వరకవి యోగి కైవారం నారాయణ తాతగారికి ఘన ‘’వసంత ‘’కైవారం -3(చివరి భాగం )
తాతగారి కాల జ్ఞానామృతం
కాలజ్ఞానం అంటే విదేశీయులలో నోస్ట్రా డామస్ ,స్వదేశీయులలో వీర బ్రహ్మేంద్రస్వామి ముందు గుర్తుకొస్తారు .కైవారం తాతగారు కూడా కాలజ్ఞానం 1813-14 కాలం లో రచించాడు .సూక్ష్మ భీమ ఖండ శతకం లో 28పద్యాలు ,ప్రచండ నారేయణ కవి పద్యాలుగా 16 పద్యాలలో కాలజ్ఞానం గురించి ఉన్నట్లు వసంత్ తెలిపాడు .తాతగారి కాలజ్ఞానం లో విశ్వం లోని వింతలూ , ప్రకృతి వైపరీత్యాలు ,అతి వృష్టి అనావృస్టి ,ఆంగ్లేయుల పాలన అంతరించటం ,వెట్టి చాకిరి నశించటం ,వడ్డీ వ్యాపారం గుత్తాధిపత్యం హెచ్చటం ,వెండి బంగారు నాణాలు డబ్బు రూపం లో ప్రభుత్వం ద్వారా ప్రజలకు చేరటం ,ప్రపంచమంతా ఒకే ఒకడి అధీనం లోకి రావటం వగైరాలున్నాయని వసంత్ విశ్లేషించి చెప్పాడు .ముందుగా తెల్లవారి పాలన అ౦త మౌతు౦దని వారిని వానరులతో పోల్చి చెప్పాడు తాత.-‘’వానరుల వసుధ పాలన తీరెను –పలాయనమై పోదురు ‘’అనీ ‘’పడి చత్తురు –పరంగి వారి పట్టణము పాడౌను ‘’అన్నాడు .పరంగిపండు అంటే బొప్పాయి పండు .తెలుపు ,ఎరుపు రంగులో ఉంటారుకనుక వాళ్లకు ఆ పేరోచ్చిందట .సమస్త ప్రకృతిని ‘’అరణ్య పురం ‘’అన్నాడు తాత .ప్రకృతికి విఘాతం కలిగించవద్దని ఆనాడే హెచ్చరించాడు –‘’అరణ్య పురము నిండా శక్తి పుట్టినది ‘’అన్నాడు అందుకనే ,తన హృదయ సత్యమే కాలజ్ఞానం అన్నాడు .వేశ్యావృత్తి, దళారి ప్రవృత్తి పెరుగుతాయని ,ఆడ మగ వస్త్రధారణ మానాన్ని కప్పుకునే విధంగా కాకుండా అమ్ముకునే విధంగా ఉంటాయని .పశువులు వాటిమేత స్త్రీలు వృక్షాలు భిక్షగాండ్లు వగైరాలపై గుత్తాధిపత్యం హెచ్చుతు౦దన్నాడు –‘’పశులమేత భూమి పచ్చి పచ్చిక గుత్త-చెడ్డ స్త్రీలకు గుత్తచెట్ల గుత్త-ఫలవ్రుక్షములు గుత్తపండ్లు కాయలు గుత్త-భిక్షగా౦డ్ల కు గుత్త,బీడు గుత్త –చాకి వాండ్లకు గుత్త సారాయి గుత్త –హరిదాసు గుత్త అడవి గుత్త ‘’అని అన్నిటినీ నిలువునా దోచుకొనే వారు పెరిగిపోతారని ముందే చెప్పాడు .ఇప్పుడు జరుగుతున్న తంతు అదేకదా .
