కవిసామ్రాట్ విశ్వనాధ రాసిన రచనలలో ”మా స్వామి ” ”నా రాముడు ”ప్రత్యేకమైనవి కారణం వేటిలో విశ్వనాధ మహా భక్తుడుగా కనిపించటమే భక్తీ హృదయానికి సంబంధించింది అయితే జ్ఞానం బుద్ధికి చెందినది భక్తికి విశ్వాసమే ముఖ్యం జ్ఞానానికితత్వ చింతన ముఖ్యం జ్ఞానులకు దైవం .రూపం లేని ఒక శక్తిగా కనిపిస్తాడు ఈ రెండుమర్గాలలోనూ మహా నిష్ణాతుడు విశ్వనాధ ,తాత్విక చింతనతో పాటు భక్త్యావేశామూ ఆయనలో సమపాళ్ళలో ఉన్నాయి మాస్వామిలో ఆయన భక్తీ . నా రాముడులో ఆయన తాత్విక చింతన కనిపిస్తాయి శివుడిని భక్తికీ .,తాత్విక చింతనకు రాముడిని ఆయన ఎంచుకున్నాడు అంటే ఆత్మలో శివ కేశవులనిద్దర్నీ ప్రతిష్టించు కుని హరిహరాద్వైతం లో పయనించారు .. ఈ రామ కావ్యం రచించి శివునికి అంకితమిచ్చిన మహానుభావుడు ఆయన. ప్రస్తుతం . ”నా రాముడు ”గురించి ఆలోచిద్దాం .
“నా రాముడు” ”మాస్వామికి ” పూర్తి వ్యత్యస్తంగా ఉంటుంది. ఇందులో భక్తి లేదా అంటే ఉంది. కానీ తాత్త్విక చింతనదే పై చేయి. ఎంతటి భక్తుడైనా, విశ్వనాథ అద్వైతాన్ని సంపూర్ణంగా నమ్మినవారు. అందుకే రామాయణ కల్పవృక్షాన్ని అద్వైత సిద్ధాంత పరంగా నిర్మించారు. కల్పవృక్షం రస ఫలాలతో, అలంకార సుమాలతో, నానా కల్పనలు శాఖోపశాఖలుగా విస్తరిల్లిన వృక్షమైతే, “నా రాముడు” దానికి ప్రాణభూతమైన మూలకందం. కల్పవృక్షం ఏ తాత్త్విక చింతన ఆధారంగా నిర్మించబడిందో దాని సారమంతా “నా రాముడు”లో ఉంది. ఇందులో కవిత్వం లేదు. ఉన్నదల్లా శుద్ధ వేదాంతం. సంస్కృతంలో ఉన్న శంకరుల అద్వైతాన్ని తెలుగువాళ్ళు అర్థం చేసుకోడానికి పద్యాలుగా వ్రాసి దానికి మళ్ళీ తన వ్యాఖ్యానాన్ని జోడించి మనకి “నా రాముడు”గా అందించారు విశ్వనాథ. బహుశా యిదే విశ్వనాథవారి చివరి రచన అయ్యుండవచ్చు. ఇది విశ్వనాథ పరమపదించిన తర్వాత ముద్రితమైంది.
ఇందులో రాముడు మనకి పది రకాలుగా కనిపిస్తాడు. ఆనందమయుడు, ఆనందమూర్తి, అవతారమూర్తి, బాలరాముడు, కోదండరాముడు, అయోధ్యరాముడు, దశరథరాముడు, జానకీరాముడు, రఘురాముడు, ఆత్మారాముడు.
శుద్ధ బ్రహ్మ స్వరూపుడైన రాముడు ఆనందమయుడు, విష్ణువుగా ఆనందమూర్తి అయి, అవతారమూర్తిగా భౌతిక జగత్తులో జన్మనెత్తి, బాలరామునిగా తాటకవధా అహల్యాశాప విమోచనమూ చేసి, శివధనుస్సు విఱిచి విష్ణుధనుస్సుని చేపట్టి కోదండరాముడై సీతని వివాహమాడి, అయోధ్యారామునిగా అయోధ్యప్రజలందరికీ ప్రీతిపాత్రుడై, తండ్రి ఆజ్ఞని శిరసావహించి దశరథరాముడై అడవులకేగి, జానకీదేవి పంపగా బంగారు లేడి వెంటబడి అటుపైన ఆమె కోసం లంకదాకా పోయి రావణ సంహారం చేసిన జానకీరాముడై, చివరకు తన వంశ గౌరవం ఇనుమడించేలా రాజ్యం చేసి రఘురాముడయిన విధానమంతా ఇందులో చిత్రించబడింది. చివరకి విశ్వనాథ ఆత్మలో ఆత్మారాముడుగా నిలిచిపోయాడా రాముడు.
