కర్ణకఠోర భీభత్స ‘’రంగస్థలం ‘’
(‘’సౌండ్ ఇంజనీర్లు ‘’అవ్వాలనుకున్నవారు చూడచ్చు )
మేరేజ్ డే ,పుట్టిన రోజున కోరి తెచ్చుకున్న తలకాయ నెప్పి
‘’వద్దురా బాబూ నేను ఆ సినిమా చూడలేను .ఇంతవరకు ఆ హీరో సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా చూసిన పాపానికి నోచుకోని వాడిని నన్ను బలవంత పెట్టొద్దు బాబో ‘’అని మొత్తుకున్నా నిన్న మా అబ్బాయి చి .శాస్త్రి ,కోడలుశ్రీమతి సమత ల వివాహ వార్షిక మహోత్సవం ,మామనవడు చి భువన్ పుట్టిన రోజు నాడు .అయినా వినకుండా మా వాడు ‘’బ్రహ్మాండం, బాక్సులు బద్దలు ,చూడకపోతే పాపం ‘’అంటూ ఆ సినిమా రిలీజ్ అయిన దగ్గర్నుంచి ఊదర పెడుతున్నాడు .నాకు అసలు నమ్మకం లేదు .నిన్న వాడి బామ్మర్ది రమేష్ కొడుకు ఉపనయనం .అందరం ఆ హడావిడిలో ఉన్నా,అంతకు రెండు రోజుల ముందు 2 వతేదీ సోమవారం మా మనవడు చి శ్రీకేత్ యశస్వి ఉపనయనం మా అమ్మాయి వాళ్ళు దీనికోసం అమెరికానుంచి రావటం ఆ హడావిడి లో అందరం ఫుల్ బిజీ . నిద్ర ఎవరికీ లేదు . రాత్రికి సినిమా మోజు తీర్చుకోవటానికి మావాడు 9 మందికి నిన్నరాత్రి 9 గంటలాటకు కుషాయి గూడా హాల్ లో టికెట్లు ముందే బుక్ చేయించాడు .మల్లాపూర్ నుంచి దీనికి రవాణాకు రెండు’’ కాబుల చమురు’’ వదిలించుకుని రాత్రి 8-30 కి బయల్దేరుతూ ఆపసోపాలు పడి సినిమా హాల్ కు చేరుకున్నాం .మా శ్రీమతి ఎలాగూ రోజూ రాత్రిళ్ళు నిద్ర పట్టటం లేదుకదా అని తానూ రోజూ ఏదీ సయించక ఇంత చప్పిడికూడు మజ్జిగన్నం తో సరి పుచ్చుకుంటున్నా తానూ మాతో తయారైంది హాల్ లోనైనా హాయిగా నిద్రపడుతుందన్న గంపెడాశతో .మేమిద్దరం ,మా అబ్బాయి కోడలు కొడుకు ,మా అమ్మాయి చి సౌ విజ్జి ,కొడుకులు చి శ్రీకేత్ ,ఆశుతోష్ ,పీయూష్ ఇదీ మా ‘’రంగ బృందం’’ . మా అల్లుడు రాను అని ముందే జాగ్రత్త పడ్డాడు .మేమిద్దరం అమెరికాలో షార్లెట్ లో ‘దువ్వాడ జగన్నాధం ‘’సినిమా తర్వాత సుమారు 8 నెలలకు మళ్ళీ ఈ సినిమా చూస్తున్నాం .కొంత ఆటవిడుపుగా ఉంటుందని ఆశ -నీరసం అలసట మధ్య మమ్మల్ని హాలుకు లాక్కెళ్ళింది . సినిమా టైటిల్సే మసక మసక గా కనిపించాయి .కారణం వెదికితే ఈ సినీ నేపధ్యం 1985ట .అంటే కేవలం 33 ఏళ్ళ క్రితం .అంతమాత్రాన ఆకలర్ వాడాల్సిన పనే లేదు అని పించింది .