నాద బ్రహ్మానంద నారేయణ కవి శతకం
‘’నాద బ్రహ్మానంద నారేయణకవి ‘’మకుటం గా సాగే ఈ శతకం లో పెద్దలను మెచ్చుకొని మాల,కవుల ,నోముల ,మతాల జాతుల పై తన అభిప్రాయాన్ని నిష్కర్షగా తాత వెలి బుచ్చాడు .ఇంటి ప్రణయం వంటికి మేలు అని నీతి చెబుతూ –‘’పంట చేను విధము పడతి ఇంటను ఉండ –వారకాంతల మీద వలపు యాల ?చేతికాసు పొవ్వు ,చెడు వ్యాధులు వచ్చురా ‘’అని బయటి సుఖం మరిగితే ఇల్లూ ఒళ్ళూ గుల్ల అవుతాయని,సుఖం ఏమోకాని సుఖ వ్యాధులు పెరుగుతాయని హెచ్చరిక .’’ప్రాణ లింగము తనలో ప్రత్యక్షమై వుండ-చరలింగ పూజలు చేయనేల ?’’అనీ ‘’ఓంకార ప్రణవంబు వైభవం బెరుగక – వాదించు వాడు వైరాగ్యుడౌనే’’ ?అని ప్రశ్నించి ,’’బ్రహ్మ ఎరుగని బ్రాహ్మడే శూద్రుడు?’’అని ఉపనిషద్రహస్యాన్ని వివరించి,’’రేచక ,పూరక ,కు౦బక –సాహస పరుడైన వాని సహావాసమున-కనవలె కాయము మర్మము ‘’అంటూ యోగ రహస్య వివరణ చేశాడు .మొత్తం 100పద్యాలను ఈ పుస్తకం లో చేర్చి వసంత్ మంచిపని చేశాడు. తాతగారి జ్ఞాన మూలధనం అందుకోవటానికి అనువైన తీరిది .
అమర నారేయణ శతకం
లో 110 సీసపద్యాలున్నాయి.సీసాలో సెంటు వాసన గుప్పు మాననట్లు ప్రతి సీసం లొనూ విజ్ఞాన పరిమళం వెదజల్లెట్లుగా ఉన్నాయి .మచ్చుకి –‘’మతములన్ని యు వేరే –మార్గంబు ఒక్కటే –వర్ణ భేదములు వేరే –వస్త్ర మొకటే-శృంగారములు వేరే –బంగారమొక్కటే ,పసుల వన్నెలు వేరే పాలు ఒకటే –జీవ బొందులు వేరే –జీవుండు ఒక్కడే –జాతి రీతులు వేరే –జన్మమొకటే –దర్శనంబులు వేరే –దైవంబు ఒకడే-పుష్పజాతులు వేరే –పూజ వఘటే-‘’ఈవిషయాలు తెలియక మనుషులు భ్రాంతి విడువకుండ భవ రోగబద్ధులైనారు అని బాధ పడ్డాడు తాత .
శివ భక్తులు శివుని పూజిస్తారేకాని శివుడున్న చోటు తెలుసుకోరు ,అల్లాను ఆత్మలో చూడని ముస్లిం లకు ముక్తి ఎలాకలుగుతుంది ?నిష్టలు పాటించే వైష్ణవులు తత్త్వం తెలుసుకోకపోతే ప్రయోజనం ఏమిటి ?అని ప్రశ్నించాడు .ఆవులకు పచ్చిగడ్డి మీద ,పిల్లికి మాంసం మీద ,పక్షులకు పండ్లమీద ,అడవి జంతువులకు చీకటి మీద ,జలజీవులకు నీటిపైనా ,తుమ్మెదకు పుష్పపరిమళంపైనా ,గ్రామ దేవతలకు జంతు బలిమీద ,ఆశ ఉంటె అల్పులైన నరులకు అన్నిటి పైనా ఆశ ఎక్కువ అని చురకలేశాడు .
శ్రీ కృష్ణ తత్వామృత యోగ సారం
లో బాలకృష్ణుని చిలిపి చేష్టలు తోపాటు శ్రీ కృష్ణ తత్వాన్ని సుబోధకంగా బోధించాడు నారాయణ తాత .చిలిపి కన్నయ్య లీలల్ని తప్పుగా అర్ధం చేసుకున్న భర్త భార్యను శంకిస్తూ తమ జాతి వారిని పేరు పెట్టి పిలిచే విధానం లో హాస్యం తొణికిసలాడుతుంది.
