి సన్యాసిగా మారి’’ నారాయణ తాత ‘’గా ప్రసిద్ధి చెందాడు .
చదువు పెద్దగా లేని తాత పామరులకు కూడా తేలికగా అర్ధమయ్యే రీతిలో వేదాంత సారాన్ని భక్తీ ,రక్తి విరక్తి తో రంగరించి త్రివేణీ సంగమం చేసి పవిత్రత కల్గించి ప్రచారం చేశాడు .తత్వాలు ,కీర్తనలు ,కాలజ్ఞానం ,అమర నారేయణ శతకం ,,బ్రహ్మా౦డపురి శతకం ,నాద బ్రహ్మానంద నారేయణ కవి శతకం ,శ్రీ కృష్ణ చరిత తత్వామృత యోగసారం ,తారక బ్రహ్మానంద ద్వయ కంద శతకం రచించి మహా కవులు, మహాయోగులు చేసినంత సాహిత్య సేవ చేసి ,దార్శనికత ప్రదర్శించాడు .సమాజం లోని జాతి,మత కుల విభేదాలను రూపుమాపటానికి సంఘ సంస్కరణకు కృషి చేశాడు .అయన తత్వాలు గీతాలు కోలారు జిల్లా జానపదులే కాక చిక్కబళ్ళాపురం ,బెంగుళూరు మైసూరు జిల్లాలలో తమిళనాడు హోసూరు ,డెంకణి,వేపనపల్లి ,ఆంధ్రాలో చిత్తూరు జిల్లాలో ప్రజల నోళ్ళలో నిత్యం నానుతూ రసాలూరిస్తాయి .లక్షలాది అభిమాన భక్త బృందమేర్పడింది తాతకు .
1836-37 సంవత్సరం జ్యేష్ట శుద్ధ తదియ రాత్రి 12 గంటలకు అంటే 110 ఏళ్ళ వయసులో తాను సమాధి చెందుతానని శిష్యులకు తాత ముందే తెలియ జేశాడు .అన్నట్లే అదే రోజు సమాధి గతుడై నాడు .ముఖ్య శిష్యుడు ముత్తప్ప స్వాములు తాతగారి సమాధి నిర్మించి ,నిత్య పూజాదికాలు నిర్వహిస్తూ తాత భావ వ్యాప్తికి కృషి చేశాడు ..తర్వాత లింగాచార్యులు ,ముని అవధూత ఆ బాధ్యతలు చేబట్టారు. తాళపత్రాలలో లిఖించబడిన తాత సాహిత్యాన్ని 19 12 లో సీతారామాచార్యులు మఠ నిర్వహణలో భాగంగా మొదటి సారిగా ముద్రించి లోకానికి అందుబాటు లోకి తెచ్చాడు .ఆ తర్వాత నారాయణ సింగ్ ,మేలూరు ముని శ్యామప్ప,చిక్కబళ్ళాపురం చిన్న నారాయణ స్వామి ,కట్టకింది జయరామి రెడ్డి మొదలైనవారు తాత సేవలో పునీతులయ్యారు .మాలూరు శ్రీ టి. సొణ్ణప్ప దాసు తాత జీవిత చరిత్రను హరికధా రూపంగా మార్చి గానం చేస్తూ తత్వ ప్రచారం చేశాడు .1978-79 లో బెంగుళూరుకు చెందిన మత్తికరయ సంపంగప్పకుమారుడు ఏం ఎస్ రామయ్య తాతగారి ఆశ్రమాన్ని సందర్శించి అనుభూతికి లోనై,స్వంత ఖర్చుతో ఆశ్రమ రూపు రేఖలే మార్చి కొత్త భవనాలు నిర్మించి కైవారం తాతకు కైమోడ్పు క్రియా రూపంగా అందశాడు .ఈయన పెద్దకొడుకు డా.ఏం ఆర్ జయరాం 1998 నుండి ఆశ్రమ ధర్మాదికారిగా వ్యవహరిస్తున్నాడు . ప్రతి ఆదివారం వచ్చి భక్త బృందం తో ఒక్కో గ్రామం లో కీర్తనలు పాడుతూ తాత తత్వాలను సజీవం చేస్తున్నాడు .హోసూరు లో తాతగారి ఆశ్రమ నిర్వాహకులు బ్రహ్మశ్రీ వెంకటేశ్వర స్వాములు తనజీవితాన్ని తాత గారి సేవకు అంకితమిచ్చి నిత్యభజన ,తత్వ ప్రచారం ఊరూరా నిర్వహిస్తున్నారు.
ఇలా కైవారంనారాయణ తాత గారు వెలిగించిన ఆధ్యాత్మిక జ్యోతి అమరదీపం లా విజ్ఞాన జ్యోతులను వెలయిస్తూ ఆస్తిక జనాలకు మార్గ దర్శకం గా ఉన్నది . ఈ ప్రభావం తోనే డా వసంత్ తాతగారి జీవితం రచనలు ఒక చోట చేర్చాలన్న సత్ సంకల్పం తో ఈ పొత్తం రాసి అందజేశాడు .తాతగారి జీవితం పై ఎన్నో వెలుగు రేకలు ప్రసారితమైనాయి. తాత జీవితం మనవళ్ళ ,ముని మనవళ్ళ,ఇని మనవళ్ళతరం దాకా ప్రసరించి శాశ్వతత్వాన్ని పొందింది .ఒక రకం గా ఈ పొత్తం కైవారం తాత గారికి డా .వసంత్ సమర్పించిన ఘన కైవారం అని పిస్తుంది .
ఇక తాత గారి రచనల గురించి తర్వాత భాగం లో తెలుసుకొందాం .
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -23-3-18-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్