ఆ యానందమయుండె బ్రహ్మయని యభ్యాసంబుచే నిశ్చితం
బై యేర్పాటుగ వేదపంక్తులను భాష్య ప్రోక్తమై యొప్పగా
నా యానందమయుండు రాముడని వ్యాఖ్యానించె వాల్మీకి నాన్
ఆ యానందములన్ రఘూత్తముడు మూడై యొక్కడైనట్లుగా
శుద్ధ బ్రహ్మము నిర్గుణమై ఆలోచనకి అందని ఒక భావన (concept). అలాంటి బ్రహ్మాన్ని సచ్చిదానందమనే త్రిగుణాల ద్వారా అర్థం చేసుకొనే ప్రయత్నం వేదాలలో జరిగింది. ఇందులో ఆనందం మనిషి అనుభూతికి అందేది. అయితే ఇది మామూలు లౌకికమైన ఆనందం కాదు. బ్రహ్మానందానికి అతి దగ్గరగా వచ్చేది రసానందం. ఇది కవిత్వం వల్ల సిద్ధిస్తుంది. తొలి కావ్యానికి నాయకుడు రాముడు. అతనిలో యీ రసానందం నిండి ఉంది. అందుకే రాముడు ఆనందమయుడు. అందువల్ల తరచి చూస్తే – బ్రహ్మ, ఆనందము, రాముడూ ముగ్గురూ ఒకటే.
ఇదీ విశ్వనాథ వారి చింతన. ఆ ఆనందమయుడిని ఆత్మలో నింపుకొనే ప్రయత్నమే కల్పవృక్ష రచన. రాముని అవతారంలోని ప్రతి అంశలోనూ, ప్రతి చేష్టలోనూ, ప్రతి రూపంలోనూ ఆ పరబ్రహ్మ తత్త్వాన్ని దర్శించారు విశ్వనాథ. అలా దర్శించి దర్శించి, అనుభవించి అనుభవించి చివరకి తనలో ఆత్మారామునిగా నిలుపుకున్నారు.
కల్పవృక్షం చివరలో అరణ్యవాసం పూర్తిచేసి రాముడు తిరిగివస్తున్నాడన్న వార్త హనుమంతుడు భరతునికి వినిపిస్తాడు. అగ్నిప్రవేశం చెయ్యబోతున్న భరతునికి వార్త విన్న ఆనందంలో గొంతులోంచి ఒక వింత ధ్వని వెలువడిందిట! అది ఎలా ఉందో విశ్వనాథ ఊహకి అందలేదు. పద్యంలో నాల్గవ పాదం ఆగిపోయింది. చాలా గంటలు నిద్రాహారాలు మానేసి ఆలోచించారట. చివరకి ఆ రాముడే తనకి చెప్పినట్టుగా అది స్ఫురించిందట. “జైత్ర యాత్రాంచచ్ఛ్రీ మధుసూదనాస్య పవమానా పూర్ణమైనట్టులన్”. ఆ ముందుపాదంలోనే భరతునిది “కంబుకంఠం” అని వర్ణించారు. ఆ పోలికని యిది సంపూర్ణం చేస్తోంది! జైత్రయాత్ర చేస్తూ విష్ణుమూర్తి పూరించిన గాలితో నిండిన శంఖంనుంచి వచ్చిన ధ్వనిలా ఉందట ఆ నాదం. భరతుడు శంఖావతారం కదా మరి! పైగా వాయుపుత్రుడైన హనుమంతుని ద్వారా రాముడు పంపిన వార్త దీనికి కారణం. ఇలాంటి పోలిక ఇంత సంపూర్ణంగా కుదరడం అనేది ఆ రాముడు స్వయంగా చెప్పడం వల్లనే సాధ్యమని విశ్వనాథ ప్రగాఢ నమ్మకం. అప్పుడు మరి విశ్వనాథ అహంకార మేమయినట్లు?!
అంతా వివరించి చివరకి అంటారూ,
ఇది యాత్మారాముని దౌ
సదమల రూపంబు సర్వ సంపత్కంబై
మది నమ్ముము కడు మంచిది
మది నమ్మకు మంతకంటె మంచిది పోనీ!
తన ఆత్మలో తను నమ్మిన రాముడు కొలువై ఉండగా ఇక మనం నమ్మితే ఎంత నమ్మకపోతే ఎంత! నమ్మితే మంచిదే. నమ్మకపోతే పోనీ, మరీ మంచిది!
రచన -శ్రీ భైరవభట్ల కామేశ్వరరావు
రేపు శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక కానుక