తలకాయ కొండ ద్విపద
లో కృష్ణ దేవరాయల ప్రస్తావన ఉన్నది .రాయల ఆస్థానం లో వీర రాఘవ భట్టు అనే పురోహితుడు శ్రీరంగ నాధుని సేవించాలని యాత్ర చేస్తూ ,కోలారు దగ్గరున్న తలకాయ కొండకు వచ్చి అక్కడ ఒక ఆవు పొదుగు పాలను దాని దూడతోపాటు పులి పిల్ల కూడా తాగుతూ ఉండటం చూసి ఆశ్చర్యపోయి ,తిరిగి వెళ్లి అప్పాజీకి తిమ్మరాజుకు తెలియ జేశాడు .అప్పాజీ ఇది విష్ణు మహిమ అని చెప్పి ,రాయలకు నివేదించాడు .రాయలు భార్యలతో ససైన్యంగా ఆ ప్రదేశానికి వచ్చి అడవి మధ్యలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవించి గుడి చుట్టూఉన్న పొదలను తొలగించి తన సేనాధిపతి చంద్ర శేఖర శెట్టి ద్వారా అక్కడి రాళ్ళపై చక్ర ముద్ర వేయించి ,సాతాని వైష్ణవుడైన తిరు వెంగళప్పయ్యను అర్చకునిగా నియమించాడట .ఈ వృత్తాంతాన్ని తాత ద్విపదలో చక్కగా వివరించాడు –‘’ఆ వేళ రాయలు అతి భక్తీ తోను –అర్చకుడు తిరుగ వెంగళప్పయ్య చేత –హరిపూజ గావించె ఆన౦దముగను’’.ఈ విధంగా చారిత్రిక ఇతి వృత్తాన్ని ద్విపదలలో భద్రపరచి గాన యోగ్యం చేశాడు నారాయణ తాత .
బ్రహ్మాండ పురి శతకం
లో మొగుడిని అర్ధం చేసుకోలేని స్త్రీ ఎలాఉంటుందో చెప్పి ,యోగి సుజ్ఞాని ,జ్ఞానం ,ప్రేమ ,ఆత్మ జ్యోతి మొదలైన విషయాలపై పద్యాలు చెప్పాడు కైవారం తాత .ఇదంతా సమాజ సంస్కరణాభి లాషతో చెప్పినదే
మచ్చుకి ఒకటి –‘’అక్షరము లన్నీ నాల్గేసిగా భాగించి అందులోన నిలువు తీసి –తీసిన నిలువులో ఐదేసిగా భాగించి లబ్ధభాగ మేర్పరచి -లబ్ధమున ఉన్నట్టి నాల్గక్షరములకు నామ మొక్కటి దాని లగువు తెలిసి –ఏకాక్షరంబని ఎరిగిన నెర యోద ఎరుక మానసుడతడు యోగ శాలి .
మర్మ మిడవక పరులను మాటలాడు ముగ్ధు డని పించుకొని తాను మురియు చుండు.
భక్త మందార బ్రహ్మాండ పుర విహార జయతు జగదీశ అమర నారేయణేశ ‘’
ఈ చివరి పద్యం బ్రహ్మ భేద్యంగా ఉందని వసంత్ భావించి ఎవరైనా విడమర్చి అర్ధం చెబితే చాలా సంతోషిస్తానని చెప్పాడు. నాదీ అదే కోరిక. కనుక ‘’బాలు మీ కోర్టులో’’ ఉందని మనవి .అయినా వసంత్ ‘’చూచాయగా దీనికి’’ ఓం’’ అని అర్ధం వస్తుంది ‘’అని క్లూ కూడా ఇచ్చాడు .
తారక బ్రహ్మానంద ద్వయ కంద శతకం
230పద్యాలున్న ఈ శతకం సమాజం లోని దూర్తజనాలపై పద్యాలతో ఎక్కు పెట్టి విడిచిన బాణాలే.
‘’కొట్టకుమీ పసిబాలల –కొట్టకుమీ స్త్రీల అశ్వ పులి వర్గంబుల్ –కొట్టకుమీ దీనాత్ముల-కొట్టకు మీ సన్యాసి ,కవుల నారేయణ కవీ ‘’అని సకల జీవులపైనా తనకున్న ప్రేమభావాన్ని,జాలినీ అనుకంప నూ తెలియ జేశాడు .వంకాయ తోటలో టెంకాయలు వెదకటం వేస్ట్అని –‘’తలకిందైతపసు చేసిన –తలనిండా జలడు పెంచి గడ్డము మీసం-దీక్షాక్రమమున వుండిన –మోక్షము తనకెట్ల వచ్చు మనసు చపలునకు ‘’అని ముగించాడు తాత .
