సరసభారతి 11-3-18 ఆదివారం సాయంత్రం నిర్వహించిన శ్రీ విళంబి ఉగాది వేడుకలో విశ్వనాథ వారి ‘’ఏక వీర ‘’నవలపై గంటన్నర సేపు ఏకదాటి ప్రసంగం చేసిన శ్రీమతి బెల్లం కొండ శివ కుమారికి కవుల ఆశీరభినందనలు
1-శ్రీ చావలి శివ సుబ్రహ్మణ్యం –విజయవాడ -99859 732 39
1-జ్ఞాన పీఠాధిపతివిశ్వనాథ కవి వ –రేణ్యు నవలా మహారాజ ‘’ఏకవీర’’
నద్యయన జేసి ,పరిశోధనాత్మకముగ-రచన సాగించి ,లోకోత్తరముగా గీర్తి
నందిన శివ కుమారికి ఆశిసు లివె.
2-‘’వేయి పడగల’’వాని నైవేద్యమనగ-జిలుగు పదముల నెదల రంజిల్ల జేసి
ఆంద్ర భాషామతల్లి కాహార్య మనగ –సేవలందించి నావమ్మ శివకుమారి !
౩-శబ్ద దేవతోపాసన సతము సల్పి –శిష్యగణము లెల్లయు నిన్ను శిరసు దాల్చ
మాతృభాషాభిమానుల మనసు దోచి –నిలిచి యుందువు మాయమ్మ ,నిత్య దీప్తి ‘’.
2-శ్రీమతి ముదిగొండ సీతారామమ్మ –విజయవాడ -9299303035
1-పరిశోధన చేసెం గా –పరామాద్భుత ఫణితి ,తాను పారము ముట్టన్
సురుచిర భాషణ మంతయు –పరమానందంబు గూర్చె,భావము నిండెన్ .
2-ఆషా మాషీ కాదిది –భాషా పరిశోధనమ్ము ,భాగ్యము గాదే
యోషా వేసితె సరములు –భాషా యోషకు గొనుమిదె వందన శతముల్ ‘.
౩-అంచిత మైన దీక్ష గొని ,యా పరిశోధన చేసినారుగా –సంచిత పుణ్యశీలి ,తమ సాహితీ వాగ్రసపాన మందగన్
మంచిగ దోచె మా మదికి ,మాధురి నిండిన భాష ణ౦బుకున్-ఎంచగ నేనె మీ కృషిని ఈశుడు బ్రోచుత యెల్లకాలమున్.
౩-శ్రీమతి గుడిపూడి రాదికారాణి-మచిలీపట్నం -9494942583
‘’ఆటవెలది అభినందనలు ‘’
1-ఏకవీర నవల నేకదాటిగ చెప్పి –వినినవారికెల్ల విశద పరచ
ధన్య జీవివమ్మ ధరణి నందు నీవు –రాదికమ్మ వాక్కు రాణ కెక్కు .
2-మమత ఊటలాగ ,మాటు దాచిన మాత –ఏక వీర మదిన యేలు తల్లి
మనసు బెల్లంకొండ .మాట యే కలకండ-రాదికమ్మ మాట రాణకెక్కు.
౩-ముందు మాట వినక మునుపు నే పఠియించి –మరలమరల చదివి మరులు పెరిగె
విశ్వనాథ వారి విజయ భేరివె నారి –రాదికమ్మ వాక్కు రాణకెక్కు.
