విలంబికి వికసించిన కవితల అనప పువ్వులు
ఈ సారి విలంబి ఉగాదికి హోసూరు తెలుగు వారు 53 కవితల ‘’అనపపువ్వులు ‘’పూయించారు .అనుములు ఒకరకమైన ధాన్యం అని అనుకొంటాను .వాటిపూలు తెల్లగా స్వచ్చంగా మన చిక్కుడు పూలలాగా ఉంటాయని పిస్తోంది .రాయలసీమలో అనపకాయల వాడకం ఎక్కువ అని తోస్తోంది .కనుక అర్ధవంతమైన నామ ధేయం ఈ కవితా సంకలనానికి డా వసంత్ మాటలలో ఈ ’’ కూర్పుకు’’పెట్టారు .వివిధ ప్రాంతాలనుండి వేర్వేరు కవులనుండి సేకరించిన కవితల సమాహారం ఇది .ఇందులో ఉగాది ,తెలుగు ,పంటలు, సేద్యం ,సినారె లపై కవితలున్నాయి .అన్ని రకాల కవితలతో చక్కని చిక్కుడు పూలు కాయలవంటి అనపపువ్వులు కాయల ముఖ చిత్రం తో మిలమిల లాడింది పుస్తకం .ముచ్చటైన ముద్రణ మరింత వన్నె తెచ్చింది .విషయాలు సమస్యలూ మారనివి తీరనివి కనుక కవితలలో కొంత పాత వాసన ఉండటం సహజం .అన్నీ మంచికవితలే అయినా మెరుపులా మెరిసి నా మనసుకు నచ్చిన కొన్ని పంక్తులను ఉదహరిస్తాను .
జానపద కవి గోరేటి వెంకన్న ‘’రావే మా చైత్రమా ‘’కవిత మకుటాయమానం అని చెప్పక తప్పదు.ఆ సౌరభం ఆఘ్రాణి౦చండి -‘’మావిళ్ళు సిగురేసి మారాకు తొడిగె-మంచు తెమ్మెర కరిగి శిశిర వెనుకకు జరిగె-కాడకు మూడేసి కాయ పిందెలు గాయ –తనువొంచి పాలిచ్చ తల్లులా చందం –కొమ్మ లన్నీ వంగి అమ్మ ప్రేమను చాటె-రావే మా చైత్రమా అలరించే పద చిత్రమా ‘’చాలు వెంకన్న భావుకత కు పదాల కూర్పుకు జేజేలు పలకటానికి . .మోదుగు పూల గురించి చెబుతూ –‘’మన్మధుని విరిశరం గురి తప్పి మోదుగుల-తనువెల్ల నాటుకుని తాపమయి విరిసెనో -అణువణువువల కెంపు లలరించి గుబురుల ‘’అని అగ్గిపూల సౌరు పరమ రామణీయకంగా చెప్పాడు .వ్యవసాయ పనుల ఆరంభం ‘’యాగిడి’’గురించి వర్ణిస్తూ –‘’రాగి చెంబుకు మామిడాకు పట్టిని గట్టి –కోవెల కోనేటి పుణ్య తీర్ధము నింపి –ముంగిట ఎద్దులకు మువ్వ జతలమరించి –పొడువై కాడకు పొదిగిన గొడ్డలితో –‘’యాగిడెల్లె’’అన్న దాతను దీవింప ‘’అని చైత్రానికి పొలం పనులకు స్వాగతం పలికి సంప్రదాయ వైభవాన్ని కనుల ముందు నిలిపాడు .
‘’రాణి ‘’కవి ‘’కాలం దొంగ లంజ –దాన్నేవడూ అర్ధం చేసుకోలేడు’’అని నిట్టూర్చాడు .’’నేను మునిగినా నిన్ను ఒడ్డుకు చేరుస్తాను ‘’అని భరోసా ఇచ్చాడు ఆశారాజు –‘’కవికి ఆ తృప్తి చాలు ‘’అంటాడు.లోకం పోకడ చెబుతూ దేవీప్రియ –‘’నువ్వు వాడి సేవలో అస్తమించు –వాడు నీ సమాధి మీద ఉదయిస్తాడు ‘’అన్నాడు .భావుక కవి శివారెడ్డి –పూరింటి పంచలో పిచ్చుకలకోసం వరికంకుల గుత్తులు వేలాడదీసినట్లు జనం ‘’లోకం గుమ్మం ముందు తమను తాము వేలాడ దీసుకున్నా’’రనినిస్టుర సత్యం చెప్పాడు .చీకటి వెళ్ళిపోతూ సూర్యునిపై అరిచే అరుపులే కాకుల రొద’’ వస్తున్న సూర్యుడు క్షణ క్షణం మారుతూ లోకాన్నీ మారుస్తాడు ‘’అన్న కాల సత్యం ఆవిష్కరించాడు గోపి.