ఆత్మ బోదామృత వచనములు
కైవారం తాత తన ప్రియ శిష్యుడు ముత్తప్ప స్వామికి బోధించిన సత్యాలే ఇవి .ఇందులో ఒకటి రెండు –1-‘’అష్టాంగ యోగ ముద్రలను సమాధిలో వెలసి ,ప్రకాశ స్వరూపముగా ఉండే ఆత్మను ,ఓంకార శబ్ద మూలకముగా తేలిస్తే తక్షణం మోక్షం పొందటానికి అనుమానం లేదు .2-జాగ్రత్ ,స్వప్న ,సుషుప్తులలో నిశ్చల ధ్యానం చేస్తే ,అజ్ఞానం అనే మలాన్ని కడిగి ,ముక్తుడు అవటానికి ఏ సందేహమూ లేదు .గురు ధ్యానం చేసే వారి కర్మలు నాశనమై ఆనందం పొందుతారు .వంటి సుబోధక వాక్యాలతో తత్వాన్ని కరతలామలకం చేశాడు తాత .
తాత తాను ఎంతటి జ్ఞాని సుజ్ఞాని కాలజ్ఞాని క్రాంత దర్శీ అయినా పూర్వపు కవులను యోగులను స్మరించి కృతజ్ఞత చూపటం సంస్కారానికి గొప్ప నిదర్శనం ,మనకు ఆదర్శం .-మచ్చుకి –‘’వాల్మీకి నారద శుక వ్యాస భట్టరు –వేమ యోగుల వారు ఎరుక పరులు ‘’.’’కనకదాస ,పురందర దాసులను కన్నడం లో ప్రస్తుతించాడు .’’శ్రీ గణేశ శ్రీశారద కాళిదాసాది కవులనెల్లా –భావమున బ్రస్తుతి౦తునురా ‘’అని ‘’రామానుజా చార్యుల ను కీర్తిస్తూ ‘’తిరుమంత్రము జీవనము పావనము –రామానుజ గురుడిచ్చు మోక్షము ‘’అన్నాడు .శ్రీనాధ మహాకవిని ప్రస్తుతిస్తూ ‘’శ్రీనాధ సకల శాస్త్రముల౦దు ప్రఖ్యాతా –తెలిసి తెలియక మూల మర్మము –తెరవు మరుపుల చేత ఉంటివి ‘’అనీ భక్త పోతన్న ను ‘’కవినాయకుల కెల్ల కల్ప వ్రుక్షంబైన –బమ్మెర పోతయ్య భక్త వరుని ‘’అని మెచ్చాడు నాకు తెలిసినంతవరకూ పోతనను ‘కవి కల్ప వృక్షం ‘’అని కీర్తి౦చినవాడు కైవారం తాతయ్య ఒక్కడే అని పించింది .
కైవారం తాతగారి సాహిత్యాన్ని కన్నడీకరించి 10 భాగాలుగా తెచ్చి ప్రాచుర్యం తెచ్చారు .తాత గారి కీర్తనలను బాలమురళి ,నేదునూరి ,స్వరపరచి పాడి సిడిలుగా ,కేసేట్టులుగా కైవారం మఠం లో అందుబాటులో ఉంచారు కావలసిన వారు మఠం వారిని సంప్రదించి పొందవచ్చు .బెంగుళూర్ నుండి వెలువడే కన్నడ మాసపత్రిక ‘’మల్లార ‘’ తాతయ్య కీర్తనలను ధారావాహికంగా ప్రచురిస్తోంది .కైవారం తాత జీవిత చరిత్రను బ్లాక్ అండ్ వైట్ లోను కలర్ లోనూ కన్నడం లో సినిమాలుగా తీశారు .అచ్చ తెలుగువారైన ఆంధ్రా, తెలంగాణా వారికి ఇంతవరకు అ ఆలోచన రాక పోవటం సిగ్గు చేటు తల వంచు కోవాల్సిన పరిస్థితి అని సవివరంగా డా అగరం వసంత్ తెలియ జేశాడు .ఒక గొప్ప పురుషుని కాలాతీత వ్యక్తినీ మనకు ‘’కైవారం నారాయణ తాత గారి రచనలు –చిరు పరిశీలన ‘’ద్వారా పరిచయం చేసిన వసంత్ ధన్యుడై ,మనల్నీ ధన్యులను చేసినందుకు ,అతనికి ఏమిచ్చినా ఋణం తీరదు .అందుకని కృతజ్ఞత చెప్పి తప్పించుకొంటున్నాను .అతని చిరు పరిచయం నాతో ఇంత పెద్ద వ్యాసం రాయించింది .తెలియని విషయాలెన్నో నాకు తెలిసి, ఆ ఆనందంతో మీకూ తెలియ జేశాను.శ్రమ వసంత్ ది.ఫలితం మనందరిది .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-3-18-కాంప్-మల్లాపూర్-హైదరాబాద్
—