మెగా తారాగణం , వారి సుపుత్రుల సినిమాలలో కధ కోసం వెదకటం ఎందుకు ?పాపం జగపతి బాబు ‘’బందరు అంబర్ బీడీ ‘’నోట్లో పెట్టుకుని లుంగీతో కూర్చోటం తప్ప ఏమీ లేదు .మరో గొప్ప విషయం అండోయ్ –ఆయన గత 30 ఏళ్ళుగా రంగ స్థల గ్రామ అనప్పోజేడ్ ప్రెసిడెంట్ .బాంక్ కు కూడాఆయనే .అందుకని అందరూ ఆయన్ను ‘’ప్రెసిడెంట్ గారు ‘’అని పిలుస్తున్డటం తో ఆయన పేరే మర్చిపోయారు ఊరిజనం .ఆయనకూడా మర్చి పోతే హీరో అన్న గుర్తు చేస్తాడు .ఆ గర్వం డాబు దర్జా తో బతుకుతున్నాడు .మా ఊర్లో కూడా ‘’ప్రెసిడెంట్ రామారావు ‘’అనే ఆయన ఉండేవాడు .ఆయన పేరు మావాళ్ళు మర్చిపోలేదు . సరే బాగుంది అనుకుంటే పాపం ప్రకాష్ రాజు మంచానికీ ,హాస్పిటల్ కు అతుక్కు పోయి డైలాగ్ లేకుండా గడుపుతాడు .ఇక హీరో గారి విషయానికొస్తే ఆయనకు పుట్టెడు చెవుడు .చెవిటి మిషన్ కు వ్యతిరేకి ఆయన అరుపులు మన గుండెల్లో మంటలు రేపుతాయి .ఆయన్ను చూసి అందరూ అదే ధోరణిలో మాట్లాడుతూ మనకి కిక్కేచ్చాల్సింది పోయి పిచ్చెక్కిస్తారు .సినిమాలో కూర్చున్నమనం కూడా మన పక్కవాళ్లతో అంతే ‘’హై పిచ్’’లో మాట్లాడితెకాని మన ప్రక్కన కూర్చున్న మన ఆవిడ కూడా మంచి నీళ్ళు కూడా ఇవ్వదు .ఇదీ పరిస్థితి . ఇంత ‘’చెవిటి పిచ్చ’’ పట్టేస్తుంది అందరికి .
పాపం హీరో లుంగీ పైకి ఎగకట్టి ఒకే ‘’రకమైన ఫోజు ‘’తో ,ఒకే రకమైన డాన్స్ తో వంద సందర్భాలలో కనిపించి అభిమానులకు కిర్రెక్కి౦చాడడేమో తెలీదు కాని మనకు చిర్రెత్తించాడు .’దేవీ శ్రీ మార్క్ ‘’పాటలు వినేవాడికి బాగానే ఉంటాయి .మాలాంటి వారికి బధిర శంఖారావమే .హీరోయిన్ సమంత ‘’గ్లామర్’’ కాస్తా ‘’డీగ్లేమర్ ‘’అయి అప్పుడప్పుడు హీరోను అకస్మాత్తుగా ‘’హగ్గు కు ముద్దుకు’’ పనికొచ్చింది .హీరో అన్న గా వేసింది రవిరాజా పినిశెట్టి గారబ్బాయి .పాంటు షార్ట్ నలక్కుండా జాగ్రత్త పడ్డాడు .బ్యాంకి ఆఫీసర్లు ‘’జగపతి ‘’చేసే అన్యాయాలు తెలిసినా ,తమవంతు బాధ్యత వహించకుండా ఎంక్వైరీ గట్రా చేయకుండా ‘’ఎవరో రావాలీ ఏదో చేయాలి ‘’అని పాడుకుంటూ ఉండటం ఆ నాటి రాజకీయానికి అద్దం పడుతుందని డైరెక్టర్ ఊహించి ఉంటాడు .ఎదురు తిరిగిన ప్రతివాడూ ప్రెసిడెంట్ చేతిలో అప్పడంలాగా నలిగిపోయిన సంగతి తెలిసినా పదవికి పోటీ చేసిన పినిసెట్టి కొడుకు జాగ్రత్తలు తీసుకోడు .కధ ట్విస్ట్ చేయటానికేమో అనుకుంటే పొరబాటే .