‘’రూపు నల్లనే కాని మనసు పుచ్చపువ్వు తెల్లన ,బూరుగదూది మెత్తన ,చలిగంజే చల్లన ‘’అని బాప్పను వర్ణించాడు శిఖామణి .’’పాలమూరు పిల్లలమర్రిమానులా విస్తరించినా –మా బాప్ప ఎప్పుడూ పరిగె పరక ‘’లాగానే ఉండిపోయిందని బాధ పడ్డాడు .’’భూమికీ ఆకాశానికీ ,మట్టికీ మమకారానికీ –అనాది వారసులు –లోకం మెచ్చే పువ్వులు ‘’గా కనిపించారు పిల్లలు పలమనేరు బాలాజీకి .ఇంకో అడుగు ము౦దుకెళ్ళిన దేశరాజు –‘’పిల్లలే ప్రకృతి ,ప్రకృతే పిల్లలు –మనమే చేజేతులా వారిని మనుషుల్ని చేస్తాం ‘’అని మన వికృత చేస్ట ను బయట పెట్టాడు .కల్తీ విత్తనం కల్తీ ఎరువులు మందులతో తో మిరపపంట పండించి ఆరుగాలాలు కస్టిస్తే’’మా బతుకులు తాలుగాయ బతుకులై పోయే –ఈళ్ళ కొంపల్లో మిరపగాయలేసి తగలబెట్టా ‘’అని కసిగా తిట్టాడు బండ్ల మాధవరావు .’’నవ్వును పెదాలపైకి ఆహ్వానించకపోతే ‘’ఖచ్చితంగా మరణి౦చి నట్లే అన్నాడు కుమారస్వామి రెడ్డి .’’హక్కులు అనేవి ఎవడూ ఇయడు-నువ్వే అవి గుంజుకోవాలి ‘’అని సమకాలీన చాణక్య నీతి చెప్పింది వేముల శ్రీదేవి .’’పట్టిపంట పరాయై పొతే –వరిపంట వాచి ‘’వరి బీజం ‘’అయింది అని చమత్కరించాడు విస్తావి .వడలి రాధాకృష్ణ ‘’భానోదయం ‘’కోసం ఎదురు చూశాడు .అది భానూదయం ఏమో !’’బాకీ ‘’తుపాకీ మాటగా ‘’మనుషుల్ని ఒకటి చేయటానికి మతం పుడితే –ఆ బతుకు నేర్చి మాన్యుడయ్యాడు –అలాంటప్పుడు ‘’మనుషుల విడదీయ మత మెట్లౌను’’అని ప్రశ్నించాడు .సినారె కు ఘన నివాళి ఇస్తూ –‘’నీవొక స్పూర్తి స్పోరక అమర కావ్యం –‘’అన్నాడు కలువకుంట నారాయణ .చివరి కవితగా కూర్పుకర్త పల్లవి ‘’ పాడుతూ –‘’అమ్మానాన్నా గురువు దైవం –ప్రేమకు ప్రతి రూపం –మన జంటకు దారి దీపం –జగతిని నడిపించే ప్రగతే మనప్రేమ –పోరును జయించే పల్లవి తానమ్మా’’అని హక్కులకోసం భాష వ్యాప్తికోసం సంస్కృతి ప్రదీపనకోసం అహరహం అనేక పోరాటాలు చేసిన డా అగరం వసంత్ .ఇంతమందికవులను సంప్రదించి వారిని కవితలు రాయమని కోరి అనుకున్న సమయం లో సేకరించి చక్కగా కూర్చటం లోమనో ధర్మమెరిగిన డాక్టర్ గా వసంత్ ప్రతిభ ద్యోతకమౌతోంది .మిక్కిలి అభినందనీయుడు డా వసంత్
పుస్తకం ముఖ చిత్రాన్ని జత చేశాను చూడండి
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-3-18 –కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్