4లయన్ శ్రీ బందా వెంకట రామారావు –విజయవాడ -9393483147
‘’ఆంధ్రుల సంస్కృతీ సంప్రదాయాలపరి రక్షణలో నిరంతర కృషిని యజ్ఞం లా కొనసాగిస్తున్న శ్రీమతి బెల్లంకొండ శివ కుమారి గారూ –
మీవైన విధి విధానాల్లో శ్రీ విశ్వనాథ కవి సామ్రాట్ విరచిత ‘’ఏకవీర ‘’చారిత్రిక నవలా సమీక్షణం ఓఅద్భుతం ,అనిర్వచనీయం
పాశ్చాత్య నాగరికతా వ్యామోహం లో ప్రేమ ,విడాకులు ,బహుభార్యత్వం ,బహు భర్తృత్వం వంటి విష వృక్ష ఫలాలను ఆరగిస్తూ పతనమవుతున్న నేటి సామాజిక విలువల పునర్జీవనానికి ఓ ప్రయత్నంగా ఉపకరిస్తుంది మీ సమీక్ష .పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుని ,ప్రేమించు కుంటూ కలకాలం అన్యోన్యంగా జీవించమని అంతర్లీనంగా బోధిస్తుంది విశ్వనాథ వారి వాణి.
ఆ వాణికి సారదులై ఈ సమీక్షా కృషిని నిర్విఘ్నంగా కొనసాగించండి .మీ కృషికి భగవంతుని ఆశీస్సులు ,సభ్య సమాజపు సహకారం లభించాలని ఆశిస్తూ అభినందిస్తున్నాను .
5-శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ –ఉయ్యూరు -9989066375
‘’ఏకవీర –ఏకనారి ‘’
ఏకవీర నవలను –ఏకవీరా దేవిగా ఆరాధిస్తూ –ఊరూరా ఊరేగిస్తూ
క్లాసిక్ కావ్య గౌరవం కల్పిస్తూ –ఏకదీక్షగా కొనసాగిస్తూ –ఆ పేరు లోని మాధుర్యాన్ని
తరతరాల విస్తరించే తపనతో -నీ కుమార్తెకూ ‘’ఏకవీర ‘’నామాన్ని సార్ధకం గా పెట్టి ధన్యురాల వైనావు
అలవోకగా ,తాదాత్మ్యంగా ,నిర్విరామంగా-అలుపెరగక ప్రసంగించే నీ దీక్ష అమోఘం తల్లీ
అనితర సాధ్యం ఆదర్శప్రాయమూ
నవలా శిల్పానికి పరాకాష్ట ,శిఖరా రోహణంకదా అమ్మా .
విశ్వనాథ ‘’కల్ప వృక్షం’’ ఊరూ వాడా నీరాజనాలు అందుకొంటే
తెలుగువారి జీవన విధాన మైన ‘’వేయిపడగలు ‘’ఆధునిక ఆంద్ర ఇతిహాస’’మైతే
ఇప్పటి ఏకవీర అజరామరమైన వేళ-విశ్వనాథ జీవించే ఉంటె
తనువెల్లా పులకించి పరవశించి కనులవెంట ఆనంద బాష్పాలు రాలుస్తుండగా
ఆశీరభి నందనలు స్వయంగా అందించి నీకు శుభం పలికేవారు
నీ ప్రసంగం లో నిర్మల కృష్ణానదీ సోయగాలు .’’వైగై నదీ ‘’వైచిత్రాలు
మీనాక్షీ సుందరేశుల పవిత్ర ప్రేమ జీవన విధానాలు ప్రతి ఫలించి
పరిపూర్ణత సాధించింది
చిరంజీవి అమ్మాయీ ‘’శివకుమారీ ‘’!
మీ దాంపత్యం వర్ధిల్లాలి కలకాలం ఆనందంగా
మహిళా మాణిక్యంలా నీవు భాసించాలి
‘’నీ ఏక వ్యక్తి సైన్యం ‘’ఇలాగే నిరంతరం
విజయాలు సాధించాలని ఆశీర్వదిస్తున్నాను –‘’నాన్నగారు’’
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -11-4-18 –ఉయ్యూరు
దీని తర్వాత ఇక వరుసగా శ్రీ విళంబి ఉగాది వేడుకలో జరిగిన ‘’ ఆశించి భంగ పడ్డ ఆంధ్రా ‘’కవిసమ్మేళన కవితలు ధారా వాహికంగా అందజేస్తాను –దుర్గాప్రసాద్