ఇంటర్వెల్ దాకా ఏదోరకం గా లాగిన సినిమా తర్వాతన్నా మలుపు తిరుగుందేమోననుకున్నవారికి ఆశాభంగమే .అక్కడా అవే సీన్లు రిపీట్ అయి పరమ బోరు కలిగిస్తాయి .హీరో అన్న అడవిలో హత్య చేయబడగానే ఇక సినిమా చూడలేక మేము అయిదుగురం బయటికోచ్చేసి ‘కాబెక్కి ‘’కొంపకు రాత్రి 12 కు చేరాం. ఆతర్వాత సినిమా యెంతసేపు ‘’సా —గిందో ‘’ తెలీదు.ఇంటికొచ్చి నాలుగు మెతుకులు కతికి హాయిగా నిద్రపోయాం .మా మనవడు చి ఆశుతోష్ కి సినిమా ఏమీ నచ్చలేదట .దాన్ని ఇమిటేట్ చేసి మాకు నవ్వు తెప్పించాడు .చివరిదాకా సినిమా చూసినవాళ్ళు మా అబ్బాయి శాస్త్రి , వాడికొడుకు భువన్ ,మా అమ్మాయి కొడుకులు శ్రీకేత్ పీయూష్ లు మాత్రమె .ఈ ఉదయం వాళ్ళను అడిగితె వాళ్ళూ అదే ఫీలింగ్ బోర్ తెలియ జేశారు .ఇందులో ‘’టైలర్ ‘’పాత్రలో నరేష్ కూడా ఉన్నాడండోయ్.హీరో మేనత్త పాత్రలో అమ్మాయి కాస్త బాగా చేసింది .సౌండ్ ఇంజనీర్ హీరో ‘’పక్కన ఉండే హెల్పర్ భారత యుద్ధం లో ‘’ సంజయుడు’’పాత్రలాగా బాగానటించాడు .మంచిగా కనిపించే ప్రకాష్ రాజ్ చివర్లో విలనైతే అతన్ని రక్షించిన హీరో అతడే తన మేనత్త మొగుణ్ణి చంపిందని తెలిసి చంపేస్తాడని ,మేనత్త ప్రెసిడెంట్ అవుతుందని చూసిన మా వాళ్ళ కధనం .సుకుమార్ అంటే చాలా సుకుమారంగా డైరెక్ట్ చేస్తాడనుకొంటే దానికి పూర్తి వ్యతిరేకంగా ‘’మొరటు ‘’గా తీశాడని పించింది చూసిన కాసేపూ .అసలు విషయం చెప్పటం మర్చిపోయా – సినిమా మొదలైన పావు గంట తర్వాత చెవుల్లో చేతులు ,కళ్ళకు రుమాలు కప్పుకున్నాను ఆ కర్ణ కరోరం ఆ దారుణ సీన్లు చూడలేక .
టైల్ పీస్ – ఈ సినిమాలో హీరో గొప్ప ‘’సౌండ్ ఇంజనీర్ ‘’.ఆ ఇంజనీరింగ్ అందులోని పాత్రలకూ బాగా ఎక్కి చివరికి చూసిన వాళ్ళనూ సౌండ్ ఇంజనీర్లను చేస్తుందేమో నన్న భయం నాకుంది .అందుకనే హెచ్చరిక .
మా వాళ్ళ పెళ్లి రోజు, మనవడి పుట్టిన రోజుఉదయం అంతా ఎంతో బాగా ఎంజాయ్ చేసిన మేము రాత్రిమాత్రం ఇంతటి’’ దారుణ మారణ హోమం ‘’సినిమా చూస్తామని ఊహించలేదు. ‘’బాహుబలి తర్వాత మరో బలికి బలి అయ్యాం . ‘’సారీ ఐ పిటీ యు రంగస్థలం’’ .
బాబూ జగ్జీవన్ రాం జయంతి శుభాకాంక్షలు
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-3 -18 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్
—
అయ్యా , శాస్త్రి గారి పెండ్లి మే లో కదా !!!
మీరు నీది నాది ఒకే కధ చూడండి విరుగుడుకు
మరీ అంత చెత్తగా ఏమీ లేదు బయ్యా. నువ్వు సినిమాలు చూడడం అవసరమా సామీ.